రాజమండ్రి

మంకు వారి ముచ్చట ‘మయూర వాహన శతకం’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిలోని భక్తితత్వం పోటీపడి ప్రేరణ ఇచ్చింది. కవిలోని కవిత్వ సారం పొంగి శతక రచనకు నాంది పలికింది. అవాజ్యమైన కృపను కురిపించే భగవంతుడ్ని ఎలా కొలవాలో మనిషి ఆరాట పడతాడు. అనురాగ పూరితుడైన దేవుడ్ని అక్షరాలతో పూజించటానికి తనలోని భావాలను నిలపటానికి కీర్తించి స్తుతి గానం చేశారు కవి మంకు శ్రీను. కుమారస్వామికి ‘మయూర వాహన శతకము’ పుస్తకం. భక్తి కులంలో ఇప్పటికే తన ఆధ్యాత్మిక శక్తితో ఎన్నో పద్యాలను పుస్తక రూపంలో ప్రకటించి భక్తి జనహృదయాలకు దగ్గరయ్యారు మంకు శ్రీను.
మయూరమంటే నెమలి ఎంత అందమో శబ్దార్థం కూడా అంత అందంగా ఉంటుంది. బహుశా చిన్నప్పుడు ఆ అందానికి సమ్మోహనమై నెమలి ఫించాలు పుస్తకాల్లో దాచుకొని మురిసిపోయిన బాల్యాన్ని ఎలా నెమరు వేసుకుంటామో ఇందులో పద్యాలు చదువుతుంటే మనసులో అంతలా దాచుకుంటారు. కవిగారు మయూరమనే పేరు పెట్టడానికి ఇంకా ఎన్నో ఆకర్ష ప్రకరణలున్నాయి. ఛందస్సులో వన మయూరము అనే పేరు ఉంది. సప్తస్వరాల్లో ఒకదానికి ‘షడ్జమం’ అనే పేరు ఉంది. దానికి నెమలి కంఠ ధ్వనిని తీసుకొని ఆ పేరు పెట్టారు. నాట్యంతో మది దోచుకొనే నర్తకులను ‘నాట్య మయూర’ బిరుదులిస్తుండటం చూస్తూనే ఉంటాం. నెమలి నడకలోని వయ్యారం అది పురివిప్పి చేసే నృత్యం ఎంత సొగసుతనంతో ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే.
భక్తి పారవశ్యంతో పాఠకుల్ని తన్మయ ముద్రలోకి పంపే ఎన్నో కవితాంశలు పుస్తకం నిండా కన్పిస్తాయి. ‘నేనొక తేటినై సతము నీ పద పద్మ మరంద మానెదన్‌ల / నేనొక పువ్వునై సతము నీ గళసీమల నివ్వటిల్లెదన్ / నేనొక దివ్వెనై సతము నీ గుడి లోపల వెల్గులీనెదన్ / నేనొక వర్ణమాలనయి నిన్ను మతింతు మయూర వాహనా!’ ఈ పద్యాన్ని భక్తితత్వంలో ఎంత మమేకమైపోయి కొలుస్తున్నాడో కవి. కవి భావనలోని గొప్పతనమేకాదు భక్తుని అంతరంగాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు. ‘నీ కొఱకై మనోభవుడు నీఱయిపోయెనదేమి చోద్యమో / నీ కొఱకై సదా శివుడు నిష్ఠుర దీక్ష పరిత్యజించెన / య్యోకుమిలెన్ వెసన్ రతి వియోగ విషాద నిరుద్ధకంఠియై / నీ కొఱకై తపించె ధరణీ ధరపుత్రీ మయూర వాహనా!’ శివతత్వాన్ని బాగా ఒంట పట్టించుకొన్న కవి కనుకనే ఆ అంశలోని వినాయకుణ్ణి అలాగే అమ్మపైన ఇప్పుడీ కుమారస్వామిపైన భక్తిప్రపత్తులతో ఆరాధించారు. శివునిపై ఒక శతకం రాస్తే, అమ్మపై అనురాగ పూరిత భక్తి మెండు. అందుకే మూడువందల పద్యాలు రాశారు. వినాయకునిపై ఒక శతకం రాశారు. కవి శ్రీను రాసిన ఈ శతకంలోని పద్యాలు చదివి తన గురువు గారైన డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్ ఒక మాటంటారు. పుస్తకం ముందు మాటలో విద్యా దదాతి వినయమ్ అన్న మాటకు సజీవమైన ఉదాహరణ ఈ మంకు శ్రీను. ఇతనిలో ఉన్న ఒక గొప్ప ప్రత్యేకత ఏమంటే ఒకే సమస్యకు ముప్పది నలుబది రకాల పూరణలు చేస్తుంటాడు. శతవధానులు, సహస్రావధానులు కూడా ఈ పూరణలు చూసి ఆశ్చర్యపోవలసిందే. ఈ కవి పూరణలేని ఆకాశవాణి సరసవినోదిని కార్యక్రమం దశాబ్దాలుగా ఒక్కటి కూడా లేదంటే స్తవం కాదు ముమ్మాటికీ వాస్తవం’. అని శిష్యుని ప్రతిభను గొప్పగా చెప్పారు. గురువు గారు సహస్రావధాని. ఎవర్నీ బట్టిగా పొగిడేయరు. కారణం కవిలోని విద్వత్తుని చూసే శిష్యుడ్ని అంతగా పొగిడారు.
పద్యం మనకు మాత్రమే సొంతం. మరొకరెవరికి లేని గొప్ప ‘ప్రక్రియ’. దాన్ని అంది పుచ్చుకొని ఇంత రసరమ్యంగా దేవున్ని స్తుతించటానికి తన కవితాధారను కురిపిస్తున్న కవి మంకు శ్రీను ధన్యులే. ఇంత గొప్పగా రాయటానికి కారణం ప్రాచ్య కళాశాల (ఒరియంటల్ కాలేజీ)లో చదవడం. ఛందోబద్ధంగా రాయడంతోపాటు ధ్వని ప్రధానమయిన శ్రావ్యత పద్యంలోనే దక్కుతుంది. అనుప్రాసలు, యతి ప్రాసలు, శే్లషలు పద్యం బిగువును పెంచుతాయి. అంత పటుత్వంతో కవిగా అనేక పద్యాలు రాసారు. అయితే ఇక్కడొక విషయం నేర్చుకున్న వాళ్లు వ్రాసే వాళ్లు గతించిన తర్వాత కొత్త వాళ్లు ఎవ్వరూ రారు. ఎందుకంటే ప్రాచ్య కళాశాలల్ని ఎత్తేశారు. పండిట్లు, తెలుగు టీచర్లు వలన పద్యం బతకదు. ఒక్క పద్యమే కాదు తెలుగుభాష మనుగడ ప్రమాదస్థితిలో పడింది. అక్షర దోషాలు, ఉచ్ఛారణా దోషాలు తెలుసుకోకుండానే విద్యార్థి లోకం ముందుకుపోతుంది. ప్రభుత్వాలకు భాష మీద ప్రేమేలేదు కనీసం అభిమానం లేదు. మాతృభాషలో ప్రావీణ్యత ఉంటే మిగతా భాషలు నేర్పడం పెద్ద కష్టంకాదు. ఇంగ్లీషు మోజులో తూతూమంత్రంగా నాలుగు ముక్కలు నేర్పి వదులుతున్నారు. వాళ్లు (విద్యార్థులు) రెండికి చెడ్డ రేవడిగా మారుతున్నారు.
కవి మంకు శ్రీను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కనుక ఈ ప్రస్తావన అనివార్యమయింది. నిబద్ధత గల కొంతమంది ఉపాధ్యాయులు ఇలా పద్యాన్ని, భాషను రక్షిస్తున్నారు. భాషను బతికించలేకపోతే పోయారు భాషను చంపేయకండని భాషా ప్రేమికులు కోరుతున్నారు.
పద్యం సులువుగా అర్థం అయితే ఎవరు నేర్చుకోరూ? అభిలాషను పెంచేలా ప్రయత్నిస్తే అది సాధ్యమే. ఆ దిశగా కృషిచేస్తే మంచి కావ్యాలే మరిన్ని వస్తాయి. సుమతి, వేమన పద్యాలు రాని తెలుగు బిడ్డలు ఈనాడు ఎంతోమంది ఉన్నారు. భాష వల్ల విషయ స్పష్టత ఆత్మ విశ్వాసం నైతికత కలుగుతాయి. బాగా చదువుకున్న వారు సాంప్రదాయ వాదులు సాహితీకారులు పండితుల మధ్యే కాక ‘శతక రచన’ ఆధ్యాత్మికతకే పరిమితమై పోకూడదు.
అందరికీ చేరే అవకాశం కుచించుకుపోతుంది. ఇప్పటికే కవి, ఉపాధ్యాయులు మంకు శ్రీను ఎన్నో ఆధ్యాత్మిక రచనలతో పాఠకులకు చేరువయ్యారు. పర్యావరణం మీద, విద్యారంగ లోపాల మీద, సాంఘిక రుగ్మతల మీద, సామాజిక సమస్యల మీద దృష్టిసారిస్తే ఆయన కలం సమాజానికి ఊతం అవుతుంది. కవి సమాజ ఉద్ధారకుడు మంచిని కోరతాడు ఉత్తమ మార్గాన్ని సూచిస్తాడు. అలా దైవిక భావనలు మనలో చేరి ఆధ్యాత్మిక శక్తితో కవి ఆహ్లాద భరితుల్ని చేశారు. ఇంకా మేలుకరమైన రీతులతో మానవీయ రచనలు మరిన్ని చేస్తారని ఆశిద్దాం.
ప్రతులకు:
మంకు శ్రీను
కొప్పర్రు, నరసాపురం (మం)
ప. గో. జిల్లా
పేజీలు: 56, వెల: 80/-
సెల్: 8985990215

- రవికాంత్, సెల్: 9642489244