యువ

మయూర్ చెబితే రజనీ చెప్పినట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ అతని గొంతును విననివాళ్లు అంటూ ఎవరూ ఉండరేమో! ముఖ్యంగా నార్త్ ఇండియన్స్‌కి అతని వాయిస్ చిర పరిచయమే.
ఎలా..అంటారా? మయూర్ వ్యాస్ మరెవరో కాదు...‘కబాలీ’ హిందీ వెర్షన్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి డబ్బింగ్ చెప్పింది అతనే మరి! తెలుగులో రజనీ స్టయిల్‌ని గాయకుడు మనో పట్టేసినట్టే హిందీలో మయూర్ కూడా రజనీ వాయిస్‌నీ అచ్చు గుద్దినట్టు దింపేశాడు. ‘నాన్నా! పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’ అంటూ మనో చెబితే హాల్‌లో చప్పట్లు దద్దరిల్లినట్టే హిందీలో ‘ఝుండ్ మే తొ సువ్వర్ ఆతే హై...షేర్ అకేలా హీ ఆతా హై’ అని మయూర్ చెప్పినప్పుడు హాళ్లు దద్దరిల్లిపోయాయట. దటీజ్ మయూర్! రజనీ స్టైల్‌ని, పదాలను ఆయన విరిచే తీరును నిశితంగా పరిశీలించి, అవసరమైతే డైలాగ్ రైటర్‌తో మాటల్లో మార్పులు చేర్పులు చేయించి మయూర్ చెప్పిన డైలాగులకూ హిందీ వెర్షన్ కబాలీలోనూ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారట.
ఇంతకీ మయూర్ ప్రధాన వృత్తే డబ్బింగా అంటే కాదు...మన మనో ప్రధాన వ్యాపకం సింగింగ్ కదా. అలానే మయూర్ కూడా వృత్తి రీత్యా ప్రొఫెసర్. ముంబయిలోని ఉషా ప్రవీణ్ గాంధీ కాలేజ్‌లో పాఠాలు చెప్పే మయూర్ తీరిక చేసుకుని మరీ సినిమాలకు డబ్బింగ్ చెబుతూ ఉంటాడు.
రజనీ వయసులో సగం కూడా లేని మయూర్ గతంలో ఇంగ్లీష్ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవాడు. రజనీకి డబ్బింగ్ చెప్పడం 2007నుంచీ మొదలు పెట్టాడట. లింగా, రోబో తరవాత ఇప్పుడు కబాలీ.
అనిల్ కపూర్ ఫెయిలైన చోట...
డైరక్టర్ శంకర్..శివాజీకి హిందీ డబ్బింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతల్ని రచయిత, నటుడు స్వానంద్ కిర్కిరేకి అప్పగించాడు. రజనీ వాయిస్‌కి నప్పేట్లు డబ్బింగ్ చెప్పించేందుకు స్వానంద్ చాలామందినే టెస్ట్ చేశాడు. చివరకు హీరో అనిల్ కపూర్ చేత డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకు అనిల్ కపూర్ కూడా సరేనని, కొంత వర్క్ కూడా చేశాడట. అయితే అనిల్ చెబితే అది అనిల్ కపూర్ వాయిస్ అని ప్రేక్షకులు గుర్తు పట్టే ప్రమాదం ఉందని గ్రహించి, స్వానంద్ తన ప్రయత్నాన్ని విరమించుకుని, ఆ బాధ్యతని మయూర్‌కు అప్పగించాడట. రోబోని హిందీలో డబ్ చేసినప్పుడూ రజనీకి వాయిస్ ఇచ్చే అవకాశం మయూర్‌నే వరించింది. అయితే ఇందులో రజనీ డబుల్ రోల్ చేయడంతో వాయిస్‌ను మార్చడం కాస్త ఇబ్బంది అనిపించిందంటాడు మయూర్. సైంటిస్ట్‌గా మాట్లాడటం ఓకే అయినా, రోబో ‘చిట్టి’గా వాయిస్ మార్చి మాట్లాడటానికి కాస్త కష్టపడ్డానంటాడు. మొదట్లో శివాజీకి డబ్బింగ్ చెప్పాలని పిలిచినప్పుడు రజనీ 1980ల్లో హిందీలో ‘చాల్‌బాజ్’,‘గిరఫ్తార్’ వంటి సినిమాలు చాలానే చేశాడు. వాటిలో రజనీ తన వాయిస్‌కు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. వాటిని చూసి అచ్చం రజనీలానే డబ్బింగ్ చెప్పాలనుకున్నానని, అయితే అప్పటి రజనీ వాయిస్ కాస్త కామిక్‌గా ఉండటం, హిందీ యాస స్పష్టంగా తెలుస్తుండటంతో తనదైన వాయిస్‌లోనే కాస్త గాంభీర్యాన్ని జోడించి చెప్పానని, అది క్లిక్ అయిందని సంతోషంగా చెబుతాడు మయూర్. రజనీకి మూడు సినిమాల్లో డబ్బింగ్ చెప్పినా లెజెండ్ యాక్టర్‌ని స్వయంగా కలిసే అవకాశం మాత్రం ఇంతవరకూ రాలేదంటాడు మయూర్. కబాలీ డబ్బింగ్ పనులకోసం చెన్నై వెళ్లినప్పుడు రజనీ సార్ చెన్నైలో లేరని, తదుపరి చిత్రంలోనూ తనకు అవకాశం వస్తే తప్పకుండా కలుస్తానని వినయంగా చెబుతాడు.