యువ

యుద్ధవిద్యలో మేమేం తక్కువ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిక్ బాక్సింగ్, కరాటే వంటి యుద్ధక్రీడల్లో పురుషులకు తప్ప మహిళలకు అవకాశం లేదన్న సనాతన వాదనలను తిప్పికొట్టినందుకు తనకెంతో సంతోషంగా ఉందని మైసూరుకు చెందిన పూజా హర్ష గర్వంగా చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి కిక్ బాక్సింగ్‌లో తొలి మహిళా జాతీయ కోచ్‌గా ఎంపికైన ఘనత ఆమెకే దక్కింది. మూఢాచారాలకు, కట్టుబాట్లకు నిలయమైన మన దేశంలో క్రీడలకు సంబంధించి కూడా మహిళల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో ఈ పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోందని, తల్లిదండ్రులు ఆడపిల్లలను యుద్ధవిద్యలో రాణించేలా ప్రోత్సహించాలని ఆమె కోరుతోంది. ‘వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్’ ఇండియా విభాగం పూజను జాతీయ కోచ్‌గా గుర్తించింది. రోహ్తక్ (హర్యానా)లోని మహర్షి దయానంద విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన శిక్షణ శిబిరంలో 27 ఏళ్ల పూజా హర్ష పాల్గొని మరిన్ని మెళకువలను నేర్చుకుంది. ‘వాకో’ ఉపాధ్యక్షుడు వాదిమ్ ఉక్రెయిన్‌స్తవ్ (రష్కా), ఇటలీకి చెందిన మాన్యుయేల్ నార్డియోల సమక్షంలో ఆమె తర్ఫీదు పొందింది. మనస్తత్వ శాస్త్రంలో పిజి చేసిన పూజ తనకు అత్యంత ఇష్టమైన కిక్ బాక్సింగ్‌లో ‘బ్లాక్‌బెల్ట్’ను సాధించింది.
చిన్నతనం నుంచే కిక్ బాక్సింగ్ అంటే తనకు ఎంతో ఆసక్తి ఉందని, ఈ విద్యలో మహిళలకు ప్రవేశం లేదన్న మాటలను తాను ఎంతమాత్రం పట్టించుకోకుండా శిక్షణ పొందానని ఆమె గుర్తు చేస్తోంది. యుద్ధవిద్యలో బాలికలకు అర్హత లేదని చాలామంది వాదిస్తుంటారని, అలాంటి మాటలను విన్నప్పడల్లా- కరాటే, బాక్సింగ్‌లో ఎందుకు రాణించకూడదన్న భావన తనలో మొదలైందని ఆమె చెబుతోంది. ఈ వాదనలు అర్థరహితమని చాటి చెప్పేందుకే తాను కిక్ బాక్సింగ్‌లో నిరంతర సాధన చేశానని అంటోంది. వీలైనంత ఎక్కువ సంఖ్యలో బాలికలు కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవాలన్నదే తన తపన అని పూజ చెబుతోంది. పురుషులు చేయగలిగే పనులన్నింటినీ మహిళలు కూడా చేయగలరని చెప్పేందుకే తాను బాక్సింగ్ రింగ్‌లో ప్రవేశించానని అంటోంది. బాక్సింగ్‌లో అద్భుతాలను సాధించాలన్నదే తన జీవితాశయమని తెలిపింది.
కొనే్నళ్లపాటు నిరంతర సాధన అలవడితే ఎలాంటి యుద్ధ క్రీడలోనైనా మహిళలు సత్తా చాటవచ్చని పూజ చెబుతోంది. భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేందుకు బ్రూస్ లీ వంటి వారు యుద్ధవిద్యలకే తమ జీవితాలను అంకితం చేశారని ఆమె అంటోంది. యుద్ధ క్రీడల గురించి మాట్లాడుకున్నపుడు మహిళల పేర్లు ప్రస్తావనకు రాకపోవడం తనకు ఆవేదన కలిగిస్తుందని ఆమె తెలిపింది. ఈ పరిస్థితుల్లో సమూల మార్పులు రావాలన్నదే తన తపన అంటోంది. జాతీయ, అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో మన దేశం తరఫున తనకు భాగస్వామ్యం దక్కడం ఎంతో ఆనందంగా ఉందంటోంది. విద్య, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న మహిళలు యుద్ధ కళల్లోనూ అద్భుతాలు సాధించగలరని చెబుతోంది. కర్నాటక రాష్ట్రం నుంచి బ్లాక్‌బెల్ట్ సాధించిన తొలి యువతిగా గుర్తింపు పొందడం, తాజాగా దక్షిణాది నుంచి తొలి మహిళా బాక్సింగ్ కోచ్‌గా ఎంపిక కావడంతోనే తన కల పూర్తిగా సాకారం కాలేదని, ఎక్కువ మంది బాలికలకు బాక్సింగ్ పట్ల ఆసక్తి కలిగించడం తన ప్రధాన లక్ష్యమని పూజ చెబుతోంది. తాను మొదట్లో కరాటే నేర్చుకున్నా, ఆ తర్వాత కిక్ బాక్సింగ్ పట్ల మొగ్గు చూపానని తెలిపింది. క్రీడా నైపుణ్యం ప్రదర్శించేందుకు బాక్సింగ్‌లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అంటోంది. కరాటేలో అనుభవం ఉండడంతో బాక్సింగ్ తనకు సులువుగా అలవడిందని వివరిస్తోంది. క్రీడారంగంపై ఆసక్తి ఉన్న తన తండ్రి హరిదాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. బాక్సింగ్ రిఫరీగా ఇప్పటికే గుర్తింపు పొందిన ఆమె- బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన ధ్యేయమంటోంది. అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలను సాధించే సామర్ధ్యం తనకు ఉందని, వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం కృషిచేసి, ఆ తర్వాత ఉత్తమ రిఫరీగా సేవలందిస్తానని తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. లైంగిక నేరాలు పెచ్చుమీరిన ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణలో మెళకువలు నేర్పించడమే కాదు, బాక్సింగ్‌లో వారు రాణించేలా కృషి చేస్తానని తెలిపింది. బాక్సింగ్‌ను క్రీడలా కాకుండా ఒక వృత్తిలా తీసుకోవాలని పూజ సూచిస్తోంది.