రంగారెడ్డి

నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు: ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు రావాలని ప్రభుత్వం ఒకవైపు ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే మరోవైపు వైద్యుల నిర్లక్ష్య వైఖరి కారణంగా శిశువులు మృత్యువాత పడుతున్నారు. సిఎం కెసిఆర్ కిట్స్‌తో గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రులకు రప్పిస్తుంటే.. వైద్యులు సకాలంలో వైద్యసేవలు అందించక శిశువుల మృతికి కారణమవుతున్నారు. జూలై 25వ తేదీ ఉదయం 11గంటల సమయంలో కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన మంగన్నగారి మానస (30) అనే గర్భిణి ప్రసవం కోసం కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. 25వ తేదీ నుండి 26వ తేది మధ్యాహ్నం వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే గర్భిణీని పెట్టుకొని తీరా చేయి దాటిన తరువాత పరిస్థితి విషమంగా ఉందంటూ షాద్‌నగర్‌కు తీసుకువెళ్లాలని డాక్టర్ చందునాయక్ చెప్పారని బంధువులు బలవంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలు వివరించారు. దాంతో అంబులెన్స్‌లో షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువచ్చే సరికే కడుపులో శిశువు అప్పటికే మృతి చెందిందని ప్రైవేట్ వైద్యశాల డాక్టర్లు తెలిపినట్లు బంధువులు వివరించారు. దాంతో ఏమీ చేయలేక వెనుతిరిగి వెళ్లిపోయారు. గురువారం ఉదయం కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బంధువులు చేరుకొని డాక్టర్ పనితీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్లు ఉంటారని, ప్రతి గర్భిణి అక్కడికే వెళ్లాలని ప్రచారం చేస్తూనే మరోవైపు ఇలాంటి ఘటనకు పాల్పడటం ఏమిటని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యసేవలు అందించినట్లయితే శిశువుకు ఎలాంటి అపాయం జరిగేది కాదని పేర్కొన్నారు. డాక్టర్‌పై చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి బంధువులకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు.
సాధారణ ప్రసవానికి ప్రయత్నించాం- పిహెచ్‌సి డా.చందునాయక్
పర్వతాపూర్ గ్రామానికి చెందిన మానస అనే గర్భిణికి సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించామని, పరిస్థితి విషమించడంతో షాద్‌నగర్ తీసుకువెళ్లాలని బంధువులకు చెప్పామని కొందుర్గు పిహెచ్‌సి డాక్టర్ చందునాయక్ వివరించారు. తాము అన్ని విధాల ప్రయత్నం చేశామని, చివరకు ఫలితం లేకుండా పోయిందని డాక్టర్ పేర్కొన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
వైద్యసేవలు అందించండి
ఆసుపత్రికి ఆవార్డులు, రివార్డులు ముఖ్యం కాదు.. వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడం ముఖ్యమని టిఆర్‌ఎస్ కొందుర్గు మండల అధ్యక్షుడు రాజేష్‌పటేల్ అన్నారు. స్థానిక పిహెచ్‌సి డాక్టర్ చందునాయక్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరుమార్చుకొని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలే తప్ప ఇలాంటి సంఘటనలు మరోమారు కాకుండా చూడాలని సూచించారు.