భక్తి కథలు

హరివంశం 152

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడున్న రాజులందరూ ఆయనకు ససంభ్రమంగా ప్రత్యుత్థానం చేశారు. అంజలి ఘటించారు ప్రతి ఒక్కరూ. అట్లా వీణాలాపనం ముగించి ‘కమలాక్షా! అమరులందరు నిన్ను కీర్తిస్తారు. వారిని నీవు కరుణిస్తావు. నీ కీర్తితో సమానమైన కీర్తి ఈరేడు లోకాలలో ఎవరికీ దుర్లభం. నీతో సములెవరూ లేరు’ అని స్తోత్రించాడు నారదుడు.
దానికి కృష్ణుడు ఆహ్లాదకరంగా నవ్వుతూ, ‘నిజమే నీవన్నది. నేను అత్యంత ప్రీతిపాత్రుణ్ణి, పూర్ణ మనోరథ సిద్ధుణ్ణీ, పరిపూర్ణుణ్ణీ అవుతాను ఎప్పుడంటే, అందుకు అనుగుణమైన దక్షిణ ఏ లోపమూ లేకుండా నాకు సమర్పించిన వారి యెడల!’ అన్నాడు.
దీనికి నారదుడు దరహాసరోచులు వదనాన్ని వెలిగించగా ‘సరి సరి! నేనెందుకు వచ్చానో నా పని ఇక్కడ సానుకూలమైంది. సర్వ సంశయ నివారణ కలిగింది. ఇక వెళ్లి వస్తాను అని వీణ మెట్టులు సవరించుకుంటూ ప్రత్యుద్గమనానికి సిద్ధపడ్డాడు. ‘మీ అందరికీ శుభమగుగాక! మీ సద్గోష్టిలో నేను ఆటంకం కలిగించినట్లుంది. ఇక శెలవా!’ అంటూ వీడ్కోలు మాటలు చెపుతుండగా, అక్కడి రాజులు
జగదీశా! ఈ నారద మహర్షి వచ్చి ఇపుడు నిన్ను గూర్చి సంభాషించిన తీరు, నీవు ఆయనకు చెప్పిన సమాధానం ఏదో గూడార్థ సముపేతంగా ఉంది. సంకేత పరిభాష సమన్వితంగా ఉంది. దీని అర్థం ఏమిటో మాకు చెప్పవలసింది అని ఆయనను ప్రార్థించారు. అపుడు ముకుందుడు నవ్వుతూ, అయితే ఆ విషయం ఆయననే అడుగుదాం. ఇక్కడే ఉన్నాడు కదా! చెప్పవలసిందిగా కోరుదాం. ఆయన చెప్పటమే సమంజసం అని నారద మహర్షి వైపు ప్రసన్నార్ద్ర దృష్టులతో చూశాడు మధుసూదనుడు. అపుడు స్మేరాననుడై నారదుడు వారికిట్లా చెప్పటం ప్రారంభించాడు.
వినండి, నేను ఒకసారి గంగానదిలో తపో నియమంతో త్రిషవణ స్నానాలు చేస్తుండగా ఒకరోజున ఉషోదయ కాలాన ఒక అద్భుత దృశ్యం చూశాను. ఒక క్రోసు (రెండు మైళ్ళు) పొడవున్న ఒక తాబేలు పెద్ద కొండ చరియలాగా నదిలోంచి ఒడ్డుకు వచ్చి నన్ను సమీపించింది. దానిని చూసి నాకు ముచ్చట కలిగి దాని మహాశరీరాన్ని చేతితో తాకుతూ ఇట్లా అన్నాను ఆ కూర్మంతో! ‘ఏమాశ్చర్యం! ఏమాశ్చర్యం! ఇంత పెద్ద శరీరంతో నిర్భయంగా నిర్విచారంగా ఇక్కడ ఈ గంగ ఒడ్డున విహరిస్తున్నావు ప్రమోద మానసంతో.
లోకంలో ఇంతకన్నా అద్భుతం నేను చూడలేదు ఇప్పటివరకు. ఇంత నిశ్చింత నీకెట్లా లభించిందయ్యా తాబేటి మేటుదొరా! కొండ వచ్చి మీదపడ్డా నీకు ఎటువంటి హాని కలగదు. నీ మేను కసుగందదు. చీమ చిటుక్కుమంటుందో నీ చేతులు, కాళ్ళు, తల, తోక, నీ శరీరపు డొప్ప లోపలికి వెంటనే ఉపసంహరించుకుంటావు. బెదరిపోవు. వెంటనే నీ శరీరాన్ని మళ్లీ మహాప్రవాహంలోకి ప్రవేశింపజేస్తావు! ఇటువంటి చాతుర్యం, ఇటువంటి శక్తి, ఇటువంటి ప్రమాద భీతరహిత స్థితి సృష్టిలో మహాబలాఢ్యమైన ప్రాణికోటిలో కూడా విన్నదీ కాదు, కన్నదీ కాదు. అయారే! ధన్యత అంటే నీదే సుమా! నీకెవరు సాటి! అన్నాను. అపుడు కూర్మం. ‘మహానుభావా! దివ్యర్షీ! అట్లా అనవద్దు. ఈ నీ మెప్పుకు నేను అర్హను కాను. చూడు మునిపుంగవా? నాకంటే ఎన్నో ఎనె్నన్నో రెట్లు పెద్దవీ, జవసత్వ బల అద్భుత శరీరాలతో వున్నవీ అయిన జల చరాలు ఈ గంగానదీమ తల్లిలో ఆశ్రయం పొందుతున్నాయి. ప్రభూతాశ్చర్య నిదర్శనం ఆ తల్లి. నేను కాను. నిజమైన ప్రశంసకు, అందునా నీవంటి దొడ్డవాడి ప్రశంసకు అర్హురాలెవరైనా వున్నారా అంటే అది ఆ గంగా భవాని మాత్రమే అని వినయంగా సమాధానించింది.
అంతట నాకు విస్మయం కలిగి జాహ్నవిని సాక్షాత్కరింపచేసుకుని ఇట్లా అడిగాను.

ఇంకాఉంది