నిజామాబాద్

నెరవేరిన పేదల సొంతింటి కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీర్కూర్: నెరవేరిన పేదల సొంతిటి కల అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బైరాపూర్ గ్రామంలో మంజూరు అయిన 56 డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 40 ఇళ్లను పూర్తి చేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన గృహాల వద్ద యజ్ఞం, ఇతర పూజలు నిర్వహించి, నూతన డబుల్‌బెడ్ రూంలో ముందుగా మంత్రి కాలు పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను తన నియోజక వర్గంలోని బీర్కుర్ మండలం బైరాపూర్ గ్రామంలోని నిరుపేద కల నిజం అయ్యిందన్నారు. మరో 15 ఇళ్లు కూడా త్వరలో పూర్తి కానున్నాయని అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి నాణ్యతతో కూడుకుని ఉన్నాయని, కాబట్టి పేదలకు ప్రభుత్వం నీడకల్పించిందన్నారు. చెప్పిన మాట చేసి చూపించడం సిఎం కెసిఆర్ నైజం అని అన్నారు. నిరుపేదల కోసం సిఎం కృషి అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతోందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజానికానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తమ గ్రామానికి తీసుకుని వచ్చి కొత్త డబుల్ బెడ్ రూంలు చూపించాల్సిందిగా కోరారు. గ్రామంలో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని మరిపించింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపిపి మల్లెల మీనా హన్మంతు, జడ్పీటిసి కిషన్‌నాయక్, ఎఎంసి చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ జడ్పీటిసి సతీష్, గ్రామ సర్పంచ్ సుభాష్, నియోజక వర్గ ఇన్‌చార్జి సురేందర్‌రెడ్డి, గ్రామస్థులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జి కలెక్టర్‌గా రవీందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ
రిలీవ్ అయిన కలెక్టర్ యోగితారాణా
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఎ.రవీందర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్‌గా కొనసాగిన డాక్టర్ యోగితారాణాను హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఆమె స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించకుండా, జె.సి రవీందర్‌రెడ్డికి ఇన్‌చార్జి కలెక్టర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రవీందర్‌రెడ్డికి గురువారం ఉదయం యోగితారాణా బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన 24గంటల్లోపే ఆమె జిల్లా కలెక్టర్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. కొత్త కార్యస్థానమైన హైదరాబాద్‌లో కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడం, స్థానికంగా కూడా జె.సికే అదనపు బాధ్యతల్లో నియమించడంతో కలెక్టర్ యోగితారాణా వెనువెంటనే రిలీవ్ అయ్యేందుకు వెసులుబాటు లభించింది. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎ.రవీందర్‌రెడ్డిని పలువురు జిల్లా శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలుపుతూ, జిల్లాను వీడి వెళ్తున్న కలెక్టర్ యోగితారాణాకు వీడ్కోలు పలికారు.

తల్లీ, ఇద్దరు చిన్నారుల మృతితో బర్దీపూర్‌లో విషాద ఛాయలు

డిచ్‌పల్లి రూరల్: తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ వివాహిత మహిళ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. బర్దీపూర్‌కు చెందిన ఆరేపల్లి అర్చన(27), తన కుమార్తె అమూల్య(7), నాలుగు నెలల కుమారుడు కీర్తిరాజులను బాసర వద్ద గోదావరి నదిలో తోసివేసి, తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. గోదావరి వద్ద తల్లితో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమైనట్టు టి.వి ప్రసారాల ద్వారా తెలుసుకున్న అర్చన కుటుంబీకులు గురువారం ఉదయం అక్కడికి చేరుకుని మృతులు తమవారేనని నిర్ధారించుకుని గుండెలవిసేలా రోదించారు. గత కొన్నాళ్ల నుండి మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్న అర్చన, అనారోగ్య కారణాలతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు, కుటుంబీకులు పేర్కొంటున్నారు.
బర్దీపూర్‌కే చెందిన అర్చనకు, స్థానికుడైన రాముతో గత తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అయిన ఏడాది కాలం అనంతరం రాము బ్రతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పటి నుండి ఆయన సెలవుపై స్వస్థలానికి వచ్చి కొన్నాళ్ల పాటు ఉంటూ తిరిగి గల్ఫ్‌కు వెళ్లడం చేస్తున్నాడు. ఏడాది క్రితమే సెలవుపై వచ్చి, ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్‌లో పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్చనకు తొలి సంతానంగా కుమార్తె అమూల్య(7) జన్మించగా, నాలుగు మాసాల క్రితమే ఆమెకు కుమారుడు కీర్తిరాజు పుట్టాడు. బాబు పుట్టిన నాటి నుండి అర్చన మానసిక సమతుల్యతను కోల్పోయి అనారోగ్యంతో బాధపడేది. బుధవారం ఆమె తన తల్లి సుజాతను వెంటబెట్టుకుని వైద్య చికిత్సల కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్‌కు చూపించుకున్న తరువాత మధ్యాహ్న సమయంలో అర్చన ఖలీల్‌వాడిలోని ఓ కొబ్బరిబొండం దుకాణం వద్దకు వెళ్లి పిల్లలకు బొండాలు తాగించింది. తన సెల్‌ఫోన్‌తో పాటు బాబు పాలడబ్బాను తల్లి చేతికి అందించి, తన ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకుని అక్కడి నుండి ఆ ఆటోరిక్షా ఎక్కి వెళ్లిపోయింది. ఏమీ చెప్పకుండానే కుమార్తె పిల్లలతో కలిసి ఎక్కడికో వెళ్లిపోవడంతో తల్లి సుజాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారంతా నిజామాబాద్‌కు చేరుకుని సాయంత్రం వరకు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న క్రమంలోనే, గురువారం ఉదయం జిల్లా సరిహద్దున గల బాసర వద్ద గోదావరి నదిలో మూడు మృతదేహాలు పైకి తేలుతూ కనిపించాయి. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో రావడంతో అనుమానించిన అర్చన కుటుంబీకులు బాసరకు వెళ్లి చూడగా, మృతులు అర్చన, అమూల్య, కీర్తిరాజులేనని నిర్ధారించుని బావురుమన్నారు. తమ ఇంట్లో కుటుంబ కలతలేవీ లేవని, మానసిక అనారోగ్యంతో బాధపడుతుండడం వల్లే అర్చన ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని ఆమె కుటుంబీకులు పేర్కొన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్‌లోనే ఉంటున్న రాము, తనకు పుట్టిన కుమారుడు కీర్తిరాజును కనీసం కళ్లారా చూడకముందే ఆ చిన్నారి తనువు చాలించడం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడడం స్థానికులను కంటతడి పెట్టించింది.

డిఎస్‌ను వెంటాడుతున్న అనుమానపు నీలినీడలు!
నిజామాబాద్: తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో సమైక్య రాష్ట్రంలో అగ్రనేతల్లో ఒకరిగా చెలామణి అయిన రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ను ఇటీవలి కాలంలో అనుమానపు నీలి నీడలు వరుసగా వెంటాడుతున్నాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అనేక కీలక పదవులు నిర్వర్తించి, పరిస్థితులు అనుకూలించకపోవడంతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని డిఎస్ అనూహ్యంగా ప్రాంతీయ పార్టీ తెరాస గూటికి చేరినప్పటికీ ఆయనను వివాదాలు వీడలేకపోతున్నాయి. డిఎస్ తెరాసను సైతం వీడతారనే వదంతులు తెరపైకి వస్తుండడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా డిఎస్ తనయుడు అరవింద్ ప్రధాని నరేంద్రమోదీని కీర్తిస్తూ ఓ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన డిఎస్ పార్టీ ఫిరాయింపు ఊహాగానాలపై రాజకీయ వర్గాల్లో రసవత్తర చర్చకు దారితీస్తోంది. తెరాసలో ఇమడలేకపోతున్న డిఎస్ వ్యూహాత్మకంగానే తన కుమారుడిచే ఈ ప్రకటన ఇప్పించి ఉంటారనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తుండగా, డిఎస్ మాత్రం నిర్ద్వందంగా ఈ వాదనలను తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తెరాసను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకెలాంటి సంబంధం లేదంటూనే, అరవింద్ చిన్న పిల్లవాడేమీ కాదంటూ పేర్కొనడం విశేషం. డిఎస్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన తన కుమారులను బిజెపిలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నట్టుగానే ఉన్నాయని పరిశీలకులు విశే్లషిస్తున్నారు. అయితే తాను గత దశాబ్ద కాలానికి పైగా నరేంద్రమోదీని అభిమానిస్తానని, తానిచ్చిన ప్రకటనతో తన తండ్రి డిఎస్ ప్రమేయం ఏమాత్రం లేదని అరవింద్ పేర్కొనడం జరిగింది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్, తాజా పరిస్థితిని బట్టి చూస్తే సమీప భవిష్యత్తులోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి వ్యాపార రంగానికే పరిమితం అయిన అరవింద్, 2010లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సమయంలో డిఎస్‌కు మద్దతుగా తొలిసారిగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు కూడా నిజామాబాద్‌లోనే మకాం వేసి అన్ని వ్యవహారాలను తానే దగ్గరుండి మరీ స్వయంగా పర్యవేక్షించారు. డిఎస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డి.సంజయ్ కూడా 2010 ఉప ఎన్నికల సమయంలో బాధ్యతలను తన సోదరుడికే అప్పగించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అరవింద్ ప్రధాని మోదీని పొగుడుతూ నిలువెత్తు పత్రికా ప్రకటన ఇవ్వడంతో ఆయన బిజెపిలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు తనకు ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశ్యం లేదని, అలాంటి నిర్ణయమేదైనా తీసుకుంటే ముందుగా మీడియాకే వెల్లడిస్తానని అరవింద్ చెబుతున్నప్పటికీ, ఆయన చేరికకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. అరవింద్ విషయం ఎలా ఉన్నప్పటికీ, ఆయన సృష్టించిన ప్రకటన కలకలంతో డిఎస్ మరోమారు ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోక తప్పలేదు. డిఎస్ కూడా పార్టీ మారతారనే పుకార్లకు అరవింద్ ప్రకటన ఊతమందించినట్లయ్యింది. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా కొనసాగిన దిగ్విజయ్‌సింగ్‌ను హైకమాండ్ ఇటీవల ఆ పదవి నుండి తప్పించిన సమయంలోనూ డిఎస్ పార్టీ ఫిరాయింపు ఊహాగానాలు చెలరేగిన విషయం విదితమే. అప్పట్లోనే డిఎస్ ఈ వార్తలను ఖండిస్తూ, తాను తెరాసను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడనని, బంగారు తెలంగాణ నిర్మాణానికి తనవంతు సహకారం అందించే కర్తవ్యాన్ని తుదివరకు అంకితభావంతో నిర్వర్తిస్తానని స్పష్టం చేయడం జరిగింది. ఈ తరుణంలోనే డిఎస్ తనయుడు అరవింద్ ఇచ్చిన పత్రికా ప్రకటనతో ఇరకాట స్థితికి లోనైన డిఎస్ తన పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలపై మరోమారు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ప్రభుత్వ విప్ ఇల్లు ముట్టడికి యత్నం
జెఎసి విద్యార్థి నాయకుల అరెస్ట్

ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి: తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం తలపెట్టిన అమరవీరుల స్ఫూర్తి యాత్రపై దాడి చేసిన టిఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘాలు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, శాంతియుతంగా స్ఫూర్తి యాత్రపై అలాగే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని సభ నిర్వహించుకుంటే టిఆర్‌ఎస్ నాయకులు కుర్చీలతో, కోడిగుడ్లతో దాడి చేయడం అమానుషమని అన్నారు. దాడి చేసిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసేలా కామారెడ్డి ఎమ్మెల్యే అయిన ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ స్పందించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని పోవాలని అన్నారు. ఈ దాడిలో అనేక మంది విద్యార్థి నాయకులు గాయపడ్డారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ విప్ ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి రవీందర్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి చెలిమెల భానుప్రసాద్, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి సందీప్, టివియువి రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మన్, జివిఎస్ జిల్లా అద్యక్షులు జబ్బర్‌నాయక్, ఐఎఫ్‌డిఎస్ జిల్లా కన్వీనర్ నరేశ్, టిజివిపి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌నాయక్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.

కాళేశ్వరం నీటితో పోచారం ప్రాజెక్ట్‌నింపుతాం
వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నాగిరెడ్డిపేట్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి ద్వారా నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్‌లను నింపి, 7లక్షల ఎకరాలలో సాగునీటిని రబీ,ఖరీఫ్‌లకు గాను అందిస్తామని ,రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితోకలిసి, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా ఎకరం భూమిలో ఏర్పాటు చేసిన రాశీ వనాన్ని ప్రారంభోత్సవం చేసి మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలోమాట్లాడారు. విత్తన క్షేత్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు 25 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, భవన నిర్మాణానికి 8 కోట్ల రూపాయలతోప్రతి పాదనలు పంపగా 2కోట్లు మంజూరైయ్యాయన్నారు. వచ్చే ఏడాది లోపు ఆ భవనాన్ని నిర్మించి, తరగతుల ప్రారంభించేలా అన్ని రకాల చర్యలుతీసుకుంటున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులే ఈపాలిటెక్నిక్ కళాశాలలో 75శాతం మంది చేరే విధంగా అధ్యాపకులు విద్యార్థులను తీర్చి దిద్దాలన్నారు. ఒక ఏఈఓ ఉన్న పరిధిలో 15లక్షల రూపాయలతోగోదాం ఏర్పాటు చేసి అక్కడే రైతుల సమావేశాలు జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వ్యవసాయ శాఖలో 1526 పోస్టులను భర్తీచేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరి కొన్ని పోస్టులను టిఎస్‌పిఎస్‌సికి అప్పగించడం జరిగిందన్నారు. మే నెల నుంచి ఎకరాకు 4వేల రూపాయల పెట్టుబడి నిధులను ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరుగుతోందన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఒక కోటి ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీటిని అందిస్తామని ఉద్ఘాటించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణంతో పూర్వవైభవం వస్తుందని అన్నారు. ఈప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇదే కళాశాలలో చదివి ఉద్యోగాలు పొందుతారని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన క్షేత్రం అభివృద్ధికి నిధులు మంజూరు, సాగుకు యోగ్యం కాని భూమిని వంద ఎకరాలలో భూమిని చదును చేసి, పంటలు పండించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, ఎల్లారెడ్డి ఆర్డీఓ వి.దేవేందర్‌రెడ్డి, ఎంపిపి ఊషమ్మ సంజీవులు, జడ్పీటిసి కాశీనారాయణ, ఎడిఎ వీరాస్వామి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్స్‌పాల్ సురేష్‌బాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులలు తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
ఆర్మూర్: ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన దూలూరి శ్రీనివాస్(45) అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా మరణించినట్లు ఎస్‌హెచ్‌ఓ సీతారాం తెలిపారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామ పంచాయతి రెండవ వార్డు కౌన్సిలర్‌గా, రేషన్ డీలర్‌గా పని చేస్తాడని అన్నారు. బుధవారం రాత్రి 2 గంటలకు మూత్ర విసర్జనకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదని అన్నారు. ఉదయం సమయంలో గ్రామంలోని గంగపుత్ర సంఘం ఎదురుగా రోడ్డుపై శ్రీనివాస్ మరణించి ఉన్నాడని అన్నారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఎసిపి శివకుమార్ సందర్శించారు. డాగ్ స్వ్కాడ్ బృందం వారు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. శ్రీనివాస్ తలపై బలమైన గాయాలు ఉండడం బట్టి చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు ప్రణాళిక ప్రకారం హత్య చేసి పరారైనట్లు తెలిసింది.

బియ్యం పట్టివేత
వినాయక్‌నగర్: పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని దొడ్డి దారిలో తరలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగిందని సివిల్ సప్లైయ్ అధికారి వెంకటేశ్వర్‌రావు, తహశీల్దార్ వసంత్ తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఎరుకలవాడ, ఆటోనగర్‌లో నబీ అనే వ్యక్తి టాటా మ్యాజిక్ గూడ్స్ ఆటోరిక్షాలో సబ్సిడీ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు కాపుకాయడం జరిగిందన్నారు. టాటా మ్యాజిక్ ఆటోరిక్షాలో 39క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. బియ్యాన్ని సీజ్, కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ దాడిలో ఇంటలిజెన్స్ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

కెసిఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
*ఎంపి బీబీపాటిల్
పిట్లం: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించే సత్తా కేవలం సిఎం కెసిఆర్‌కు మాత్రమే ఉందని జహీరాబాద్ ఎంపి బీబీపాటిల్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఆర్ వ్యాక్సిన్‌ను ఎంపి, ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాలకు మన తెలంగాణ రాష్ట్రం ఆదర్శ కావాలని అన్నారు. 9నెలల నుండి 15ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి చిన్నారులకు విద్యార్థులకు తప్పని సరి ఎంఆర్ వ్యాక్సిన్ వేయించాల్సిందిగా కోరారు. అనంతరము ఎమ్మెల్యే హన్మంత్‌షిండె మాట్లాడుతూ, దేశంలో తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధిలో నంబర్ వన్ స్థానం వస్తుందన్న బరోసా ఉందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రాల్లో జరగని అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని అన్నారు. విద్యుత్ సమస్యనే లేకుండా చేసి, ఇప్పుడు రైతులకు 24గంటల విద్యుత్ సరాఫరా చేసేందుకు రంగం సిద్ధం అయ్యిందన్నారు. ప్రతి అభివృద్ధి పనిలో సిఎం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఎఆర్ వ్యాక్సిన్‌లు వేయాలని, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎఎంసి చైర్మెన్ వెంకట్‌రాంరెడ్డి, వైస్ ఎంపిపి నర్సాగౌడ్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు జగదీశ్, తెరాస నాయకులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

డెంగీతో యువకుడు మృతి
ఆర్మూర్: ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన చౌల్ గణేష్(15) అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న గణేష్ స్థానికంగా వైద్యం చేయించుకున్నాడని అన్నారు. జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని యశోధ ఆసుపత్రిలో చూపించారని అన్నారు. పరీక్షలు చేసిన అనంతరం డెంగ్యూ వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలోనే గురువారం ఉదయం మృతి చెందాడని అన్నారు. గణేష్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడని చెప్పారు. తండ్రి చౌల్ గంగామోహన్ మామిడిపల్లిలో మహావీర్ స్టోర్స్ దుకాణాన్ని నడుపుకొని జీవనం సాగిస్తాడని అన్నారు.