రివ్యూ

శేఖర్ + సాయ = ఫిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*** బాగుంది *** ఫిదా

తారాగణం: వరుణ్‌తేజ్, సాయిపల్లవి, సాయిచంద్, శరణ్య ప్రదీప్, గీతాభాస్కర్, హర్షవర్థన్ రాణే, సత్యం రాజేష్ తదితరులు
సినిమాటోగ్రఫి: విజయ్ సి.కుమార్
సంగీతం: శక్తికాంత్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జీవన్‌బాబు
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
*
ఓ మూస ధోరణిలో వెళుతున్న సినిమాను తనవైపుకు తిప్పుకున్నాడు శేఖర్ కమ్ముల. కేవలం భావోద్వేగాలపై ఆయన తీసిన ఆనంద్ సినిమా సంచలన విజయం అందుకోవడంతో అసలు శేఖర్ కమ్ముల ఎవరనే ఆసక్తి అటు జనాల్లో, ఇటు పరిశ్రమలోని వారికి కలిగింది. మంచి కాఫీలాంటి సినిమా అంటూ నిజంగానే ఆ ఫీలింగ్ కలిగేలా తన సినిమాను తీర్చిదిద్దగల దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన కథలో గొప్ప మలుపులు లేకపోయినా జీవితాలు కనిపిస్తాయి. అవి మన దగ్గరగా ఇంకా దగ్గరగా ఉన్నట్టే ప్రవర్తిస్తాయి. అందుకే ఆయన సినిమాలంటే అందరికీ ఇష్టం. తన బాణీని కొసాగిస్తూ సినిమాలు చేస్తున్న శేఖర్ కెరీర్‌కు కొన్ని బ్రేక్‌లు పడ్డాయి. మళ్లీ కొంత గ్యాప్ తరువాత ఆయన ఫిదా చేయాలని చేసిన ప్రయత్నం ఫలించింది. వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా దిల్‌రాజు నిర్మించిన ఫిదా ఇటీవలే విడుదలైంది. మరి శేఖర్ కమ్ముల తన పంథాను అలాగే కొనసాగించాడా.. కొత్త ప్రయత్నం చేశాడా? మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఎలాంటి సినిమా అవుతుంది. అసలు ఎవరు ఎవరికి ఫిదా అయ్యారో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
***
వరుణ్ (వరుణ్‌తేజ్) అమెరికాలో మెడిసిన్ చదువుతుంటాడు. అన్నయ్య, తమ్ముడితో కలిసి వుంటాడు. తన అన్నకి ఇండియానుంచి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత తన తమ్ముడి ఒపీనియన్ కూడా తీసుకోవాలంటాడు అన్నయ్య. అన్నయ్య పెళ్లి నిర్ణయం కోసం వరుణ్ బాన్సువాడ గ్రామంలోకి ఎంటరవుతాడు. వచ్చీ రావడంతోనే పెళ్లికూతురి చెల్లెలు భానుమతి (సాయిపల్లవి)తో తలెత్తిన గొడవతో పరిచయం మొదలవుతుంది. భానుమతి స్వతంత్ర భావాలుగల అమ్మాయి. తండ్రి, తన ఊరితోపాటు వ్యవసాయం అంటే ఆమెకు ఇష్టం. తన ప్రాంతాన్ని, తన వాళ్లను ఎవరైనా కించపరిస్తే అస్సలు సహించదు. తనను ప్రాణంగా ప్రేమించే మనుషులమధ్యే జీవితాంతం ఉండిపోవాలని ఆశపడుతుంది. అక్క పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోవడం భానుకి ఇష్టం లేదు. పెళ్లయితే పుట్టి, పెరిగిన ఊరిని వదిలి వెళ్లాలా? ఇక్కడే ఎందుకు వుండకూడదు అనేది భాను వాదన. పల్లెటూళ్ళో ఏముంది? అంతా చెత్త అనేది వరుణ్ అభిప్రాయం. అలా వారిమధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. తరువాత వరుణ్ అన్నయ్యకు భానుమతి అక్కతో పెళ్లి జరిగిపోతుంది. వరుణ్, భానుమతిల మధ్య ఏర్పడిన పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారుతుంది. ఒకరిపట్ల మరొకరికి ఉన్న ప్రేమను వెల్లడించాలనుకునేలోపే అపోహలు, అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరూ విడిపోతారు. మనసులో ఇష్టం ఉన్నా దానిని వ్యక్తపరచలేక అనుక్షణం సంఘర్షణకు లోనవుతుంటారు. చివరకు వారిద్దరు ఎలా ఏకమయ్యారు? తను ఇష్టపడ్డ భానుమతి కోసం వరుణ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? వారిమధ్య అపోహలు ఎలా తొలగిపోయాయి అన్నదే అసలు కథ.
నిజానికి ఇందులో కథ కంటే కూడా కథనంకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక హీరో, హీరోయిన్‌లమధ్య అపార్థాలు, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత దూరం అయిపోవడానికి బలమైన కారణం పెద్దగా కనిపించదు. సినిమాలో చూపించిన కారణం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒకరంటే ఒకరికి చెడు అభిప్రాయాలు కలుగుతాయి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి చివరివరకూ తెలంగాణ యాసను మినహాయిస్తే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఆనంద్ సినిమా గుర్తొస్తుంటుంది. ఓ ప్రాంతానికి చెందిన సంస్కృతుల్ని సంప్రదాయాలను వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా జోడించి వెండితరపై ఆవిష్కరించడం కత్తిమీద సాములాంటిది. కానీ ఈ విషయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల సఫలమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, కల్మషంలేని ఇక్కడి మనస్తత్వాల్ని ఫిదా సినిమాలో సహజంగా చూపించారు. తండ్రీ కూతుళ్లమధ్య ఉండే అనురాగాన్ని, పెళ్లి తర్వాత కుటుంబానికి దూరమైపోతానని భయపడే సగటు అమ్మాయిలా మనోభావాలను మనసుల్ని కదిలించేలా సినిమాలో తెరకెక్కించారు. కథను కాకుండా కేవలం పాత్రలమధ్య ఉండే భావోద్వేగాల ఆధారంగా తనదైన శైలిలో సినిమాను నడిపించారు.
ఇక సినిమాలో వరుణ్‌తేజ్ తన పాత్రను చక్కగా చేశాడు. వరుణ్‌తేజ్, సాయిపల్లవిల జంట తెరపై చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా సాయిపల్లవి తన నటనతో భానుమతి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసింది. నిజమైన తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా చక్కటి హావభావాలను ప్రదర్శించింది. నటనతోపాటు డాన్సుల్లో ప్రతిభను చాటింది. తన పాత్రకు తానే తెలంగాణ మాండలికంలో డబ్బింగ్ చెప్పడం విశేషం. పెర్‌ఫార్మెన్స్ పరంగా సాయిపల్లవికి నూటికి నూరు మార్కులు పడతాయి. వరుణ్‌తేజ్‌కి ఇది కొత్త తరహా సినిమాయే అయినప్పటికీ హీరోయిన్ క్యారెక్టర్ ఇంప్రెస్ చేసినంతగా హీరో క్యారెక్టర్ చెయ్యలేదనేది వాస్తవం. సాయిపల్లవి తండ్రిగా మాభూమి ఫేం సాయిచంద్ మంచి నటనను ప్రదర్శించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, తల్లి గీతాభాస్కర్ ఓ కీలక పాత్రలో నటించారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల్లో చక్కగా చేశారు.
శేఖర్ కమ్ముల చేసిన సినిమాల్లో ఎక్కువ సినిమాలకు విజయ్ సి.కుమార్ సినిమాఫొటోగ్రాఫర్. ఈ సినిమాకు కూడా అతనే ఫొటోగ్రఫి అందించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని అందంగా చూపించాడు. శక్తికాంత్ బాణీలు వీనుల విందుగా సాగాయి. ప్రతి పాట అర్థవంతంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంతో సాగే వచ్చిందే, హే పిల్లగాడ పాటలు కొత్తగా ఉన్నాయి. వాటిని చిత్రీకరించిన తీరు బాగుంది. జీవన్‌బాబు నేపథ్య సంగీతం బాగుంది. శేఖర్ కమ్ముల ఆలోచనలను నమ్మి నిజాయితీగా ఈ సినిమాను నిర్మించారు దిల్‌రాజు. సినిమా బాగా రావడానికి ఆయన పడిన తపన ప్రతి సన్నివేశంలో కనిపించింది. తన అభిరుచులకు అనుగుణంగా భారీ వ్యయంతో నిర్మించారు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్‌లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇక శేఖర్ కమ్ముల 13 సంవత్సరాల క్రితం తీసిన ఆనంద్ తరహాలోనే ఈసారి తెలంగాణ నేపథ్యంలో కొత్త ప్రయత్నం చేశాడు. అయితే సినిమాలో ప్రతి సన్నివేశం చాలా స్లోగా కదులుతుంది. చూసిన సీన్లనే మళ్లీ మళ్లీ చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో బలమైన కథంటూ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కేవలం సీన్స్‌తో, డైలాగ్స్‌తో నడిపించెయ్యడం, ఫస్ట్‌హాప్‌లో కనిపించిన హుషారు సెకాండాఫ్‌లో లేకపోవడం. అయితే శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎలాంటి ఎమోషన్స్ ఆశించి ప్రేక్షకులు వెళ్తారో అవన్నీ సినిమాలో ఉంటాయి.

-త్రివేది