మెయన్ ఫీచర్

తరగతి గది.. వడ్డించిన విస్తరి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లికి బిడ్డ వెలుగు. గురువుకు శిష్యుడే వెలుగు. ఈనాడు గురువులు సామాజిక స్పృహలో తడిసి వస్తున్నారు. మానవతా లక్షణాలు కూడా జీర్ణించుకుని వస్తున్నారు. తమ కళలను విద్యార్థుల ద్వారా సాధించుకోవాలనే పట్టుదల వారిలో కనపడుతుంది. ఈమధ్య ఆదిత్య అనే ఉపాధ్యాయుడు సామాజిక చైతన్యంతో ఆలోచించాడు. మురికివాడల్లో ఉండే పిల్లలను మార్చాలనే తపనతో తన జీవితాన్ని తరగతి గదికే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. విద్యార్థుల నేపథ్యం, ఆలోచనా పద్ధతి, అలవాట్లు తెలిసి ఉంటే వారిలోకి గురువు చొచ్చుకుని పోవచ్చు. మంచి ఆశయం ఉన్నంత మాత్రాన సరిపోదు. విద్యార్థుల జీవనశైలి ఉపాధ్యాయులు తెలిసుండాలి. ఆదిత్య మురికివాడల్లోని పిల్లలపై 30కి పైగా డాక్యుమెంటరీలు తీశాడు. ఆ పిల్లల ఇళ్ళల్లోకి చొచ్చుకొనిపోయాడు. ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లేముందు సబ్జెక్టు తెలిసుండటమే కాదు, విద్యార్థుల నేపథ్యం కూడా తెలిసుండాలి. తరగతి గది వడ్డించిన విస్తరేం కాదు. దీక్షతో ఆ విద్యార్థులను, వారి జీవితాలను పాఠంలా అధ్యయనం చేయాలి. అందువల్లనే ఈనాటి ఉపాధ్యాయులు తరగతి గదికి వెళ్లేముందు ఏ వర్గాల నుంచైతే విద్యార్థులు వస్తున్నారో వారి జీవనశైలిని గమనించి, వారితో కలిసి తిరిగితేనే అర్థవౌతుంది. జ్ఞానం ఎంత ప్రధానమో విద్యార్థుల నేపథ్యం కూడా అంతే ప్రధానం. ఈ నేపథ్యం నుంచి జ్ఞానాన్ని వారిలోకి అందించాలి. ఉపాధ్యాయుడు సామాజిక దృక్పథం, మానవతా లక్షణాలను అలవర్చుకుంటేనే తన వృత్తికి న్యాయం చేయగలుగుతాడు. లేకుంటే నేల విడిచి సాము చేసినట్లుంటుంది. తరగతి గది యోగసాధన లక్షణాలు కలిగి ఉంటుంది. దానికి కమిట్‌మెంట్ అవసరం. పిల్లల జీవితాల్లో వెలుగుచూసి తనలో ఉండే ఆకాంక్షలను తీర్చుకోవాలనే తపన గురువుకు ఉండాలి. అందుకే ఉపాధ్యాయ వృత్తి ఒక పాషన్. అది ఒక తృప్తిని ప్రసాదిస్తుంది. తరగతి గది- చీకట్లో ఒక దీపం వెలిగిస్తుంది.
టీచర్‌కు పరీక్ష..
విద్యార్థి మన్ననలను పొందటం, వారి సాంగత్యంలో తిరగటం ఉపాధ్యాయునికి ఒక పరీక్ష. వారిని విమర్శలతో కాకుండా ప్రేరణతోనే లేక ప్రోత్సాహంతోనే వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీయవచ్చును. శిక్ష భయాన్ని సృష్టిస్తుంది. ప్రేమ ప్రతిభను పైకి తీసుకువస్తుంది. ప్రతి విద్యార్థిలో కూడా ప్రతిభ ఉంటుందని గుర్తించాలి. అది వివిధ రూపాల్లో ఉంటుంది. తరగతి గదిలో విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్ష చేయటమేగాకుండా వారి అలవాట్లు ఏమిటి? వారికి ఏ ఆటల మీద ఆసక్తి ఉన్నది? ఏ పాటలు వింటారు? ఏ విధమైన సినిమాలు చూస్తారు? టీవీలో ఏ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిపెడతారు? వీటన్నింటిపైన టీచర్‌కు అధ్యయనం ఉంటేనే పిల్లల్లో ప్రతిభ బైటకు వస్తుంది.
ఉపాధ్యాయులు తమ దృక్పథం నుంచి పిల్లలను బేరీజు వేయకూడదు. విద్యార్థుల కళ్లతోనే వారిని చూస్తేనే ఆ పిల్లల్లో ప్రతిభ కనిపిస్తుంది. చివరకు దినపత్రిక చదువుతున్నప్పుడు కూడా ఏ విషయాలపై ఆసక్తి చూపుతారో చూడాలి. వాటిని పాఠ్యాంశాలతో జోడించాలి. అప్పుడే వారితో సామరస్యం కుదురుతుంది, తరగతి గదిలో భాగస్వామ్యం ఏర్పడి కలిసివస్తారు. పిల్లలు నవ్వినప్పుడే పాఠం మెదడులోకి పోతుంది. రెసిడెన్షియల్ స్కూల్ అంటే ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తూ వారి స్థాయికి ఉపాధ్యాయులు దిగిరావాలి. చాలామంది ఉపాధ్యాయుల్లో వయసు ఎంత పెరిగినా పిల్లల లక్షణాలే ఉంటాయి. ఆ వృత్తికి పిల్లల లక్షణాలనే అలవర్చుకోవాలి. పిల్లల్లో ప్రతిభను గుర్తించేందుకు ప్రయత్నం జరుగుతున్నప్పుడు వారితో ఎంతగా సాంగత్యం మనం పెంచుకుంటే అంత తొందరగా తరగతి గది లక్ష్యం పూర్తవుతుంది.
గొలుసు బంధం..
‘తరగతి గది’ అనే పదంలోనే ఒక ప్రజాస్వామిక వ్యవస్థ కనపడుతుంది. ఆ సమాజమే గొప్పది. నా నిజమైన కల- ఆ బంధం. కృష్ణుడు కూడా రాముడికి క్లాస్‌మేట్‌నే. ఇది వేరే దిక్కున కనపడుతుందా? ఇది అసాధారణమైన బంధం, చాలా అరుదుగా కనపడే బంధం. రాముడు కృష్ణుడికి క్లాస్‌మేట్. కృష్ణుడు రంగడికి క్లాస్‌మేట్. అయితే రాముడు రంగడికి కూడా క్లాస్‌మేట్‌నే కదా! అనగా ఈ బంధం గొలుసు బంధం. వీటన్నింటికన్నా పవిత్రమైంది తరగతి గది అనేది పరావర్తన బంధం. ఒంటరిగా కూర్చుని ధ్యానంలో విద్యార్థి తనకుతానే పాఠం చెప్పుకుంటాడు. తనలోతానే ఒక వ్యక్తిని ఊహించుకుంటాడు. ఆ ఊహించిన మనిషే ఇతడికి క్లాస్‌మేట్ అయితే- ఊహించిన మనిషికి ఇతడు క్లాస్‌మేట్ అవుతాడు. క్లాస్‌మేట్ అనేది ఒక అద్దం. తన బంధాన్ని తాను చూసుకోవచ్చు. అందుకే తరగతి గది- సమానమైన సమాజం, ఆదర్శవంతమైన సమాజం. ఈ తరగతి గదే సమాజంలో కూడా ప్రతిబింబిస్తే ఎంత ఆనందం ఉంటుందో కదా. తరగతి సమానుల సమూహం. ‘వీడు నా క్లాస్‌మేట్’ అని విద్యార్థులు పరిచయం చేస్తారు. దాని వెనుకనున్న బంధం ఎదుటివారికి అర్థవౌతుంది. అందుకే క్లాస్‌మేట్ అన్న పదం శాశ్వతం. ఎన్నో స్మృతులకు చిహ్నం. ఎన్నో ఘటనలకు సాక్షి. అందుకే అది ఎప్పటికీ పచ్చగానే, పరిశభ్రంగానే ఉంటుంది.

-చుక్కా రామయ్య