రంగారెడ్డి

ఆదాయపు పన్ను చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 24: ఆదాయం పొందుతున్న వారంతా ఆదాయపు పన్ను చెల్లించి తలెత్తుకుని జీవించాలని వికారాబాద్ జిల్లా ఆదాయపు పన్ను అధికారి సిహెచ్ నాగప్రభ పిలుపునిచ్చారు. సోమవారం 157వ ఇన్‌కంట్యాక్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో పన్ను చెల్లింపు దారులతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
బ్రిటీషు కాలంలో 1860 జూలై 24ను ఇన్‌కంట్యాక్స్ దినంగా ప్రకటించారని, అప్పటి నుండి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. నమ్మకంగా పన్ను చెల్లించే వారికి తమ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పన్ను ఎగ్గొట్టాలనుకునే వారిపై కొరడా ఝుళిపిస్తుందని హెచ్చరించారు. ఆదాయం పెరిగితే పన్ను పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తేనే.. ప్రభుత్వం ప్రజలకు రోడ్లు, నీరు, వైదారోగ్య సదుపాయాలు కల్పిసుందని పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్ ప్రహ్లాద్ శర్మ మాట్లాడుతూ ఆదాయపు పన్ను శాఖ ఒకప్పటిలా లేదని వివిధ ఎజెన్సీల ద్వారా డాటా వస్తోందని తెలిపారు. ఎవరూ తమ ఆదాయాన్ని చూడటం లేదనుకోవడం తప్పని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్యాలయం సూపరింటెండెంట్ / సీనియర్ అసిస్టెంట్ పురుషోత్తం పాల్గొన్నారు.

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
మేడ్చల్, జూలై 24: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి సూచించారు. మండలంలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఎంపి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపి మాట్లాడుతూ విద్యార్థులు అమూల్యమైన సమయాన్ని వృథా చేయకుండా సద్వియోగం చేసుకుని జీవితంలో రాణించాలని అన్నారు. రెండు సార్లు ఎస్‌బిఎ, నాక్ గుర్తింపు పొందిన కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడదని చెప్పారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే సాంకేతిక విద్యాలయంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్) ప్రథమ స్థానంలో పెరొందిందని అన్నారు. కళాశాలకు యూజిసి ఇచ్చిన స్వయం ప్రతిపత్తి హోదాను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌లో ఎప్పటికపుడు మార్పులు చేసుకుంటున్నామని తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ ధనుంజయ్, వివిధ విభాగాధిపతులు సురేంద్రనాథ్‌రెడ్డి, విజయ భాస్కరరెడ్డి, విజయ్, సరోజ, వంశీ పాల్గొన్నారు.

విద్యుత్ సమస్య లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే
మేడ్చల్, జూలై 24: తెలంగాణలో విద్యుద్ సమస్య లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని, వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనేది కల అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని మేడ్చల్ పట్టణంలో మంత్రులు జగదీష్‌రెడ్డి పట్నం మహేందర్‌రెడ్డి బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి డంపింగ్ యార్డులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి అనంతరం నూతనంగా నిర్మించిన 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంపై ఉన్న అపోహాలను తొలగిస్తూ ప్రజలకు విశ్వాసం కల్పించినట్లు చెప్పారు. గృహ వినియోగం పారిశ్రామిక రంగాలే కాకుండా రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించాలనేది ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ కల అని, ఆ కలను సాకారం చేసుకునే విధంగా ముందుకుసాగుతూ ప్రస్తుతం మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని వివరించారు. గతంలో ప్రతి సంవత్సరం లోఓల్టేజీ సమస్యతో లక్షల కోట్ల బల్బులు వృథా అయ్యేవని అలాగే వ్యవసాయ బోరు మోటార్లు యేడాదికి రెండు సార్లు చెడిపోయేవని, తెలంగాణ ఏర్పడిన మూడు సంవత్సరాల్లోనే రూ.20 వేల కోట్లతో సబ్‌స్టేషన్‌లు విద్యుత్ లైన్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. త్వరలోనే ఇవన్ని పనులు పూర్తిచేసి రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తామని మంత్రి ఆభయమిచ్చారు. మేడ్చల్ పట్టణంలో రూ. 2కోట్ల 60లక్షలతో నూతనంగా సబ్‌స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు కోట్ల తొమ్మిది లక్షల మొక్కలను నాటే విధంగా లక్ష్యం ఉందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతి మనిషి ఐదు మొక్కలు నాటాలని కోరారు. మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపిపి విజయలక్ష్మి, జడ్పీటిసి శైలజ హరినాథ్, ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, తహశీల్దార్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ దేవసహయం, నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి, ఎంఇఓ శ్రీ్ధర్, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజమల్లారెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు అమరం మోహన్ రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు నందారెడ్డి, మల్లికార్జున్, విష్ణు, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్‌గౌడ్, భాగ్యరెడ్డి, మర్రి నర్సింహా రెడ్డి, రవీందర్ రెడ్డి, మోహన్‌రెడ్డి, శైలేందర్, నాగరాజు పాల్గొన్నారు.

విరివిగా మొక్కలు నాటాలి
కీసర: రాష్ట్రంలో కరవును అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి, మేడ్చల్, కీసర, ఘట్‌కేసర్ మండలాల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డితో కలిసి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీసరలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమాశంలో జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్నారు. పీల్చే గాలిలో స్వచ్ఛత లేకపోవటం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వివరించారు. సిఎం కేసీఆర్ ఆశయం మేరకు ప్రతి ఒక్కరూ ఇంట్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఖాళీ స్ధలాల్లో మొక్కలు నాటడంతో పాటు, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ హరిత కార్యక్రమంలో ప్రజలు,ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములులై ఐదు నుండి పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మూడవ విడత హరితహారంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3.75 కోట్లు మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించటం జరిగిందన్నారు. 36 సబ్‌స్టేషన్‌లకు గాను 180 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందన్నారు. కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో హరితహారం క్రింద 40 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవటం జరిగిందని, ఇప్పటి వరకు పది వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. కలెక్టరేట్‌లో 46 శాఖలు పని చేస్తున్నాయని, సంక్షేమ భవన్ ముందు గల ఖాళీ స్ధలంలో రెండు వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. నాగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్బంగా కళ్యాణలక్ష్మీ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేసారు. అనంతరం కలెక్టరేట్‌లోని బి బ్లాక్‌లో హరితహారం కింద కలెక్టర్ ఎంవి రెడ్డి విద్యార్ధులతో కలిసి మొక్కలను నాటారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించనున్న బస్‌షెల్టర్‌కు శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, పిఎఫ్‌ఒ కృష్ణ, డిపిఒ సురేశ్‌మోహన్, డిఈవో ఉషారాణి, ఆర్టీవో శ్రీనివాస్, డిఆర్‌డిఒ కౌటిల్య, ఎంపిపి సుజాత పాల్గొన్నారు.

-- ఏడాదిగా ఆగిపోయన పింఛన్ --
వృద్ధురాలి వౌన పోరాటం
వికారాబాద్, జూలై 24: మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన బీజాన్‌బీ (70) అనే వృద్ధురాలు సోమవారం ఉదయం కొడంగల్ ఎంపిడివో కార్యాలయంలో వౌనపోరాటానికి దిగింది. బీజాన్‌భీ వృద్ధాప్యంతో పాటు వైకల్యంతో బాధపడుతోంది. రెండు కాళ్లు పనిచేయని స్థితిలో ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004వ సంవత్సరం నుంచి 2014 వరకు వికలాంగ ఫించన్ రూ. 500 వచ్చేవి. 2014 నవబంర్ నుంచి 2016 జూలై వరకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా ఫించన్ రూ 1500 వచ్చేది. 2016 జూలైలో ఆ వృద్ధురాలు ఫించన్ ఆగిపోయింది. ఈ విషయంపై ఆ వృద్ధురాలు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ ఫించన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధురాలు ఇప్పటివరకు ఒంటిపూట భోజనంతో కాలం వెళ్లదీస్తోంది. సుమారు సంవత్సర కాలం నుంచి ఫించన్ రాకపోవడంతో సదరు వృద్ధురాలు ఆర్థిక ఇబ్బందుల నడుమ సతమతమవుతోంది. బతుకు భారమై పూట గడవడమే కష్టంగా మారటంతో ఆవేదన చెందిన వృద్ధురాలు సోమవారం ఉదయం కొడంగల్ యంపిడివో కార్యాలయానికి చేరుకుని బైఠాయించింది. బైఠాయించిన వృద్ధురాలు ఎండ తీవ్రతతో సోమ్మసిల్లి కిందపడిపోయింది. విషయం గమనించిన పరిసరవాసులు యంపిడివో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన వారు కార్యాలయం బయటఉన్న వృద్ధురాలి దగ్గరకు చేరుకుని ఫ్రజావాణిలో దరఖాస్తును స్వీకరిస్తున్నట్లు వారు తెలిపారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించి త్వరలో పింఛన్ మంజురు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధురాలికి చేదోడు వాదోడుగా ఉన్న న్యాయవాది భవనప్పను గ్రామస్థులు అభినందించారు.

పథకం ప్రకారమే పరువు హత్య
తాండూరు, జూలై 24: తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో కలకలం రేపిన యువకుడి అదృశ్యం అనంతరం హత్య ఘటన ఉదంతంలో మిస్టరీ వీడింది. యువకుడు యాదప్పను పథకం ప్రకారమే పరువు హత్యకు పాల్పడినట్లు ప్రధాన నిందితులు గౌరీ రాములు అలియాస్ మేస్ర్తి రాములు, అతడి కారు డ్రైవర్ శ్రీనివాస్ సోమవారం తాండూరు డిఎస్పీ కార్యాలయంలో సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారుల సమక్షంలో అంగీకరించారు. కాగా పట్టణంలోని సాయిపూర్ ఏరియాలో నివాసం ఉంటున్న బెస్తలక్ష్మయ్య, బెస్త నర్సమ్మల కుమారుడు అదే ప్రాంతంలో నివసించే గౌరీ రాములు అలియాస్ మేస్ర్తి రాములు అనే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. అది తెలిసిన గౌరీ రాములు.. యువకుడు యాదప్పను, అతడి తల్లిదండ్రులను పలుమార్లు వారించాడు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు కనిపించ లేదు. రాములు కుమార్తె సైతం యాదప్ప పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో తన కారు డ్రైవర్‌గా ఉన్న శ్రీనివాస్ సహాయంతో మంత్రగాడైన చంద్రప్పను కలిసి మంత్రతంత్రాలతో యాదప్పను కడతేర్చాలని భావించాడు. కాగా మంత్రతంత్రాలకు చింతకాయలు రాలవనే చందంగా యువకుడు, తన కుమార్తె వ్యవహారం మారటంతో ఇక లాభం లేదని భావించిన గౌరీ రాములు.. ఎలాగైనా తన పరువు కాపాడుకోవాలనే దృఢ సంకల్పానికి వచ్చాడు. కారు డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి యువకుడు యాదప్పను హతమార్చేందుకు వారం పది రోజులుగా పథకం రూపొందించారు. గురువారం తెల్లవారుఝామున తమ ఇంట్లో నిద్రిస్తున్న యాదప్పను పథకం ప్రకారం ఫోన్ చేసి మాయమాటలతో బయటకు రప్పించారు. యువకుడు యాదప్ప తెల్లవారుజాము నిద్ర మత్తులో వీరి మాయ మాటలు నమ్మి వారి వెంట వెళ్లాడు. యాదప్పను రాములు కుమార్తెతో వివాహం జరిపిస్తామని నమ్మించినట్లు ఎ-2 నిందితుడిగా ఉన్న డ్రైవర్ శ్రీనివాస్ తెలిపాడు. యువకుడిని తన మిత్రులు మరో నలుగురితో కలిసి బషీరాబాద్ మండలం కోర్వీచెడ్ గ్రామానికి సమీపంలో ఉన్న నాపరాతి గనుల కుచ్చల నిర్జన ప్రాంతానికి తరలించారు. యువకుడు యాదప్పను కారులోనే గొంతునులిమి హత మార్చినట్లు ప్రధాన నిందితులు రాములు శ్రీనివాస్ వెల్లడించారు. యాదప్ప (22)ను కోర్వీచెడ్ గ్రామ పరిసరాలలో ఉన్న నాపరాతి గనుల కుచ్చల్లో రాళ్లురప్పల మధ్య పాతిపెట్టామని వివరించారు. కాగా, ఈ దారుణ ఘటనలో యువకుడి మర్మాంగాలను కోసి వేసినట్లు తెలిపారు. తాండూరు పోలీసులకు ఓ సవాలుగా మారిన ఈ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులు గౌరీ రాములు, అతడి కారు డ్రైవర్ శ్రీనివాస్‌ను పట్టణ పోలీసులు అరెస్టు చేసి విచారించగా యాదప్పను హత మార్చింది తామేనని అంగీకరించారు. హత్య ఘటనలో భాగస్వాములైన మరో నలుగురు నరేష్, చరణ్, మునేప్ప అలియాస్ ముఖేష్, షేక్ గఫార్ పరారీలో ఉన్నట్లు తాండూరు డిఎస్పీ ఎం.రామచంద్రుడు, పట్టణ సిఐ ఎం.వెంకట రామయ్య, ఎస్సై నాగార్జున, బషీరాబాద్ ఎస్సైలు వెంకటేష్, శర్ఫోద్ధీన్ వెల్లడించారు. కాగా మంత్రగాడు చంద్రప్పను సైతం ఈ కేసులో ముఖ్య నిందితుడుగా అరెస్ట్ చేయనున్నట్లు డిఎస్పీ తెలిపారు.
యాదప్ప హత్యకు
రూ.10 లక్షలు డీల్
సాయిపూర్‌కు యాదప్పను అడ్డు తొలగించుకునేందుకు పరువు హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు గౌరీ రాములు అలియాస్ మేస్ర్తి రాములు తన కారు డ్రైవర్ శ్రీనివాస్ ఆప్త మిత్రులైన కోర్వీచెడ్ గ్రామానికి చెందిన నరేష్, చరణ్, మునేప్ప అలియాస్ ముఖేష్, తాండూరు పట్టణానికి చెందిన షేక్ గపూర్‌తో శ్రీనివాస్ మధ్యవర్తిత్వంతో రూ.10లక్షలకు డీల్‌ను కుదుర్చుకున్నట్లు ప్రధాన నిందితులు రాములు, శ్రీనివాస్ ఓప్పుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు శ్రీనివాస్ ద్వారా మిగతా నిందితులకు ముట్టజెప్పినట్లు మీడియా సమావేశంలో రాములు అంగీకరించాడు. కాగా పరారీలో ఉన్న మిగతా నిందితులు నలుగురితో పాటు, గతంలో యాదప్పను మంత్రతంత్రాలతో హత మారుస్తానంటూ వచ్చిన చంద్రప్పను త్వరలో అరెస్ట్ చేస్తామని, ఇప్పటికే నిందితుల కోసం పోలీసుల వేట ముమ్మరం చేసినట్లు డిఎస్పీ రామచంద్రుడు, సిఐ వెంకట రామయ్య పునరుద్ఘాటించారు.