మెయన్ ఫీచర్

‘తలతిక్కతనం’.. పుతిన్ జాణతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో వ్లాదిమిర్ పుతిన్ జపాన్‌కు వెళ్లాడు.. క్రీస్తుశకం 2000వ సంవత్సరం నాటి ‘కథ’ ఇది.. జపాన్ రాజధాని టోకియో నగరంలోని ఒక మైదానంలో ‘జూడో’ సమర క్రీడా ప్రదర్శనలు జరిగాయి! ఆ ప్రదర్శనను తిలకించడానికి రష్యా అధ్యక్షుడు వెళ్లాడు! పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ‘జూడో’ క్రీడా విన్యాసాలను ప్రదర్శించారు! వారిని చూసి పుతిన్‌కు కూడ ఉత్సాహం వచ్చేసింది! పుతిన్ కూడ ‘జూడో’క్రీడలో గొప్ప కోవిదుడట! అత్యున్నత స్థాయి ‘బ్లాక్ బెల్ట్’- నల్లపట్టా- ఆయనకు చిన్నప్పుడే లభించింది. అందువల్ల పుతిన్ కూడ తన విద్యను ప్రదర్శించడానికి నడుం బిగించాడు! ‘నసూమీగూమీ’ అన్న పదేళ్ల జపానీ బాలికతో ‘జూడో’ యుద్ధానికి తలపడినాడు! ‘నాతో నీవు పోటీపడలేవు..’- అని ఆ పాప పుతిన్‌కు నచ్చచెప్పింది. పుతిన్ వినలేదు. ఆ పాప తనతో జూడో యుద్ధం చేసి తీరాలని పట్టుపట్టాడు! విధిలేక ఆ పాప పుతిన్‌తో తలపడింది. ‘యుద్ధం’ యాబయి సెకండ్లలోనే ముగిసిపోయింది. పుతిన్‌తో తలపడిన విద్యార్థిని అంత లావు అధ్యక్షుడిని తన భుజం మీదుగా తలకిందులుగా తిప్పి నేలపై పడేసింది. కింద పడిపోయిన పుతిన్‌ను ‘ఎలా ఉంది?’ అని బాలిక పరామర్శించింది! పుతిన్ అధ్యక్ష పదవీ ప్రస్థానంలో ఇలాంటి ఘటనలెన్నో జరిగాయి! ‘తల తిక్క’ మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు! కానీ, నిజానికి అతగాడు గొప్ప జాణతనానికి ప్రతీక..
‘మా కుక్క ఆరు పిల్లలను ఈనింది.. ఐదింటిని ఎవరెవరికో ఇచ్చేశాము! ఈ ఒక్కటీ మిగిలి ఉంది! దీన్ని మీకు ఇస్తాను’- అని వెనకటికి ఒక వీరభద్రప్ప గారు ఇద్దరు అర్భకులతో అన్నాడట! ‘మనింట్లో కుక్క ఉంది కదా..!’ అని ఆ అర్భకులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారట! ఈలోగా వీరభద్రప్ప గారు- ‘దీన్ని మీకు తప్పక ఇస్తాను..’ అని కుక్కపిల్లను చూసి మురిసిపోయాడు! ‘ఎదుటి వారి అంగీకారం అక్కరలేదు.!’ అన్నది వీరభద్రప్ప నీతి! ప్రస్తుతం ఈ ‘వీరభద్రప్ప’ వంటివాడు రష్యా అధ్యక్షుడు పుతిన్! ‘తల తిక్క’తనం తరచూ అభినయిస్తున్న పుతిన్ నిజానికి అతి జాణతనం ఒలకపోస్తున్నాడు! ఈ అతి జాణతనం ‘సంకుచిత జాతీయవాదం!’ అందువల్ల పుతిన్ ‘మరో రెండు’ అణువిద్యుత్ ఉత్పాదక వ్యవస్థ- న్యూక్లియర్ పవర్ రియాక్టర్-లను మనకు అంటగట్టగలిగాడు! ఈనెల ఆరంభంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలోని పీటర్స్‌బర్గ్‌ను సందర్శించాడు. ఆ సందర్భంగా- ‘ఈ రెండు రియాక్టర్‌లను మీకిస్తాము..’ అని పుతిన్ ప్రకటించేశాడు. మన ప్రభుత్వం అంగీకరించింది! కుడంకుళంలోని విద్యుత్ ఉత్పాదక కేంద్రంలో ఇప్పటికే పనిచేస్తున్న నాలుగు ‘రియాక్టర్’లను మనం రష్యా నుంచి కొన్నాము! వీటిలో ‘మూడు’, ‘నాలుగు’ ఉత్పాదక యంత్ర విభాగాల ధర విషయంలో రష్యా ప్రభుత్వం పెచీ పెట్టింది! అనేక ఏళ్లపాటు ఈ ‘రియాక్టర్’లను అప్పగించకుండా రష్యా ప్రభుత్వం ‘జాణతనం’ ప్రదర్శించింది. చివరికి పుతిన్ ప్రభుత్వం చెప్పిన ధరలకే మన ప్రభుత్వం ఈ మూడవ, నాలుగవ ‘రియాక్టర్’లను కొనుగోలు చేయవలసి వచ్చింది! ఇప్పుడు మన ప్రభుత్వం వ్యూహం మార్చింది. ‘అణు సరఫరాలు చేసే దేశాల కూటమి’- న్యూక్లియర్ సప్లయ్యర్స్ గ్రూప్-ఎన్‌ఎస్‌జి-లో మనకు సభ్యత్వం ఇవ్వాలని రష్యా ప్రభుత్వం బాహాటంగా ప్రకటించాలని మన ప్రభుత్వం ఏడాదికి పైగా కోరుతోంది! మనకు ‘ఎన్‌ఎస్‌జి’లో సభ్యత్వం లభించకుండా చైనా బహిరంగంగానే అడ్డుకుంటోంది! అందువల్ల రష్యా మనకు ‘మద్దతు’గా బహిరంగ ప్రకటన చేయాలన్నది మన ప్రభుత్వ వ్యూహం! రష్య ఇలా మద్దతును ప్రకటించేవరకు రష్యావద్ద సిద్ధంగా ఉన్న ఐదవ, ఆరవ ‘రియాక్టర్’లను కొనరాదన్నది మన వ్యూహం...
‘తల తిక్క’ పుతిన్ మరోసారి తన ‘జాణతనం’ ప్రకటించగలిగాడు! నరేంద్ర మోదీతో పీటర్స్‌బర్గ్‌లో జరిపిన చర్చలలో ‘అణుసరఫరాల కూటమి’లో మన సభ్యత్వం గురించి పుతిన్ ప్రస్తావించనే లేదు.. ‘నరేంద్ర మోదీ ఎందుకు ప్రస్తావించలేదు?’- అన్న ప్రశ్న కూడ వినబడడం లేదు. ఇదీ పుతిన్ ‘జాణతనం’.. ‘ఈ రెండు రియాక్టర్‌లను మాత్రం మీకు ఇచ్చేశాము’ అని పుతిన్ ప్రకటించేశాడు. ‘ఎన్‌ఎస్‌జి’ సభ్యత్వం గురించి మన ‘వ్యూహం’ ఏమయినట్టు? చైనాను పరోక్షంగానైనా విమర్శించడానికి రష్యా సిద్ధంగా లేదు! అంత గట్టిగా ‘రష్యా- చైనా మైత్రి’ బిగిసిపోయి ఉండడం మన ప్రధాన మంత్రి పీటర్స్‌బర్గ్ సందర్శన సందర్భంగా మరోసారి ధ్రువపడిన చేదు నిజం. మనకు మద్దతుగా రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. మనం మాత్రం ‘రియాక్టర్’లను కొనుగోలు చేసేశాం!!
మనకు ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి’లో శాశ్వత సభ్యత్వం ‘ఎండమావి’లోని ‘కొబ్బరి నీటి’వలె ఊరిస్తూనే ఉంది! రష్యా అధ్యక్షుడు ఇప్పుడు ఆ ఊసుకూడ ఎత్తలేదు! ‘్భరతదేశానికి ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం లభించడం అంత తేలిక కాదు’- అని చైనా ప్రభుత్వం మోదీ పీటర్స్‌బర్గ్ నుంచి వచ్చేసిన తరువాత దాదాపుప్రతిరోజూ ప్రకటిస్తోంది! కానీ ‘షాంఘయి సహకార సమాఖ్య’- షాంఘయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్- ఎన్‌సిఓ-లో మాత్రం మన దేశానికి సభ్యత్వం లభిస్తోందని రష్యా అధ్యక్షుడు ‘పీటర్స్‌బర్గ్’లో మన ప్రధాని ఉన్న సమయంలోనే ప్రకటించాడు! ఇది కూడ మన అంగీకారంతో నిమిత్తం లేకుండానే- ‘మీకు ఈ కుక్కపిల్లను ఇస్తాను’ అని వీరభద్రప్ప గారు చెప్పినట్టుగానే ఉంది! ‘షాంఘయి సహకార సంస్థ’ చైనా ఆధిపత్యానికి, విస్తరణ వ్యూహానికి మరో మాధ్యమం.. చైనాకు తోకగా రష్యా అవతరించి ఉండడం ‘షాంఘయి’ కూటమి ఏర్పాటునకు చారిత్రిక నేపథ్యం. ‘షాంఘయి’ చైనాలోని అతి పెద్ద నగరం, చైనాకు వాణిజ్య రాజధాని వంటిది! ‘షాంఘయి’ కూటమి ‘ప్రపంచీకరణ’కు ఆసియాలో మరో విస్తరణ! ప్రాచీన కాలం నాటి ‘పట్టుబాట’- సిల్క్‌రోడ్-ను పునరుద్ధరించడమన్న ‘చారిత్రక స్ఫూర్తి’తో చైనా ఇటీవల మరో బృహత్ పథకాన్ని రూపొందించింది! ఈ ‘పట్టుబాట’ మన జమ్మూ కశ్మీర్‌కు ఉత్తరంగా టిబెట్, సింకియాంగ్, అప్ఘానిస్థాన్, ఇరాన్, ఇరాక్ దేశాలగుండా సిరియాలోని డమాస్కస్ వరకు కొనసాగింది. ‘పట్టుబాట’కు ప్రాచుర్యం కల్పించినవారు ప్రాచీనకాలంలో భారతీయులు!
శతాబ్దులకు పూర్వం అఫ్ఘానిస్థాన్ మన దేశంలో భాగం. ‘గాంధార’, ‘యోన’వంటి అనేక రాజ్యాలు నేటి అప్ఘానిస్తాన్‌లో ఉండేవి! అప్పుడు ఇరాన్ ‘పారశీక’ దేశం, ఇరాక్ ‘మెసపుటేమియా’గా పేరుగాంచింది! టిబెట్-త్రివిష్టపం- రెండువేల ఐదువందల ఏళ్ల క్రితం మన దేశంలో భాగం. ఆ తరువాత స్వతంత్ర దేశమైంది. అలాగే క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది వరకూ ‘సింకియాంగ్’ చైనాలో భాగం కాదు. ‘సింకియాంగ్’ ప్రాచీన కాలంలో హూణ దేశం.. ‘హూణు’లకూ, ‘హాణు’ -చైనా-లకూ మధ్య శతాబ్దుల పాటు యుద్ధాలు నడిచాయి. అందువల్ల ప్రాచీన కాలంలో ‘పట్టుబాట’వెంట ‘డమాస్కస్’ నుంచి టిబెట్ వరకూ ప్రధానంగా వ్యాపారం ‘రవాణా’సాగించినవారు భారతీయులు! కానీ ‘పట్టుబాట’ పునరుద్ధరణ పేరుతో చైనా ‘పాకిస్తాన్ దురాక్రమణ కశ్మీర్’లో తిష్ఠ వేయడానికి ప్రయత్నిస్తోంది! అందువల్లనే మన ప్రభుత్వం ఈ తథాకథిత- సోకాల్డ్- ‘పట్టుబాట పునరుద్ధరణ వ్యవస్థ’లో చేరడానికి నిరాకరించింది! చైనాను ప్రతిఘటిస్తోంది! కానీ ఈ విధానాన్ని నీరుగార్చే విధంగా ‘షాంఘయి కూటమి’లో మనం చేరడం మరో హిమాలయ మహాపరాధం కాగలదు... పాకిస్తాన్‌కు కూడ మనతోపాటు ‘షాంఘయి కూటమి’లో సంపూర్ణ సభ్యత్వం లభించడం చైనా మనలను వెక్కిరిస్తోందనడానికి సాక్ష్యం! ఈ చైనా‘వెక్కిరింపు’ రష్యా ‘నోటి’ ద్వారా కన్పిస్తోంది! గతంలో ఈ ‘పట్టుబాట’ వ్యూహం రూపొందని రోజులకు, మన దేశం ‘షాంఘయి’ సభ్యత్వం కోసం తహతహలాడింది! కానీ ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’లోకి చైనా చొరబడి ఉన్న నేపథ్యంలో మనం మన విధానాన్ని సమీక్షించుకోవాలి..
రష్యా 1991వరకు సోవియట్ యూనియన్‌లో భాగం.. సోవియట్ యూనియన్‌లో మరో పధ్నాలుగు దేశాలుండేవి! ఈ ‘యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్’- ‘యుఎస్‌ఎస్‌ఆర్’కూ, చైనాకు మధ్య పెద్ద సరిహద్దు ఉండేది. సరిహద్దు తగాదాలు ఉండేవి. ‘యుఎస్‌ఎస్‌ఆర్’- సోవియట్ రష్యా- కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, చైనా కూడ కమ్యూనిస్టు దేశమే! కానీ ఉభయ దేశాల మధ్యగల సరిహద్దులో నిరంతరం పచ్చగడ్డి భగ్గున మండుతూ ఉండేది! ఆ సోవియట్ రష్యా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మనకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం! 1991లో సోవియట్ యూనియన్‌లో ‘కమ్యూనిజమ్’ కుప్పకూలిపోయింది! నియంతలపై తిరుగుబాటు చేసిన జనం బోరిస్ ఎల్బ్‌సిన్ నాయకత్వంలో ప్రజాస్వామ్య విప్లవం సాధించారు! ప్రజాస్వామ్యం వికసించగానే సోవియట్ యూనియన్ పదిహేను దేశాలుగా విడిపోయింది! ‘యూనియన్’ వారసత్వం రష్యాకు దక్కింది. కానీ ప్రజాస్వామ్య రష్యా ప్రజాస్వామ్య భారత్‌తో 1991 సంవత్సరానికి పూర్వం వలె సన్నిహిత మైత్రిని పాటించడం లేదు! ప్రజాస్వామ్య రష్యా నియంతృత్వ చైనాతో జట్టుకట్టింది. మతోన్మాద బీభత్స రాజ్యాంగ వ్యవస్థగల పాకిస్తాన్‌తో జట్టుకట్టింది! 2000వ సంవత్సరం నుంచి పుతిన్ అధ్యక్షుడిగా, ప్రధానిగా, మళ్లీ అధ్యక్షుడిగా రష్యాను నడిపిస్తున్నాడు! ‘తల తిక్కతనం’ వెనుక నక్కిన సంకుచిత ప్రయోజనం పుతిన్ విధానం...

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352