పశ్చిమగోదావరి

కరుణిస్తున్న వరుణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: రుతుపవనాల ప్రభావంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతాంగానికి గత కొంతకాలంగా అవి నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. గతంతో పోలిస్తే ఈసారి పూర్తి అనుకూలమైన పరిస్థితులు వుంటాయని వాతావరణ శాఖ పేర్కొన్నా దానికి అనుగుణంగా పరిస్థితులు కనిపించకపోవడంతో రైతాంగంలో నిరాశ కనిపించింది. అయితే గత కొద్దిరోజులుగా మాత్రం వరుణుని కరుణ రైతాంగంలో ఆశలు చిగురించేలా చేసిందనే చెప్పాలి. అల్పపీడనాల ప్రభావం వరుసగా జిల్లాపై గట్టిగానే కనిపించడంతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. గత రెండ్రోజులుగా భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగానే నమోదయ్యాయి. శుక్రవారం కూడా అదే స్థాయిలో వర్షాలు కురిసాయి. ఈ పరిస్థితులతో వ్యవసాయ పనులను రైతాంగం మరింత ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. గోదావరి డెల్టాలో పరిస్థితి ఒకరకంగా వుంటే యధా ప్రకారం కృష్ణాడెల్టా పరిధిలో మాత్రం ముందునుంచి నిరాశే కొనసాగుతూ వస్తోంది. ఆ డెల్టాకు శివారున వుండటంతో కృష్ణాపరిధిలోని భూములకు ఆశించిన స్థాయిలో తాగునీరు అందలేదు. దీనితో ఎప్పటిలానే ఈ పరిధిలోని రైతాంగం వర్షాధారంగానే వ్యవసాయ పనులు ప్రారంభించారు. వారికి ప్రధానంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు కీలకంగానే నిలుస్తున్నాయని చెప్పాలి. చాలా చోట్ల కొంత అనుమానంతో వెనుకాడుతున్న రైతాంగానికి సాగుపై ధీమాను ఈ వర్షాలు అందించాయని చెప్పవచ్చు. జిల్లా పరిధిలో కృష్ణా డెల్టా పరిధిలోకి సుమారుగా 58 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. దీనిలో కొంత పరిధిలోని భూములకు పోలవరం కుడికాలువ కారణంగా కొంత వరకు పరిస్థితి మెరుగ్గా కనిపించినా వ్యవసాయ అవసరాల స్థాయిలో సాగు జలాలు అందుబాటులోకి రాకపోవడంతో ఆ పరిధిలోనూ కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ తాజా వర్షాలతో కృష్ణా డెల్టా రైతాంగానికి కొంత మేరకు ఊరట లభించిందని చెప్పాలి. ఇక ప్రభుత్వం ఈసారి ముందస్తు ఖరీఫ్‌కు ప్రణాళిక చేసి మరీ జూన్ 1వ తేదీనే కాలువలకు నీరు విడుదల చేసింది. ఆ తరువాత నుంచి వ్యవసాయ పనులు ముమ్మరం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ ప్రకారం ముందుకు వెళితే సాధారణంగా తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలోగా పంట చేతికి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఈ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లారు. అయితే జిల్లావ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే ఆశించిన స్థాయిలో కాలువల్లో మట్టాలను నిలబెట్టలేకపోవడంతో వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. అందువల్లే జూన్ 1న నీరు విడుదల చేసినా ఆగస్టు రెండవ వారం వరకు కూడా కొన్ని పరిధుల్లో నాట్లు సాగుతూనే ఉండటం గమనార్హం. దీనితో జిల్లా యంత్రాంగం ఈ అంశాన్ని సీరియస్‌గానే పరిగణనలోకి తీసుకుని అనుకున్న సమయంలోగా నాట్లు పూర్తి చేయలేకపోతే పూర్తి ఆయకట్టుకు అవసరమైన స్థాయిలో సాగునీరు అందించడం కష్టసాధ్యమన్న అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ఇలాంటి నేపధ్యంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు రైతాంగంలో మరికొన్ని ఆశలను చిగురించేలా చేసిందని చెప్పాలి. ఈ వర్షాలతో అక్కడక్కడ కొంత వెనుకడుగు వేస్తున్న రైతాంగం ఉత్సాహంగా ముందుకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితులు మరికొద్దిరోజులపాటు కొనసాగే అవకాశముండటంతో ఈసారి గతంతో పోలిస్తే ఉత్సాహ భరితమైన వాతావరణంలోనే ఖరీఫ్ సీజన్ ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తోంది. కాగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో పలుచోట్ల నీరు నిల్వ వుండిపోయి దుర్బరపరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు అపారిశుధ్ధ్య పరిస్థితులు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.