యువ

సోలార్ కార్.. సో గ్రేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహన్!
ఈ పేరు వినగానే బాలీవుడ్ సినిమా స్టార్ కొడుకు పేరో, రాజకీయాల్లో పేరొందిన నాయకుడి పుత్రరత్నం పేరో గుర్తుకు వస్తుంది.
కానీ...ఆహన్ అనేది సోలార్ కార్ ప్రాజెక్ట్ పేరు!
సౌరశక్తితో నడిచే కార్లు ఇండియాకు కొత్తేం కాదు...మరి, మరో కారు తయారు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అనేది ఆలోచించాల్సిన ప్రశే్న. కానీ, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన యువ ఇంజనీర్ల బృందం లక్ష్యం ఒకటే...అతి తక్కువ ఖర్చుతో అధిక మన్నికను, మైలేజీని ఇచ్చే కారును తక్కువ ధరకు అందించడం. ఈ లక్ష్యమే వారిని కార్యరంగంలోకి దించింది.
ఆహన్ కార్ ప్రాజెక్ట్‌లో 25మంది యువ ఇంజనీర్లు పాలుపంచుకుంటున్నారు. వీళ్లంతా జోధ్‌పూర్‌కు చెందినవారే. వీరిలో చాలామంది అదే ఊళ్లో ఉన్న జోధ్‌పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటున్నవాళ్లు కావడం గమనార్హం. మరో రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ సోలార్ ఛాలెంజ్ పోటీల్లో పాల్గొనడమే ధ్యేయంగా ఈ బృందం శ్రమిస్తోంది.
సోలార్ కార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకోవడం వరకూ సరే. కానీ ఎలా ప్రారంభించాలి? ఎక్కడినుంచి ప్రారంభించాలి?
ముందుగా ప్రాజెక్ట్‌కు ఓ రిఫరెన్స్ కావాలి. నిధులు మరీ ముఖ్యం. ఇక మూడోది కార్ తయారీలో పాల్గొనేందుకు తెలివితేటలున్న ఇంజనీర్లు అవసరం. ఆహన్ ప్రాజెక్ట్ రీసెర్చ్ వర్క్ సెప్టెంబర్‌లో మొదలైంది. జోధ్‌పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న కెప్టెన్ కనిష్క్ వర్షిణి, వైస్ కెప్టెన్ అమన్ సచ్‌దేవ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వారి నేతృత్వంలో ప్రతిభాపాటవాలున్న 25మంది యువ ఇంజనీర్లు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు. వారికి ఫ్యాకల్టీ అడ్వయిజర్లుగా ఉండేందుకు అదే వర్శిటీకి చెందిన రాకేశ్, నరావత్, మోహిత్ ఓస్త్వాల్, కుసుమ్ అగర్వాల్ అంగీకరించారు. ఇంకేం... టీమ్ కుదిరింది.
జోధ్‌పూర్ విద్యార్థుల ఆలోచన గురించి తెలుసుకున్న ఆదర్శ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ..కావలసిన నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. కార్ తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించేందుకు సోలార్ యూనివర్శ్ ఇండియా సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ప్రపంచ సోలార్ కార్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తూ కార్ తయారీకి ఈ బృందం శ్రీకారం చుట్టింది. మోటార్ పవర్ 2000 వాట్స్ దాటకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 1200 వాట్స్ బిఎల్‌డిసి హబ్ మోటార్‌ను ఎంచుకున్నారు. బ్యాటరీకి, సోలార్ పేనల్స్‌కూ ఎలాంటి షరతులూ లేవు. అయితే సాధారణంగా కార్ల తయారీలో లెడ్ యాసిడ్ బ్యాటరీలనే వాడతారు. దీని బరువు ఎక్కువ. సోలార్ కార్ బరువుఎంత తక్కువ ఉంటే అంతగా పనితీరు బాగుంటుంది. దీంతో ఆహన్ ప్రాజెక్ట్ బృందం లెడ్ యాసిడ్ బ్యాటరీల బరువులో మూడోవంతు ఉండే లిథియమ్ అయాన్ బ్యాటరీని ఎంచుకుంది. అలాగే కారు పైన ఏర్పాటు చేసేందుకు సెమీ ఫ్లెక్సిబుల్ రకం సోలార్ ప్యానెళ్లను ఎంపిక చేసింది. బ్యాటరీ ఐదారు గంటలు పనిచేయడానికి కావలసిన అర కిలోవాట్ శక్తిని ఈ ప్యానెళ్లు సునాయాసంగా అందిస్తాయి. తొలి దశలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా ఆహన్‌కు రూపకల్పన చేస్తున్నారు. భవిష్యత్తులో మోటార్ పవర్‌ను పెంచడం ద్వారా కారు వేగాన్ని పెంచాలన్నది ఈ బృందం ఉద్దేశం.
ఆహన్ ప్రాజెక్టు ప్రస్తుతం తుది దశలో ఉంది. కార్‌కు జిపిఎస్, ఎన్‌విఎస్ వ్యవస్థలనూ అమర్చారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ వంటి వెసులుబాట్లూ కల్పించారు. సోలార్ ట్రాకర్ టెక్నాలజీ అదనం. కారు బాడీని గ్లాస్ ఫైబర్‌తో రూపొందించారు. ఆహన్ కార్ మార్కెట్ ధర 3-5 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ఇతర దేశాల్లో తయారవుతున్న సోలార్ కార్ల ధర మన కరెన్సీలో 20-25 లక్షల మధ్య ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. అలా పోల్చి చూసినప్పుడు వాటిలో ఆరో వంతు ధరకే ఆహన్ అందుబాట్లోకి రావడం భారతీయులు గర్వించదగిన విషయం.
జోధ్‌పూర్‌లో తుదిరూపు దిద్దుకుంటున్న ఆహన్...త్వరలో మన దేశంలోనే జరిగే ఎలక్ట్రిక్ సోలార్ వెహికల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతోంది. అలాగే ఆష్మాన్ మోటార్స్ నిర్వహించే ఇండో-ఆసియన్ సోలార్ ఛాలెంజ్-2017లోనూ పాల్గొనాలని జోధ్‌పూర్ బృందం భావిస్తోంది. అయితే వారి అంతిమ లక్ష్యం మాత్రం ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ సోలార్ కార్ ఛాలెంజ్‌లో పాల్గొనడమే. అప్పటివరకూ ఈ బృందం అవిరామంగా శ్రమిస్తూనే ఉంటుందంటారు బృందానికి నాయకత్వం వహిస్తున్న కనిష్క్, అమన్ ద్వయం.