యువ

పాటల రచయిత తనయుడు పేదల సంక్షేమానికి నిబద్ధుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాకేశ్ ఆనంద్ బక్షి...!
ఈ పేరు వినగానే ప్రఖ్యాత బాలీవుడ్ పాటల రచయిత ఆనంద్ బక్షి గుర్తుకువస్తే తప్పేం లేదు! ఎందుకంటే ఈ రాకేశ్, ఆ పాటల రచయిత తనయుడే. అతని గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవలసి వస్తోందంటే అతను చేస్తున్న సమాజ సేవ వల్ల!
తండ్రిలోని రచనా శక్తిని వారసత్వంగా పుణికి పుచ్చుకున్న రాకేశ్, బాలీవుడ్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా, రచయితగా, డైరెక్టర్‌గా స్థిరపడ్డారు. అయితే 2012లో జరిగిన ఓ సంఘటన రాకేశ్‌ను పేదల గురించి ఆలోచించేలా, వారికి చేయూతనిచ్చేలా పురిగొల్పింది. రాకేశ్‌కు సైక్లింగ్ అంటే ఇష్టం. ఓ రోజు ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో సైకిల్‌పై వెడుతూ ఓ సైకిల్ షాపువద్ద ఆగి మరమ్మతులు చేయించుకున్నాడు. తిరిగి వెడుతూ షాపు యజమానికి జేబులోంచి 800 రూపాయలు తీసి ఇచ్చాడు.
దానికి ఆ షాపు యజమాని పడిన సంబరం అంతా ఇంతా కాదు. ఆ 800 రూపాయలతో తన కుటుంబం ఓ నెల రోజులపాటు గడుపుకొస్తుందని అతను సంతోషం వ్యక్తం చేయడం రాకేశ్‌ను ఆలోచనలో పడేసింది. డబ్బున్నవాళ్లు చిన్నపాటి విలాసాలకు చేసే ఖర్చు నిరుపేదలకు ఎంత ఉపయోగపడుతుందో అతనికి తెలిసివచ్చింది. దాంతో నిరుపేదలకోసం తన వంతుగా ఏదైనా ఓ ప్రాజెక్టు తలపెట్టాలనుకున్నాడు. ఈలోగా అతనికి సెయింట్ జేవియర్స్ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రారంభించిన ‘కేంపస్ బైసికిల్’ గురించి తెలిసింది. విద్యార్థుల వద్ద వృథాగా పడిఉన్న సైకిళ్లను సేకరించి, నిరుపేదలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీని గురించి తెలిశాక, రాకేశ్ స్వయంగా ‘బైసికిల్ ఏంజెల్స్’ పేరిట ఓ సంస్థను నెలకొల్పాడు.
ఈ సంస్థ తరపున ఇప్పటివరకూ రాకేశ్ ఎంతోమందికి సైకిళ్లను కొని ఇచ్చాడు. తన సంస్థ ఉద్దేశాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ అతనికి ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బుతో నిరుపేదలకు కొత్త సైకిళ్లను కొనివ్వడం లేదా వారి వద్ద మరమ్మతులకు నోచుకోని సైకిళ్లకు మరమ్మతులు చేయించడం చేస్తున్నారు.
కేవలం సైకిళ్లతోనే రాకేశ్ సరిపెట్టడం లేదు. సైక్లోథాన్‌లు నిర్వహించడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు చేయించడం వంటి పనులూ చేస్తున్నాడు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న అడాప్ట్ (ఏబుల్ డిసేబుల్డ్ ఆర్ పీపుల్ టుగెదర్) అనే స్వచ్ఛంద సంస్థలో వివిధ రకాల వ్యాధులతో చికిత్స పొందుతున్న చిన్నారులకు రాకేశ్ చేతి కర్రలను, వీల్‌చైర్లను ఉచితంగా అందజేశాడు. ఇప్పటికీ రాకేశ్ ఉదయానే్న సైకిల్‌పై బయల్దేరతాడు. దారిలో సైకిల్ అవసరమైన వారిని చూసి, వారి వివరాలు నమోదు చేసుకుని, వారికి సైకిళ్ళను అందజేస్తాడు. తాను ఇచ్చే సైకిళ్ల వల్ల నిరుపేదలకు ప్రయాణ ఖర్చు తప్పడమే కాదు, సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారని, అది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అంటాడు రాకేశ్.

చిత్రాలు..ఓ నిరుపేదకు సైకిల్ అందజేస్తున్న రాకేశ్ బక్షి. పక్కన బక్షి ఇచ్చిన త్రిచక్ర వాహనంతో ఓ దివ్యాంగ బాలుడు