డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నకు అతనికి కృతజ్ఞతలు తెలపాలనిపించింది.
అందుకే నాన్న వాళ్ళను పలకరించాలని వెళ్ళారు. వస్తూనే సరాసరి అమ్మ దగ్గరకు వెళ్లి పుస్తకం చూపించారు డాక్టర్‌గారి కొడుకు ఇచ్చాడంటూ. అన్నీ వున్న విస్తరి అణిగే వుంటుందని. డాక్టర్‌గారి అబ్బాయి చాలా మర్యాదస్తుడు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అమెరికాలో చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నాడట. అతను కూడా పెద్ద సైంటిస్ట్‌ట. నన్ను చూడగానే డాక్టర్ గారబ్బాయి డా.రామ్ చాలా సాదరంగా ఆహ్వానించాడు.
షేడ్‌హ్యాండ్ ఇస్తూ- ‘‘రండి రండి నేనే కలుద్దామనుకున్నాను. కూచోండి’’ అని. ఐ యామ్ వెరీ సారీ, థింగ్స్ డిడ్ నాట్ వర్కవుట్ ఫర్ యువర్ డాటర్’’ అన్నాడు.
అతను వెంటనే లేచి లోపలకు వెళ్లి ఒక టైమ్ మాగజైన్ తీసుకువచ్చి ఇచ్చాడు.
‘‘ఈ వారమే రిలీజ్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో బుక్‌స్టాండ్‌లో కనిపించింది. వెంటనే రెండు కాపీలు కొన్నాను మీకు ఇవ్వాలని’’ అన్నాడు.
‘‘డా.రఘురామ్ ఈజ్ ఎ వెరీ రెస్పెక్టెడ్ సైంటిస్ట్’’ అన్నాడు. ఈమధ్య అతని కాంట్రిబ్యూషన్‌కి చాలా గౌరవం లభించింది. అమెరికన్ ప్రెసిడెంట్ వైట్‌హౌస్‌కి కూడా ఆహ్వానించాడు’’ అన్నాడు.
అని నాన్న అమ్మతో అంటున్న ప్రతి పదం నా చెవిలో పడుతూనే ఉంది.
వెల్ రెస్పెక్టెడ్ సైంటిస్ట్. అతని కాంట్రిబ్యూషన్ అత్యంత ఉపయోగకరమయింది. దాని ప్రభావం ఎంత గొప్పది.
అవే మాటలు ఒకటికి రెండుసార్లు మనసులో మననం చేసుకుంటూ ఉండిపోయాను. ‘‘వెల్ రెస్పెక్టెడ్.. గ్రేట్ కాంట్రిబ్యూషన్..’’ చెవుల్లో మ్రోగుతూనే ఉన్నాయి.
‘‘అతను సాధించాలనుకున్నది సాధించాడు. కళ్యాణికే అదృష్టం లేకపోయింది. నిట్టూర్చింది అమ్మ. అమ్మ ఆ మాగజైన్ తెచ్చి నా చేతికి ఇచ్చింది. అది తెరవకుండా కవరు పేజీనే చూస్తూ ఉండిపోయాను. ‘మాన్ ఆఫ్ ది ఇయర్’ ఎంత చెప్పకోతగ్గ గౌరవం.
ఒక దేశంలో పుట్టి పెరిగి అమెరికా లాంటి దేశానికి వెళ్లి ఘనవిజయం సాధించడం అంటే మాటలా? ఎంత స్వయంకృషి ఉంటే సాధించగలరు?
కవరు మీద ఫొటోలో చాలా ఇంప్రెస్సివ్‌గా ఉన్నాడు. రఘు మొహంలో తను చూచిన కుర్రాడి స్థాయిలోంచి మాన్ ఆఫ్ ది ఇయర్ స్థాయి గాంభీర్యం కనిపిస్తోంది.
కళ్ళల్లో ఒకరకమయిన కాన్ఫిడెన్స్. జుట్టు కొంచెం వెనక్కి వెళ్లి నుదురు మరీ విశాలంగా కనిపిస్తోంది. చెంపల దగ్గర తెల్లపడుతున్న జుట్టు పెద్దరికం వెల్లడి చేస్తోంది. ఒక మేధావి ముఖంలో ఉండాల్సిన వర్చస్సు తొంగి చూస్తోంది. అసలే చక్కనివాడేమో! గణించిన ఘనత ఒక ఠీవీని ఆపాదిస్తోంది. నల్లటి టుక్సిడో వేసుకున్నాడు. చేతిలో చుట్టిన ఒక పేపర్ ఉంది. రెండు చేతులతో ఏటవాలుగా పట్టుకుని నుంచున్న ఫోటో తదేకంగా చూస్తూ ఉండిపోయాను.
నాకు తెలిసిన వ్యక్తి ఇతనేనా అనిపించింది! కలలన్నీ సాకారం చేసుకున్నాడు. ఎంతో ఘనత దక్కించుకున్నాడు. ఎందరికో గర్వకారణం అయ్యాడు. దేశానికి గుర్తింపు తెచ్చాడు. ఆ మార్గం- ఆ ప్రయాణంలో ఏ గుండెలమీద తల వంచుకుని పడుకున్నాడో అది మర్చిపోయాడు. ఎవరి కన్నీటికి గట్లు తెగాయో గ్రహించలేకపోయాడు. ఒకరి జన్మకు కారణమయ్యాడన్న విషయమే విస్మరించాడు.
బలంగా నిట్టూర్చాను. ఇవన్నీ అతని సక్సెస్‌కి ఆపర్ట్యూనిటీ కాస్ట్స్. రాబోయే తరాలకు ఉపయోగపడటంలో ఒక ఘనత ఉంది. ఒక త్యాగం ఉంది. త్యాగంలో ఆనందం ఉంది. అభివృద్ధి ఉంది. అవసరం ఉంది.
కాని త్యాగం అనేది ఎవరికి వారు చేయాలి. ఇంకొకరి జీవితాలను త్యాగం చేసే అధికారం మరొకరికి ఉండదు. తల్లి అయినా, తండ్రయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలయినా!
అదే జరిగితే అది త్యాగం స్థానంలోంచి స్వార్థంగా మారిపోతుంది. ఇంతకీ ఈ త్యాగం చేసింది- అతనా, తనా? మళ్లీ నా మనసుకు అదుపులేకుండా వెళ్లిపోతోంది. అనాలోచితంగానే మాగజైన్ తెరిచాను. లోపల చాలా పెద్ద ఆర్టికల్, ఫొటోస్ ఉన్నాయి అతని గురించి.
కుతూహలంగా చూచాను. అతని తల్లిదండ్రులతో, అతని అన్నదమ్ములతో ఫొటోస్ ఉన్నాయి. అతను చదివిన హైస్కూల్, కాలేజీ, బెంగుళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫొటోస్ ఉన్నాయి.
అతను ఆర్జించిన గోల్డ్‌మెడల్స్, ఎనె్నన్నో సంస్థల నుంచి పొందిన గౌరవాలు, రకరకాల ఫొటోస్‌తో ఆ మాగజైన్ నిండిపోయింది.
అతని చిన్నతనపు పెంపకం, సరదాలు, ఒకటేమిటి అతని జీవితచరిత్ర అంతా ఉంది. అలా ఒకటొకటే చదువుకుంటూ పోతూ ఉంటే కళ్ళు మరో ఫొటోమీద ఆగిపోయాయి.
అతని రీసెర్చ్‌లో తోడుగా ఉంటూ ఇంతటి విజయానికి చేయూతనిచ్చి భాగస్వామి అయిన మరో సైంటిస్ట్ డా.వర్జీనియా జాక్‌సన్.
ఆ ఫొటో వంక చూస్తూ ఉండిపోయాను. అతని పక్క అంత ఎత్తులోనూ ఉంది. పొడుగ్గా పాదాల దాకా ఉన్న ఫార్మల్ డ్రెస్, చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్, మెడ దాకా కత్తిరించిన పొట్టి జుట్టు, పొంగుతున్న ఆరోగ్యం, తొంగిచూస్తున్న ఆత్మస్థైర్యం- అతని పక్క, అతని స్థాయిలో నుంచుని ఉన్న వర్జీనియా!
ఆమెని చూస్తుంటే ఈర్ష్య కలగలేదు. కోపం రాలేదు. చిత్రం- ఏ భావము కలగలేదు. ఎన్నో ఎంతోమందిని ఫొటోస్ చూస్తున్నట్లు అనిపించింది.
నేను ఎప్పటికయినా ఆ స్థాయికి ఎదిగి ఉండగలిగేదానినా? అన్న ఆలోచన రాబోయి ఆగిపోయింది. నన్ను నేను న్యూనతపరచుకోదల్చుకోలేదు!
ఒక మనిషి ఏ స్థాయికన్నా ఎదిగాడంటే, సాధించాలన్న తృష్ణ ఉండాలి. స్వయంకృషి ఉండాలి. కాని వాటన్నిటికీ తోడు చుట్టూ ఉన్న పరిసరాలు తోడవ్వాలి.
కృషి, తృష్ణ నాలో ఉన్నాయి. అందుకే ఈ మాత్రం ఎదగగలిగాను. నా కాళ్ళమీద నిలబడ్డాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మైసెల్ఫ్ అంటూ పుస్తకం మూసేశాను.
ఎప్పుడూలాగానే నా మనసు అనలైజ్ చెయ్యలని ప్రయత్నిస్తోంది. నన్ను నేను అద్దంలో చూసుకోవాలని చూస్తున్నాను. ఈసారి మనసు అనలైజ్ చెయ్యడానికి వెనకాడుతోంది. బుద్ధి అడ్డుపడుతోంది. భావనలు మసకబారుతున్నాయి. అభిమానం అడ్డొస్తోంది. అంతరాత్మ ఎదిరిస్తోంది.
అదే సమయానికి వౌళి ఆపద్బాంధువుడిలా దూసుకొచ్చాడు. వాడు ఎప్పుడూ నాకు ఆపద్బాంధవుడే. ఆంతరంగికుడే. అన్నిటినీ మరిపింపచేయగలిగేవాడే! మాగజైన్ మూసేశాను.. అంతరంగంలో కూడా తాత్కాలికంగా తలుపులు మూసి ఉన్నాయి.
వాడి అవసరాలు చూడటంలో విరామం కలిగింది.
మళ్లీ ఇప్పుడు వాడు అడుగుతున్నాడు. నేను ఏ పుస్తకం చదువుతున్నానని?
నేను సమాధానం ఇచ్చేలోపలే- అన్నయ్య గదిలోకి వచ్చాడు. ‘‘వౌళికి ఆ మాగజైన్ చూపించావా?’’ అంటూ!
‘‘లేదు’’ అన్నట్లు తల ఊగించాను.
‘‘ఇవ్వు, వాడికి చూపించు’’ అన్నాడు.
నేను తటస్థంగా ఆగిపోయాను.
‘‘ఇవ్వు, నా మేనల్లుడు నువ్వు అనుకున్నంత పసివాడు కాదు’’ అన్నాడు అన్నయ్య.
లేచి మాగజైన్ తెచ్చి ఇచ్చాను. ప్రశ్నార్థకంగా నా మొహం వంక చూస్తూ వౌళి ఆ మాగజైన్ అందుకున్నాడు.
నాకు తెలుసు వౌళి కూడా మాగజైన్ వంటరిగా చదవడానికే ఇష్టపడతాడని.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి