యువ

అద్భుతం చేశారు.. అందలం ఎక్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరి తండ్రి కూలీ.
మరొకరి తండ్రి ఆటోరిక్షా డ్రైవర్.
పొట్టగడవడమే కష్టంగా ఉన్నప్పుడు చదువే దైవం.
ఏ తండ్రయినా అలాగే ఆలోచిస్తాడు.
కొడుకు చదువుకుని ప్రయోజకుడవ్వాలని ఆశిస్తాడు.
తనలాగా కూలీగానో, ఆటో డ్రైవర్‌గానో కాకూడదనే
కాంక్షిస్తాడు.
కానీ, చదువులను కాదని..ఆ కొడుకు ఆటల్లో పడితే ఏ తండ్రి మనసైనా క్షోభించకమానదు కదా!
నటరాజన్, సిరాజ్‌ల విషయంలోనూ అదే జరిగింది. తల్లిదండ్రుల అభీష్టాన్ని కాదని క్రికెట్‌ను ఎంచుకున్నారు. అందులో రాణించాలనుకున్నారు. కుమారుల తీరు ఆ తల్లిదండ్రులకు తీరని మనోవ్యథ మిగిల్చింది. రెక్కలొచ్చిన కొడుకు కష్టాలు తీరుస్తాడనుకుంటే ‘కూడు పెట్టని క్రీడ’లను ఎంచుకున్నాడని బాధపడ్డారు.
కానీ, వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు వారి కొడుకులను క్రికెట్టే అందలం ఎక్కించింది. కోట్లు కుమ్మరిస్తోంది. తాజాగా జరిగిన ఐపిఎల్ వేలంలో చెన్నై కుర్రాడు నటరాజన్, హైదరాబాద్ అబ్బాయి మహ్మద్ సిరాజ్‌లకు కోట్లు వెచ్చించి కింగ్స్ లెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎగరేసుకుపోయాయి.
**
తమిళనాడులోని సాలెం పట్టణానికి సమీపంలో చిన్నప్పంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్, నిజానికి ఓ లక్ష్యమంటూ లేకుండానే పెరిగాడు. తండ్రి ఓ టెక్స్‌టైల్ మిల్లులో రోజు కూలీ. తల్లి రోడ్డు పక్కన చక్రాల బండిపై ఫాస్ట్ఫుడ్ అమ్ముతూ ఉంటుంది. ఐదుగురు సంతానంలో నటరాజనే పెద్దవాడు. దాంతో కుటుంబాన్ని ఎలా పోషించాలా, తల్లిదండ్రులకు ఎలా సాయం అందించాలా అన్నదే అతని ఆలోచనంతా. సాలెంలో చదువుకుంటున్న సమయంలో రోడ్లపై టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. 20 ఏళ్లు వచ్చేవరకూ క్రికెట్ గ్రౌండ్ అంటే ఎలా ఉంటుందో అతనికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అయితే నటరాజన్ బౌలింగ్‌లో నైపుణ్యాన్ని అతని స్వగ్రామానికే చెందిన జయప్రకాశ్ అనే శ్రేయోభిలాషి పసిగట్టి, ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతోనే నటరాజన్ తన మకాంను చెన్నైకి మార్చాడు. అక్కడ అతని ప్రతిభకు గుర్తింపు దొరికింది. బిఎస్‌ఎన్‌ఎల్ జట్టులో సభ్యుడిగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోర్త్ డివిజన్ లీగ్‌లో ఆడి రాణించాడు. ఆ తర్వాత విజయ క్రికెట్ క్లబ్‌లో చేరడంతో దశ తిరిగింది. అనంతరం మరో ప్రముఖ క్రికెట్ క్లబ్ జానీ రోవర్స్‌లో చేరాడు. 2015లో తమిళనాడు జట్టులో స్థానం సంపాదించాడు. ఈ దశలోనే అతని బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దాంతో నటరాజన్ మానసికంగా కాస్త దెబ్బతిన్నాడు. అయితే సీనియర్ల సలహాతో తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకుని, మళ్లీ సత్తా చూపాడు. గత సీజన్‌లో రైల్వేపైనా, ఉత్తరప్రదేశ్‌పైనా నటరాజన్ సాధించిన వికెట్లు, అతను ఐపిఎల్‌కు ఎంపికయ్యేందుకు బాట వేశాయి. తాజాగా ఐపిఎల్ వేలంలో కింగ్స్ లెవన్ పంజాబ్ నటరాజన్‌కు మూడు కోట్లు చెల్లించి, కొనుగోలు చేసింది.
కుటుంబం కోసం తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని, ఇక వారి కష్టాలు తీరినట్టేనని భావిస్తున్నానని నటరాజన్ చెప్పాడు. ఇటీవలే ఓ చిన్న ఇల్లు కొన్నామని, దానికోసం చేసిన అప్పుల్ని ముందుగా తీర్చేయాలనుకుంటున్నానని చెబుతున్న నటరాజన్, తనపై కింగ్స్ లెవన్ పంజాబ్ నిర్వాహకులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

మా అమ్మా నాన్నలకు ఐదుగురు సంతానం. అందులో నేనే పెద్దవాణ్ని. కూలీగా పనిచేసే నాన్న, ఫాస్ట్ఫుడ్స్ బండి నడుపుతూ అమ్మ ఎంత కష్టపడుతున్నారో చూస్తూ, వారి కష్టాలు ఎలా గట్టెక్కించాలా అని ఆలోచించేవాణ్ని. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఈ మధ్యే ఓ చిన్న ఇల్లు కొన్నాం. దానికోసం అప్పులు చేశాం. ముందుగా ఆ అప్పులు తీర్చేయాలి
- నటరాజన్
**
హైదరాబాద్‌లోని మాసాబ్‌టాంక్‌లో నివాసం ఉండే సిరాజ్ తండ్రి గౌస్ ఓ ఆటో డ్రైవర్. కుటుంబాన్ని పోషించేందుకు ముప్ఫయ్యేళ్లుగా ఆయన ఆటో నడుపుతూనే ఉన్నారు. పెద్ద కొడుకు బాగా చదువుకుని ఈ మధ్యే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. కానీ సిరాజ్ మాత్రం చదువుకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. అతని మనసంతా క్రికెట్‌పైనే. ఫాస్ట్‌బౌలర్‌గా ఎదగాలన్నది సిరాజ్ ఆకాంక్ష. అయితే ఆటల్లో పడి కొడుకు చదువును నిర్లక్ష్యం చేయడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదు. పెద్ద కొడుకును ఉదాహరణగా చూపిస్తూ, ‘నువ్వూ అలా జీవితంలో సెటలవ్వాలి’ అని చెప్పేవారు. కానీ, చిన్నప్పుడే తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న సిరాజ్, ఆ దిశగానే కష్టపడేవాడు. అతని పట్టుదలను, బౌలింగ్‌లో అతని నైపుణ్యాన్ని గమనించిన కోచ్ భరత్ అరుణ్.. సిరాజ్ ప్రతిభకు సానపట్టాడు. 2010లోనే హైదరాబాద్ రంజీ జట్టులో స్థానం సంపాదించిన సిరాజ్, అంచెలంచెలుగా ఎదిగాడు. ఇటీవల టి-20 ఛాంపియన్‌షిప్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో పది మ్యాచ్‌లు ఆడి 41 వికెట్లు సాధించడంతో అందరి దృష్టిలోనూ పడ్డాడు. సోమవారం జరిగిన ఐపిఎల్ వేలంలో సిరాజ్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 2.60 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇప్పుడెలా అనిపిస్తోందని అడిగితే సిరాజ్ ఉద్వేగంగా స్పందించాడు. ‘కుటుంబంకోసం మా తండ్రి ఎన్నో త్యాగాలు చేశారు. 30 ఏళ్లుగా ఆటో నడుపుతూ కష్టపడుతున్నారు. ఇకపై ఆయన ఆటో నడుపుతానంటే ఒప్పుకోను. ఇనే్నళ్లయినా హైదరాబాద్‌లో మాకు సొంత ఇల్లు లేదు. ఓ ఇల్లు కొనాలన్నది నా ఆశ’ అన్నాడు. ‘ఐపిఎల్‌లో మీకు భారీ ధర పలుకుతుందని ఊహించారా?’ అనడిగితే, ఐపిఎల్‌లో ఎంపికవుతానన్నది ఊహించిందేనని, ముంబయి జట్టుపై నేను సాధించిన వికెట్లే తన ఎంపికకు కారణమని విశే్లషించాడు సిరాజ్.

కుటుంబం కోసం మా నాన్న ఎంతో కష్టపడ్డారు. 30 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇకపై ఆయన ఆటో నడుపుతానంటే ఎంతమాత్రం ఒప్పుకోను. హైదరాబాద్‌లో ఇంతకాలంనుంచీ ఉంటున్నా మాకంటూ ఓ సొంత ఇల్లు లేదు. త్వరలో ఓ ఇల్లు కొనాలనుకుంటున్నాను.
- మహ్మద్ సిరాజ్

చిత్రాలు..నటరాజన్, మహ్మద్ సిరాజ్