భక్తి కథలు

వైదికమతోద్ధారకుడు విద్యారణ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బౌద్ధమతంలోని మంచి సిద్ధాంతాలను చేర్చి, అద్వైత మత స్థాపనాచార్యుడైనాడు ఆది శంకరుడు. తూర్పున జగన్నాథంలో ‘‘గోవర్ధన మఠం‘‘, పశ్చిమాన ద్వారకలో ‘‘శారదామఠం’’, ఉత్తరాన కేదారంలో ‘‘జ్యోతిర్మఠం’’, దక్షిణాన శృంగేరియందు ‘‘శృంగేరి మఠం’’ స్థాపించి మత కార్యనిర్వహణార్థం దేశం నలు చెరుగులా సంచరించి, అద్వైత తత్వాన్ని వివరించి, దిగ్విజయ యాత్ర కొనసాగించారాయన. ఆది శంకరుని అనంతరం అంతటి వారిగా పేరెన్నికగన్నది విద్యారణ్య స్వామి. విఖ్యాత పురుషుడు, మహాయోగి, మహామతి, కవి, తాత్వికుడు, ద్రష్ట, వేదత్రయ భాష్యకర్త, సాంఖ్యశాస్త్ర రహస్యజ్ఞుడు, బ్రహ్మవిద్యా పారాయణుడు, శ్రౌతస్మార్త క్రియా పరుడు, వేదాంత శాస్త్రాది రచయిత, శతాధిక గ్రంథకర్త, విశేషించి విజయనగర మహా హిందూ సామ్రాజ్య నిర్మాత, రాజ్యోద్ధాకుడు, మహామంత్రి, హిందూ మతోద్ధారకుడు, విరూపాక్ష పీఠ స్థాపకుడు, శృంగగిరి పీఠాధిపతియై జగత్ప్రసిద్ధి నొందారు
విద్యారణ్య స్వామి. 1267లో జన్మించి, 1331లో సన్యాసము స్వీకరించి, శృంగేరీ పీఠాధిపత్యం వహించి, 1386లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశినాడు సిద్ధిపొందారు విద్యారణ్యులు. ఉత్తర హిందూదేశమంతా మహమ్మదీయుల వశమై, అన్య మతస్తుల ఆధిపత్యం అధికమైన పరిస్థితులలో శంకరుని తర్వాత అంతటివాడైన ప్రాజ్ఞత గలిగిన విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్య నిర్మాతయై, సామ్రాజ్య రక్షకుడై భరత జాతిని జాగృత పరిచేందుకు అహరహం శ్రమించి, విశేష కృషి సల్పి, లక్ష్య సాధనలో సిద్ధిపొందారు. బలవంత మతాంతరీకరణవల్ల మతం మారిపోయ తిరిగి, హిందూ మతంలోకి రావాలనుకునే వారికి కల్పవృక్షమై నిలిచారాయన. తమకు ముందున్న శృంగేరీ పీఠాధిపతులు విద్యాతీర్థుల అనుమతితో, శృంగేర పీఠానికి అనుబంధంగా విరూపాక్ష, పుష్పగిరి, శివగంగ, ఆమని, సంకేశ్వర, కొల్లాపుర పీఠాల స్థాపనలు గావించి, తద్వారా హిందూ మత దీక్షలు ఇప్పించి, విమతాల బాధితులకు ఆశ్రయ దాతయైనారు. పరాశర మాధవీయమనే స్మృతి గ్రంథంలో తమ గూర్చి చెప్పుకున్నారు.
శ్రీమతి, మాయణునిల తనయుడై, సాయణుడు, భోగనాథుడులిరువురు సోదరులు, సింగల సోదరిని కలిగి, కృష్ణ యజుర్వేది, బోధాయన సూత్రుడు, భారద్వాజ సగోత్రుడు, మాధవ జన్మనామం కలిగి, సన్యసించి విద్యారణ్య నామధేయులైన స్వామి, బాల్యమున విద్యాభ్యాసం నాటికి దక్షిణ భారతాన ఆర్ష మత పరిస్థితి శోచనీయమై, వేద శాస్త్రాలు అడుగంటి, శ్రౌత స్మార్త విద్యలు భ్రష్ఠమై, ఉపనిషణ్మతం పెడత్రోవలో పడి, మతం పలు శాఖలుగా చీలిన పరిస్థితులలో విద్యారణ్యుడు అవతరించి వేద మతాన్ని ఉద్ధరించాడు. జాతిని ఉత్తేపరిచిన మహనీయుడైన విద్యారణ్యుడు బ్రహ్మైక్యం పొందిన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిని శృంగేరీలో వలెనే ప్రతి చోట స్మరణ, పూజ తప్పక జరగాల్సి ఉంది.
ధర్మపురితో విద్యారణ్యుల అనుబంధం
1336లో విజయ నగర సామ్రాజ్య రాజధానియగు విజయనగరాన్ని నిర్మించి, శృంగేరీ పీఠమధిష్ఠించిన పవిత్రాత్ములకు ధర్మపురి క్షేత్రంతో విడదీయ జాలని సంబంధం, అనుబంధం ఉన్నాయి. ప్రాచీన ఆర్షవిద్యా, సంస్కృతులకు కేంద్రస్థానమై, వేద విద్యకు కాణాచియై, చరిత్రకందనంత పూర్వ కాలికంగా ఉజ్జ్వల సాంస్కృతిక, వైదిక, పౌరాణిక పుణ్య స్థలమై, పవిత్ర గోదావరీ తీరస్థ క్షేత్రమైన ధర్మపురితో గల సాన్నిహిత్య నేపథ్యంలోనే శా.శ.1258 (క్రీ.శ.1336) ధాతృనామ సంవత్సర వైశాఖ శుక్లపక్ష సప్తమి పుష్యమీ నక్షత్ర సింహలగ్న సుముహూర్తాన విజయనగర సామ్రాజ్య స్థాపనా సమయాన, ధర్మపురికి చెందిన చతుర్వేద పండితులను ఆహ్వానించినట్లు చెప్పబడుతున్నది.
అంతేకాక ధర్మపురికి విజయ నగర రాజ్యానికి దగ్గర సంబంధం ఉన్నట్లు చారిత్రక పరిశోధకులు, బహు గ్రంథ కర్త, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య ఈ విషయంలో విశేష కృషి సల్పారు. ధర్మపురిలోని యోగ నారసింహుడు విజయనగరంలోనూ ఆరాధనీయుడైనాడు. ధర్మపురిలోని 60స్థంభాల గుడిని పోలిన వంద స్థంభాల విఠలాలయం హంపీలో ఉంది. హంపీలోని తుంగభద్రా నదిలో కోదాండ రామాలయానికి ఎదురుగా ఉన్న చక్రతీర్థం, ధర్మపురి గోదావరిలోని చక్రతీర్థాన్ని పోలి ఉంది. ధర్మపురి లాంటి కళ్యాణ, డోలోత్సవ మంటపాలు విఠలేశ్వర మందిరంలో ఉన్నాయి. కృష్ణదేవరాయల సోదరుడు వీర నరసింహ రాయలు, ఉదయమే నూటొక్క దివ్య క్షేత్రాల ప్రసాదం తీసుకోనిదే రాయలు సింహాసనం అధిరోహించే వారు కాదట. అలా నూటొక్క దివ్య తిరుపతులలో ఒకటిగా, నవనారసింహ క్షేత్రాలలో ఉతృష్టమైనదిగా ధర్మపురి ప్రసిద్ధమైనది. ధర్మపురి క్షేత్రంలో వీధివీధికీ శివలింగం, నంది, పార్వతి, గణపతి, ఆంజనేయులతో కూడిన శివ పంచాయతనాలన బడే గ్రామ రక్షక దేవతల గద్దెలున్నాయి. ధర్మపురి ప్రాంత ప్రభావితుడైన విద్యారణ్యుల ద్వారానే ఈసాంప్రదాయం ప్రబలినట్లు చెపుతారు. దక్షిణామ్నాయ శృంగేరీ పీఠ 12వ అధిపతియైన విద్యారణ్యులు ధర్మపురిలో నివసించి, వేదాధ్యయనం చేసినట్లు, విజయనగర రాజ్య స్థాపకుడై, హక్క, బుక్క సోదరులలో జ్యేష్ఠుని పట్ట్భాషిక్తుడిని చేసి, హరిహర రాయలని నామమిడినట్లు, ఇది హరిహర క్షేత్రమైన ధర్మపురి ప్రభావ ఫలితమేనని, హరిహర అభేదమైన ధర్మపురిలో నరసింహునికి, శివునికి సమాన పూజలు అనాదిగా జరుగుతూ, బ్రహ్మ, శివాంశలలో జన్మించిన ఆంజనేయుని, గణపతి విగ్రహాలు నారసింహాలయాలలో కలిగి శివకేశవాభేద తత్వాన్ని చాటుతూ, స్మార్త ఆగమ పూజారీతులతో, శైవ వైష్ణవాగమ విధానాలతో ఉభయ దేవతలు ఉపాస్యులుగా ఆచరించే సత్సాంప్రదాయం విద్యారణ్యులపై తీవ్ర ప్రభావం చూపినట్లు, అది యావద్భారతానికే ఆదర్శప్రాయమైనట్లు స్పష్టమవుతున్నది.

- సంగనభట్ల రామకిష్టయ్య 9440595494