పశ్చిమగోదావరి

ద్వారకాతిరుమల పిహెచ్‌సిలో నిధుల గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూలై 22: ద్వారకాతిరుమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిధులు గోల్‌మాల్ అయ్యాయి. సుమారు రూ.5లక్షలు పైబడిన నిధులను కొందరు సిబ్బంది స్వాహాచేసి సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. సొమ్ములు స్వాహాచేసిన ఆ ఉద్యోగులు బదిలీలపై జిల్లాలు దాటి వెళ్లిపోతుంటే అవకతవకలు ఉన్న ఆ రికార్డులను ప్రస్తుత ఉద్యోగులు కప్పిపుచ్చలేక నానా తంటాలు పడుతున్నారు. 2014-15, 2015-16 సంవత్సరాలకు గాను జననీ సురక్ష యోజన ద్వారా బాలింతలకు ఇచ్చే చెక్కుల బాపతు సొమ్ము, అలాగే వైద్యశాల అభివృద్ధి నిధులు వెరసి దాదాపు రూ.5లక్షలకు పైబడి విలువైన వోచర్లు మాయమైనట్లు చెబుతున్నారు. సొమ్ములు స్వాహా జరగకుంటే వోచర్లు ఎందుకు కనిపించవని పలువురు సిబ్బందే బాహాటంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాలలో ప్రసవానంతరం ప్రతి బాలింతకు జననీ సురక్షా యోజనా పథకం ద్వారా వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వవలసి ఉంది. అయితే 2014 టూ 2016 సంవత్సరాలకు గాను వైద్యశాలలో ఎంతమంది బాలింతలకు చెక్కులు ఇచ్చారనే దానిపై సరైన వోచర్లు లేవని చెబుతున్నారు. వైద్యశాలలో ఖర్చుపెట్టిన ప్రతి దానికి వోచర్లు తప్పని సరి. అయితే వోచర్లు లేకుండా ఆయా సంవత్సరాల్లో జెఎస్‌వై, హెచ్‌డిఎఫ్ నిధులను ఏ విధంగా డ్రా చేశారో సంబంధిత అధికారులకే తెలియాలి. సంబంధిత సొమ్ములు స్వాహాచేసి బదిలీ అయి వెళ్లిపోయే ఉద్యోగుల నుండి ఛార్జి తీసుకుంటున్న ఉద్యోగులు అవకతవకలు ఉన్న రికార్డులను విడిచిపెట్టి మిగిలినవి అందుకుంటూ వస్తున్నారు. దీంతో పాత రికార్డులు, అప్పటి అవకతవకలు మరుగునపడుతున్నాయి. ఛార్జి తీసుకుంటున్న ఉద్యోగులు ఈ అవకతవకలు తమకెక్కడ చుట్టుకుంటాయోననే భయంతో వాటిని కప్పిపుచ్చుతున్నారు. ప్రజా ధనం ఇలా దుర్వినియోగమవుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆయా సంవత్సరాల రికార్డులను పరిశీలించి స్వాహా చేసిన ఉద్యోగుల నుండి సొమ్మును రాబట్టడంతోపాటు వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై వైద్యశాల సీనియర్ అసిస్టెంట్ ఎన్ రాజారత్నం వివరణ ఇస్తూ తాను దెందులూరు నుండి బదిలీపై ఇక్కడకు వచ్చి గత నాలుగు రోజుల క్రితమే ఛార్జి తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఇక్కడ ఇన్‌ఛార్జి యుడిసిగా పనిచేసిన జి నాగరాజు తనకు 2014-2016లోని జెఎస్‌వై నిధులు, హెచ్‌డిఎఫ్ నిధులకు సంబంధించిన రికార్డులు, వోచర్లు ఇవ్వకుండా మిగిలిన రికార్డులతో ఛార్జి అప్పగించారన్నారు. ఇదేమిటని అడిగితే తన ముందు పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ చూపిన రికార్డుల్లో జెఎస్‌వై, హెచ్‌డిఎఫ్ నిధులకు సంబంధించి రూ.5 లక్షలకు పైబడి అవకతవకలు ఉండడంతో వాటికి సంబంధించిన రికార్డులు మినహాయించి మిగిలిన వాటితో తాను ఛార్జి తీసుకున్నానని, వాటినే అప్పగిస్తున్నట్టు నాగరాజు చెప్పడంతో తాను ఛార్జి అందుకున్నట్టు రాజారత్నం వివరణ ఇచ్చారు.