యువ

నాగ పట్టిందల్లా బంగారమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటారు నాగ!
చూడగానే తెలిసిపోతోందిగా తెలుగు పేరని..!
కరెక్ట్...ఈ కుర్రాడు తెలుగువాడే.
ఆంధ్రప్రదేశ్‌లోని గంపలగూడేనికి చెందిన నాగ మూడు పదులైనా నిండకముందే తనదైన రంగం (టెక్నాలజీ)లో వినూత్నమైన ఆవిష్కరణతో ఘన చరిత్రను సృష్టించాడు. ఇప్పుడు తనది కాని రంగం (వ్యవసాయం)లోనూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన తెలుగుబిడ్డ నాగ ప్రస్థానం ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.
స్కూలు పేరు చెబితే చాలు అదో పెద్ద పీడగా భావించే విద్యార్థులున్న రోజుల్లో చదువే సర్వస్వంగా భావించి చదివి ఎదిగాడు నాగ. తండ్రి కూడా స్కూల్ హెడ్మాస్టర్ కావడంతో నాగకు చిన్నప్పటినుంచే చదువు బాగా వంటబట్టింది. ఇంటర్ తర్వాత ఐఐటిలో చేరి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తీసుకున్నాడు. తర్వాత 2000 సంవత్సరంలో ప్రఖ్యాత సంస్థ గూగుల్‌లో చేరాడు. అక్కడ మొదలైంది నాగ ప్రస్థానం. ఏడాది తర్వాత అతనికో ఐడియా వచ్చింది. అదే గూగుల్ అలెర్ట్స్. ఏ విషయంపైనేనా మనకు ఆసక్తి ఉంటే గూగుల్ స్వయంగా మనకు ఆ విషయానికి సంబంధించిన అప్‌డేట్స్ పంపిస్తుంది. కానీ నాగ ఐడియాను అతని మేనేజర్ కొట్టిపారేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నాగ ఏకంగా లారీ పేజ్, సెర్జీ బ్రిన్ (గూగుల్ వ్యవస్థాపకులు)లను కలిసి, తన ఆలోచనను వారితో పంచుకున్నాడు. వారికి ఆ ఆలోచన ఎంతగానో నచ్చింది. నాగను ప్రోత్సహించారు. ఫలితంగా 2003 గూగుల్ అలెర్ట్స్ అశేష జనావళికి అందుబాట్లోకి వచ్చింది. ఈ కృషికి గాను గూగుల్‌కు సంబంధించిన మూడు పేటెంట్స్ నాగ పేరిట ఉండటం విశేషం.
ఈ విజయంతో గూగుల్‌లో నాగ అందలం ఎక్కుతాడని అంతా భావించారు. గూగుల్ అధిపతులు కూడా అతన్ని అందలం ఎక్కించాలనే తలచారు. కానీ నాగ ఆలోచన మరోలా ఉంది. తనదైన రంగం (టెక్నాలజీ)లో చరిత్ర సృష్టించడంలో విశేషమేముందనుకున్నాడు. గూగుల్‌లో ఎనిమిదేళ్లు పనిచేశాక గుడ్‌బై చెప్పేశాడు. అలా ఎందుకు చేశారని అడిగితే ‘మెదడులో ఒక భాగమే పనిచేస్తోంది. మరో భాగానికి పనిచెప్పాలనుకున్నాను. అందుకే గూగుల్‌కి రిజైన్ చేశా’నంటాడు నాగ. ఈసారి పూర్తిగా తనకు పరిచయం లేని డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ రంగంలోకి దిగాడు. ఆ రంగంలో కొంత అనుభవం సంపాదించాక, తాజాగా రైతు అవతారం ఎత్తాడు. అదీ అమెరికాలో!
కాలిఫోర్నియా సమీపంలోని మోడెస్టో అనే చోట 320 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నాడు. నిజానికి ఈ పొలాన్ని ఇన్‌వెస్ట్‌మెంట్‌గా పనికొస్తుందనే కొన్నాడు. కానీ పొలాన్ని కొన్నాక అతని ఆలోచన మారింది. సొంత వూళ్లో పచ్చని పొలాల మధ్య బాల్యాన్ని గడిపిన నాగ మళ్లీ పచ్చదనాన్ని ఓసారి కళ్లారా చూడాలనుకున్నాడు. వ్యవసాయమంటే తెలీన నాగ, పుస్తకం చేతపట్టాడు. సాగు పద్ధతులన్నీ క్షుణ్నంగా అవపోసన పట్టాక పొలంలోకి దిగాడు. బాదం పంట వేసి లాభాలు రాబట్టాడు. ఇప్పుడు ఆప్రికాట్స్ కూడా పండిస్తున్నాడు. ఏటా 25 లక్షల డాలర్ల ఆదాయం కళ్లజూస్తున్నాడు. అయితే నాగ కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితమయ్యాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓ పక్క పొలం పనులు చూసుకుంటూనే మరోపక్క ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబిఎ, ఎన్విరాన్‌మెంట్ అండ్ రిసోర్సెస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు.
ఎప్పుడూ ఒకే చట్రంలో అమరిపోయి పనిచేయడం తనకిష్టం లేదనే నాగ, వ్యవసాయానికి టెక్నాలజీ జోడిస్తే అద్భుత విజయాలను సాధించవచ్చంటాడు. ‘టెక్నాలజీకి పెట్టని కోటగా భాసిల్లుతున్న సిలికాన్ వ్యాలీకి 90 మైళ్ల దూరంలోనే వేలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. కానీ ఇక్కడ పంటల దిగుబడిని వృద్ధి చేసేందుకు టెక్నాలజీని వినియోగించకపోవడం విచారకరం’ అంటున్న నాగ భవిష్యత్తులో మరెన్ని ప్రయోగాలు చేయబోతున్నాడో వేచి చూడాల్సిందే.
*