యువ

బాలికల చదువు సరళతరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్ శాతం పెరగడానికి కారణం....
టాయిలెట్లు లేకపోవడం!
అయితే అదొక్కటే కాదు. మరో ప్రధానమైన కారణం కూడా ఉంది. అది..రుతుచక్రం!
రజస్వల అయినప్పటినుంచీ బాలికలు శానిటరీ నాప్‌కిన్స్ వాడటం మొదలుపెడతారు. కానీ, అందరూ కాదు. పేదరికంలో మగ్గుతున్న బాలికలకు శానిటరీ నాప్‌కిన్స్ అందని ద్రాక్షే. కాబట్టి, వారు నాసిరకం నాప్‌కిన్స్‌కు అలవాటు పడతారు. వాటివల్ల రోగాల బారిన పడుతున్నారు. వాటిని కూడా కొనే స్థోమత లేనివారు స్కూలుకో దండం పెట్టి, చదువు మానేస్తున్నారు. దాంతో రజస్వల అయిన బాలికల్లో డ్రాపౌట్ శాతం పెరుగుతోంది!
ఇలా బాలికలు చదువు మానేయడమన్నది ఐఐటిలో చదివి పట్టా అందుకున్న సుహానీ మోహన్, కార్తీక్ మెహతాలను ఆలోచనలో పడేసింది. దీనిపై అధ్యయనం చేస్తే, దేశవ్యాప్తంగా 23శాతం మంది బాలికలు డ్రాపౌట్ అవుతున్నట్టు తేలింది. దీనిని అరికట్టాలంటే నాణ్యమైన, చవకైన శానిటరీ నాప్‌కిన్స్‌ను తయారు చేయడం ఒక్కటే మార్గమని భావించారు. అలా వారి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ‘సరళ్ డిజైన్స్’.
ఐఐటి, ఎన్‌ఐటి, బిట్స్ పిలానీల్లో చదివిన తొమ్మిదిమంది యువ ఇంజనీర్లతో సరళ్ టీమ్ రెడీ అయింది. వీరంతా కలసి ఓ మెషీన్‌కు రూపకల్పన చేశారు. ఇది నాణ్యమైన శానిటరీ నేప్‌కిన్స్‌ను అత్యంత వేగంగా తయారు చేస్తుంది. ఎంత వేగంగా అంటే...మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల మెషీన్లకంటే 30 రెట్లు వేగంగా! వీరు తయారు చేసే నాప్‌కిన్స్‌కు ఐషా అల్ట్రా ఎక్సెల్ అని పేరు పెట్టారు. ఏడు నాప్‌కిన్ల ప్యాక్‌ను 30 రూపాయలకే అందిస్తున్నారు. మిగతా బ్రాండ్లకంటే ఇది ఎంతో చవక. తొమ్మిది నెలల కిందటే ఉత్పత్తి మొదలుపెట్టినా, ఇప్పటికే రెండు లక్షల నాప్‌కిన్స్‌ను అమ్మగలిగారు.
అయితే సరళ్ డిజైన్స్‌ను కేవలం వ్యాపార దృక్పథంతో మొదలుపెట్టలేదు. బాలికలకు నాణ్యమైన నాప్‌కిన్స్‌ను అందివ్వడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో తమ ఉత్పత్తి గురించి మహారాష్టల్రోని గ్రామాల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అలాగే పాఠశాలలకు వెండింగ్ మెషీన్లను అందిస్తున్నారు. నాప్‌కిన్స్‌ను ఎవరికి కావాలంటే వారు నేరుగా తీసుకోవచ్చన్నమాట.
మరోవైపు సరళ్ టీమ్ కర్నాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పలు ఎన్జీవోలతో ఒప్పందం కుదుర్చుకుని, గ్రామీణులకు తమ ఉత్పత్తులు సరఫరా అయ్యేట్లు చూస్తోంది. అలాంటివాటిలో ‘శిక్షార్థ్’ అనే స్వచ్ఛంద సంస్థ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. చత్తీస్‌గఢ్‌లో గిరిజనులు అత్యధికంగా నివసించే సుక్మా జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థను ఆశిష్ శ్రీవాత్సవ నిర్వహిస్తున్నారు. ఇండియాలో బాలికల డ్రాపౌట్ శాతం పెరగడానికి నాణ్యమైన, చవకైన శానిటరీ నాప్‌కిన్స్ అందుబాట్లో లేకపోవడమే కారణమని గ్రహించిన ఆశిష్, తన మకాంను సుక్మాకు మార్చి, గిరిజనుల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. బాలికలు పాఠశాల మానేయకుండా తన వంతు కృషి చేస్తున్నారు. ఆయనను ఓ ఫంక్షన్‌లో సుహానీ కలిశారు. ఇద్దరి ధ్యేయమూ ఒకటే కావడంతో ఆశయ సాధనకు ఇద్దరూ కలసికట్టుగా ముందడుగు వేశారు.
శానిటరీ నాప్‌కిన్స్ వాడకంపై శిక్షార్థ్ వలంటీర్లకు సరళ్ బృందం శిక్షణ ఇచ్చి, గిరిజన ప్రాంతాలకు పంపిస్తోంది. ఈ వలంటీర్లు గిరిజన గ్రామాలు, పాఠశాలలకు వెళ్లి శానిటరీ నాప్‌కిన్స్ వాడకం ప్రాముఖ్యతను విడమరచి చెప్పి, వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు. నాప్‌కిన్స్ వాడకం పట్ల గిరిజనుల్లో నెలకొని ఉన్న మూఢాచారాలను, భయాలను పారదోలడంలో కూడా శిక్షార్థ్ వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఓ సదాలోచన వేలమంది జీవితాలకు వెలుగును ప్రసాదిస్తుంది. సరళ్ డిజైన్స్ అధిపతులకు వచ్చిన ఆలోచన దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలకు కొత్త జీవితం ప్రసాదిస్తోంది. అందుకు వారిని అభినందించాల్సిందే.