పశ్చిమగోదావరి

జిల్లా బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల జె ఎసి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లా బందు ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు ఆర్‌టిసి గ్యారేజీ వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తిన ఘటన మినహాయించి జిల్లా అంతా ప్రశాంతంగా ఈ బంద్ జరిగింది. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. సినిమా ధియేటర్లలో ఉదయం ఆటలను రద్దు చేశారు. కాగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏలూరుతోపాటు జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, చింతలపూడి తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం గట్టిగానే కనిపించింది. కాగా తెల్లవారుఝాము నుంచి దళిత సంఘాల నేతలు ఆయా ప్రాంతాల్లోని బస్సు డిపోల వద్ద ఆందోళనలు చేపట్టారు. దీనితో ఎక్కడికక్కడ ఉదయం పూట బస్సులు నిలిచిపోయాయి. ఏలూరులోని ఆర్‌టిసి గ్యారేజీ వద్ద దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో బస్సులన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించగా నేతలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు కొంతమంది సంఘ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. అయితే ఆ తరువాత నుంచి కొంతమేరకు ఆర్‌టిసి బస్సు సర్వీసులు తిరుగుతున్నట్లు కనిపించాయి. జిల్లా వ్యాప్తంగానే ఈ పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు చేపట్టిన జిల్లా బంద్ మొత్తం మీద ప్రశాంతంగా, సంపూర్ణంగా సాగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలను నిర్వహించారు. సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. అన్నిచోట్ల కేంద్రమంత్రులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. స్వల్ప వివాదాన్ని యూనివర్శిటీ అధికారులు పరిష్కరించకుండా ఉదాశీనంగా వ్యవహరించి చివరకు రాజకీయ జోక్యం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్ధులను సస్పెండ్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. రోహిత్ వంటి పరిశోధక విద్యార్ధిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణం రోహిత్ మరణానికి కారణమైన వారిపై కటిన చర్యలు తీసుకోవడంతోపాటు అతని కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. పలుచోట్ల పోలీసు బందోబస్తును పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సంఘాలు చేస్తున్న ఆందోళన ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు దారితీయకుండా తగిన జాగ్రత్తలను చేపట్టారు. బంద్ నేపధ్యంలో విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలను సంఘాల నాయకులు మూయించి వేశారు. అలాగే ప్రముఖ వాణిజ్య, వ్యాపార సముదాయాలు కూడా పూర్తిగా మూతపడ్డాయి. ఏలూరు, కొత్తూరుల్లోని జూట్‌మిల్లులు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం గట్టిగానే కనిపించింది.
జిల్లా వ్యాప్తంగా 200 అన్న సంజీవని షాపులు
డిఆర్‌డిఎ అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఏలూరు, జనవరి 23: రానున్న ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా 200 అన్న సంజీవని మందుల షాపులను ఏర్పాటు చేయాలని డిఆర్‌డిఎ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం డి ఆర్ డి ఎ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల ప్రగతి తీరును కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత వరకూ 13 మండలాల్లో అన్న సంజీవని మందుల షాపులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ వారంలో గోపాలపురం, టి నర్సాపురం, కాళ్ల, దెందులూరుల్లో ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన మండలాల్లో కూడా త్వరితగతిన ఏర్పాటు చేయడంతోపాటు ఏడాది కాలంలో జిల్లా అంతటా 200 అన్న సంజీవిని మందులు షాపులుండేలా పనులు వేగవంతం చేయాలన్నారు. వీటిని ఏర్పాటు చేయడంతోపాటు ప్రతీ షాపు ఏడాదికి పది లక్షల రూపాయలు వ్యాపార లావాదేవీలు జరిగే లక్ష్యంగా నిర్వహించాలన్నారు.
4 లక్షల సభ్యులకు డిజిటల్ అక్షరాస్యత
జిల్లాలో 4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను ఈ ఏడాది చివరి నాటికి డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారానికి 15 వేల మందికి శిక్షణ అందించే దిశగా ప్రణాళిక అమలు చేయాలన్నారు. డ్వాక్రా సంఘాల్లో నిరక్షరాస్యులుగా వున్న రెండు లక్షల మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది జిల్లాలోని 4 లక్షల మంది డ్వాక్రా మమిళలను డిజిటల్ అక్షరాస్యులను చేయాలన్నారు. జిల్లాలో వెనుకబడిన డ్వాక్రా గ్రూపులను చైతన్యపరిచి వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వెలుగు క్లస్టర్ కో ఆర్డినేటర్లు, ఎపి ఎంలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 64 వేల డ్వాక్రా గ్రూపులుండగా వాటిలో 40 వేల గ్రూపులు ఏ గ్రేడ్ నుండి సి గ్రేడుకు వెళ్లాయని వాటిని ఏ గ్రేడ్‌కు తీసుకురావాల్సిన బాధ్యత సిసిలు, ఏపి ఎంలపై ఉందన్నారు.
ఆన్‌లైన్‌లో చేసిన రికవరీయే ప్రామాణికం
జిల్లాలో మొండి బకాయిలు ఒక శాతానికి లోపులోనే ఉండాలని కలెక్టర్ చెప్పారు. డ్వాక్రా గ్రూపులకిచ్చిన రుణాలు తిరిగి వసూళ్లలో సిసిలు, ఎపి ఎంలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. లక్ష్య సాధనపై గురి పెడితే ఫలితాల సాధన బాగుంటుందన్నారు. మొండి బకాయిల వసూళ్లలో వేలేరుపాడు, జీలుగుమిల్లి, ద్వారకాతిరుమల, దేవరపల్లి, ఏలూరు, ఉంగుటూరు, కొవ్వూరు మండలాల్లో రికవరీలో వెనుకబడి వున్నారని, వచ్చే వారం నాటికి చేయవలసిన రికవరీలో 50 శాతం లక్ష్యాలు సాధించకపోతే వారు తమ ఉద్యోగాల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
26న రూ. 7.56 కోట్లు స్కాలర్‌షిప్‌లు పంపిణీ
స్వయం సహాయక సభ్యురాళ్లకు చెంది చదువుకుంటున్న బాలబాలికలకు స్కాలర్‌షిప్పులు అందించేందుకు 7.56 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లను చెక్కుల రూపంలో అందించేందుకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిధులను పంపడం జరిగిందన్నారు. వీటిని గణతంత్ర దినోత్సవం రోజున స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందుబాటులో ఉన్న విద్యార్ధినీ విద్యార్ధులకు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో డి ఆర్‌డి ఎ పిడి కె శ్రీనివాసులు, వెలుగు ప్రాజెక్టు క్లస్టర్ కో ఆర్డినేటర్లు, ఎపి ఎంలు పాల్గొన్నారు.
23 ఇ ఎల్ ఆర్ 10 : ఏలూరులో శనివారం డి ఆర్‌డి ఎ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అన్న సంజీవని, డిజిటల్ అక్షరాస్యత, బ్యాంకు లింకేజ్ రుణాలు రికవరీ తదితర అంశాలపై సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్
ఆక్వా మెగా ఫుడ్ పార్కు నిర్మాణ పనులు
తక్షణం నిలిపివేయాలి
అఖిలపక్ష సమావేశం డిమాండ్
నర్సాపురం, జనవరి 23: ప్రజాభిప్రాయానికి భిన్నంగా తుందుర్రు గ్రామంలో జనావాసాల మధ్య చేపట్టిన ఆక్వా మెగా ఫుడ్ పార్కు నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. తుందుర్రు సంఘటనపై శనివారం అఖలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక మీరా గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీతో సహ వైసిపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, లోక్‌సత్తా పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆక్వా మెగా ఫుడ్ పార్కు నిర్మాణం వలన రైతాంగం, మత్స్యకారుల ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లితుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని ఈ నిర్మాణాన్ని తక్షణం నిలుపుదల చేయాలని కొత్తపల్లి కోరారు. లోక్‌సత్తా పార్టీ నాయకులు డాక్టర్ శిరిగినీడి నాగభూషణం మాట్లాడుతూ ఫుడ్ పార్కు నిర్మాణం వలన నీటి కాలుష్యం ఏర్పడి ప్రజలు రోగాలపాలవుతారన్నారు. సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్వాహుకులు మొదటి నుంచి మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూమి సేకరణతోపాటు అనుమతులు పొందటంలో కూడా యాజమాన్యం ప్రభుత్వాన్ని మోసగించిందన్నారు. టిడిపి నాయకులు కొప్పాడి రవీంద్రనాధ్ ఠాగూర్, పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని ఎమ్మెల్యే ద్వారా పార్టీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సిపిఐ నాయకులు ఆరేటి మృత్యంజయ రావు, కాంగ్రెస్ నాయకులు పి మురళీకృష్ణ, లోక్‌సత్తా నాయకులు నల్లం సూర్యచంద్రరావు, వైసిపి నాయకులు కొత్తపల్లి నాని, వనె్నంరెడ్డి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
తాడిపూడి లిఫ్ట్‌కు ఎలైన్‌మెంట్‌లో జాప్యం ఎందుకు:కలెక్టర్
ఏలూరు, జనవరి 23: ఏడేళ్లు అయినా ఇంకా తాడిపూడి లిఫ్ట్‌కు ఎలైన్‌మెంట్‌లో జాప్యం ఎందుకు జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ గాయత్రీ ఏజెన్సీ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ తీరుపై ఆయన సమీక్షించారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 2009లో తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టినా నేటి వరకు మెయిన్ కెనాల్ పనులు చేపట్టకపోవడం దారుణమన్నారు. నిధుల కొరత వున్నప్పటికీ 180 కోట్ల రూపాయలు నిధులను చింతలపూడి లిఫ్ట్ పనులకు మంజూరు చేయించడం జరిగిందని, వచ్చే ఏడాది మరో 300 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వాన్ని కోరున్నట్లు చెప్పారు. చింతలపూడి మెయిన్ బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి ఎలైన్‌మెంట్ ఫిక్సేషన్ ఇంకా పూర్తికాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఎక్కడాకూడా భూమికొరత లేదని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, కాంట్రాక్టు ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, ఇరిగేషన్ ఎస్ ఇ వెంకటరమణ, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ డి సుదర్శనమ్, ఆర్‌డివోలు తేజ్‌భరత్, లవన్న, ఐటిడి ఎ పివో షాన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాడిపూడి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంపై
ఎసిబి దాడి* అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నుండి రూ.4లక్షలు స్వాధీనం* రైతుల నష్టపరిహారం కోసం అధికారులకు లంచాలు
నల్లజర్ల, జనవరి 23: రైతుల నుండి భారీ ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మండల కేంద్రం నల్లజర్లలో ఉన్న తాడిపూడి ఎత్తిపోతల పథకం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంపై శనివారం అవినీతి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎసిబి దాడి సమయంలో కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లేరు. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వద్ద రూ.4లక్షలు ఉండడాన్ని గుర్తించిన ఎసిబి అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి డిఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..తాడిపూడి ఉప కాలువలో భూములు కోల్పోయిన అన్నదేవరపేటకు చెందిన రైతులకు నష్టపరిహారం అందజేయటంలో అధికారులు జాప్యం చేస్తుండడంతో కొందరు ఎసిబిని ఆశ్రయించారు. ఈ బిల్లులు మంజూరు నిమిత్తం శనివారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులకు ముడుపులు అందుతున్నట్లు తమకు సమాచారం రావడంతో తమ సిబ్బందితో ఆకస్మిక దాడి చేసినట్టు డిఎస్పీ తెలిపారు. ఈ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి సురేష్ వద్ద నుండి రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆ సమయంలో డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో లేకపోవడంతో ఆమెకు సమాచారమిచ్చి కార్యాలయానికి రప్పించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్‌ను, డిప్యూటీ కలెక్టర్ సమజను వేర్వేరుగా విచారించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అన్నదేవరపేటకు చెందిన రైతులకు ఎకరానికి రూ.26లక్షలు చొప్పున రూ.83లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. దీని నిమిత్తం డిప్యూటీ కలెక్టర్ రూ.5లక్షలు డిమాండు చేయగా రూ.4లక్షలు తనకు తెచ్చి ఇచ్చినట్లు సురేష్ తెలిపినట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఎసిబి సిఐ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.

తుందుర్రు, కె.బేతపూడి గ్రామాల్లో పోలీసు పికెట్
42 మందిపై కేసులు
నరసాపురం, జనవరి 23: తుందుర్రు గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా శనివారం తుందుర్రు, కె.బేతపూడి గ్రామాలలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం సంఘటనపై పోలీసులు మొత్తం 42 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటకం కల్గించడం, వస్తువుల ధ్వంసం, అనుమతి లేని ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించడం వంటి నేరాలపై కేసులు నమోదు చేసినట్టు నరసాపురం సిఐ రామచంద్రరావు చెప్పారు. రూరల్ ఎస్సై శంకర్ దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరోవైపు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ ఆక్వా ఫుడ్ పార్కు యాజమాన్యంతో చర్చించారు. ఫ్యాక్టరీకి మంజూరైన అనుమతులు, పొల్యూషన్ బోర్డు జారీ చేసిన అనుమతి పత్రాలను సబ్ కలెక్టర్ పరిశీలించారు.
బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను బర్తరఫ్ చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను మంత్రివర్గం నుండి మోదీప్రభుత్వం బర్త్ఫ్ చేయాలని మాజీ ఎంపి జివి హర్షకుమార్ డిమాండ్ చేశారు. విసిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. శనివారం భీమవరం వచ్చిన ఆయనను పలువురు దళిత నాయకులు కలిశారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే దళితులందరినీ ఐక్యంచేసి , ప్రత్యేక పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, దళిత మహాసభ లీగల్ కన్వీనర్ పిల్లి డేవిడ్‌కుమార్ తదితరులు హర్షకుమార్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
సమస్యల సత్వర పరిష్కారానికే సిజిఆర్‌ఎఫ్
సిజిఆర్‌ఎఫ్ ఛైర్‌పర్సన్ శ్రీనివాసరావు
బుట్టాయగూడెం, జనవరి 23: విద్యుత్తు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి, మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కృషిచేయడానికే విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సిజిఆర్‌ఎఫ్)ను ఏర్పాటుచేసినట్లు వేదిక ఛైర్‌పర్సన్ ఆర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన గ్రీవెనె్సస్ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2005లో వేదిక ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 4997 ఫిర్యాదులు అందాయని, వీటిలో 4719 పరిష్కరించామని, సంబంధిత అధికారుల నుండి సకాలంలో వివరణలు రాకపోవడంతో 278 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. తమ వేదిక తూర్పు, పశ్చిమ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నెలకు ఐదు ప్రదేశాల్లో గ్రీవెనె్సస్ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ అయిదు జిల్లాల పరిధిలో 52లక్షల మంది విద్యుత్తు వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎల్లవేళల తెలియవచ్చునని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గతేడాది జనవరి 1వ తేదీ నుండి ఇప్పటివరకు 146 ఫిర్యాదులు అందాయని, వాటిలో 85 పరిష్కరించినట్లు వివరించారు. వేదిక సూచించిన పరిష్కారం పట్ల వినియోగదారుడు సంతృప్తిచెందని యెడల హైదరాబాదులో ఉన్న అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. తమకు ఫిర్యాదు అందిన 45రోజుల గడువులో పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. కానీ అధికారుల అలసత్వం కారణంగా నెలల తరబడి ఆలస్యమవుతోందని విచారం వ్యక్తంచేశారు. విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యోగులే పరిష్కార వేదికలో సభ్యులుగా ఉండటం వలన తగిన న్యాయం జరగడంలేదనే కొందరి అభిప్రాయం కారణంగా వేదిక ఛైర్మన్‌గా 25 సంవత్సరాల అనుభవం కలిగిన జిల్లా జడ్జిని, ఇతర సభ్యులుగా సంస్థకు సంబంధంలేని వ్యక్తులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం విశాఖపట్నంలో జరిగే డయల్ యువర్ సిఎండి (్ఫన్ నెం.08912706352)కు ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు, స్పందన కార్యక్రమానికి ఉదయం 10.30 నుండి ఫోను ద్వారా వినియోగదారులు తమ సమస్యలను తెలుపవచ్చునని సూచించారు. వేదిక దృష్టికి మూడు ఫిర్యాదులు అందినట్లు నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో వేదిక లీటల్ సభ్యుడు ఎంవై కోటేశ్వరరావు, ఎస్‌ఇ సిహెచ్ సత్యనారాయణరెడ్డి, డిఇలు సాల్మన్‌రాజు, రఘునాధబాబు పాల్గొన్నారు.
ప్రశాంతంగా పత్తికోళ్లలంక
ఏలూరు, జనవరి 23: మండలంలోని కొల్లేరు గ్రామమైన పత్తికోళ్లలంకలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగడం, ఒక వ్యక్తిని హత్య చేయడం, ఇళ్లను ధ్వంసం చేయడం తదితర తతంగాల నేపధ్యంలో శనివారం పత్తికోళ్లలంక ప్రశాంతంగానే వుంది. మెల్లిగా కోలుకుంటోంది. గ్రామానికి చెందిన పురుషులు ఎవరూ కూడా గ్రామంలో పెద్దగా లేరు. మహిళలు, విద్యార్ధులు, చిన్నారులు, కూలీలు వున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. వీధి వీధిన కూడా ప్రత్యేక పర్యవేక్షణలు నిర్వహించారు. రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

కాపులు అన్నిరంగాల్లో రాణించాలంటే రిజర్వేషన్ ఒక్కటే మార్గం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 23: కాపులు అన్నిరంగాల్లో రాణించాలంటే రిజర్వేషన్ ఒక్కటే మార్గమని కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకర సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడులు అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఈ నెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో తలపెట్టిన ఐక్యకాపుగర్జనకు మద్దతుగా శనివారం 100 కార్లతో జిల్లాకాపు చైతన్యయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర కొమరాడ రోడ్డులోని చేపల రాము అతిథి గృహం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకర సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, జిల్లాకాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, ఐక్యకాపుగర్జన కన్వీనర్ యార్లగడ్డ రాము, జిల్లా అధ్యక్షులు ఉండపల్లి రమేష్‌నాయుడులు మాట్లాడారు. కాపులకు న్యాయం జరగాలంటే ఒక్క రిజర్వేషన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కాపులు ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, అందరూ ఐకమత్యంగా పోరాడినప్పుడే రిజర్వేషన్ సాధించుకోగలమన్నారు. కాపుల ఆఖరి పోరాటంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఐక్యకాపుగర్జనకు ప్రతీ కాపుసోదరుడు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐక్యకాపుగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉండి, గణపవరం, తాడేపల్లిగూడెం, తణుకు, మార్టేరు, పాలకొల్లు, నరసాపురం, మత్స్యపురి, తుందుర్రు మీదుగా కాపుచైతన్య యాత్ర సాగింది. కార్యక్రమంలో కాపునాడు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బేతు కృష్ణారావు, మాగాపుప్రసాద్, గ్రంధి నానాజీ, సివి, మాణిక్యాలరావు, నల్లం చిట్టిబాబు, ఉప్పలపాటి ఫణీంద్ర, చల్లా రాము, బాబి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదరహిత వాహనాల రూపకల్పనకు యువ ఇంజనీర్లు నడుం బిగించాలి
జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రభురాజ్‌కుమార్

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 23: ప్రమాదరహిత వాహనాల రూపకల్పనకు యువ ఇంజనీర్లు నడుంబిగించాలని జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం ప్రభురాజ్‌కుమార్ (ఏలూరు) పేర్కొన్నారు. భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో జరుగుతున్న జాతీయస్థాయి విష్ణు కార్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను రెండవ రోజు శనివారం డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రభురాజ్‌కుమార్, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కెవి విష్ణురాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్‌కుమార్ మాట్లాడారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం, వాహనాలు వేగంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలు నడిపినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగవన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా జాతీయస్థాయి కార్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కెవి విష్ణురాజు మాట్లాడుతూ ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టాలన్నారు. దేశ, సమాజ అవసరాలు గుర్తించి, ఆ విధంగా పరిశోధనలు జరపాలన్నారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత ఇటువంటి సందర్భాల్లో బయటపడుతాయన్నారు. ఇంజనీర్లు పారిశ్రామిక రంగాల వైపు మళ్లకుండా పరిశోధనలపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా ఛాంపియన్‌షిప్ రైన్‌టెస్టును ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రాజ్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. డ్రైవింగ్‌లో వాహనం జారుడు నిరోధక శక్తిని పరీక్షించే స్కిడ్ టెస్టును ఛైర్మన్ కెవి విష్ణురాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు కార్టింగ్‌లో ప్రతిభ కనబరిచారు. భీమవరం ఆర్టీవో రమేష్‌కుమార్, పాలకొల్లు ఎంవిఐ శ్రీనివాస్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ జి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ పి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
కార్యకర్తల సంక్షేమమే లోకేష్ ధ్యేయం
పాలకొల్లు, జనవరి 23: కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇవ్వటంతోపాటు, వారికి ఉచిత ప్రమాద బీమా, వారి పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా విద్య తదితర సౌకర్యాలు కల్పించిన ఘనత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో లోకేష్ 34వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మారావు పౌండేషన్ ద్వారా 50 మంది పేద మహిళలకు చీరలు అందించారు. మార్కెట్ కమటీ ఛైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు మాట్లాడుతూ లోకేష్ రాకతో పార్టీకి నూతన జవసత్వాలు వచ్చాయన్నారు. మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, మండల అధ్యక్షురాలు పెనె్మత్స శ్రీదేవి, ఎఎంసి వైస్ ఛైర్మన్ చిట్టూరి సీతారామాంజనేయులు, పట్టణ టిడిపి అధ్యక్షులు బోనం నరసింహారావు, జడ్పీటీసీ బోనం నాని, గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, పెనె్మత్స రామభధ్రిరాజు, ధనాని సూర్యప్రకాష్ పాల్గొన్నారు.