పశ్చిమగోదావరి

అల్లూరి అవతారంలో గిరిజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 16: వరుస సమస్యలు చుట్టుముడుతున్నా ఇన్నాళ్లు వేచిఉన్న గిరిజనం ఒక్కసారిగా తిరగబడ్డారు. అల్లూరి సీతారామరాజును గుర్తుకుతెచ్చుకుని మరీ ఆయన బాటలో కదనరంగానికి దిగారు. ఏకంగా వందలు, వేలమంది గిరిజనులు ఏజన్సీ ప్రాంతం నుంచి తమ సమస్యలను భుజానవేసుకుని సిపిఎం అనుబంధసంఘాలు చేపట్టిన పోరుయాత్రను ఆసరాగా చేసుకుని భారీసంఖ్యలో ఏలూరు తరలివచ్చారు. వీరంతా కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు దిగారు. ఇటీవలకాలంలో ఎన్నడూ చూడని సంఖ్యలో గిరిజనులు ఏజన్సీ నుంచి తరలిరావటంతో ఆప్రాంగణం అంతా కిటకిటలాడిపోయింది. అధికసంఖ్యలో గిరిజనులు తరలివస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూడా కలెక్టరేట్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ముందస్తుగానే బలగాలను అక్కడ మోహరించారు. ముళ్లకంచెలు, బారికేడ్లతో సహా అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఏదశలోనైనా వారంతా కలెక్టరేట్‌లోనికి చొచ్చుకువచ్చే పరిస్ధితి రాకుండా ముందుగానే పోలీసు బలగాలను కూడా పెద్దసంఖ్యలోనే మోహరించారు. ఏదీఏమైనా సోమవారం ఉదయం నుంచి కలెక్టరేట్ ప్రాంగణం అంతా కదం తొక్కుతున్న గిరిజనులతో నిండిపోయింది. వారి నినాదాలు, డిమాండ్ల ఆ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఎన్నాళ్ల నుంచో విజ్ఞప్తులు, వినతులతో సరిపెడుతున్నా సమస్యల పరిష్కారంలో అధికారయంత్రాంగం తీవ్ర ఉదాసీన వైఖరి అవలంభిస్తోందంటూ వారంతా ధ్వజమెత్తారు. ఇక ఊరుకునేది లేదని పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈసందర్భంగా సంఘాల నాయకులు, గిరిజనులు ప్రతినబూనారు. భూమి, పునరావాసం, అభివృద్ధిలో వివక్షతలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన కుకునూరు మండలం చీరవల్లి నుండి, 11వ తేదీన పోలవరం మండలం న్యూదేవరగొంది నుండి ప్రారంభమైన రెండు పాదయాత్రలు సోమవారం ఏలూరు చేరుకున్నాయి. తొలుత నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వం కోల్పోతున్న నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం దుర్మార్గమని విమర్శించారు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులు ముంచి వారి సమాధులపై ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకోవటం దారుణమని ధ్వజమెత్తారు. ఏజన్సీలో గిరిజనులకు అనేక చట్టాలున్నాయని, ఆ భూముల రక్షణ కోసం 1/70 చట్టం, గ్రామీణ పరిపాలనకు పీసా చట్టం, పోడుభూములకై హక్కుపత్రాల కోసం అటవీ హక్కుల గుర్తింపుచట్టం ఇలా ఎన్ని ఉన్నా అవి అమలుకాకపోవటంతో గిరిజనులు, ఇతర పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజన్సీలో అన్యాక్రాంతమైన గిరిజనుల భూములు 55వేల ఎకరాలు ఉన్నాయని అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి రెడ్యానాయక్ 12ఏళ్ల క్రితం చెప్పారని, అయితే ఇప్పటికీ ఆ భూములు స్వాధీనం చేసుకుని గిరిజనులకు పంచే చర్యలు చేపట్టడం లేదన్నారు. దానికిమించి గిరిజనులు పోరాడి సాధించుకున్న భూములకు ఎటువంటి హక్కులు కల్పించకపోగా స్ధానిక రెవిన్యూ అధికారులు గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములనే పోలవరం, జల్లేరు ప్రాజెక్టు నిర్వాసితులకు భూమి కోసం సేకరిస్తున్నారని, ఈకారణంగా గిరిజనుల్లో తీవ్ర అశాంతి నెలకొందన్నారు. తాతల కాలం నుంచి పోడు నరికి సాగు చేస్తున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇవ్వటం లేదన్నారు. తక్షణం అధికారులు, నాయకులు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతెన సీతారాం మాట్లాడుతూ 2019లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈనిర్మాణంలో అత్యంత ముఖ్యమైన నిర్వాసితులకు పునరావాస చర్యలు అంతంతమాత్రంగా ఉన్నాయన్నారు. ఇంతవరకు 5శాతం మందికి కూడా పునరావాసం కల్పించలేదన్నారు. ఇప్పటికీ వారి కాలనీలకు పునాదులు కూడా వేయలేదన్నారు. దీనికితోడు విద్యార్ధుల సంఖ్య తక్కువుగా ఉందని కారణం చూపించి పాఠశాలలు, హాస్టళ్లు మూసివేసి విద్యాహక్కు చట్టానికి కూడా తూట్లు పొడుస్తున్నారన్నారు. గిరిజన యూనివర్శిటీ హామీ కాగితాలపైనే ఉందన్నారు. స్పెషల్ డిఎస్సీ జివో నెంబరు 3 అమలుకాకపోవటంతో ఏజన్సీ ప్రాంత నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ కొయ్యలగూడెం, గోపాలపురం, టి నర్సాపురం మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయకార్మికసంఘం జిల్లా కార్యదర్శి ఎ రవి మాట్లాడుతూ మెట్టప్రాంతంలో జంగారెడ్డిగూడెం, ఇతర మండలాల్లో దళితులు, ఇతర పేదలకు చెందాల్సిన సీలింగ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకుని గిరిజనులకు పంచాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ గిరిజనులు, దళితులు చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. తగిన విధంగా స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఈప్రభుత్వాలకు గుణపాఠం తప్పదన్నారు. అనంతరం జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌కు నేతలు వినతిపత్రం సమర్పించారు. సమస్యలపై ఆయనతో చర్చించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం డిఆర్వో సత్యనారాయణ ధర్నా వద్దకు వచ్చి గిరిజనుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వివిధ సంఘాల నేతలు తెల్లం నాగమణి, పి మంగరాజు, గూడిల్లి వెంకట్రావు, ధర్ముల రమేష్, చుండ్రు బుల్లెమ్మ, పిల్లి రామకృష్ణ, బొడ్డు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.