వినమరుగైన

అల్పజీవి -రాచకొండ విశ్వనాథశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1950లకు ముందే ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్‌ల సిద్ధాంతాలు ప్రపంచమంతటా విపులంగా ప్రచలితం కావడంతో అవి తెలుగు గడ్డను కూడా సోకాయి. తెలుగు నవలకారులనూ ఆకర్షించాయి. 1953లో వచ్చిన అల్పజీవి ఆ సిద్ధాంతాలను ప్రతిబింబించడంలో ఆశ్చర్యం ఏమే లేదు.
మరి అల్పజీవిలో అంతర్హితంగా వున్న మనో వైజ్ఞానిక సిద్ధాంతం ఏమిటి? లేదా సిద్ధాంతాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం నవల చదివే వానిమీద ఆధారపడి వుంటుంది. ఎందుకంటే ఏ నవల కూడా నిర్ద్వంద్వంగా, స్పష్టంగా, అసందిగ్ధంగా శాస్త్రంలా ఉండదు. ఉండరాదు. అలా శాస్త్రంలాగో, గణితంలాగో వుంటే అది నవల కాదు. మేఘాలలోకి చూసినపుడు, చూసేవానిని బట్టి అక్కడ పులో, గడ్డం తాతో కనిపిస్తాడు. అలాగే నవల కూడా, కొంతమేరకు మేఘంలా ఉండి, పాఠకుని మనస్సు అందులోకి చొచ్చుకొనిపోయి తనకు కావలసింది వెతుక్కోవడానికి వీలుగా ఉండాలి. ఇది మంచి నవల లక్షణం. అందుకని ఇంతకుముందు వేసుకొన్న ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.
‘‘ఈ నవల న్యూనతా భావ గ్రంథి ఆధారంగా రాయబడింది’’ అని అధికుల అభిప్రాయం. ఇది చాలావరకు సబబే. అయితే ఇది కేవలం ఆ ఏక సిద్ధాంతంమీదే ఆధారపడి రాయబడిందా? అంటే చెప్పలేం.
ఎలాగంటే, ఆలోచన రెండు విధాలుగా ఉంటుందని తర్కం చెబుతుంది. ఒకటి తార్కికాలోచన. రెండోది అనియంత్రిత ఆకస్మిక, యాదృచ్ఛికతాలోచన, దీనిని రాండమ్ థింకింగ్ అంటారు. రావిశాస్ర్తీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వ శాస్త్రం చేశారు గనుక. తత్వశాస్త్రంలో తర్కం ఒక ఆవశ్యకత పాఠం కనుక, ఆ తర్కంలో మిసెస్ నికోలస్ నికలబీ రాండమ్ థింకింగ్‌ను గురించి రావిశాస్ర్తీ చదివాడు. అల్పజీవి నాయకుడైన సుబ్బయ్య ఆలోచన అనేక సందర్భాలలో అనియంత్రితమే.
మరికొంతమంది విమర్శకులు సుబ్బయ్య అస్తిత్వపు లోతులకు వెళ్లిపోయాడన్నారు. తన ఉనికికీ, అస్తిత్వానికీ అనుక్షణం అర్థం చెప్పుకోవడానికి విఫలప్రయత్నం చేశాడన్నారు.
రావిశాస్త్రేమో తనమీద జేమ్స్ జాయిస్, శ్రీశ్రీ కోనేటిరావు పాత్ర ప్రభావం పడిందని చెప్పుకొన్నాడు. కాని దీనితో మనం ఏకీభవించలేం. మనమే కాదు ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు సుదర్శనం కూడా ఏకీభవించడు. ‘‘జేమ్స్ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్‌ల చైతన్య స్రవంతి పద్ధతిలో ఈ నవల నడిచింది’’ అని చెప్పిన చాలామంది అపోహలో ఉన్నారన్నాడు సుదర్శనం. ఇది నిజమే, ఎందుకంటే నవలలో జేమ్స్ జాయిస్ ఉలిసిస్‌లో ఉన్నట్లుగా కామా, ఫుల్‌స్టాప్‌లు లేని నలభైనాలుగు పేజీలు నింపిన ఏకవాక్యంలేదు. అచేతనంలో బయలుదేరి, చేతనంలోకి వచ్చేటప్పటికి రూపొందీ రూపొందని పదాలు ఈ నవలలో లేవు. చైతన్య స్రవంతిలో అర్థంకానితనం ఉంటుంది. అది మనకు ఈ నవలలో కనపడదు.
ఇంకొంతమంది దీనిని ఆంతరిక సంభాషణలు, ఒక అంతర్మథనం అన్నారు. సుబ్బయ్య తనలో తానే ‘‘అలా కాదు ఇలా; అలా అనకుండా ఇలా అంటే బాగుండేది; ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేయకపోవడమే మంచిదైంది’’ అని అనుకొంటూ తనకు వ్యతిరేకంగానూ, తనకు అనుకూలంగాను లోలోపే వాదించుకొంటాడు.
ఎందరు ఏమి చెప్పినా అల్పజీవి నవలను న్యూనతాభావ గ్రంథి కోణం నుంచి పరిశీలిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎవరు ఆ నవలకు ఆ పేరు పెట్టినా, అది చాలా అతికినట్లు అనిపిస్తుంది. పుట్టినపుడు ప్రతి ఒక్కడూ అల్పుడే. శారీరకంగా, మానసికంగా, శక్తిపరంగా, అన్నిట్లోను పెద్దవాళ్లతో పోల్చినపుడు పిల్లలు అల్పులే. అందుకని ప్రతి పిల్లవాని జీవితం న్యూనతా భావనతోనే ఆరంభమవుతుంది. అయితే పిల్లవాడు ఎదగడంలో, సామాజిక కారకాల దోహదంతో-అంటే తల్లి తండ్రి, ఇరుగు పొరుగు, సమవయస్కులు, గురువులు కల్పించే దోహదంతో-ఆ న్యూనతా భావనను అధిగమిస్తాడు. ఈ ఎదుగులలో చాలామందికి విజయమే చేకూరుతుంది. కొంతమంది సుబ్బయ్యలాంటివారు కొన్ని చిన్ననాటి అనుభవాలతో కుంఠితులై అక్కడే స్థిరీభవం చెందుతారు.
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి