రచ్చ బండ

కసి దీక్ష...సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో గురువారం (2న) విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్ళు పూర్తయిన సంబురాలు, మరోవైపు రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం జరిగిపోయిందని బెజవాడలో కసి దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ రెండూ అధికారంలో ఉన్న పార్టీలే నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రోజంతా తెలంగాణలో అధికార పార్టీ నేతలు సంబురాల్లో మునిగి తేలారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రోజంతా బిజీ షెడ్యూలుతో గడిపారు. ఉదయమే ఆయన అసెంబ్లీ, కంట్రోలు రూంకు ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో, హెచ్‌ఐసిసి అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంజీవయ్య పార్కులో 198 మీటర్ల ఎత్తున స్తంభంపై జాతీయ జెండాను ఎగుర వేశారు. ఇంత ఎత్తున దేశంలో మరెక్కడా జాతీయ జెండా రెపరెపలాడడం లేదు. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై లేజర్ షో వంటి కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణల్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్టమ్రంతటా మిరుమిట్లుగొలిపేలా ప్రభుత్వ కార్యాలయాలను, చారిత్రాత్మక భవనాలను అలంకరించారు. చారిత్రాత్మకమైన చార్మినార్‌ను, అసెంబ్లీని సుందరంగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ ఉద్యోగులు, తోటి ఆంధ్ర ఉద్యోగులను కలుపుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తప్పెట్లు-తాళాలు, బోనాలు, పోతరాజులు, రంగోళి పోటీలు, జానపద గేయాల పాటల పోటీలు జరిగాయి. తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా అనేక కార్యక్రమాలతో ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని కార్యకర్త వరకూ వైభవంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగాల్లో తెలంగాణ వెలిగి పోతున్నదని, రాబోయే రోజుల్లో 24 గంటలూ విద్యుత్తు అందజేస్తామని, తెలంగాణ ప్రజల సాకారమైందని చెప్పారు.
కానీ తెలంగాణలోని ప్రతిపక్షాల నేతలు రెండేళ్ళ పాలన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండేళ్ళలో ఏమి సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, బిజెపి, టిడిపి నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా గాంధీ భవన్‌లో సంబురాలు నిర్వహించింది. తెలంగాణ తెచ్చింది మేమే అంటూ ఇంత కాలం గర్వంగా చెప్పిన కాంగ్రెస్ నాయకులు సంతోషంగా సంబురాల్లో పాల్గొనలేదు. మరోవైపు టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణ ఉత్సవాలకు దూరంగా అమెరికాలో ఉన్నారు. ‘నాటా’ ఆహ్వానం మేరకు వారు అమెరికాకు వెళ్ళారు. తెలంగాణ తెచ్చింది మేమే అన్నప్పుడు తెలంగాణలోనే సంబురాల్లో పాల్గొనాలి కదా! అనే సందేహాలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారు. టిడిపి, బిజెపి నేతలు పార్టీ కార్యాలయం ఆవరణల్లో సంబరాలు నిర్వహించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాల్లో రాజకీయ నేతల ప్రమేయం పెరిగిపోవడంపై ఒక విద్యార్థి దాఖలు చేసిన పిటీషన్‌పై స్పందించిన కోర్టు, రాజకీయ నాయకులు వెళ్ళరాదని ఆదేశించింది. అయినా టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి బైక్‌పై వర్సిటీకి వెళ్ళడం వివాదస్పదమైంది. దీంతో కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కను, మాజీ మంత్రి శ్రీ్ధర్ బాబును పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. ఇలా రోజంతా అధికార పార్టీ సంబురాలు, ప్రతిపక్షాల ఆందోళనల మధ్య గడిచింది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఇది కసి దీక్ష అని మండిపడ్డారు. రెండో రోజూ కూడా దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు అంగీకరించాలని ఎపికి చెందిన కాంగ్రెస్ ఎంపీలను నాడు ఆ పార్టీ అధిష్టానం ‘వార్-రూం’లో బలవంతంగా ఒప్పించిందని దుయ్యబట్టారు. ఎపిలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో తెలంగాణకు వాటా ఇవ్వాలన్నప్పుడు, తెలంగాణకు ఉన్న ఆదాయంలో ఎపికి వాటా లేదా? ఇదెక్కడి న్యాయం? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. విభజన తప్పదనుకున్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం చేయాలని అప్పుడే నాటి యుపిఎ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదంటూ రుసరుసలాడారు. నిజమే విభజన వద్దన్న భావన బాబుకు ముందే ఉంటే, నాడు తెలంగాణ రాష్ట్ర విభజనకు రెండు సార్లు సానుకూలంగా కేంద్రానికి లేఖ ఎందుకు ఇచ్చినట్లో? అంతేకాదు ఈ విషయంలో కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలనీ అన్నారు. రాష్ట్ర విభజనకు ముందు 2009 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలతో ఏర్పాటైన మహాకూటమిలో చంద్రబాబు పార్టీ చేరింది. రాష్ట్రాన్ని విడగొట్టాలని ఉద్యమించిన టిఆర్‌ఎస్‌తో జత కట్టి పోటీ చేసినప్పుడు ఈ పరిస్థితి వస్తుందన్న ఆలోచన ఎందుకు చేయలేదు? రాష్ట్ర విభజన జరిగి, రెండేళ్ళు దాటింది. విభజనతో వీధిన పడ్డామంటూ మండిపడితే సమస్యలు పరిష్కారం కావు. ఇదే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలు కాకుండా ప్రత్యేక హోదా, నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం, కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు సాధించుకోవడంపై దృష్టి సారిస్తే మంచిది. రెండు రాష్ట్రాల్లోనూ పాలక-ప్రతిపక్షాల నేతలు ఇంకా విమర్శలు గుప్పించుకుంటూ పోతే రాష్ట్రాలు బాగుపడేదెలా? ఎన్నికలు సమీపించినప్పుడు రాజకీయాలు చేసుకుందాం, అప్పటి వరకు అభివృద్ధికి సమన్వయంతో పని చేద్దాం అనే భావనతో పాలక-ప్రతిపక్షాలు ఉండాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాలు వెలుగుతాయి.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి