రంగారెడ్డి

ఎఇ సస్పెన్షన్‌కు నిరసనగా పెన్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 28: మేడ్చల్ ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ ఎం.శరణ్యను మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి సస్పెండ్ చేసినందుకు నిరసనగా జిల్లాలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు పెన్‌డౌన్ చేస్తునట్లు రాష్ట్ర ఆర్‌డబ్ల్యూఎస్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.ఎల్లారెడ్డి పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఇజిఎస్ క్రింద నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇలకు ఎలాంటి సంబంధం లేదని, దీనిలో 2500 రూపాయలు వసూలు చేశారని కలెక్టర్ అభియోగం మోపడం తన స్థాయిని దిగజార్జుకోవడమేనని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో 90 శాతం ప్రగతి ఉన్నందున, ఎలాంటి నిర్లక్ష్యం శరణ్య వహించలేదని చెప్పారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినప్పుడు అక్కడే అధికారులు ఉండాలని ఎక్కడా లేదని, ఇతరత్రా పనుల నిమిత్తం శరణ్య.. ఉప్పల్‌కు వచ్చారని, దీనికి సంబంధించి వివరణ ఇచ్చారని తెలిపారు. మండల ఎఇ కేవలం 40 లక్షల పనుల పర్యవేక్షణ మాత్రమే చేయాల్సి ఉంటుందని, అలాంటిది నేడు దాదాపు 20కోట్లు పనులు చేయటంతో పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌భగీరథ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించటం లేదని, అనుకున్న సమయానికంటే ముందుగానే జిల్లాలోని ఐదు మండలాలకు తాగునీరు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాను ఆదర్శ జిల్లాగా చేసేందుకు కృషి చేస్తుంటే, కలెక్టర్ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం అమానుషమని అన్నారు. మహిళా ఉద్యోగులపై కలెక్టర్ వేధింపులు ఆపేదాకా నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. సిఎస్ ఎస్‌పి సింగ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రెటరీ వి.నరేందర్, సలహాదారు చంధ్రశేఖర్‌రెడ్డి, ఇఇ వెంకట్‌స్వామి, డిఇ మధు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఓటరు నమోదు ప్రక్రియ

కీసర, ఏప్రిల్ 28: అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌తో పాటు, ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల సంఘం నియమించిన ఓటర్ల జాబితా పరిశీలకులు విష్ణు సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఐదు నియోజక వర్గాల పరిధిలో ఓటర్ల సవరణ రాజకీయ పార్టీల సూచనలు, సలహాల మేరకు సవరణలు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న 492 పోలింగ్ కేంద్రాలకు, నూతనంగా 88 పోలింగ్ కేంద్రాలు, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో 485 పోలింగ్ కేంద్రాలకు, అదనంగా 19 కేంద్రాలు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 566 పోలింగ్ కేంద్రాలకు, అదనంగా 120 కేంద్రాలు, కూకట్‌పల్లిలో 491 పోలింగ్ కేంద్రాలకు, అదనంగా నాలుగు పోలింగ్ కేంద్రాలు, ఉప్పల్ నియోజకవర్గంలో 447 పోలింగ్ కేంద్రాలకు, అదనంగా 21 కేంద్రాలను ప్రతిపాదించామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 1400 ఓటర్లుకు మించినట్లయితే, అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో 1200 దాటితే, మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. రాజకీయ పార్టీలు బూత్ స్ధాయి ఏజెంట్లను నియమించినట్లయితే, అధికారులకు ఓటర్ల జాబితా సవరణ సులువు అవుతుందని అన్నారు. ఇంటి నెంబర్ ప్రకారం ఓటర్ల జాబితా తయారు చేయాలని, ఓటరు స్లిప్పులు అధికారులు తప్పనిసరిగా పంచినట్లయితే ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వివరించారు. ఓటరు స్లిప్పులపై ఓటరు ఫోన్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని భాజపా ప్రతినిధి మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేంర్‌రావు, ఆర్డీవో హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.