పశ్చిమగోదావరి

అంతా పచ్చగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 23 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలన్నీ పచ్చదనంతో అలరారిపోతున్నాయి. ఎటు చూసినా తెలుగు తమ్ముళ్లే లబ్ధిదారులుగా దర్శనమిస్తున్నారు. ఈ పరిణామాలతో సహజంగానే అర్హులైన లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. మొత్తం మీద ఆయా పరిధుల్లో నియమించిన జన్మభూమి కమిటీల తీరుపైనే అందరూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళుతున్నారని ప్రకటిస్తున్నా సంక్షేమంలో మాత్రం అమలవుతున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుందనే చెప్పాలి. దాదాపుగా ప్రతీ సంక్షేమ విభాగం పరిధిలోనూ జన్మభూమి కమిటీలదే పూర్తిస్థాయి హవాగా మారిపోయిందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని విభాగాల పరిధిలో అధికారులు కూడా ఈ పరిస్థితులు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన జాబితాకు మాత్రమే అర్హత ముద్ర వేయాల్సి వస్తోందని, అంతకుమించి లబ్ధిదారుల ఎంపిక వంటివన్నీ ప్రహసనప్రాయంగా మారిపోయాయన్న అభిప్రాయానే్న వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా రాజకీయంగా పలు చోటు చేసుకుంటున్నప్పటికీ సంక్షేమ పధకాల అమలు తీరులో గతంలో లబ్దిదారుల ఎంపిక మార్గదర్శకాల ఆధారంగా జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తోంది. ఎక్కడికక్కడే నియమించిన జన్మభూమికమిటీలు తమ పూర్తి హవాను ప్రయోగించడంతో విభాగాల పరిధిలోని అధికార యంత్రాంగాలు విగ్రహ పుష్టిగా మారిపోయారన్న విమర్శ వినిపిస్తోంది. కొద్దికాలం క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ పరిధిలో లబ్ధిదారుల ఎంపిక కూడా దాదాపుగా ఈ విధంగానే ముందుకు వెళ్లిందని అధికారులే పేర్కొంటున్నారు. అటు రాజకీయంగాను, ఇటు సామాజికంగాను కీలకంగా నిలుస్తున్న కాపు కార్పొరేషన్ పరిధిలోని అధిక శాతం ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయంటే ఇక సాధారణ సంక్షేమ పధకాల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాపు కార్పొరేషన్ పరిధిలో జన్మభూమి కమిటీల మాటే చెల్లుబాటు కావడంతో ఈ పరిధిలో మంజూరుచేసిన రుణాలు, యూనిట్లు దాదాపుగా అదృశ్యమయ్యాయనే చెప్పుకోవాలి. కార్పొరేషన్ పరిధిలో నిధులు గోల్‌మాల్ జరిగిందన్న ప్రచారం నేపధ్యంలో ఉన్నత స్థాయిలోనే భారీ కదలికలు వుంటాయని చెబుతున్నారు. అయితే వాటికి పునాధి మాత్రం జిల్లాస్థాయిలోనూ, గ్రామ స్థాయిల్లోనూ పడిందనే చెప్పాలి. తాజాగా ఈ కార్పొరేషన్ పరిధిలో మంజూరైన యూనిట్ల పరిస్థితిపై ప్రస్తుతం సర్వే జరుగుతున్నప్పటికీ ఆ సర్వే బృందాలకు ఏర్పాటైన యూనిట్లు దాదాపు ఒక్కటికూడా దర్శనమివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక రానున్న రోజుల్లో ఈ సర్వేలో ఏ స్థాయిలో గోల్‌మాల్ బయటపడుతుందో వేచి చూడాలి. ఇక దీనికి పోటీగా బలహీన వర్గాలు, ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్లతో సహా మరికొన్ని సంక్షేమ విభాగాల పరిధిలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని చెబుతున్నారు. ఈ పరిధిలో స్వల్పంగా సర్వే చేసినా భారీ ఎత్తున అవకతవకలు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. కాగా వ్యవసాయ ప్రధానమైన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రైతు రధం కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారే పరిస్థితి వున్నప్పటికీ దాన్ని కూడా పూర్తిగా రాజకీయంగా మార్చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ జిల్లాకు నిర్ధేశిత మొత్తంలో రైతురధం పధకం కింద ట్రాక్టర్లను మంజూరు చేసినా వాటికి సంబంధించి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెలిగే వారే లబ్ధిదారులుగా మారిపోయారన్న విమర్శ వినిపిస్తోంది. ఈ విషయంలోనూ సంబంధిత ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన జాబితాకే బాధ్యులైన అధికారి ఆమోదముద్ర వేయాల్సి వుంటుందన్న అభిప్రాయం వుంది. ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా అన్ని విభాగాల పరిధిలోనూ పరిస్థితులు ఈ విధంగానే వున్నట్లు చెబుతున్నారు.
పరామర్శల వెల్లువ
భీమవరం, జూలై 23: కాంగ్రెస్ పార్టీ..సిపిఐ రెండు రాజకీయ పార్టీలు జిల్లాలోని తుందుర్రు, గరగపర్రు గ్రామాల్లో పర్యటించారు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మహ్మద్ అమర్ జహాబేగ్, జిల్లా అధ్యక్షులు రఫీయుల్లా బేగ్ తదితరులు పర్యటించారు. ఇటీవల గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు వస్తున్న కూలింగ్ ప్యానల్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మహ్మద్ అమర్ జహాబేగ్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లామని మహిళలకు చెప్పారు. తప్పనిసరిగా సమస్యకు పరిష్కారం ఉంటుందని వారి న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు తాను ఇక్కడకు వచ్చానని వారికి చెప్పారు. భీమడోలులో తెలుగుదేశం పార్టీ సమావేశంలో 30 పోలీసు యాక్టు అమల్లో ఉంటే ఎలాజరిగిందని ప్రశ్నించారు. కేవలం సంవత్సరం 10 మాసాలు మాత్రమే ఈ ప్రభుత్వం సమయం ఉందన్నారు. అదే విధంగా గరగపర్రులోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కంట్రోల్ కమిటీ ఛైర్మన్ నెక్కంటి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ తదితరుల బృందం పర్యటించింది. గ్రామంలో వెలి ప్రాంతంలో బాధితులతో రామకృష్ణ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ , తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇక్కడకు వచ్చి ప్రకటనలు మాత్రం చేసి వెళ్లారని, కానీ ఇప్పటివరకు ఏమీ అమలు కాలేదన్నారు. వెలి బాధితులకు సిపిఐ అండగా ఉంటుందన్నారు. ఇటీవల మృతి చెందిన యాకోబు కుటుంబానికి రూ.10వేలు సిపిఐ కమిటీ అందచేసింది. అదే విధంగా మరి కొందరు సిపిఐ నాయకులు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. శాంతి కమిటీలో సభ్యులుగా ఉన్న యాకోబును కావాలని హత్య చేశారని, ఆయన మృతి పై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు సిపిఐ రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. జల్లి విల్సన్, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఆర్.రవీంద్ర, పట్టణ కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్, వైట్ల విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన జాతీయస్థాయ చదరంగం పోటీలు
భీమవరం, జూలై 23: పట్టణంలో నిర్వహించిన జాతీయస్థాయి చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి. గత కొద్ది రోజులుగా ఈ పోటీలు స్థానిక కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాలులో జరిగాయి. ముఖ్య అతిథిగా ఎంపి తోట సీతారామలక్ష్మి హాజరయ్యారు. ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన జె రామకృష్ణ ప్రథమ స్థానం సాధించారు. తరుణ్‌వికాంత్, రావు జె మల్లేశ్వరరావు ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. విజేతలకు జ్ఞాపికలతోపాటు నగదు బహుమతులను ఎంపి తోట అందజేశారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, అద్దంకి శివ, గనుపూటి తిరుపాల్, పట్టణ టిడిపి అధ్యక్షులు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు తోట భోగయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికీ సొంతిల్లు ఏర్పాటుకు చర్యలు
తాడేపల్లిగూడెం, జూలై 23: నియోజకవర్గంలోని పేదలందరికీ సొంతిల్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మండలంలోని జగన్నాథపురం ఎస్సీ కాలనీలో ఆదివారం స్వచ్ఛ్భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ చాలామంది సొంతిల్లు లేక అద్దె ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నారని వాపోయారు. పలువురు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు సిఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్థితో కృషిచేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలు కోసం స్థల పరిశీలన చేస్తోందని, ఎంత ధరైనా సరే ప్రభుత్వం స్థలాలను కొనుగోలుచేసి పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తుందన్నారు. అర్హతగల వారందరికీ ఇళ్లు మంజూరుచేస్తామని మహిళలకు హామీనిచ్చారు.
అక్టోబరులో సిఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు
ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో ప్రజలకు వౌళిక వసతులు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు అక్టోబరులో సిఎం చంద్రబాబుతో ప్రారంభోత్సవాలు చేయిస్తానన్నారు. రాబోయే ఏడాదిన్నరలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అవసరమైన పరిశ్రమలు ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. గ్రామంలో మంచినీటి సమస్య ఉందని పలువురు ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా, తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు మంత్రి ఆదేశించారు. గ్రామానికి చెందిన పుణుకుమట్టి వజ్రం మాట్లాడుతూ తన భర్త రైల్వేలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేవాడని, నెల్లూరులో మృతి చెందారని, మట్టి ఖర్చులు గాని, పింఛన్ గాని ఇప్పటి వరకు ఇవ్వలేదని వాపోయింది. దీనిపై మంత్రి స్పందిస్తూ పెన్షన్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఆదేశించారు. 104 వాహనాన్ని గ్రామంలో ఏర్పాటుచేయాలని పలువురు ప్రజలు కోరారు. కార్యక్రమంలో పిఆర్ ఎఇ వి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసచంద్రరాజు, కర్రి సీతారామయ్య, ఐసిడిఎస్ సూపరింటెండెంట్ సిహెచ్ భవాని, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
అబ్బురపరుస్తున్న పంపర పసన చెట్టు
మొగల్తూరు, జూలై 23: మండలంలోని కొత్తోట కొప్పినీడి సూర్య చంద్రరావు ఇంటి ఆవరణలోగల పంపర పనస కాయలు మొక్క చిన్నదైనా దానికి కాసిన కాయాలు మాత్రం ఎక్కువే. మొక్క చిన్నదిగా అగుపిస్తున్నా కాయలు మాత్రం విరగకాయడంతో గ్రామంలో అందరూ ఆ చెట్టును ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. మొక్క నేలకు మూడు అడుగులు ఎత్తు ఉన్నప్పటికీ కాయలు విరివిగా కాయటంతో మొక్క కొమ్మలు బరువుతో నేలకొరిగాయి. ఈ చిన్న మొక్క సుమారు నలభైకు పైగా కాయలు కాసింది.
ఘనంగా కళాకారుల సాంస్కృతిక కళా సమ్మేళనం
ఏలూరు, జూలై 23 : స్థానిక అగ్రహారంలోని వై ఎంహెచ్ ఏ హాలు వద్ద ఆదివారం రాత్రి హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 32వ కార్యక్రమంగా కళాకారుల సాంస్కృతిక కళాసమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక షిర్డీ సాయి ఆర్ట్స్ వారి శ్రీకృష్ణరాయభారం పాండవుల సీను నాటకాన్ని ప్రదర్వించారు. సంగీతాన్ని కలపర్రుకు చెందిన సురేష్‌రాజు వ్యవహరించగా కానాల డ్రస్ కంపెనీ వారు మేకప్ నిర్వహించగా శ్రీకృష్ణుడుగా మెతుకుమిల్లి ధర్మరాజు, అర్జునుడుగా ఎన్‌వి ఏ, భీముడుగా దొండపాటి, సహదేవుడుగా దుగ్గిరాలలు తమ అభినయాన్ని ప్రదర్శించారు. తొలుత నృత్యాంజలి కళానికేతన్ సమర్పణలో చిరంజీవి గండికోట జాహ్నవి లాలిత్య స్వాగత నృత్యాన్ని నిర్వహించారు. బాల గణపతి భజన సమాజం వారు సర్వనామసంకీర్తనాన్ని ఆలపించారు. ఎ రాంబాబు, వణుకూరి శ్రీనివాస్‌లు ఈ కార్యక్రమాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మానం అనంత పద్మనాభాన్ని కళాపోషకులుగా గౌరవ సత్కారం నిర్వహించారు. ప్రముఖ సంగీత విధ్వాంసులు నెల్లి రామారావు, ప్రముఖ కళాకారుడు తిరువీధుల రామ్మోహనరావులకు ఆర్ధిక సత్కారాన్ని నిర్వహించారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ అధికారి బివి రామరాజుకు నూతన వస్త్ర బహుకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వి భాస్కర నరసింహం మాట్లాడుతూ కళాకారులను ఆదుకునేందుకు గాను నిర్వహిస్తున్న హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం చేస్తున్న కార్యక్రమాలు సమాజాన్ని ఉత్తేజపరుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ప్రముఖ వైద్యులు రావి గోపాలకృష్ణయ్య, హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మోదుగు కృష్ణారావు, కార్యదర్శి పెదపాటి రామకృష్ణ, కోశాధికారి ఖాశీం, గౌరవ సలహాదారులు సిహెచ్ నరసింహారావు, ఎండి ఖాజావలి, ఉపాధ్యక్షలు ఘంటసాల పెద్దిరాజు, బి రామాంజనేయ చౌదరి, సహాయ కార్యదర్శులు సంకు రమేష్, కమిలి గోవిందరావులతోపాటు సభ్యులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో నగర ఫ్రజలు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమలలో సాధారణ రద్దీ
ద్వారకాతిరుమల, జూలై 23: చిన వెంకన్న క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీపై అమావాస్య తన ప్రభావాన్ని చూపింది. దీంతో ఆదివారం భక్తులు సర్వసాధారణంగా ఆలయానికి విచ్చేశారు. వారాంతపు సెలవు దినం కావడంతో ప్రతి ఆదివారం ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే ఈమారు అమావాస్య రావడం వల్ల భక్తుల రద్దీ చాలా తగ్గిపోయింది. ప్రసాదాల కౌంటర్లు, టిక్కెట్టు కౌంటర్లు, కేశ ఖండన శాల వద్ద భక్తులు నామమాత్రంగా కనిపించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పరిసరాలు దాదాపు నిర్మానుష్యంగా మారాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో భక్తుల రద్దీ పెరగవచ్చునని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.
2019 నాటికి రాష్ట్రంలో బిజెపి బలోపేతం
పాలకొల్లు, జూలై 23: భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2019 నాటికి రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మూడేళ్లల్లో కేంద్రం ద్వారా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వీటిని కార్యకర్తలు ప్రచారం చెయ్యాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ బాబ్జి నాయకత్వంలో పార్టీ ఎంతో బలోపేతంగా ఉందని అభినందించారు. కార్యక్రమంలో రావూరి సుధ, రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ డాక్టర్ బాబ్జి, మామిడి శివయ్య, గోపాలం, జక్కంపూడి కుమార్, కొల్లి ప్రసాద్, చేగొండి ప్రకాష్, అడ్డాల వాసుదేవరావు, చేగొండి సూరిబాబు, శివరామరాజు, ఉన్నమట్ల కపర్ధి, దొంగ కుమార్, బిరాజీ తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
ద్వారకాతిరుమల, జూలై 23: శ్రీహరి కళా తోరణం వేదికపై ఆదివారం ఉదయం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను, స్థానికులను ఆకట్టుకుంది. విశాఖ జిల్లా సింహాచలంకు చెందిన రోజా మ్యూజిక్ డాన్స్ అకాడమీ వారు చిన వెంకన్న క్షేత్రంలో తొలిసారిగా నర్తించారు. సుమారు 10మంది కళాకారుల బృందం కె బాల సరస్వతి సారధ్యంలో ఈ కళా ప్రదర్శన నిర్వహించారు. తమ అకాడమీ ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, భద్రాచలం, విజయవాడ, అన్నవరం, సింహాచలం ల్లాంటి పలు ఆలయాలలో నృత్య ప్రదర్శనలు చేశామన్నారు. అయితే ద్వారకాతిరుమల క్షేత్రంలో తొలిసారిగా నృత్యప్రదర్శనలివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనకు ఆర్గనైజర్‌గా ఎల్ రామకృష్ణ వ్యవహరించారు.
ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు సభ్యులకు అదనపు సేవలు
ఏలూరు, జూలై 23 : ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు ఏలూరు శాఖ ద్వారా సభ్యులకు అదనపు సేవలను అందించేందుకు చర్యలు తీసుకున్నామని బ్రాంచి మేనేజర్ వై శ్రీనివాసరావు, బ్రాంచి ఇన్‌ఛార్జి డైరెక్టర్ పివి రమణరావు, ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావులు తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక రామచంద్రరావుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ కళ్యాణ మండపంలో మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్, బ్రాంచ్ మేనేజర్లు మాట్లాడుతూ బ్యాంకులో 1066 మంది సభ్యులున్నారని, డిపాజిట్లుగా 9 కోట్ల రూపాయలను సాధించామని, రుణాలుగా 37 కోట్లు అందజేశామని, షేర్ ధనం 1.81 కోట్లుగా వుందని, నిరర్ధక ఆస్తులు 0.60 కోట్లు వున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా జాతీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. డిపాజిట్లుపై కూడా అదనపు వడ్డీ ఇస్తున్నామన్నారు. 90 రోజులకు డిపాజిట్ చేస్తే ఆరు శాతం వడ్డీ, 270 రోజులకు గాను డిపాజిట్ చేస్తే 7.25 శాతం, ఒక సంవత్సరానికి డిపాజిట్ చేస్తే 7.50 శాతం వడ్డీ, సంవత్సరం పైబడి డిపాజిట్ చేస్తే 7.75 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుందని తెలిపారు. డిపాజిట్‌దారుల సౌకర్యార్ధం నెలవారీగా కూడా వడ్డీలు ఇచ్చే సౌకర్యాన్ని కూడా కలగజేశామని, లక్ష రూపాయలు డిపాజిట్‌కు 621 రూపాయలు ప్రతీ నెలా వడ్డీగా ఇస్తామని, అదే సీనియర్ సిటిజన్లకు 642 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. రికరింగ్ డిపాజిట్ పధకాన్ని కూడా ప్రవేశపెట్టామని, ప్రతీ నెల 1375 రూపాయలు చెల్లిస్తే 60 నెలల అనంతరం లక్షా 224 రూపాయలు తిరిగి చెల్లిస్తామన్నారు. అదే విధంగా ప్రతీ నెలా కూడా 13750 రూపాయలు చెల్లిస్తే 60 నెలల అనంతరం 10 లక్షల 2 వేల 238 రూపాయలు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోడ్‌పతి పధకం ద్వారా నెలకు లక్షా 37 వేల 500 రూపాయలు చెల్లిస్తే కోటీ 22 లక్షల 375 రూపాయలు 60 నెలల అనంతరం చెల్లించడం జరుగుతుందన్నారు. సీనియర్ సిటిజన్లకు అదనపు సేవలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా బంగారు వస్తువులపై రుణాలు అందజేస్తామని, డిడిలు ఇవ్వడం, తదితర విద్యా రుణాలు అందించడం నిర్వహిస్తున్నామన్నారు. వ్యాపారస్తుల సౌకర్యార్ధం డెయిలీ డిపాజిట్ పధకాన్ని కూడా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. జాతీయ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి స్థిరాస్తుల తనిఖాపై రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయల వరకు 12 శాతం వడ్డీ, పది లక్షల రూపాయల వరకు 12.25 శాతం వడ్డీ, 70 లక్షల రూపాయల వరకు 12.75 శాతం వడ్డీ ఇస్తున్నామన్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని, ఇంటి నిర్మాణం, ఇల్లు కొనుగోలు విషయంలో రుణాలపై కేవలం పది శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాతా, శిశు సంరక్షణకు కృషి చేయాలి
తాడేపల్లిగూడెం, జూలై 23: మాతా, శిశు సంరక్షణకు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు కృషిచేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మండలంలోని జగన్నాథపురం అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు పిల్లలకు ఇస్తున్న ఆహారాన్ని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి స్థలం కోసం ఎదురు చూస్తున్నామని, స్థల సేకరణ జరగగానే భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు నిర్ధేశించిన సమయానికి సక్రమంగా వేయాలని అంగన్‌వాడీ సిబ్బందికి మంత్రి ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసచంద్రరాజ్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సిహెచ్ భవాని, కర్రి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.