యువ

రుచా కీర్తి.. యువతకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణెకు చెందిన రుచా సురేంద్ర సియల్‌ను చూస్తే ఎవరైనా స్ఫూర్తి పొందాల్సిందే. ప్రముఖ బహుళ జాతి సంస్థలో టెక్నోక్రాట్‌గా రెండు చేతులా సంపాదిస్తున్న ఆమె తన ఉద్యోగాన్ని వదిలి పెట్టి, ఎంతో ఇష్టపడి భారత వైమానిక దళంలో చేరింది. జీతం తక్కువ, కష్టం ఎక్కువ అన్న రెండు విషయాలూ తెలిసినా, ఎలాంటి సంకోచం లేకుండా ఎయిర్‌ఫోర్సులో చేరింది. దానికి ఆమె చెప్పే సమాధానం ఒక్కటే- ‘సంతోషం.. దేశం కోసం పనిచేస్తున్న సంతోషం.. తన కోసం మాత్రమే తాను ఆలోచించుకోవడం లేదన్న మరో సంతోషం.’ సొంత లాభం కన్నా దేశం కోసం ఏదో ఒకటి చేద్దామనే ఇలాంటి భిన్నమైన ఆలోచనలతో ఉన్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశం కోసం, సమాజం కోసం తమ వంతు ఏదో చేయాలనే తపన వారిలో మరింతగా పెరుగుతోంది. ఇప్పటి పరిస్థితుల్లో- ఇలాంటివారిని ఒడిసిపట్టుకుని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి యువతకు మార్గదర్శకం చేయాల్సిన పెద్దవాళ్లు చాలా ముఖ్యం.
‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీశ్రీ అన్న మాటలు- యువతకు సవాలు విసిరి.. వారు సరికొత్త ఆకాంక్షలతో దేశ పునర్నిర్మాణానికి ముందుకు సాగాలని చేసినవేనని తరచి చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
దేశ నిర్మాణ కార్యక్రమంలో యువత పాత్ర చాలా కీలకమైంది. యువత పట్టించుకుంటే దేశ కీలక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించడం గొప్ప విషయం ఏమీ కాదు. భారతదేశ జనాభాలో మూడు వంతుల భాగం చూస్తే వారంతా 20 ఏళ్ల లోపువారేనని తెలుస్తుంది. ఇంతటి ‘యువ దేశం’ ప్రపంచంలో రానున్న మరో 20 ఏళ్ల వరకూ ఉండబోదు. అంటే భారతదేశ చరిత్ర, గమనం నేటి యువత చేతిలోనే ఉందనేది నిస్సందేహం. యువజనులతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి, వారే ఆవిష్కర్తలు, సృష్టికర్తలు, సమసమాజ నిర్మాతలు కూడా, భవిష్యత్ నేతలు వారే, వినూత్న ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించే సామర్ధ్యం వారి సొంతమే అంటూ ఇటీవల ఐక్య రాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొంది. రాజకీయ భాగస్వామ్యంతలో యువత పాత్ర చాలా తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. గత పదేళ్లతో పోలిస్తే యువత విజయవంతమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్లో పాల్గొనడమేగాక, వినూతనత్వాన్ని , సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒంటబట్టించుకుంటూనే సేవా కార్యక్రమాల్లోనూ ముందుంది. చాలా వరకూ యువత సంఘటితమై తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. చార్‌ధామ్ వరద బీభత్సం, నేపాల్ భూకంపం, ఇటీవల పలురాష్ట్రాల్లో సంభవించిన ఉప్పెనలు,తుపాన్లలో బాధితులను రక్షించడంలో కూడా యువత పాత్ర చిరస్మరణీయమైనది. క్షతగాత్రులను ఆస్పత్రులకు చేరవేయడం, రక్తదానం, అన్నదానం, కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం వంటి ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విరాళాలు పోగు చేసి అన్నార్తులను ఆదుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏ విపత్తు సంభవించినా సాయం చేయడానికి అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి కూడా యువత వెనుకంజ వేయడం లేదు. ఇదో మంచి పరిణామం. అయితే ఈ సంఖ్య మరింత పెరగాల్సి ఉంది. కేవలం సమాజంలోని కొన్నిసమస్యలకు మాత్రమే స్పందించడం కాకుండా, ఆర్ధిక విధానాల్లోనూ, దేశ రక్షణలోనూ కూడా భాగస్వామ్యం కావల్సిన రోజు ఆసన్నమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన పెంచుకుంటున్న యువత స్పందిస్తున్న తీరు అత్యంత ప్రశంసనీయమైనదే. సమాజానికి మంచి చేయాలనే తపన వారిలో కనిపిస్తోంది. ‘పూణె ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ’లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన రుచా సురేంద్ర బెంగళూరులో టెక్నోక్రాట్‌గా తన కెరీర్ ప్రారంభించింది. తర్వాత తన గురించి తాను ఆలోచించుకుంటే- దేశంలో సైన్యం అందిస్తున్న సేవలు, వారి కష్టనష్టాలు కళ్ల ముందు కదలాడాయి. దాంతో తాను కూడా సైన్యంలో చేరాలనే ఆలోచనకు వచ్చింది. అంతే.. ఎయిర్‌ఫోర్సు కామన్ అడ్మిషన్ టెస్టు రాసింది. ఆ తర్వాత ఎయిర్‌ఫోర్సులోని ఫ్లయిట్ స్క్వాడ్రన్‌లో చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే శిక్షణ పొందుతున్న రుచా చాలా సంతోషంగా తన శిక్షణ పూర్తి చేసుకుంటున్నట్టు చెబుతోంది. ఇదే కోవలో అనేక మంది యువత ముందుకు వస్తున్నారు. ‘రుచా మాదిరి మనం ఎందుకు ఆలోచించడం లేదు’ అని ఎవరికివారు అనుకుంటే ప్రతి ఒక్కరికీ ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది.

చిత్రాలు.. ఎయర్ ఫోర్స్‌లో ఫ్లయిట్ స్క్వాడ్రన్‌గా శిక్షణ తీసుకుంటున్న రుచా సురేంద్ర సియల్
*తల్లిదండ్రులతో రుచా

- బి.వాగ్దేవి