పశ్చిమగోదావరి

సమాజ సేవే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : పోలీసు కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందుతున్న అభ్యర్ధులకు సమాజ సేవే లక్ష్యం కావాలని, ఏకాగ్రతతో అన్ని విషయాలు తెలుసుకుని సందేహాలను నివృత్తి చేసుకుంటూ శిక్షణా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో 70 మంది మహిళలు, 164 మంది పురుషులకు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిఐజి రామకృష్ణ, జిల్లా ఎస్‌పి రవిప్రకాష్‌లు మాట్లాడుతూ ఇప్పటి వరకు సామాన్యులుగా వున్న అభ్యర్థులంతా క్రమశిక్షణ కలిగిన ఉద్యోగంలో చేరడంతో ప్రజలకు మేలు, సేవచేసే అదృష్టం లభించిందన్నారు. ఈ ఆధునిక కాలంలో సమాచార వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో ప్రతీ ఒక్కరికీ సమాచారం అందుతోందని, పోలీసు శాఖలోని సమాచార వ్యవస్థ అనేది ఆపద సమయంలో అతిముఖ్యమన్నారు. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఎన్నికలు, ముఖ్యమైన బందోబస్తులు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ విషయాల్లో కమ్యూనికేషన్ పోలీసు కానిస్టేబుళ్ల పాత్ర ముఖ్యమైనదన్నారు. బాధ్యతతో శిక్షణను పూర్తి చేయాలని, క్రమశిక్షణతో నడుచుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటుచేస్తామన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి (ప్రిన్సిపల్ డిటిసి) బి రత్న, ఎ ఆర్ అదనపు ఎస్‌పి ఎం మహేష్‌కుమార్, ఎస్‌బి డిఎస్‌పి పి భాస్కరరావు, ఎస్‌బి ఎఆర్ డిఎస్‌పి చంద్రశేఖర్, డిటిసి డిఎస్‌పి రాజేశ్వరరెడ్డి, ఎస్‌సి, ఎస్‌టి సెల్-1 డిఎస్‌పి, మహిళా పోలీసుస్టేషన్ డిఎస్‌పి, ఏలూరు ట్రాఫిక్ డిఎస్‌పి శ్రీనివాసరావు, సిసి ఎస్ డిటిసి ఆర్‌ఐ మురళీ పాల్గొన్నారు.

నేడు పోలవరానికి పార్లమెంటరీ కమిటీ
ఏలూరు : జలవనరుల విభాగం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శుక్రవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నట్లు ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చెప్పారు. ఏలూరులో గురువారం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పర్యటనా విశేషాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి 11.30 గంటలకు కొయ్యలగూడెం శివాజీ అతిధిగృహానికి కమిటీ చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పట్టిసీమ ఎత్తిపోతల పధకం సందర్శించి పర్యటనా మార్గంలో పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించిన పైపులైన్లు తదితరాలు సందర్శించి మధ్యాహ్నం ఒంటిగంటకు పోలవరం ప్రాజెక్టుకు ఈ కమిటీ చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి 1.30 గంటల వరకూ పోలవరం ప్రాజెక్టు నమూనాను పరిశీలిస్తారన్నారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలిస్తారన్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఏలూరు చేరుకుంటారని చెప్పారు. సాయంత్రం 7.30 గంటలకు ఏలూరులోని తమ నివాస గృహానికి కమిటీ సభ్యులు చేరుకుంటారని తిరిగి రాత్రి 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటారన్నారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న లోక్‌సభ సభ్యులు హుకుంసింగ్‌తోపాటు లోక్‌సభ సభ్యులు వి సత్యభామ, అపురూపపద్ధార్, మాగంటి మురళీమోహన్, రాజ్యసభ సభ్యులు సర్ధార్ బల్విందర్ ఎస్ బుహందర్, హర్షవర్ధన్ సింగ్ దుంగరపు, ఆనంద్ భాస్కర్ రాపోలు, ప్రదీప్ టమ్టా, ఎబి స్వామి, డాక్టర్ సిద్ధాంత్ మహోపాంతతోపాటు లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందిన నలుగురు ఉన్నతాధికారులు, జలవనరుల శాఖకు సంబంధించిన మరో అయిదుగురు ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారని ఎంపి మాగంటి బాబు చెప్పారు.
అభివృద్ధికి అడ్డుతగలడం సరికాదు
రాష్ట్ర విభజనతో ఇబ్బందుల్లో వున్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని ఏలూరు ఎంపి మాగంటి బాబు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓర్వలేని మాటలతో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగిలే విధానం సరికాదని ఆయన జగన్మోహన్‌రెడ్డికి హితవు పలికారు. ఎంతకాలం రెచ్చగొట్టే విధానంలోనే ముందుకు వెళితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాగంటి బాబు విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్కడైనా పొరపాటు చేసిందని భావిస్తే రాజకీయ పోరాటం చేయాలి తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డికి తగదని పేర్కొన్నారు. రాష్ట్భ్రావృద్ధికి మంచి సలహాలు, సూచనలు అందించి అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే హర్షిస్తామన్నారు. సంస్కారం లేని మాటలతో ప్రజలను రెచ్చగొడితే వారు హర్షించరని, ఈ వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించిన లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, ఇతర కమ్యూనిస్టు నాయకులు అక్కడి పనుల ప్రగతిని చూసి అభినందించారన్నారు. పోలవరం మనకు వరం లాంటిదని, 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్న ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ అడుగడుగునా అడ్డు తగులుతూనే వున్నారన్నారు.

ఇదేమి చోద్యం!
అడ్డదిడ్డంగా బస్సు నడిపి, అడిగిన వారిపై చిందులు:విద్యాసంస్థ బస్సు డ్రైవర్ నిర్వాకం
నిడదవోలు: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టారాజ్యంగా నడపడమేకాక, ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమవ్వడమేకాక, ప్రశ్నించిన ప్రశ్నించిన వారిని నానా దుర్భాషలాడిన ప్రైవేటు విద్యాసంస్థ బస్సు డ్రైవర్ ఉదంతమిది. ఈ సంఘటన నిడదవోలు పట్టణంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయ...ఒక విద్యాసంస్థకు చెందిన బస్సు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇస్తున్న సిగ్నల్‌ను లెక్కచేయకుండా రోడ్డుకు అడ్డుగా బస్సు నిలిపివేశాడు. దీనితో ఆర్టీసీ బస్సు కదలకుండా నిలిచిపోయంది. ఇదేమి చోద్యమని ఆ రోడ్డుపై ఉన్న వ్యాపారులు ప్రశ్నించగా, తమ బస్సుకు క్లీనర్ ఉండడని, డ్రైవర్ కం క్లీనర్ నేనేనని, ప్రభుత్వం మాది.. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండంటూ వ్యాపారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగగా, వ్యాపారులంతా కలిసి ఆర్టీసీ డ్రైవర్‌ను సముదాయించారు. ప్రైవేటు స్కూలు బస్సుకు మార్గమిచ్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇటువంటి విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, యాజమాన్యంపై తగు చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జిల్లా పరిషత్తుకు వనె్నతేవాలి
అధికార్లు, సిబ్బందికి ఎంపి మాగంటి బాబు పిలుపు:జడ్పీ కార్యాలయంలో ఆధునీకరించిన ఛాంబర్లకు ప్రారంభోత్సవం
ఏలూరు : ఎంతో ఘన చరిత్ర ఉన్న పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తుకు మరింత వనె్న తెచ్చే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కోరారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్తు కార్యాలయంలో కోటీ 74 లక్షలతో రెండవ అంతస్తులో ఆధునీకరించిన జడ్పీ ఛైర్మన్ ఛాంబరు, సి ఇవో ఛాంబరు, కార్యాలయ ఛాంబరును ఎంపి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తాత మాగంటి సీతారామదాసు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు నిర్మించిన ఈ భవనాన్ని ఆధునీకరించి నూతన శోభ తీసుకురావడం అభినందనీయమన్నారు. తద్వారా మరో అయిదు దశాబ్ధాల పాటు సేవలు అందించేందుకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తన తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో దేశంలోనే ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్తుగా నిలిచి అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చేతులు మీదుగా ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారన్నారు. అటువంటి పశ్చిమ జిల్లా ప్రజా పరిషత్తును దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉంచే బాధ్యతను సంబంధితాధికారులు, సిబ్బంది తమ భుజస్కంధాలపై వేసుకోవాలన్నారు. గత మూడు సంవత్సరాల్లో ప్రస్తుత జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.
జడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ నిధులు లేమి ఉన్నప్పటికీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
పధకం నిధులు అనుసంధానం చేసుకుని 200 కోట్ల రూపాయల విలువైన పనులను జిల్లాలో చేశామన్నారు. జిల్లాలో గత రెండు సంవత్సరాల్లో 2.50 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దామన్నారు. ఇందుకు కష్టపడిన ప్రతీ అధికారినీ, సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. జిల్లాలో గ్రామ పంచాయితీల్లో పారిశుద్ధ్య పనులకు వినియోగించేందుకు 1500 ట్రాక్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలుత మాగంటి సీతారామదాసు విగ్రహానికి ఎంపి మాగంటి బాబు పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆధునీకరించిన పంచాయతీరాజ్ ఇఇ కార్యాలయాన్ని ఎంపి మాగంటి బాబు ప్రారంభించారు. ఆధునీకరించిన జడ్పీ సిఇవో ఛాంబరును జడ్పీ సిఇవో డి సత్యనారాయణ ప్రారంభించారు. ఆధునీకరించిన జడ్పీ ఛైర్మన్ ఛాంబరును ఎంపి మాగంటి బాబు ప్రారంభించగా ఆధునీకరించిన కార్యాలయ ఛాంబరును మాగంటి బాబు, జడ్పీ ఛైర్మన్ బాపిరాజులు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్తు సిఇఒ డి సత్యనారాయణ, జడ్పీటిసి సభ్యులు ముమ్మిడి సక్కుకుమారి, కురపాటి మార్తమ్మ, మట్టా రాజేశ్వరి, గంటా సుధీర్‌బాబు, శీలం రామచంద్రరావు, ఆత్మకూరి బుల్లిదొర రాజు, మనే్న లలితాదేవి, కొటారు అనంతలక్ష్మి, బండి రామారావు, పంచాయతీరాజ్ ఇఇ టి ప్రకాష్ నాయుడు, డిప్యూటీ ఇఇ పివి ఎస్ దుర్గారావు, పంచాయతీరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు వి విజయకుమార్, వై సుజాత, కెవి సంతోష్, సాయిరామ్ దుర్గ, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతోకాలంగా పాడైపోయిన జడ్పీ కార్యాల రెండవ అంతస్తు భవనాన్ని ఇతర కార్యాలయ గదులను కోటీ 75 లక్షలతో ఆధునీకరించేందుకు కృషిచేసిన జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును పంచాయితీరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా పరిషత్తు యూనిట్ నాయకులు దుశ్శాలువా, పూలమాలలతో సత్కరించారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయాలి:శివరామన్
ఏలూరు : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త, నాయకులు ఐకమత్యంగా వుండి కృషి చేయాలని చెన్నైకి చెందిన కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారి విఆర్ శివరామన్ అన్నారు. గురువారం అగ్రహారంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో నేటి ప్రభుత్వాలు పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యాయని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు గాను ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ వైపు మలచుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారంలో డిసిసి ఎన్నికలు జరుపుతామన్నారు. సంస్థాగత ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే విధంగా చర్చించుకోవాలని సూచించారు. అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిట్టిబొమ్మ వెంకటస్వామి, రాజనాల రామ్మోహనరావు, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, దారం బాబూరావు, దండుబోయిన చంద్రశేఖర్, పెద్దిరెడ్డి సుబ్బారావు, గాడి సరోజిని, పుండరీకాక్షుడు, రిజ్వాన్, ఎం రవి, దుర్గా ప్రసాద్, మాణిక్యాలరావు, అంజిత్, సేవాదళ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరామన్ నాయకులు, కార్యకర్తల నుంచి విడివిడిగా అభిప్రాయాలను సేకరించారు. నివేదికలను హైకమాండ్‌కు పంపుతామని పేర్కొన్నారు.

చేనేత వస్త్రాల అమ్మకాల పెంపునకు కృషి
ఉంగుటూరు: చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 95 క్లస్టర్లుగా చేనేత రంగాన్ని విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ ఐ శ్రీనివాస్ శ్రీనరేష్ తెలిపారు. గురువారం ఉంగుటూరు విచ్చేసిన ఆయన చేనేత సంఘం నాయకుడు దొంతంశెట్టి సత్యనారాయణ స్వగృహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రెండున్నర లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. క్లస్టరుకు రూ.2 కోట్లు విడదల అవుతాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత వస్త్రాలు తయారుచేసి, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 15 క్లస్టర్లకు నిధులు మంజూరయ్యాయన్నారు. రాష్ట్ర ఆప్కో ఛైర్మన్ జి శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో 20 కార్పొరేషన్ నగరాల్లో మెగా షోరూంల ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. మార్కెటింగ్ పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా కూడా మార్కెటింగ్ చేయనున్నట్టు చెప్పారు. వారితోపాటు దొంతంశెట్టి సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా నేషనల్ హ్యాండ్‌లూమ్ ఆఫ్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

కొల్లేరు గ్రామాలకు మెరుగైన సదుపాయాలు
ప్రభుత్వ విప్ చింతమనేని హామీ
ఏలూరు : కొల్లేరు గ్రామాలకు మెరుగైన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, దశల వారీగా సమకూరుస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరు మండలం పైడిచింతపాడు గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా వుండాలని, తద్వారా అన్ని సదుపాయాలు లభిస్తాయన్నారు. కొల్లేరులోని అన్ని గ్రామాల్లో కూడా సిసి రోడ్లు నిర్మిస్తామని, మారుమూల ప్రాంతాల్లో సైతం మంచినీటి సదుపాయాలను మెరుగుపరుస్తామని, ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు నుంచి గుడివాకలంక వరకు గల ప్రధాన రహదారి ఎన్నిసార్లు రోడ్డు నిర్మించినప్పటికీ భారీ వాహనాల రాకపోకల వల్ల గోతులమయం అవుతోందని, అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రోడ్డుకు రెండువైపులా గోడలు నిర్మించి పటిష్టంగా రోడ్డును నిర్మించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కాంటూరు విషయంలో చర్చించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిన వెంటనే కాంటూరు కుదింపు చేయడం జరుగుతుందని, తద్వారా కొల్లేరు గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని సూచించారు. సంక్షేమ పధకాలు అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేసే పధకాల ద్వారా ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను పెంపొందించుకుంటూ ప్రభుత్వానికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపిపి మోరు హైమావతి, వైస్ ఎంపిపి లంకపల్లి మాణిక్యాలరావు, జడ్పీటిసి మట్టా రాజేశ్వరి, కొల్లేరు సంఘ నాయకులు సైదు సత్యనారాయణ, గుడివాకలంక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఘంటసాల ఏడుకొండలు, టిడిపి నాయకులు నేతల రవి తదితరులు పాల్గొన్నారు.

86 కిలోల గంజాయ స్వాధీనం
దేవరపల్లి: ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న గంజాయిని దేవరపల్లి సెంటర్లో కొవ్వూరు రూరల్ సిఐ సి శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై వాసులు గురువారం స్వాధీనంచేసుకున్నారు. తమకందిన సమాచారం మేరకు ఇన్నోవా కారులో తరలిస్తున్న 86 కిలోల గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. సిఐ శరత్‌రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తిప్పాయిగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, ఒడిస్సాకు చెందిన ఆరుద్రయ్య గిరిరవితో ఒప్పందం చేసుకుని తన ఇన్నోవా కారులో ఒడిస్సా నుంచి ఈ గంజాయిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇన్నోవా కారు పెద్ద సీటులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రహస్య అరలో ఒక కిలో, పది కిలోల ప్యాకెట్లతో ఈ గంజాయిని తరలిస్తుండగా తాము వారిని పట్టుకుని, అరెస్టుచేసినట్టు సిఐ శరత్‌రాజ్‌కుమార్ తెలిపారు. దేవరపల్లి డిటి శ్రీనివాస్ సమక్షంలో 86 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కారు డ్రైవర్ రంగోలు శ్రీనివాస్‌ను, అరుద్రయ్య గిరిరవిలను గురువారం సాయంత్రం అరెస్టుచేశామని, శుక్రవారం ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నట్టు సిఐ తెలిపారు.

చిన వెంకన్న ఆలయంలో క్షీర ప్రసాద పథకం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న క్షేత్రానికి వచ్చే చిన్నారుల సౌకర్యార్థం ఆలయంలో నూతనంగా క్షీర ప్రసాద పథకాన్ని దేవస్థానం ప్రవేశపెట్టింది. దీన్ని ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన పలువురు చిన్నారులకు ఆయన ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావుతో కలిసి పాలను అందించారు. అనంతరం ఛైర్మన్ సుధాకరరావు మాట్లాడుతూ ఇకపై ఆలయంలో ప్రతినిత్యం చిన్నారులకు 20 లీటర్ల పాలను పంపిణీ చేస్తామన్నారు. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆదివారాల్లో 50 లీటర్ల పాలను చిన్నారులకు అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఇందు నిమిత్తం ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఆలయానికి వచ్చిన అయిదేళ్లలోపు చిన్నారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని, భక్తులు దీన్ని గమనించాలని సుధాకరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఇఇలు వైకుంఠరావు, శ్రీనివాసరాజు, ఎఇఒ మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ వాసు, నగేష్ పాల్గొన్నారు.

అమిత్ షా పర్యటన విజయవంతం చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన విజయవంతం చేయాలని బిజెపి ఒబిసి మోర్చా పిలుపునిచ్చింది. గురువారం జిల్లా ఒబిసి మోర్చా సమావేశం జిల్లా అధ్యక్షుడు కోమటి రవికుమార్ అధ్యక్షతన భీమవరంలో జరిగింది. సమావేశానికి ఒబిసి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రొవ్విడి సురేష్‌కుమార్, కె.కోటేశ్వరరావు, అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పర్యటన గురించి చర్చించారు. ఏడు దశాబ్దాలుగా బిసీలకు రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని కోరుతున్నామని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎస్సీ, ఎస్టీ కమిషన్లు మాదిరిగా బీసీ కమిషన్‌కు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారన్నారు. అయితే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం వల్ల బిల్లు వీగిపోయిందన్నారు. అయినప్పటికీ రాబోయే సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తే దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ నిలిచిపోతుందన్నారు. దేశంలో 58 శాతం పైగా ఉన్న బిసీల హక్కులు పరిరక్షించమని అమిత్ షాను కోరుతామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు. బిసీ సంఘాలు బిజెపికి అండగా దేశ ప్రగతిలో భాగస్వాములం అవుతామని, పార్టీని, ప్రభుత్వాన్ని బిసీలు బలపరిచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కోరుతామని తెలిపారు. జిల్లా కార్యదర్శి కడియం సూరిబాబు, అగ్రహారపు వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయన కారు
తప్పించుకున్న డ్రైవర్:ప్రయాణీకుల గల్లంతయ్యారనే సందేహంతో గాలింపు
నిడదవోలు: పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి గురువారం ఒక కారు అదుపుతప్పి దూసుకుపోయంది. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు వైపు వస్తున్న ఎపి 05బిజెడ్ 2245 నెంబరు గల ఆల్టో కారు విజ్జేశ్వరం మలుపు వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. కారు నడుపుతున్న డ్రైవరు ఉండి శివసుబ్రహ్మణ్యం ప్రమాదాన్ని గురించి కారులో నుంచి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేశాడు. ఈ విషయం తెలియని గ్రామస్థులు కాలువలో కొట్టుకుపోతున్న కారును తాళ్ల సహాయంతో వెంటనే బయటకు లాగారు. కారు బయటకు వచ్చేసరికి నాలుగు డోర్లు తెరిచి ఉండటంతో అందులో ఉన్నవారు గల్లంతయ్యారని అనుమానించారు. విషయం తెలుసుకున్న నిడదవోలు సిఐ ఎం బాలకృష్ణ, పట్టణ ఎస్సై ఎస్ సతీష్, రూరల్ ఎస్సై కె నరేంద్రలు సంఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక అధికారులకు విషయం తెలిపారు. అగ్నిమాపక అధికారి కె శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ టీముతో బోటుపై గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి డ్రైవరు శివసుబ్రహ్మణ్యం రూరల్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు ఎస్సై కె నరేంద్ర తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు చెప్పారు.