పశ్చిమగోదావరి

ఉచిత ‘ప్రశంస’కు చెల్లుచీటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ఇంతకాలం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు వచ్చాయంటే ఉద్యోగవర్గాలకు పత్రాల పండుగే పండుగ. అదుగో వీరతాడు అందుకోవాలంటూ పరుగులు తీసే పరిస్ధితి ఎప్పుడూ కన్పించేది. కానీ ఈసారి ఆ సీన్ రిపీట్ కాకపోవచ్చునన్న నమ్మకం కలుగుతోంది. అన్నీ విధానాల్లోనూ మార్గదర్శకాలు మారుస్తూ కొత్త పంధాను తీసుకువస్తున్న జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఈ వీరతాళ్ల వ్యవహారానికి కూడా బ్రేక్ వేసినట్లు కన్పిస్తోంది. తాజాగా అయా ప్రభుత్వ విభాగాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం చూస్తే ఆ విషయం ఈసారి అమలులోకి వస్తుందన్న నమ్మకమే కలుగుతోంది. వాస్తవానికి ఏ ప్రభుత్వ విభాగమైనా ఇలాంటి దినోత్సవాల సందర్భంలో ఆ కార్యాలయాల్లో పనిచేసే సగం మందికి ప్రశంసాపత్రాలకు అర్హులంటూ ఈ ఏడాది ఇవ్వటం, మరుసటి ఏడాది మిగిలిన సగం మంది అర్హులంటూ నివేదికలు ఇవ్వటం, వారంతా తండోపతండాలుగా వచ్చి దినోత్సవాల సందర్భంలో వరుస ప్రశంసాపత్రాలు అందిపుచ్చుకునే సీన్ ఇంతకాలం చూస్తూనే వచ్చాం. ఈ వ్యవహారంలో పనితీరుకు, ప్రతిభకు ఏ దశలోనూ అవకాశం లేకుండా మనోడా, కాదా అన్న అంశమే ప్రధాన అర్హతగా నిలుస్తూ వచ్చిందన్నది బహిరంగరహస్యమే. మరికొన్నిసార్లు ఈ పత్రాలు పొందేందుకు పై అధికారులను ప్రసన్నం చేసుకునే మార్గాలను కూడా ఓపెన్‌గానే ఉంచటం, దాన్ని ఉద్యోగవర్గాలు పూర్తిస్దాయిలో వినియోగించుకుంటున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూనే వచ్చాయి. ఇక కలెక్టరేట్ కేంద్రంగా ఇలాంటి వ్యవహారాలకు ఒక ‘హెల్ప్‌డెస్క్’ పనిచేస్తూ వచ్చిందంటే ఆతిశయోక్తి కాదు. ఏడాదికేడాది ఇలాంటి తంతు చూస్తూనే వచ్చాం. అయితే దీని లోగుట్టు పసిగట్టారో ఏమోగాని జిల్లా కలెక్టరు ఈ మొత్తం వ్యవహారానికి అడ్డుకట్ట వేసి పనితీరుకు, ప్రతిభకు ప్రశంసగా మాత్రమే దీన్ని పరిగణించాలని స్పష్టం చేస్తూ దానికి తగ్గ మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గతంలో మాదిరి ఉన్న ఉద్యోగుల్లో సగం మందికి పత్రాలు ఇవ్వటం కాకుండా వాస్తవంగా విధినిర్వహణలో అంకితభావం చూపిన ఉద్యోగులను గుర్తించి జిల్లా శాఖల్లో కేవలం ఇద్దరి పేర్లను మాత్రమే సిఫార్సు చేయాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే డివిజన్లవారీగా విభాగాలున్న రెవిన్యూ వంటి శాఖల్లో డివిజన్‌కు ఇద్దరిని మాత్రమే సిఫార్సు చేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అవిధంగా చూస్తే వందలమంది పత్రాలు తీసుకునే సీన్ నుంచి పదుల సంఖ్యలో పత్రాలు పంపిణి చేసే పరిస్దితి కన్పిస్తుందని చెప్పవచ్చు. దీనికితోడు అ ఎంపిక చేసేవారి విషయంలోనూ మరికొన్ని మార్గదర్శకాలు విడుదలైనట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు, ఆవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారిని దీనిలో పరిగణనలోకి తీసుకోవద్దని, కేవలం రెగ్యులర్ ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే చోటు కల్పించాలని స్పష్టంచేసినట్లు సమాచారం. వాస్తవానికి ఇంతకుముందు కాంట్రాక్టు, ఆవుట్‌సోర్సింగ్ లేక ఇతర విధానాల్లో పనిచేస్తున్న వారిని కూడా ఈపత్రాలకు సిఫార్సు చేసేవారు. అయితే అనంతర పరిణామాల్లో ఏజన్సీ కాంట్రాక్టు ముగిసిపోయినా, థర్డ్‌పార్టీ అగ్రిమెంట్ కాలం చెల్లిపోయినా అటువంటి ఉద్యోగులు విధుల్లో కొనసాగే అవకాశం లేకుండా పోయేది. అంతేకాకుండా ఎక్కడైనా పొరపాటు జరిగి దానికి వారే బాధ్యులని తేలితే వారిని విధుల నుంచి తొలగించటం వంటివి జరుగుతుండేవి. ఇలాంటి సమయాల్లో ఈ ప్రశంసాపత్రాలను తమ పనితీరుకు రుజువుగా చూపుతూ వారంతా న్యాయస్ధానాల్లో కేసులు వేయటంతో సమస్య మరింత జఠిలమవుతూ వస్తోంది. ఈపరిస్ధితి నుంచి తప్పుకునేందుకు అలా ప్రత్యామ్నాయ విధానంలో పనిచేస్తున్నవారికి ఈసారి పత్రాలు లేవని ముందుగానే స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మించి రెగ్యులర్ ఉద్యోగులను ఈ పత్రాలకు సిఫార్సు చేసినా వారి విషయంలోనూ కొన్ని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గత మూడేళ్ల కాలపరిమితిలో విధినిర్వహణలో అంకితభావం చూపటంతోపాటు ఎటువంటి క్రమశిక్షణాపరమైన చర్యలను ఎదుర్కోని ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే ప్రశంసాపత్రాలకు పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక అధికారి విషయంలో జిల్లా యంత్రాంగం ఇలాంటి పత్రాల కారణంగానే కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన వరుస దినోత్సవాల్లో ఈ ప్రశంసాపత్రాలను పొంది చివరకు క్రమశిక్షణాపరమైన చర్యను ఎదుర్కొన్న సమయంలో ఈ పత్రాలను తనకు మద్దతుగా సమర్పించినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్ధితి మరోసారి ఎదురుకాకుండా ముందునుంచి యంత్రాంగం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రశంసాపత్రాలకు సిఫార్సు చేస్తున్న సమయంలోనే సంబంధిత రెగ్యులర్ ఉద్యోగి, సిబ్బంది నుంచి ఈ పత్రాలను అనంతరకాలంలో న్యాయస్ధాన వివాదాల విషయంలో వినియోగించనని స్పష్టం చేస్తూ ప్రత్యేక లేఖను కూడా తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా చూస్తే ఈసారికి వీరతాళ్లకు బ్రేక్ పడుతుందన్న పరిస్దితి కన్పిస్తున్నా మంగళవారం గాని ఈవ్యవహారం పూర్తిస్ధాయిలో ఒక కొలిక్కి రాదనే భావించాలి.
గూడెంలో దాసరి, రేలంగి విగ్రహాల ఏర్పాటు
మంత్రి మాణిక్యాలరావు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం: ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు, హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ధవళ సత్యం కళామిత్ర మండలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక బివిఆర్ కళాకేంద్రంలో రేలంగి వెంకట్రామయ్య జయంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాణిక్యాలరావు పాల్గొని మాట్లాడుతూ సినీ రంగంలో అత్యుత్తమ సేవలందించిన దాసరి, రేలంగిలతో పాటు మరో ఎనిమిది మంది విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. సినీ రంగంలో కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును రేలంగి వెంకట్రామయ్య తెచ్చుకున్నారన్నారు. సమాజానికి మంచి సేవ చేయాలను సేవాతత్పరతను ఆయన కలిగి ఉన్నారన్నారు. తన హాస్యంతో పదిమందిని నవ్వించే మంచి లక్షణం రేలంగి సొంతమన్నారు. దాసరి నారాయణరావు సమాజానికి మంచి సందేశాలిచ్చిన ప్రముఖ దర్శకులు అని, ఇటువంటి ప్రముఖుల చరిత్రలు ప్రస్తుత తరాల వారికి తెలియడం లేదని, వీరి చరిత్రలు భావితరాలకు తెలిసే విధంగా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా రేలంగి వెంకట్రామయ్య జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో 1600మంది పాల్గొన్నారని, వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో 500మందిని ఎంపిక చేశామన్నారు. సభకు అధ్యక్షత వహించిన ధవళ సత్యం మాట్లాడుతూ నవ్వు లేని జీవితం వ్యర్థమని, నవ్వుకు అర్థం చెప్పిన రేలంగి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ తాను రేలంగి వంశానికి చెందకపోయినా రేలంగి వెంకట్రామయ్య కుమారుడిగా తనను చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమన్నారు. తొలుత రేలంగి వెంకట్రామయ్య కుటుంబ సభ్యులు పులి గాయత్రి, పులి శంకరరావు, తిరుమల బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బివిఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, రేలంగి మల్లిక్, తిరుమలబాబు, గట్టిం మాణిక్యాలరావు, యెగ్గిన నాగబాబు, ధవళ సత్యంమిత్ర మండలి సభ్యులు కాళ్ళ నారాయణరావు, దూసనపూడి సోమసుందర్, సైమన్ పాల్, జిల్లా వృత్తికళాకారుల సంఘం అధ్యక్షులు బొడ్డేపల్లి అప్పారావు, పోతుల అన్నవరం, కర్రి ప్రభాకర బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
కాపు ఉద్యమం కొత్త పుంతలు
కాపునాడు జిల్లా అధ్యక్షులు చినమిల్లి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను బిసిల్లో చేర్చేంతవరకు కాపు ఉద్యమం కొనసాగుతుందని కాపునాడు జిల్లా అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడు స్పష్టం చేశారు. అంతేకాకుండా ముద్రగడ సారధ్యంలో ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కిస్తామన్నారు. ఆదివారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక నుంచి జిల్లాలోని కాపు నేతలు కిర్లంపూడి వెళ్లి అక్కడ ముద్రగడను కలిసి ఉద్యమానికి సంఘీభావం పలుకుతారన్నారు. ఈ నెల 15 నుంచి ఛలో కిర్లంపూడి కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. తొలుత తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతీ రోజు సుమారు 200 నుంచి 300 మంది కాపునేతలు, ముద్రగడ అభిమానులు బస్సుల్లో బయలుదేరి కిర్లంపూడిలో ఆయనను కలుస్తారన్నారు. ఈనెల 20న భీమవరం నుంచి భారీ ఎత్తున కాపునేతలు వెళ్తారన్నారు. ఈ నెల 28న దెందులూరు నియోజకవర్గ కాపునేతలు చివరిగా ముద్రగడను కలుస్తారన్నారు. అనంతరం ముద్రగడ సారధ్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబును టిడిపిలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు కలుస్తారని, అయితే వారందరూ కాపులను బిసిల్లో చేర్చాలని సిఎంకు గట్టిగా చెప్పాలన్నారు. పట్టణ అధ్యక్షులు బేతు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎస్ రావు, మాగాపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో భారీవర్షం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో, రూరల్ మండలంలోని ఆదివారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపిలేని వర్షం కురవడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఈ వర్షం మూలంగా వివాహ, తదితర వేడుకలు నిర్వహించుకునేవారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టణంలో కల్యాణ మండపాలు అన్నీ బుక్ అయిపోవడంతో ఇళ్ళ వద్ద పంక్త్భిజనాలు పెట్టుకున్న అనేక మంది వర్షం మూలంగా తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వివాహ ఊరేగింపులకు బ్రేక్ పడింది. పట్టణంలో ముఖ్యమైన నాలుగు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ఊరేగింపులు ఏర్పాటు చేసుకుని, వర్షం మూలంగా రద్దు చేసుకున్నారు. ఉదయం ఎండ కాసినప్పటికీ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో ఆదివారం పెద్ద సంఖ్యలో జరగాల్సిన వేడుకలకు హాజరయ్యేవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. మురుగునీరు, వర్షపునీరు రోడ్లపై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరడంతో పేద కుటుంబాల వారు ఇక్కట్లు పడుతున్నారు.

మూడు నెలలకే శిథిలావస్థలో తల్లాడ - దేవరపల్లి రహదారి
జంగారెడ్డిగూడెం: అవినీతి, ఆశ్రీత పక్షపాతాలకు నిలువుటద్దం తల్లాడ - దేవరపల్లి స్టేట్ హైవే. గతుకులు, గోతులు, బురద, దుమ్ముకు కేరాఫ్ తల్లాడ - దేవరపల్లి స్టేట్ హైవే. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల జేబులు నింపే గని తల్లాడ - దేవరపల్లి స్టేట్ హైవే. ఇవీ ఇక్కడి ప్రజానీకం నిత్యం అనుకునేవి. ప్రభుత్వాన్ని, కాంట్రాక్టర్లను తిట్టుకోవడం తప్ప గత రెండు దశాబ్దాలుగా ఈ రహదారిలో ప్రయాణించే ప్రజలు ఏమీ చేయలేక పోతున్నారు. దుమ్ము, ధూళి, బురద భరించలేక, ప్రమాదాల్లో ప్రాణాలు పొగొట్టుకుంటూ, కాళ్ళూ చేతులు విరగ్గొట్టుకుంటూ ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం దున్నపోతుమీద వాన కురిసన చందంగా ఈ రహదారిని విస్మరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ నుండి పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి వరకు హైదరాబాద్ - విశాఖపట్నంలకు దగ్గర దారిగా ఈ రహదారిని స్టేట్ హైవేస్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి నిర్మించారు. నిర్మాణ పనులు ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో రెండు దశాబ్దాల క్రితం చేపట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రహదారిలో పట్టుమని ఒక్క ఏడాది కూడా వాహనాలు సక్రమంగా ప్రయాణించలేదు. ముఖ్యంగా జీలుగుమిల్లి నుండి జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి వరకు 55 కిలోమీటర్ల రహదారి అధ్వాన్నం. గోతులు, గతుకులతో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు అనేక సార్లు ప్రమాదాలకు గురయ్యాయి. అనేక సార్లు మరమ్మత్తులు చేసారు. చేసిన మూనాళ్ళకే గోతులు, గతుకులతో వాహనదారులను ఇక్కట్ల పాలు చేస్తూనే ఉంది. ఈ రెండు దశాబ్ధాలలో అనేక మార్లు కోట్ల రూపాయల నిధులతో మరమ్మత్తులు చేస్తూనే వచ్చారు. చేసిన కొద్ది నెలలకే శిథిలమవుతూ వస్తోంది. గోదావరి పుష్కరాలకు మరమ్మత్తుల పేరుతో హాట్ మిక్చర్ వేసి కొత్త రహదారిగా తయారు చేసారు. పుష్కరాలు పూర్తవకుండానే రహదారిలో గోతులు పడ్డాయి. జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మధ్య అధ్వాన్నంగా తయారైన ఈ రహదారిలో ఆరు నెలల క్రితం మరల కోట్ల రూపాయల నిధులతో మరమ్మత్తులు చేపట్టారు. పూర్తి చేసిన మూడు నెలలకే మూనాళ్ళ ముచ్చట అయిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లకు అధికారులు, ప్రజా ప్రతినిధులు వత్తాసు పలకడంతో జేబులు నింపుకునే గనిలా ఈ రహదారిని భావిస్తూ వస్తున్నారు. తప్పుచేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు చేసే ఉన్నతాధికారులే కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి పరులైన అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులకు శిక్షలు విధించే వ్యవస్థ, విధిస్తే శిక్షలు కఠినంగా ఉండేలా ప్రభుత్వ వ్యవస్థ మారినప్పుడే ఇటువంటి దుర్మార్గులకు బుద్ధి వస్తుందని ప్రజలు అంటున్నారు. తెలంగాణ నుండి రాష్ట్రానికి ఇదే ప్రధాన రహదారి కావడం, ఏజన్సీ మెట్ట ప్రాంతాలకు ఇదే పెద్ద రహదారి కావడంతో ఈ రహదారిలో వాహనాల రాక పోకలు అధికం. మరమ్మత్తులు చేసిన మూడు నెలలకే రహదారి గోతులు పడి వర్షం కురిస్తే చెరువు, కాలువలను తలపిస్తోందని, ద్విచక్రవాహన దారులపై బురద పడుతోంది. ఎండ కాస్తే ఈ గోతుల మూలంగా పెద్ద వాహనాలు వెళుతుంటే ముద్ము బారిన పడుతున్నారు. ఇటువంటి సమస్య జాతీయ సమస్యగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం, లేక మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలతో యాప్‌ల డౌన్‌లోడింగ్
ఏలూరు: జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ ఆదేశాల మేరకు పోలీసుశాఖ నూతనంగా ప్రవేశపెట్టిన లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్‌పై పోలీసులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఆదివారంనాడు స్ధానిక ఒన్‌టౌన్ పోలీసులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఈ విధానంపై అవగాహన కల్పించి వారితో సెల్‌ఫోన్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఈసందర్భంగా ఒన్‌టౌన్ ఎస్సై రామారావు మాట్లాడుతూ లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్ తొలుత ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఇది 1.3 ఎంబి ఉంటుందని, యాప్‌లోకి వెళ్లి కుటుంబ యజమాని వివరాలు, చిరునామా, సెల్ నెంబర్ల వివరాలను భర్తీ చేస్తే ఆమోదిస్తూ రిజిస్ట్రేషన్ యూనిక్ ఐడి వస్తుందని చెప్పారు. ఎప్పుడైనా ఇంటికి తాళం వేసి వెళ్లినట్లయితే యాప్‌లోని రిక్వెస్టు వాచ్‌లో ఫలానా తేదీ నుంచి ఇంటికి తాళం వేసి వెళతారో పేర్కొనాలన్నారు. స్ధానిక పోలీసులు ఆ ఇంటికి వచ్చి వైర్‌లెస్ మిషన్ కెమెరా ముందు కదలికలు కన్పిస్తే రికార్డు చేసి కెమెరాను మోడెమ్ వైఫైను ఏర్పాటుచేస్తారని చెప్పారు. వైర్‌లెస్ మోషన్ కెమెరా యుపిఎస్ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో ఆరుగంటల పాటు పనిచేసే బ్యాటరీ ఉంటుందని, దొంగలు విద్యుత్‌కు అంతరాయం కలిగించినా బ్యాటరీ సహాయంతో అది పనిచేస్తుందన్నారు. దీంతో చోరీకి పాల్పడినవారిని తేలిగ్గా గుర్తించవచ్చునని ఎస్సై రామారావు తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను వినియోగించుకుని పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుందని తాడేపల్లిగూడెం రైల్వే ఎస్ ఐ బి సూర్యం తెలిపారు. పట్టాలు దాటుతుండగా ఎగువకు వెళ్ళే రైలు ఢీకొని ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. మృతుడు నలుపు, తెలుపు, ఎరుపు, సిమ్మెంట్ రంగు కలిగిన పొడవుచేతుల చొక్కా, ముక్కు పొడుము రంగు బనియన్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, అతని కుడి చేతిపై వి రమణ అనే పచ్చబొట్టు ఉందని పేర్కొన్నారు. మృతుడు ధరించిన షర్టు కాలర్‌పై వి ఎస్‌పి రావు, నారాయణపురం అడ్రస్ ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సర్పంచ్ అయనీడి కుటుంబ సభ్యులకు దర్శకుడు వివినాయక్ పరామర్శ
నిడదవోలు: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో ఇటీవల మరణించిన ఆ గ్రామ సర్పంచ్ అయినీడి సత్యవతి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ ఆదివారం పరామర్శించారు. సత్యవతి మూడవ కుమారుడు పల్లారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు మండల అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు వివి వినాయక్‌ను రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావించగా ప్రస్తుతం తనకు అటువంటి ఆలోచన లేదని స్పష్టంచేశారు. తాను డైరెక్టర్ అవుతాననుకోలేదని, దేవుని దయవల్ల డైరెక్టర్ అయ్యానని వినాయక్ తెలిపారు. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానేమోనని వినాయక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను సాయి ధర్మతేజ్ హీరోగా సి కళ్యాణ్ నిర్మాతగా మరో బుల్లి ఠాగూర్ సినిమా తెరకెక్కిస్తున్నట్టు వినాయక్ తెలిపారు.
డయల్ యువర్ కలెక్టర్ వాయిదా
ఏలూరు: ఈనెల 14వ తేదీ సోమవారం కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ శెలవుదినం కావటంతో ఏలూరు కలెక్టరేట్‌లో జరగాల్సిన డయల్ యువర్ కలెక్టరు, మీకోసం, జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశాలు వాయిదా వేసినట్లు డిఆర్వో కె హైమావతి తెలిపారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని, ఏలూరుతోపాటు అన్ని మండల కేంద్రాల్లో జరిగే మీకోసం కార్యక్రమం జరగదని ఆమె తెలిపారు.