ఆటాపోటీ

నాటి వ్యాయామం నేటి క్రీడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రన్నింగ్, సైక్లింగ్ కంటే మెరుగైన వ్యాయామంగా స్విమ్మింగ్‌ను పేర్కొంటారు. ఈత కొట్టినప్పుడు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పని చేస్తాయి. బేస్‌బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలతో పోలిస్తే స్విమ్మింగ్‌కు రెట్టింపు శక్తి అవసరమవుతుంది. ఒక గంటసేపు ఈత కొడితే సుమారు 650 క్యాలరీల శక్తి ఖర్చవుతుంది. నీటి అలలు బలంగా వెనక్కు నెడుతుంటే, అంతకంటే రెట్టిపు బలంతో ముందుకు వెళ్లే క్రమంలో ఎవరూ ఊహించలేనంత వ్యాయాయ ప్రక్రియ పూర్తవుతుంది. గుండె, ఊపిరితిత్తులు బలాన్ని పుంజుకోవడానికి స్విమింగ్ చాలా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతకు కూడా స్విమ్మింగ్ ఒక ఆయుధం. ఈత కొడితే ఒత్తిడి తగ్గుతుందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ కారణాలవల్ల వ్యాయామం అనివార్యమైనప్పుడు, వైద్యులు ముందుగా స్విమ్మింగ్‌నే ప్రతిపాదిస్తారు. మిగతా ఏ క్రీడల్లోనైనా ఫిట్నెస్‌కు ప్రత్యేక వ్యాయామాలు చేయాలి. కానీ, స్విమ్మర్లకు ఈ సమస్య లేదు. వారి వ్యాయామం, క్రీడ ఒక్కటే. అందుకే, నాటి వ్యాయామం నేడు ఒక క్రీడగా రూపాంతరం చెందింది. కాగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలున్న ఏకైక వ్యాయామం ఈత కొట్టడమే. అథ్లెట్లు పరిగెడుతున్నప్పుడు గాలి వ్యతిరేక దిశగా గట్టిగా వెనక్కు నెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకే, నడవడం కంటే పరిగెత్తడానికి ఎక్కువ శక్తి కావాలి. అయితే, గాలికంటే నీరు పది రెట్లు బలంగా వ్యతిరేక దిశలో పని చేస్తుంది. నీటిని చీల్చుకుంటే ముందుకు సాగాలంటే, ఈతగాడు ఎక్కువ పరిమాణంలో క్యాలరీలను ఖర్చు చేయక తప్పదు. సర్వశక్తులు కేంద్రీకరించి, నీటికి ఎదురీదడానికి చేతులను బలంగా కొట్టాల్సి వస్తుంది. అందుకే, కనీసం 50 శాతం మంది అంతర్జాతీయ స్విమ్మర్లు భుజం నొప్పితో బాధపడుతుంటారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్‌లో పోటీపడే స్విమ్మర్లు రోజుకు సుమారు ఐదు నుంచి ఆరు గంటలు ప్రాక్టీస్ చేస్తారు. కొంత మంది వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే, ఎక్కువ మంది విరామం లేకుండా ప్రతిరోజూ ప్రాక్టీస్‌కు హాజరవుతారు. ఒక్కో స్విమ్మర్ తన శిక్షణ సమయంలో ప్రతిరోజూ పదినుంచి 15 మైళ్ల దూరం ఈదుతారు.
మనిషి నడకతోపాటే ఈతనూ నేర్చుకున్నాడని అంటారు. నాగరికత తొలుత నదులకు ఇరువైపులా అభివృద్ధి చెందింది. ఆతర్వాతే మిగతా ప్రాంతాలకు విస్తరించింది. అందుకే నదీలోయ నాగరికత అంటారు. నదులకు సమీపంలో ఉండడంతో, ఏదో ఒక కారణంగా వాటిని దాటాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ అవసరమే మనిషికి ఈత నేర్పాయి. క్రీస్తుపూర్వం 2,500 సంవత్సరంలోనే ఈత అనేది ఒక క్రీడగా, సాంస్కృతిక వారసత్వంగా అభివృద్ధి చెందినట్టు తెలిపే తైలవర్ణ చిత్రాలు ఈజిప్టులో బయటపడ్డాయి. మొదటి స్విమ్మింగ్ రేస్ క్రీస్తుపూర్వం 36వ సంవత్సరంలో జపాన్‌లో జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే, స్విమ్మింగ్ ఆధునికతను సంతరించుకోవడానికి, ఒక ప్రత్యేక క్రీడగా అభివృద్ధి చెందడానికి వందల సంవత్సరాల సమయం పట్టింది. 1830లో స్విమ్మింగ్ పోటీలను బ్రిటన్ ప్రవేశపెట్టింది. 1896 మొదటి ఆధునిక ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌ను కూడా చేర్చడంతో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒలింపిక్స్‌లో 16 స్విమ్మింగ్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో 17 ఈవెంట్స్ ఉన్నాయి. 1972లో మార్క్ స్పిజ్ ఏడు స్వర్ణ పతకాలు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డును 2008లో మైఖేల్ ఫెల్ప్స్ బద్దలు చేశాడు. మొత్తం మీద ఫెల్ప్స్ కెరీర్‌లో 23 స్వర్ణ పతకాన్ని సాధించిన అతను 2016 రియో ఒలింపిక్స్‌తో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. పురుషుల 4న100మీటర్ల మెడ్లే రిలేలో ర్యాన్ మర్ఫీ, కొడీ మిల్లర్, ఫెల్ప్స్, నాథన్ ఆడ్రియన్ సభ్యులుగా ఉన్న అమెరికా జట్టు లక్ష్యాన్ని 3 నిమిషాల 27.95 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది సరికొత్త ఒలింపిక్ రికార్డు. క్రిస్ వాటర్ హెబార్న్, ఆడం పిటీ, జేమ్స్ గయ్, డంకన్ స్కాట్‌లతో కూడిన బ్రిటన్ 3 నిమిషాల 29.24 సెకన్లలో గమ్యాన్ని చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 3 నిమిషాల 29.93 సెకన్లతో ఆస్ట్రేలియా జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ జట్టులో మిచెల్ లార్కిన్, జేక్ పాకార్డ్, డేవిడ్ మోర్గాన్, కేల్ చామర్స్ సభ్యులుగా ఉన్నారు.
ప్రత్యేక శ్రద్ధ
స్విమ్మింగ్ పూల్స్‌ను నిర్మించే సమయంలో పలు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా నీరు పూల్ అంచులకు తగిలినప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా బయటకు వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. లేకపోతే, అదే వేగంతో అలులు తిరిగి పూల్ మధ్యకు చేరుతాయి. దీనివల్ల స్విమ్మర్లు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, ప్రతి పూల్ నిర్మాణంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. కాంక్రీట్‌తో నిర్మించిన పురాతన స్విమ్మింగ్ పూల్ టెక్సాస్‌లో ఉంది. డీప్ ఎడ్డీగా పిలిచే దీనిని 1915లో పూర్తిగా కాంక్రీట్‌ను ఉపయోగించి కట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్విమ్మింగ్ పోటీల తీరు శరవేగంతో మారింది. ‘లాంగ్ జాన్’ స్టయిల్‌లో స్విమ్మింగ్ దుస్తులు వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాల్లో స్విమ్మింగ్ పూల్ స్టేటస్ సింబల్‌గా మారింది.
ఈత కొట్టాలంటే, చేతులు, కాళ్లను బలంగా ఆడించాలి. చేతులతో నీటిని వెనక్కు నెట్టడంద్వారా ముందుకు వెళ్లాలి. స్విమ్మింగ్ పరిభాషలో దీనిని స్ట్రోక్స్ అంటారు. అమెరికా, చైనా, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చిన్నతనం నుంచే స్విమ్మింగ్ అభ్యాసం మొదలుపెడతారు. ఒక హైస్కూల్ విద్యార్థి ఒక సీజన్‌లో సగటున పది లక్షల స్ట్రోక్స్ కొడతాడని అంచనా. అంతలా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టే ఫెల్ప్స్ లాంటి అసాధారణ స్విమ్మర్లను మనం చూడగలుగుతున్నాం.
పోటాపోటీ
ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతకోసం సగటున ప్రతిసారీ 1,850 మంది స్విమ్మర్లు పోటీపడతారు. హోరాహోరీగా సాగే ఈ పోరులో సుమారు 50 మంది మాత్రమే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవుతారు. పోటీ తీవ్రంగా ఉందని తెలిసినప్పటికీ, క్వాలిఫయర్స్‌కు ప్రతిసారీ అభ్యర్థులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ‘అక్వా మ్యూజికల్స్’ సినిమాను ఎజిఎం నిర్మించింది. ఈస్తర్ విలియమ్స్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత కాలంలోనే సింక్రనైజ్డ్ స్విమ్మింగ్‌కు ఆదరణ పెరిగింది. మొత్తంమీద స్విమ్మింగ్ ఎన్ని కొత్త రూపాలను ధరించినప్పటికీ, ఒక గొప్ప వ్యాయామంగా, అందరినీ అలరించే క్రీడాంశంగా వెలుగుతూనే ఉంది. రోజురోజుకూ స్విమ్మింగ్ పట్ల అందరికీ మోజు పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. సాకర్, క్రికెట్ వంటి అత్యంత ఆదరణ ఉన్న క్రీడల జాబితాలో స్విమ్మింగ్ చేరడం ఖాయం.

- బిట్రగుంట