డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకో నా ఆలోచనలు నాకే తృప్తి కలిగించలేదు. వెంటనే చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కాసేపు పాటలు విన్నాను. సంగీతం నా మూడ్‌ని ఎటువంటి సందర్భంలోనైనా మారుస్తుంది.
ఎదురుగా వున్న మీడియా మానిటర్‌లో ఏదో పాత సినిమా వస్తోంది. ఆరువారాలలో అమెరికన్ టీవీలో చాలా షోస్ చూశాను. ఒక్కర్తినీ ఉన్నప్పుడల్లా టీవీ చూస్తూనే ఉండేదాన్ని.
అక్కడున్న మనవాళ్ళల్లో అసలు కొందరు టీవీ ఆపరు. 24 గంటలు ఏదో వస్తూనే ఉంటుంది. చూచినా, చూడకపోయినా ఏదో ఒకటి ఆడుతూనే వుంటుంది. అందులో బ్రేడి బంచ్.. అని ఒక షో చూశాను. వారం వారం వస్తుందిట. వాస్తవంలో ఎంత జరుగుతుందో కానీ చూడటానికి సరదాగానే ఉండేది. భర్తను పోగొట్టుకున్న ఒక స్ర్తికి ముగ్గురు కూతుర్లు. ఒక భార్యను పోగొట్టుకున్న ఒక అతనికి ముగ్గురు కొడుకులు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆరుగురి పిల్లలతో చేసే సంసారమే ఆ షో.
అది పాశ్చాత్య దేశాలలో జరుగుతుందేమో గాని, మన దేశంలో ముగ్గురు పిల్లల తల్లికి అసలు మళ్లీ పెళ్లి జరగడం సంభవమేనా?! అసలు అలాంటి స్ర్తి మళ్లీ పెళ్లికి ఒప్పుకుంటుందా?
మరి వాళ్ళెలా చేయగలుగుతున్నారు? ఈ దేశాల్లో స్ర్తికి పునర్వివాహం చాలా మామూలు. మనవాళ్ళు ఎందుకు ముందుకు రాలేరు. ఎవరిదాకానో ఎందుకు, తనే చెయ్యలేకపోయింది.
ప్రసాద్ తనని పెళ్లి చేసుకోవాలని ఎంతగా అనుకున్నాడు. చాలా పెద్దమనిషి. తన కొలీగ్ అయినా సరే తనని సరాసరి కాకుండా వెళ్లి అన్నయ్యని అడిగాడు.
ఆ రోజు ఇంట్లో రియాక్షన్ తాను ఇప్పటికీ మర్చిపోలేదు. అసలు తను దేనినైనా మర్చిపోగలదా? ఆలోచనల మనసును తొలిచేస్తూనే ఉంటాయి.
అన్నయ్య ఇంటికొచ్చి నాన్నతో ప్రస్తావించాడు. ఆ రాత్రి భోజనాలు అయ్యక అమ్మా, నాన్నని కూచోపెట్టి చెప్పాడు.
నాన్న, ‘‘ప్రసాద్ అని కల్యాణి కొలీగ్ ఉన్నాడు. మనవాళ్లే. క్రితం సంవత్సరం అతని భార్య పోయిందిట. కళ్యాణి అతనికి బాగా తెలుసు. ఇద్దరూ ఒక కాలేజీలోనే పనిచేసేది. అతనికి ఒక కొడుకు ఉన్నాడట. కల్యాణిని పెళ్లిచేసుకోవాలని చాలా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు’’ అన్నాడు.
నాన్న మాట్లాడలేదు. అమ్మ తెల్లబోయింది. ఒకసారి పెళ్లయి, పిల్లవాడున్న తల్లికి మరో పెళ్లా? అనుకుంది అమ్మ.
తరువాత అన్నయ్య చాలాసేపు చెప్పాక ‘‘అసలు కల్యాణి ఏమంటుందో అడిగావా?’’ అన్నారు నాన్న.
‘‘లేదు. నేనింకా అడగలేదు. ప్రసాద్ దానితో కూడా మాట్లాడాడేమో అనుకున్నాను’’ అన్నాడు అన్నయ్య.
‘‘నువ్వు ముందు దానితో మాట్లాడు. అది అంగీకరిస్తుందన్న నమ్మకం నాకు లేదు’’ అంది అమ్మ.
‘‘మనమంతా నచ్చచెప్తే..’’ అనబోయాడు అన్నయ్య.
ఆశ్చర్యం! నానే్న తల అడ్డంగా ఊపారు.
‘‘నచ్చచెప్పే ప్రసక్తే లేదు. దానంతట దాన్ని ఆలోచించుకోనీ. ఒకసారి నచ్చచెప్పాం చాలు!’’ అన్నారు.
ఎప్పుడో 15 ఏళ్ళనాడు జరిగిపోయిన పెళ్లి తాలూకు జ్ఞాపకాలు ఎవ్వరినీ వదిలిపోలేదు.
అమ్మ సరిగ్గానే ఊహించింది నన్ను గురించి. అదే సమాధానం చెప్పాను అన్నయ్యకి. వదిన ఏదో సర్ది చెప్పబోయింది.
‘‘వదినా! నీ మాటలు మీద నాకు ఎంతో నమ్మకం. కానీ ఈసారి అసలు నువ్వు మాట్లాడద్దు’’ అన్నాడు. అలా ఆగిపోయింది. ఆ తరువాత కూడా ఎవరు ఈ సలహా ఇవ్వబోయినా అమ్మే ముందు ఆపేసేది.
థాంక్ గాడ్! ప్రసాద్ నన్ను డైరెక్ట్‌గా అడగలేదు. లేదంటే ఒకేచోట పనిచేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది.
కానీ మేమిద్దరం ఆ విషయాలు జరగనట్లే ప్రవర్తించాం. ఆ తరువాత ఓ ఏడాదికి ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. అతనికి మరో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
చాలా రోజుల తరువాత ఈ విషయం వౌళికి తెలిసింది. నా దగ్గరకు వచ్చి అడిగాడు. ‘‘పెళ్లి ఎందుకు వద్దన్నావు? నా కోసమా?’’ అన్నాడు సూటిగా.
ఆశ్చర్యంగా చూచాను.
‘‘నేను పెళ్లి చేసుకున్నది నువ్వు పుడతావనా?’’ అన్నాను.
వాడు మాట్లాడలేదు. ‘‘పెళ్లిళ్లు చేసుకునేది పిల్లలకోసం మాత్రమే కాదు. సహచర్యం కోసం. నీ కోసం చేసుకోలేదు. నీ కోసం మానలేదు. ఈ విషయాలు ఇకముందు నాతో మాట్లాడకు’’ అన్నాను.
ఏమనుకున్నాడో మళ్లీ అడగలేదు.
కానీ నాకు ఎందుకనో అటువంటి ఆలోచన మనసులోకి రాలేదు.
కానీ, నా పెళ్లి ఎలా జరిగిందో, విడాకులు కూడా అలాగే జరిగిపోయాయి.
ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికొచ్చే సరికి అందరి మొహాలు సీరియస్‌గా ఉన్నాయి. మామ్మ కళ్ళు, ముక్కు వాచి ఉన్నాయి. ఏదో జరిగిందని గ్రహించాను. కానీ ఏమిటని అడగదల్చుకోలేదు.
గబగబా స్నానం చేసి రెడీ అవసాగాను. ఆ రోజు వౌళికి క్రికెట్ గేము ఉంది. దగ్గరలో పొరుగూరు నుంచి మరో టీం వచ్చి వీళ్ళతో ఆడుతున్నారు.
వాడి దృష్టిలో చాలా ఇంపార్టెంట్. కానీ నాకు పొద్దున చెప్పడం మర్చిపోయాడు. మధ్యాహ్నం కాలేజీకి ఫోన్ చేసి చెప్పాడు. అందుకే హడావిడిగా ఇంటికొచ్చాను.
చీర కట్టుకుంటుంటే అమ్మ లోపలకు వచ్చి ఓ కవరు అందించింది.
అది కోర్టు నుంచి వచ్చిన ఉత్తరం. అందులో రఘురాం డివోర్స్‌కి దాఖలు చేసినట్లుంది.
దాని వంక రెండు నిమిషాలు తదేకంగా చూచాను. తిరిగి కవరులో పెట్టి అమ్మకి ఇచ్చేశాను తరువాత మాట్లాడదాం అంటూ.
రెడీ అయి బయటకు వచ్చేటప్పటికి అప్పుడే వౌళి ఆటో తీసుకువచ్చి వాకిట్లో నుంచుని ఉన్నాడు. ‘‘అమ్మా లేట్ అయిపోతున్నాం’’ అంటూ. ‘‘ఎంత లేట్ చేశావో చూశావా’’ అన్నాడు. అదంతా నా తప్పే అన్నట్లు.
‘‘నువ్వు ముందుగా చెప్పలేదు. కాలేజీకి ఫోన్ చేశావు. అంతకీ క్లాస్ అవగానే ఇంటికి వచ్చేశాను. నువ్వు ముందుగా చెప్పి ఉంటే కొంచెం త్వరగా రావడానికి ఏర్పాటుచూసుకునేదాన్ని’’ అన్నాను. ‘‘పైగా ఇదంతా నా తప్పే అన్నట్లు మాట్లాడుతున్నావ్’’ అన్నాను మందలిస్తున్నట్లుగా.
‘‘సారీ! సారీ!’’అన్నాడు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి