మెయన్ ఫీచర్

సంప్రదాయ చికిత్సకు వాణిజ్య ‘గ్రహణం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దమయంతీ స్వయంవరము’ అనే సాంఘిక నవలను కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1960వ దశకంలో రచించాడు. ‘ప్రపంచీకరణ’ వల్ల భారతీయత భంగపడుతుండడం అందులోని ఇతివృత్తం! భారతీయ సంప్రదాయ వైద్య చికిత్సకులు అణన్నర-తొమ్మిది నయాపైసలు-తో తయారుచేయగల మందును ‘అల్లోపతి’ మందుల సంస్థలు పది రూపాయలకు అమ్మడం గురించి ‘కవిసమ్రాట్’ వాపోయాడు! ‘ఆ మందు తెచ్చుకో అని వ్రాస్తాడు అల్లోపతి వైద్యుడు-ఆ సీసా వెల తొమ్మిది రూపాయల పద్నాలుగున్నర అణాలు. అంటే ఏమిటో తెలుసునా? మనం పది రూపాయలంటే భయపడతామేమోనని, తొమ్మిది రూపాయలే అనుకోవాలని వాడట్లా పెడతాడు..’ ‘..ఇంతా చేస్తే అది బోడమాకు రసం. ఆ సీసాలోని మందు అణాన్నర కంటే ఎక్కువ చేయదండి, దాన్ని పదిరూపాయలు పెట్టి కొనాలండీ!.’ ‘వావింటాకో, గుంటగలగరాకో, గల్జేరాకో, రుద్రజడమో, నాగసార మట్టో, మెట్ట తామరో ఇప్పుడు మన దొడ్లలో దొరకడకం లేదనుకోండి, కాల్వగట్ల మీదనైనా దొరుకుతుంది కదా! పూర్వం ఇవన్నీ ఇంగ్లాండ్‌కు వెళ్లేవి. అక్కడ వాళ్లు ఆధునిక ప్రకృతి శాస్త్ర పరమ సిద్ధాంతానుసారంగా శుద్ధిచేసి వానినౌషధీకరించి మళ్లీ మనకు పంపిస్తారు...’
‘కవిసమ్రాట్’ ఈ రచన చేసిన నాటికి ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-మన నెత్తికెక్కలేదు. 1948 నాటినుంచి ‘వాణిజ్యం, సుంకాల సాధారణ వ్యవస్థ’-జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్-గాట్-ఏర్పడి ఉన్నప్పటికీ, 1994 తరువాత మాత్రమే ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతమైంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్టుగా ‘గ్యాట్’ ప్రపంచ వాణిజ్య సంస్థ-వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డబ్ల్యుటిఓ-గా రూపాంతరం చెందింది. ‘ప్రపంచీకరణ’ నిజానికి బంగారు జింక, మాయల మారీచ మృగం. ఏమైనప్పటికీ విశ్వనాథ వారు జీవించిన నాటికి ప్రపంచీకరణ జరగలేదు, పాశ్చాత్య వాణిజ్య దురాక్రమణ మాత్రమే మన వైద్యరంగాన్ని ఆవహించి ఉండేది. పాశ్చాత్య వాణిజ్య దురాక్రమణకు సహజమైన విస్తృతి ‘ప్రపంచీకరణ’!
పాశ్చాత్య దేశాలకు తోడు చైనా మన దేశంలోకి చొరబడిపోవడం ఈ విస్తృతిలో భాగం! గణపతి బొమ్మలు కూడ చైనానుండి దిగుమతి కావడం ఈ మహా విస్తృతి. విశ్వనాథ వారు చెప్పిన గుంటగలగరాకు, వావిలాకు వంటి ఓషధీ పత్రాలతో వినాయకుడ్ని మనం పూజిస్తున్నాము! ఇలా వైద్యం జీవించే పద్ధతిలో భాగమైంది! ఏడాదికోసారి ‘ఏక వింశతి’ పత్రాలతో ‘బొజ్జ దేవర’ను అర్చించడం వల్ల మన శరీరాలు ఆరోగ్యవంతం అవుతున్నాయి. ఈ ఇరవై ఒక్క మొక్కలు, వాటి ఆకులు ఓషధీరసాల మూలికలు! ప్రకృతిలో మానవుడు సహజంగా నిహితమై ఉన్నాడు. ఈ వాస్తవాన్ని అనాది భారతీయుడు గుర్తించాడు. అందువల్లనే భారతీయ జీవనం సృష్టినిహిత ‘సమన్వయ’ ప్రస్థానం అయింది, అవుతోంది. ఈ వాస్తవాన్ని గుర్తించని, గుర్తించలేని పాశ్చాత్యులు, ‘మానవుడు ప్రకృతిలో భాగం కాకుండా ‘సమాంతరం’గా జీవిస్తున్నాడన్న’ కృత్రిమ సిద్ధాంతాన్ని సృష్టించారు! ప్రకృతిలో మానవుని సమన్వయ జీవనం సహజ వైద్యం, సనాతన వాస్తవం! ఈ సమన్వయ జీవనుడైన భారతీయుడు పుట్టను, గుట్టను, కొండ గట్టును, చెరువు కట్టను ప్రేమిస్తున్నాడు, పూజిస్తున్నాడు! తాను ప్రకృతిలో, సృష్టిలో అవిభాజ్యమైన వ్యవస్థ అని గుర్తించిన భారతీయుడు ప్రకృతిగా మారి ప్రకృతిని పరిరక్షించాడు! ‘శివోభూత్వా శివం యజేత్..’-శివుడుగా మారి శివుడిని అర్చించాలి-అన్నది సనాతన హైందవ జాతీయ జీవనం! ప్రకృతి పంచభూతాల సమాహారం, మానవుడు పంచ భూతాలకు సమాహారం! అందువల్లనే ప్రకృతితో సమన్వయ జీవనుడు ప్రకృతిని ఎన్నడూ గాయపరచడు, ఫలితంగా తాను గాయపడడు, రోగగ్రస్తుడు కాడు! ఇదీ భారతీయ వైద్య విధాన వౌలిక తత్త్వం.. ‘పంచ భూత భాసిత ప్రకృతి కళనె సన్నిహిత లక్ష్యమని యెవచస్వి...’ అన్న మహాకవి రాయప్రోలు సుబ్బారావుఈ సనాతన సత్యాన్ని మరోసారి ఆవిష్కరించాడు! కానీ ప్రకృతికి మానవుడు సమాంతర జీవనుడని భ్రమించిన పాశ్చాత్యులు ప్రకృతిపై దాడి చేసారు, గాయపరిచారు! గాయపడిన ప్రకృతి ‘రోగగ్రస్త’ అయింది, మానవులను రోగగ్రస్తులను చేసింది. రోగగ్రస్తుడైన మానవులు కృత్రిమ చికిత్సలకు పూనుకొనడం పాశ్చాత్యుల వైద్యం. ఈ కృత్రిమ చికిత్సకు బుద్ధి మాత్రమే ఉంది, హృదయం లేదు. అందువల్లనే పాశ్చాత్య వైద్యం భారతీయులను కొల్లగొడుతోంది, దోచుకుంటోంది! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చొరబడిపోయి ‘వాణిజ్య వైద్యశాలల’-కార్పొరేట్ హాస్పిటల్స్-ను ఏర్పాటు చేయడం దోపిడీకి పరాకాష్ఠ! ఇదీ భారతీయతను ‘ప్రపంచీకరణ’ గాయపరుస్తున్న తీరు..
హరిత పత్రాలతో, గరికెతో, సుగంధ సుమాలతో వరసిద్ధి వినాయకుడిని పూజించడం, తొమ్మిదిరోజులపాటు లేదా ఐదురోజులపాటు ఈ పచ్చని ఆకుల సంపర్కానికి, స్పర్శకు, పరిమళానికి లోనుకావడం రుగ్మతలకు దూరం చేయగల ప్రాకృతిక వరం. గణేశుడు ప్రకృతికి ప్రతీక, పంచ భూతాలలో ఒకటైన భూమికి ప్రతిరూపం! మట్టితో వినాయకుని విగ్రహాన్ని నిర్మించుకుని పూజించడం ఈ మట్టి పట్ల మనకు గల మమకారానికి సాక్ష్యం! మట్టి పట్ల మనకు గల మమకారం దేశభక్తి. మట్టి మాతృభూమి! అందువల్ల దేశమంటే మట్టి! మట్టి స్వరూపం, ప్రజలు ప్రాణం, సంస్కృతి ఆత్మ! ఇదీ ‘జాతి’! అందువల్ల భూమాతకు ప్రతి రూపమైన ‘గణపతి’ని పూజించడం భూమాతను, మాతృభూమిని అర్చించడమే! మట్టి గణపతిని మట్టినుండి పుట్టిన ‘గరికె’తో పూజించడం ప్రకృతి వైద్యం. ‘గరికె’ అమృత సంజీవనీ రసగుళిక! ‘గరికె’ రసం, ‘తులసి’ రసం తాగడం భారతీయ వైద్యంలో భాగం! ‘గరికె’ ప్రగతికి చిహ్నం. ‘దూర్వాయుగ్మం’-గరికెల జంట- దంపతులకు ప్రతీక! ‘గరికె’ కాండం నుంచి మరో ‘గరికె’ రావడం అంకురించినట్టుగా-కాండాత్ కాండా ప్రరోహన్తి- దంపతుల సంతతి నిరంతరం వర్ధిల్లాలన్నది వేదద్రష్టల ఆకాంక్ష! ‘గరికె’ భూమి స్వచ్ఛతకు ప్రతీక, ప్రకృతి స్వస్థతకు పతాక! గరికె గడ్డిని మేసిన ఆవుల పాలు అమృతము.. గరికె దళాలు-దూర్వాయుగ్మాలు-నిండిన ధరణి సమృద్ధికి సంకేతం.
‘నీ నడిచెడు దారి వెంట
గరికె పూలు పూయుగాక
నీ ఇంటికి వెనుక, ముందు
నీటి కొలనులుండుగాక,
కొలనులందు కమల పుష్ప
పరిమళములు విరియుగాక’’
అన్నది వేదద్రష్టలు ఆవిష్కరించిన ఆకాంక్ష. ‘అయనే తే పరాయణే దూర్వా రోహన్తు పుష్పిణీ, హృదాశ్చ పుండరీకాణి..’ ఇదంతా భారతీయ వైద్యం, సహజ జీవన సంప్రదాయం! ఈ సంప్రదాయాన్ని పాశ్చాత్య వైద్యం భగ్నం చేసింది, ‘ప్రపంచీకరణ’ తుదముట్టిస్తోంది! గరికె-గరిక-పెరగని ‘సిమెంట్’ కట్టడాల ప్రాంగణాలలో కాలుష్యం కొలువు తీరుతోంది. ఈ కాలుష్య వాటికలు వాణిజ్య వైద్య శాలలు, ఈ కాలుష్యం నిర్లక్ష్యం, ఈ కాలుష్యం అవినీతి, ఈ కాలుష్యం వైద్యుల స్వభావంలో గూడుకట్టుకున్న క్రౌర్యం, జాలిలేని తనం! వందల వేల పరీక్షలు, శస్త్ర చికిత్సలు అనవసరంగా జరిగిపోతున్నాయన్నది అనేక అధ్యయనాల ద్వారా ధ్రువపడిన వాస్తవం! ఒక ‘గోలీ’ మింగితే చాలునని తెలిసిన అల్లోపతి వేత్తలు పదిమాత్రలు కొనిపించి మింగిస్తున్నారు! ఒకాయనకు బ్రహ్మచెముడు వచ్చేసింది.. ‘ఎందుకొచ్చిందండీ..’ అని అడిగితే మితిమీరిన సంఖ్యలో పెన్సిలిన్ ఇంజెక్షన్‌లు పొడిపించుకున్నాడట! ఒకాయనకు దీర్ఘకాల చర్మవ్యాధి, ఎందుకంటే ‘బికాంప్లెక్సో’ మరేదో ‘కాంపౌండో’ అతిగా ఆయన దేహంలోకి చేరిపోయిందట! రక్తప్రసరణ సాఫీగా జరగడానికో, రక్తశుద్ధికో ‘అల్లోపతి’ మాత్రలు మింగిన కొందరి గుండెలు హఠాత్తుగా ఆగిపోయినట్టు ప్రచారమైంది! ఇవన్నీ స్వల్ప విషయాలు!
ప్రపంచీకరణ వ్యవస్థ నడికొన్న తరువాత, కార్పొరేట్ ఆసుపత్రులు కొలువు తీరిన తరువాత భయంకరమైన మందులను విదేశాల నుంచి మోసుకొచ్చి రోగాలను పెంచుతున్నాయి! ‘ఏమండీ.. రోగం కుదిరిందా..?’ అన్నది ‘అల్లోపతీ’గారు వ్యాధిగ్రస్తుని అడిగిన ప్రశ్న! ‘ఆ.. నయమైందిలెండి..’ అన్నది జవాబు! ‘ఓహో! నా చికిత్స వల్లనే కదా!’ -బికాస్ ఆఫ్ మైట్రీట్‌మెంట్-అని డాక్టరుగారు మురిసిపోయాడు! ‘కాదండీ బాబూ! మీరు చికిత్స చేసినప్పటికీ -ఇన్‌స్పయిట్ ఆఫ్ యువర్ ట్రీట్‌మెంట్-నాకు జబ్బునయమైంది..’ అని మాజీ రోగి ముక్తాయింపు పలికాడట! నిర్లక్ష్యం, క్రూరత్వం కొలువుతీరిన వాణిజ్య వైద్యశాలల ప్రాంగణాలలో గడపల వద్దనే గర్భవతులు ప్రసవిస్తున్నారు, ఆక్సిజన్ దొరకక నవజాత శిశువులు మొగ్గలుగానే రాలిపోతున్నారు! మహాకవి గుఱ్ఱం జాషువా ఊహించిన ‘్భయంకర ఖేద తమాల వాటికలు..’- కార్పొరేట్ వైద్యశాలలు! శ్రీశ్రీ కనిపెట్టిన ‘యముని మహిషపు లోహపు గంటలు..’ మారుమోగుతున్న చీకటి శిబిరాలు ఈ వైద్యశాలలు!
శ్రీశైలం అడవుల్లో కట్టెలు కొట్టుకుంటుండిన ఒక వనవాసికి గొడ్డలి తగిలి పాదం తెగింది. స్పృహ తప్పింది, కొంతసేపటికి తేరుకున్న ఆ గిరిజనుడు రక్తసిక్తమైన పాదాన్ని ఈడ్చుకుంటూ పడుతు లేస్తూ ఇంటిదారి పట్టాడు. చీకటి పడింది, దారి కూడ కనిపించలేదు, దారిపొడవునా పొదలకు, ఆకులకు, తీగలకు గాయపడిన పాదం తగులుతూనే ఉంది! కొంతసేపటికి నొప్పి తగ్గింది, చాలా సేపటికి ఇల్లు చేరాడు! భార్య వచ్చింది, దీపం తెచ్చింది! గాయం అయిన పాదం వైపు చూసారు, గాయం లేదు, రక్తపు మరకలు మాత్రమే ఉన్నాయి! గాయం ఎలా మానింది? గాయాన్ని అంత త్వరగా మాన్పగల ఆకులు, తీగలు అడవిదారిలో ఉన్నాయి! ఎప్పుడో జరిగిన ఈ వాస్తవం ఇప్పుడు కూడ వినబడుతోంది.. ‘ప్రపంచీకరణ’ ఈ వాస్తవాన్ని మింగేసింది. అడవులను, దేశాన్నీ మింగడానికి నోరు తెరుస్తూనే ఉంది!

-హెబ్బార్ నాగేశ్వరరావు