మెయన్ ఫీచర్

‘దిశ లేని’ నేతలే మనకు దిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగర మేయర్‌గా పనిచేసిన బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సైతం పార్టీకి ‘గుడ్ బై’ చెప్పేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై నిప్పులు చెరిగి బహిరంగంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఓ జాతీయ పార్టీ హైకమాండ్‌ను ధిక్కరిస్తూ జరిగిన ఇలాంటి సంఘటనలను తక్కువగా అంచనా వేయకూడదు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణదాస్ మూడు కోట్ల రూపాయలకు ఒక్కొక్క టిక్కెట్టు అమ్ముకున్నట్లు ఆ పార్టీ నాయకులే ఒక ఆడియో విడుదల చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఈ ‘వాయిస్’ను పరిశీలించాక నిజనిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ భక్తచరణదాస్ ఒక్కొక్క అసెంబ్లీ టిక్కెట్టుకు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. దానిని ‘పార్టీ ఫండ్’ అనే పేర సర్దిచెప్పుకోవచ్చు.
ఇప్పుడు ఆలోచించవలసిన ప్రధాన విషయం పార్టీ ఫండ్ వసూలు చేయడం గురించి కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం ఓ వైపు తెలుగుదేశం పార్టీతో జత కట్టడం, మరోవైపు మావోయిస్టు సానుభూతిపరులతో సాన్నిహిత్యం పెంచుకోవడం చర్చనీయాంశాలే. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రస్తుతం బెయిల్ మీద బయటపడి రాజకీయాలు చేస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని ఇటీవల తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ కేసులన్నీ నీరుకారిపోతాయని వేరే చెప్పనక్కర్లేదు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్, టంగుటూరి ప్రకాశం వంటి మహాపురుషులు నడిపిన కాంగ్రెస్ పార్టీ తన మూల సిద్ధాంతాలకు పూర్తిగా దూరమైంది.
ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ గెలువవచ్చు- ఓటమి చెందవచ్చు. ఇది అసలు సమస్యే కాదు. పార్టీ తన మూల సూత్రాలకు దూరమైన తర్వాత ఇంక దాని అస్తిత్వం ఏముంటుంది? సిపిఐకి సిద్ధాంత రీత్యా సిపిఎం సన్నిహిత పార్టీ. మరి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి ఛీకొట్టి సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం న్యాయమా? కాంగ్రెస్‌లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. చాడ వెంకటరెడ్డి, ప్రొ.కోదండరామి రెడ్డి అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ కుల సామ్యమే తప్ప సైద్ధాంతిక భావస్వామ్యం లేదు.
మనదేశంలో రాజ్యాంగం కన్నా కులం బలమైనది. దీనిని ‘అప్రకటిత రాజ్యాంగం’ అంటారు. దేశంలో విభిన్న భావజాలాలు ఉన్నాయి. అందులో ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ వాదాన్ని విశ్వసించింది. కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ సంస్కృతిని నమ్మింది. అంటే మొగలులు,గ్రీకులు, రోమనులు, బ్రిటీషువారు, చైనీయులు, పార్సీలు అందరూ వదలివెళ్లిన సాంస్కృతిక అవశేషాలను కాంగ్రెస్ స్వీకరించింది. కాంగ్రెస్‌లో హిందూ మతానికి చెందిన నేతలకు సైద్ధాంతిక నేపథ్యం ఉందా? వీరు సోనియా గాంధీ సాగిస్తున్న క్రైస్తవీకరణానికి బహిరంగంగా మద్దతునిస్తూ హిందూత్వాన్ని ద్వేషిస్తున్నారు. అనాదిగా ఈ దేశాన్ని బలహీనపరిచింది భారతీయులే. వారి దేశద్రోహాన్ని ఆసరాగా చేసుకొని విదేశీయులు ప్రవేశించి వేయి సంవత్సరాలు ఇండియన్లను బానిసలుగా మార్చారు. బైబిల్ పాత నిబంధనలో మోసెస్ అనే ప్రవక్త ఈజిప్టులో తన యూదు జాతి బానిసలుగా కట్టడాలను నిర్మిస్తూ కూలీలుగా మారటం భరించలేక స్వతంత్ర రాజ్యం కోసం సుదీర్ఘ ప్రయాణం చేశాడు. మోసెస్ చేసిన దానిలో తప్పేముంది? హిందువులు శక్తిమంతమైన స్వతంత్ర జాతిగా జీవించాలని ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ కోరుకోవటం దోషమా? మరి కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు, ముస్లింలు క్రైస్తవులు, హేతువాదులు ఈ జాతీయులు కారా?
***
సుందర్‌లాల్ తివారీ మధ్యప్రదేశలోని రేవా ప్రాంత గుర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. లోగడ పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేశాడు. ఇతని పూర్వీకులు వేద పండితులు. ప్రస్తుతం ఆయన రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని రాత్రింబవళ్లూ కృషిచేస్తున్నారు. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌పై నిషేధం విధించాలి అని తివారీ డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కమలనాథ్ వెంటనే- ‘అది సుందర్‌లాల్ తివారీ వ్యక్తిగతాభిప్రాయం. దాంతో తమ పార్టీకి సంబంధం లేదు’ అని సరిదిద్దుకున్నారు. మధ్యప్రదేశ్‌లో అధికార పీఠం నుంచి భాజపాను దించేందుకే కాంగ్రెస్ నాయకులు ఆరెస్సెస్‌పై విద్వేషం వెళ్లగక్కుతున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్‌కు మొదటి నుంచీ అసహనం ఉంది. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1948లో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాడు. ఆయన జీవితమంతా ముస్లిం సంతుష్టీకరణలోనే గడిచిపోయింది. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడానికి మద్దతునిచ్చిన వారిలో నెహ్రూ ప్రముఖుడు. 1975లో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించినపుడు ఆరెస్సెస్‌ను నిషేధించింది. 1991లో బాబరీ మసీదు కూల్చివేత సందర్భంగా అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు తిరిగి ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారు. కాంగ్రెస్ అధిష్ఠానం పీవీ చేత ఆ పని చేయించింది. మధ్యప్రదేశ్‌లో మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇపుడు భాజపాను చాలా చులకన భాషలో తిడుతున్నారు. ఇదంతా హిందూత్వపై ద్వేషమే.
కాంగ్రెస్ నేతలే కాదు, వామపక్ష నాయకులు కూడా భాజపాను, ప్రధాని మోదీని నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. ఆ మధ్య సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ‘ప్రధాని మోదీని 24సార్లు కాల్చి చంపాలి’ అన్నాడు. ఈయన గాంధీ జయంతి నాడు చికెన్ తిన్న ప్రబుద్ధుడు. ఇలాంటివారు జాతీయ రాజకీయాల్లో ఎట్లా ఉంటున్నారు? కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకులు హిందూజాతి నిర్మూలన కోసం ఎందుకు శ్రమిస్తున్నారు?? వీరు చైనాలోని బీజింగ్‌లో చర్చిని కట్టగలరా? కామ్రేడ్ నారాయణ లాహోరులో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు ప్రారంభించగలడా? అక్కడి ప్రధానిని నూటొక్కసార్లు కాల్చి చంపుతానని అనగలడా??
***
‘మహాప్రస్థానం’ కవితా సంకలనానికి పీఠిక వ్రాస్తూ రచయిత చలం- ‘కృష్ణశాస్ర్తీ బాధ ప్రపంచం బాధ- ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ’ అన్నాడు. ఈ వాక్యానికి- కృష్ణశాస్ర్తీ తన వైయక్తిక వేదనను ప్రపంచీకరణ చేశాడని అర్థం. సరిగ్గా ఇపుడు ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాగే చేస్తున్నాడు. ఆయన తన రాజకీయ అభద్రతాభావానికి అందమైన సైద్ధాంతిక నేపథాన్ని ముసుగు తొడిగాడు. కేంద్రం ధృతరాష్ట్ర కౌగిలి నుండి ఫెడరల్ వ్యవస్థలో వివిధ రాష్ట్రాలను రక్షించండనేది ఆయన నినాదం. ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలంటే మోదీని ఓడించాల్సిందే అనేది రెండవ నినాదం. వీటిని లోతుగా విశే్లషిస్తే తెలిసేదేమిటి? ఫెడరలిజం పేరుతో కేంద్రం మీదికి వివిధ రాష్ట్రాలను ‘ఎగదోస్తే’ రష్యాలో వలె ఈ రాష్ట్రాలు మరి కొంత కాలానికి ఇండియన్ యూనియన్ నుండి విడివడి స్వతంత్ర దేశాలుగా మారిపోతాయా? ఇక ఇన్‌కంటాక్స్ అధికారులు దాడులే చేయకూడదని చంద్రబాబు అంటే ఎలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిర్దోషులైతే బయటపడతారు.. లేకుంటే పెనాల్టీ సహా పన్ను చెల్లిస్తారు అంతే కదా!
ప్రధాని మోదీని అపఖ్యాతిపాలు చేయటంలో చంద్రబాబు కొంతవరకు సఫలీకృతులైన మాట నిజమే. మరి మోదీకి ప్రత్యామ్నాయంగా భావి ప్రధాని ఎవరు? శారదా- శారదీ స్కాముల్లో ఇరుక్కున్న మమతా బెనర్జీయా? అయోధ్యలో కరసేవకులైన హిందవులను తుపాకులతో కాల్చి చంపాలన్న ముల యం సింగ్ యాదవా?? నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద తిరుగుతున్న రాహుల్ గాంధీయా? చంద్రబాబు నాయుడా? ఎవరు భావి భారత ప్రధాని? కులగజ్జితో రగిలిపోతున్న దేవేగౌడలు, మాయావతులు, తమిళనాడును ఇండియా నుండి విడదీయాలనే ద్రవిడోద్యమ నాయకుడు స్టాలిన్, మహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా.. వీరా మన ప్రధాని అభ్యర్థులు?
***
ఒకాయన వైఎస్‌ఆర్ పార్టీలో ఉంటూ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు టిఆర్‌ఎస్ టిక్కెట్టుపై పోటీ చేస్తున్నాడు. ‘కూటమి’ అధికారంలోకి వస్తే మళ్లీ కాంగ్రెస్‌లోకి చేరడన్న గ్యారంటీ ఏముంది?? టిక్కెట్లు దొరకని రెబెల్స్ వేరే పార్టీ టిక్కెట్లు మీద పోటీ చేస్తే వీరు మళ్ళీ డిఫెక్ట్ కారు- అని ఎవరు చెప్పగలరు? దీనిని ‘ప్రజాస్వామ్యం’ అంటారా? సైద్ధాంతిక నిబద్ధత గల కార్యకర్తలను కిందిస్థాయి నుంచి తయారుచేసుకోవడమే దీనికి ఏకైక పరిష్కారం.

--ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్