ఆటాపోటీ

ఓటమిపై పాక్ అటాప్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొన్న పాకిస్తాన్ అన్ని విభాగాల్లోనూ విఫలమై, 124 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలు కావడం అటు అధికారులను, ఇటు అభిమానులను ఒకే రీతిలో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వైఫల్యాలపై పాక్ మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు అటాప్సీ (శవ పరీక్ష) మొదలు పెట్టారు. వివిధ చర్చలు, ఇంటర్వ్యూలు, అభిప్రాయ సేకరణ తదితర మార్గాల్లో అందిన సమాచారం ప్రకారం టీమిండియా చేతిలో పాక్ చావుదెబ్బ తినడానికి ప్రధాన కారణాలు ఇవే..
1. కొత్త బంతితో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను ఫాస్ట్ బౌలర్ మహ్మమద్ అమీర్ వేస్తే, రెండో ఓవర్‌ను మరో పేసర్‌తో కాకుండా స్పిన్నర్ ఇమాద్ వసీంతో వేయించాలని కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని సృష్టించింది. నిజానికి భారత ఓపెనర్లు మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరును పెంచే వైఖరిని ప్రదర్శించలేదు. ఆచితూచి ఆడుతున్నప్పుడు ఇమాద్ వాసిం వంటి స్పిన్నర్‌ను ఆరంభంలోనే ఎందుకు బరిలోకి దించాల్సి వచ్చిందనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు.
2. పేస్‌ను, స్పిన్‌ను ఒకసారి మొదలుపెట్టినప్పుడు, ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉండాలి. కానీ, పాక్ ఫీల్డింగ్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా లేదన్నది వాస్తవం. ఫీల్డింగ్ చెత్తగా ఉంటే, బౌలర్లు ఎంతటి సమర్థులైనా ఉత్తమ ఫలితాలను రాబట్టడం కష్టం. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది.
3. ఇంగ్లాండ్ వాతావరణానికి, అక్కడి పిచ్‌ల తీరుకు ఆటగాళ్లు అలవాటు పడాలి. తరచు వర్షం పడడం, ఆటకు అంతరాయం ఏర్పడడం అక్కడ ఆనవాయతీ. దీనితో అవుట్ ఫీల్డ్ జారుతూ ఉంటుంది కాబట్టి, పట్టు కోసం అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, పాక్ ఆటగాళ్లలో ఈ లక్షణం కొరవడింది. వాహబ్ రియాజ్ కింద పడడంతో కాలి మడమ బెణికింది. ఫలితంగా అతను తన కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. చాంపియన్స్ ట్రోఫీకి పాక్ క్రికెటర్లు అన్ని విధాలుగా సిద్ధం కాలేదనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
4. జట్టుకు కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన వికెట్‌కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అనుభవ రాహిత్యంతోపాటు నిర్లక్ష్యం కూడా పాక్ పరాజయానికి కారణమైంది. ఫీల్డర్ బంతిని ఆపి, నేరుగా వికెట్లను గురి చూసి విసిరినప్పటికీ, పలు సందర్భాల్లో సర్ఫ్‌రాజ్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏదో పరధ్యానంలో ఉన్నట్టు కనిపించింది. దీనికి తోడు ఫీల్డర్లు బంతిని ఆపేందుకు ప్రయత్నించకుండా, దాని వెనకే పరుగులు తీస్తూ తమ అథ్లెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడం కూడా పాక్ ఓటమికి దారితీసింది.
5. బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉన్న కారణంతోనే టాస్ గెలిచిన తర్వాత పాక్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడం అతని లక్ష్యం. కానీ, బౌలర్లను అతను చాకచాక్యంగా ఉపయోగించుకోలేదు. గత వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకూ పాక్ తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఘనత హసన్ అలీకి దక్కుతుంది. కానీ, సర్ఫ్‌రాజ్ అతనిని ఆలస్యంగా బరిలోకి దించాడు.
6. మహమ్మద్ అమీర్ మెరుపువేగంతో అవుట్ స్వింగర్స్‌ను సంధిస్తాడన్న విషయం తెలిసినప్పటికీ, అతని బౌలింగ్‌లో సెకండ్ స్లిప్ నుంచి ఫీల్డర్‌ను సర్ఫ్‌రాజ్ ఎందుకు తొలిగించాడన్న ప్రశ్న వినిపిస్తున్నది. వికెట్ల నుంచి దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి మరీ స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యే బలహీనత భారత బ్యాట్స్‌మెన్‌కు ఉంది. కానీ, సెకండ్ స్లిప్‌లో ఫీల్డర్‌ను నిలబెట్టకుండా సర్ఫ్‌రాజ్ ఒక రకంగా టీమిండియాకు మేలు చేశాడు. అమీర్‌కు దక్కాల్సిన వికెట్లు రాకుండా పోయాయి.
7. గత వరల్డ్ కప్ తర్వాత వాహబ్ రియాజ్ క్రమంగా ఫామ్ కోల్పోతున్నాడు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. చాలాకాలంగా వికెట్ల దొరక్క అల్లాడుతున్న అతను ఈ మ్యాచ్‌లో 8.4 ఓవర్లు బౌల్ చేశాడు. 87 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కాలి గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. అసలు ఫామ్‌లోలేని రియాజ్‌ను తుది జట్టులోకి సర్ఫ్‌రాజ్ ఎందుకు తీసుకున్నాడన్న ప్రశ్నకు సమాధానం లేదు.
8. వేగంగా దూసుకొస్తూ, వికెట్లకు ఇరువైపులా విపరీతంగా స్వింగ్ అవుతూ బ్యాట్స్‌మెన్‌ను నానా కష్టాలుపెట్టే బంతులను సంధించే మహమ్మద్ ఇర్ఫాన్ అందుబాటులో లేకపోవడం కూడా పాక్ ఓటమికి ఒక కారణం. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో పిసిబి అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనితో అతని సేవలను పాకిస్తాన్ కోల్పోయింది.
9. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ ఇటీవల కాలంలో వనే్డల్లో గొప్పగా రాణించడం లేదు. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో అతను 73 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇదే మ్యాచ్‌లో వాహబ్ రియాజ్ 68 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. కానీ, ఫామ్‌లోకి వచ్చిన జునైద్‌ను కాదని రియాజ్‌పై సర్ఫ్‌రాజ్ నమ్మకం ఉంచడం ఆశ్చర్యకరం. భారత్ వంటి పటిష్టమై బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుతో జరిగే మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన జునైద్ రాణించే అవకాశాలు ఉండేవి. అయితే, అతనిని పక్కకుపెట్టి సర్ఫ్‌రాజ్ తుది జట్టులోకి తీసుకున్న రియాజ్ నిరాశపరిచాడు. మూడు విడతలుగా బౌల్ చేసిన అతను మొదటి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసి 34 పరుగులిచ్చాడు. రెండో స్పెల్‌లో మూడు ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నాడు. చివరిగా, గాయ పడడానికి ముందు, 1.4 ఓవర్లు వేసి 25 పరుగులు ధారాదత్తం చేశాడు. అతని పసలేని బౌలింగ్ భారత్ భారీ స్కోరుకు పునాది వేసింది.
10. స్ట్రయిక్ బౌలర్ మహమ్మద్ అమీర్ పదునైన బంతులు వేసినప్పటికీ, ఎడ్జిబాస్టన్‌లో మ్యాచ్ ఆడుతున్నాననే విషయాన్ని మరచినట్టు ప్రవర్తించాడు. ఒక కీలక బౌలర్ తన తొమ్మిదో ఓవర్ వేస్తూ కిందపడడం అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా అరుదు. అమీర్ నిర్లక్ష్యం పాక్‌ను దెబ్బతీసింది.
అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి, పది కీలక అంశాలే భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమికి కారణమని తేల్చారు. అయితే, చాలాకాలం టీమిండియాపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన పాకిస్తాన్ క్రమంగా ఎందుకు బలహీనపడుతున్నది? పదే పదే ఎందుకు పరాజయాలను ఎదుర్కొంటున్నది? అనే ప్రశ్నలకు పిసిబి సమాధానం వెతుక్కోవాలి. మాజీ క్రికెటర్లు తమ అనుభవాన్ని రంగరించి, ప్రస్తుత జట్టు చేస్తున్న పొరపాట్లను గుర్తించాలి. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా అంతర్గత కుమ్ములాటలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ కోణంలో ఆలోచించకుండా, జరిగిపోయిన మ్యాచ్‌లు, వాటి ఫలితాలపై ఎన్నిసార్లు శవ పరీక్షలు జరిపినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇటీవల కాలంలో టీమిండియా బలాన్ని పుంజుకుంటున్నదే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, ఆరోగ్యవంతమైన పోటీ తత్వంతో ముందడుగు వేస్తేనే పాక్ జట్టుకు మనుగడ. లేకపోతే, మరో వెస్టిండీస్‌లా గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ రోజులు గడపాలే తప్ప భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా ఉండదు. పరాజయాలకు తెరపడదు. స్వదేశంలో సిరీస్‌లకు నోచుకోలేక పోతున్న పాక్ విదేశాల్లో గెలిస్తేనే మనుగడ.
- మనోహర్

చిత్రం.. కాలి కండరాలు బెణకడంతో అల్లాడుతున్న
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్