డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మో! అది సాధ్యమయితే మాత్రం? జీవితం రెండు నెలలు వెనక్కి తిరిగిపోతే, అందులోనుంచి రఘు కూడా అదృశ్యమవుతాడు.
మళ్లీ అది ఇష్టం లేదు. నా మనసంతా ఆక్రమించిన రఘు అదృశ్యమయితే! నాకు మిగిలేదేముంది?
ఆలోస్తూనే మెట్లవైపు నడిచి బయటకు చూస్తూ ఉండిపోయాను.
ఎదురుగా కనిపిస్తున్న కృష్ణానది, నిండుగా ప్రవహిస్తోంది. రెండంచులు కలిపిన బ్యారేజి నీరెండలో విశాలంగా కనిపిస్తోంది. క్రింద ప్రాంతం అంతా పరిచి పెట్టిన కొండపల్లి బొమ్మరిల్లు సంతలా ఉంది. చుట్టూ వున్న కొండలు పహారాకాస్తున్న సిపాయిల్లా నిలబడి ఉన్నాయి. నే పుట్టి పెరిగిన ఊరు. పెంచి పెద్ద చేసిన ఊరు. ఇక్కడ ఇదివరలో ఎప్పుడు నుంచున్నా ఏదో ఆత్మస్థైర్యం కలిగేది. ఇవాళ ఎందుకో ఆత్మన్యూనత కలుగుతోంది. ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్. ఒక్క గిల్టీ ఫీలింగ్. ఏదో నేరం చేస్తున్నానన్న భావన. ఎవరినో ఎదుర్కోలేనన్న భావన- ఎక్కడికో పారిపోవాలన్న భావన- భయం కాదు - బాధ కాదు- అదేమిటో కూడా నాకు తెలియదు.
అలా ఆలోచనలతో కొట్టుకుపోతూనే మెట్లు దిగాను. మెట్లు చుట్టుప్రక్కల ఎంతోమంది బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు. ఒక స్ర్తి పసిపిల్లను అడ్డంగా ఒక పాత గుడ్డతో ఛాతీకి కట్టుకుంది. రెండు చేతులతో తాటాకుతో పిల్లల గిలక్కాయలు అల్లెస్తోంది. ‘‘అమ్మ పసిబిడ్డ తల్లి, పాలు లేవు- ధర్మం చెయ్యమని’’- మరో పక్క కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళులేనివాళ్ళు- ఎంతమంది. చేతిలో చిల్లర ఉన్నంతవరకూ వేసి బయటకు వచ్చేశాను.
ఎదురుగా ఒక అమ్మాయి పూసలు అమ్ముతోంది. నేలమీద గుడ్డమీద రంగు రంగుల పూసలు పేర్చి ఉన్నాయి. ఆ అమ్మాయికి పక్కనే ఒక చింకిరి చాప మీద గుడ్డల మధ్య పసిపిల్ల కదులుతోంది. ఎర్రగా, సన్నగా పుట్టి ఎక్కువ రోజులు కూడా అయి ఉండదు. ఆ ధూళిలో రోడ్డుప్రక్క పడుకుని ఉన్న ఆ పిల్ల వంటిమీద ఓ చొక్కా కూడా లేదు. తల్లి తలకు గుడ్డ కట్టుకుంది. పురిటాలు కాబోలు. పని చెయ్యకపోతే రోజు గడవదు. ఆ తల్లిని, పిల్లను చూడలేక గబగబా నాలుగు అడుగులు వేశాను.
దృశ్యానికి దూరమయ్యాను కాని, కళ్ళల్లోంచి మనసులోంచి ఆ పసిబిడ్డ దూరం కాలేదు.
మాటిమాటికి మాంసం ముద్దలా ఉన్న ఆ పసి బిడ్డే కళ్ళల్లో కనిపిస్తోంది. కడుపులో తిప్పినట్లయింది. తల వంచుకుని మరో నాలుగు అడుగులు వేసేటప్పటికి, ఎవరో రోడ్డు ప్రక్క చిన్న పిల్లల బట్టలు, తువాళ్ళు, దుప్పట్లు అమ్ముతున్నారు.
ఎందుకో కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. మాటిమాటికి ఆ పసిపిల్లే కళ్ళముందు తిరగడం మొదలుపెట్టింది.
వెంటనే రెండు చొక్కాలు, ఒక దుప్పటి కొన్నాను. మళ్లీ వెనక్కి గుడివైపుకు నడిచాను. ఆ పసిపిల్ల ఉన్న చోట ఆగిపోయాను. ఇందాక చాపమీద ఉన్న పిల్ల ఇప్పుడు తల్లి ఒడిలో ఉంది. పాలు తాగుతోంది.
‘‘ఏం కావాలమ్మా’’ అడిగింది ఆత్రంగా ఏదైనా బేరం తగులుతుందని. ఏం వద్దని తల ఊగించాను. చేతిలో ఉన్న చొక్కాలు దుప్పటి తీసి అమ్మాయికి ఇచ్చాను. ‘నీ పాపాయికోసం’ అన్నాను.
ఆ అమ్మ తెల్లబోయి చూచింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గభాల్న నా కాళ్ళు పట్టుకుంది. ‘‘నీ ఇల్లు వెయ్యిళ్ళ మొదలవ్వాలి తల్లి’’ అంది. నా కాళ్ళు వెనక్కి లాక్కున్నాను. మెల్లిగా నడిచి ఇవతలకు వచ్చేశాను. ఇలాంటి స్థితిలో ఉన్నా వీళ్ళెవ్వరూ పిల్లల్ని వద్దని ఎక్కడ పారేయలేదేం? పెంచడం బర్డెన్ అని ఏ చెట్టుకిందా వదిలేయలేదేం? ఎంత ప్రేమగా తమ ఒడిలో ఉంచుకున్నారు! అనుకుంటూ అక్కడినుండి నడవడం ప్రారంభించాను.
అప్పుడే ఇంటికి తిరిగి వెళ్ళాలనిపించడంలేదు. మనసులో ఏవో భావాలు చోటు చేసుకుంటున్నాయి. మార్గం స్థిరపడుతోంది. మెల్లగా నడుచుకుంటూ బారేజ్ వైపుకు వెళ్లిపోయాను.
కొద్ది దూరంలో ఏదో గందరగోళం జరుగుతోంది. చాలామంది గుంపుగా నిలిచిపోయారు. మగవాళ్ళు కండువాలో, చీరలో వేటితోనో ఒక దడిలా కట్టేశారు. ఏమిటో బాగా గొడవగా ఉంది. అర్థంకాక, అటువైపు వెళ్ళలేక రోడ్డు చివరగా నిలిచిపోయాను. ఇంతలోనే కెవ్వుమని పాపాయి ఏడుపు వినిపించింది. అందరి మొహల్లోనూ రిలీఫ్ కనిపించింది. ‘హమ్మయ్య’ అనుకున్నారు.
‘‘నెలలు నిండిన మనిషితో బస్సు ప్రయాణాలు ఏమిటి చెప్పండి. మన రోడ్లు, బస్సులు మనకు తెలియనివా’’ అన్నాడు ఒక పెద్దాయన చిరాగ్గా. ‘‘ప్రసవం అయిందంటే అవదూ’’.
‘‘మన బస్సు ప్రయాణాల్లో నెలలు నిండక్కర్లేదండి. నిండకపోయినా జరుగుతాయి’’ అని మరొకరు అంటున్నారు.
ఇంతకీ ఆ రోజు ఆ బస్సులో ఒక భార్యను భర్త పుట్టింటికి తీసుకువెడుతున్నారు. దారి మధ్యలోనే ఆమెకు నొప్పులు మొదలయి ఒక హాస్పిటల్ చేరే వ్యవధి కూడా లేక బస్సు ఆపి దిగిపోయారు. అక్కడ రోడ్డు ప్రక్క ఆవిడకు పురుడు వచ్చింది. ఏవో అమ్ముకునే ఆడమనిషి, ఆ రోడ్డుప్రక్కనే ఆమెకు సహాయం చేసేది.
‘‘పక్కనే వున్న ఆటోని పిలుచుకుని పసిపిల్లను చేతిలో ఉంచుకుని, భార్యను జాగ్రత్తగా ఎక్కించి జేబులో చెయ్యి పెట్టి, చేతికి వచ్చిన డబ్బు పురుడు పోసిన ఆ ఆడమనిషి చేతిలో పెట్టి, ‘‘మీ సహాయం ఈ జన్మలో మరచిపోను’’ అంటూ ఆ తండ్రి కూడా ఆటో ఎక్కాడు.
చూడబోతే కాస్త ఉన్నవాళ్లలాగే ఉన్నారు. ఏదో టైం బాగాలేదు. రక్తంలో మునిగి ఉన్న బిడ్డను ఒక చేతిలో పట్టుకుని, రెండో చేత్తో ఎంతో జాగ్రత్తగా భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి ఎక్కిస్తున్న భర్తే కళ్ళకు కనిపించసాగాడు.
ఎంత చిత్రమయిందీ సృష్టి- సృష్టిలీల జరిగేది ఎవ్వరూ చూడలేరు. ఇసుక రేణువంటి విత్తుల్లోంచి మహావృక్షాలు మొలకెత్తుతాయి.
మధ్యాహ్నందాకా, పసరి మొగ్గలా ఉండే పువ్వు- సాయంత్రానికి సౌరభాలు వెదజల్లుతుంది. ఎంతో మధురమయిన కలయికలో, తన్మయత్వంలో జరిగే సృష్టి, నరకయాతనతో జన్మిస్తుంది. అది గొడ్డయినా, మనిషయినా!
దీనంతకు వెనక ఉన్నదెవరు- నిజంగానే వెనక అదృశ్య హస్తం ఉంటే ఈ సృష్టి ఇంత కర్కశంగా ఎందుకు ఉండాలి- అది మారదేం?
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి