యువ

ఎదురే మాకు లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కఠినమైన రహదారుల్లో, భయం గొలిపే పర్వత ప్రాంతాల్లో సైతం ‘ఎదురే మాకు లేదు.. మమ్మెవరూ ఆపలేరు..’ అంటూ ఆ యువతులు బైకులపై జోరుగా సాగిపోతున్నారు. కేవలం కాలక్షేపానికో, మానసిక ఉల్లాసానికో కాదు.. సామాజిక చైతన్యం కోసం దేశ విదేశాల్లో వీరు బైక్ యాత్రలు చేస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రెండేళ్ల క్రితం పదిమంది మహిళలతో ప్రారంభమైన ‘బైకింగ్ క్వీన్స్’ క్లబ్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఈ క్లబ్‌లో 19 నుంచి 40 ఏళ్లలోపు మహిళలు 45 మంది సభ్యులుగా ఉన్నారు. కనీసం నెలకు రెండు బైక్ రైడ్స్, ఏడాదిలో మూడు లేదా నాలుగు పెద్ద రైడ్స్ నిర్వహించే ఈ క్లబ్ సభ్యులు ఇప్పటి వరకూ మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు నేపాల్, భూటాన్, మయన్మార్, వియత్నాం, కంబోడియా, సింగపూర్, మలేసియా వంటి పది దేశాల్లో బైక్ యాత్రలు జరిపారు. డాక్టర్ సారికా మెహతా స్థాపించిన ఈ ‘బైకింగ్ క్వీన్స్’ క్లబ్‌లోని సభ్యులంతా లింగ వివక్ష, భ్రూణహత్యలకు నిరసనగా ప్రచారోద్యమం సాగిస్తున్నారు. ‘ఆడపిల్లను బతకనివ్వండి.. వారిని చదివించండి’ అంటూ దేశ విదేశాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బైక్ యాత్ర సందర్భంగా క్లబ్ సభ్యులు భారత ప్రధాని మోదీతో పాటు భూటాన్, థాయ్‌లాండ్ , కంబోడియా దేశాధినేతలను కలుసుకుని ప్రశంసలు అందుకున్నారు. కేవలం నలభై రోజుల్లో పది దేశాల్లో బైక్‌యాత్రను పూర్తిచేసిన క్లబ్ సభ్యులను అభినందిస్తూ స్వయంగా ప్రధాని మోదీ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం సూరత్‌లో ప్రారంభమైన ‘బైక్ క్వీన్స్’ యాత్ర మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు మీదుగా జమ్మూ కాశ్మీర్ చేరుకుంటుంది. కాశ్మీర్‌లోని ‘లేహ్’ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి కర్ధుంగ్లాకు యాత్ర చేరుకుంటుంది. ఏభై రోజుల పాటు సుమారు పదివేల కిలోమీటర్లు యాత్రను కొనసాగించి, ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కర్ధుంగ్లాలో జాతీయ జెండాను ఎగురవేయాలన్నది ఈ మహిళా బైక్ రైడర్ల లక్ష్యం. యాత్ర సందర్భంగా గ్రామాల్లో బస చేస్తూ లింగ వివక్ష, భ్రూణహత్యలను నివారించాలని స్థానిక మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు. పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి తోచినంత సాయం చేస్తున్నారు.
దేశంలోనే అత్యంత అరుదైన బైకర్స్ క్లబ్‌గా ప్రసిద్ధి చెందిన ‘బైకింగ్ క్వీన్స్’లోని సభ్యులు పూర్తిగా శాకాహారం తింటారు. యాత్రలో తమకు అవసరమైన భోజనాన్ని తామే స్వయంగా వండుకుంటారు. గ్రామాల్లో బస చేసినపుడు స్థానికులు వీరికి వంట గదులను ఇస్తుంటారు. యాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బైకులకు అవసరమైన స్పేర్‌పార్టులను తీసుకువెళ్లే ఓ కారు వీరి వెంట అనునిత్యం ఉంటుంది. యాత్రలో ఎలాంటి లోటుపాట్లు, సమస్యలు తలెత్తకుండా 15 మందితో కూడిన సహాయక సిబ్బంది కూడా పాల్గొంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వంటగ్యాస్, విద్యుత్, వైద్యసేవలు లభించక ఎంతోమంది మహిళలు కష్టాలు పడుతున్నారని, నగరాల్లోని మహిళలు అన్ని రకాల విలాసాలను అనుభవిస్తున్నారని ‘బైకింగ్ క్వీన్స్’ వ్యవస్థాపకురాలు డాక్టర్ సారికా మెహతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తేనే మహిళలు ముందంజలో నిలుస్తారని ఆమె చెబుతున్నారు. మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు, వారిలోని శక్తిసామర్ధ్యాలను వెలికి తీసేందుకు తమకు చేతనైనంత కృషి చేస్తున్నామన్నారు. బైక్ రైడింగ్ వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని యాత్రలో పాల్గొంటున్న 19 ఏళ్ల సోనా ముఖ్వానా అంటున్నారు. సామాజిక చైతన్యం కోసం తాము ఈ యాత్రలను నిర్వహిస్తున్నామని, కఠినమైన రహదారుల్లో పలు ఆటంకాలను ఎదుర్కొన్నామని గుర్తు చేస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మహిళలు సత్తా చాటగలరని నిరూపిస్తున్నామని ‘బైకింగ్ క్వీన్స్’ సభ్యులు ఆనందంగా చెబుతున్నారు.