రంగారెడ్డి

అటవీ శాఖ మంత్రి రామన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 25: తెలంగాణను ఆకుపచ్చగా అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా జీవిస్తారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. శివారు ప్రాంతంలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సుమారు రూ.3.06 కోట్లతో నిర్మించిన ట్రైనింగ్ సెంటర్ భవనాన్ని మంత్రి జోగురామన్న ముఖ్యఅతిథిగా విచ్చేసి ఎమ్మెల్యే కెపి వివేక్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం అకాడమీ ఆవరణలో మొక్కలను నాటారు. ట్రైనింగ్ పొందిన బీట్, రేంజ్ అధికారులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు శిక్షణ అవసరం కాబట్టి దూలపల్లిలో నేషనల్ లెవల్ ఫారెస్ట్ అకాడమీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్టమ్రంతా ఆకుపచ్చగా మారాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యమని, ఆకుపచ్చ రాష్ట్రంతోనే ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా జీవిస్తారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలను మూడు సంవత్సరాలలో నాటాలనేది ధ్యేయమని చెప్పారు.
గ్రామాల్లో 40 వేలు, అసెంబ్లీ పరిధిలో 40 లక్షల చొప్పున మొక్కలను నాటాలని, హరితహారం కార్యక్రమంలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని సూచించారు. ఈ ఏడాది వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కనకారెడ్డి, అటవీశాఖ అధికారులు పికె శర్మ, అకాడమీ డైరెక్టర్ రఘువీర్, రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపిపి సన్న కవిత, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

రూ.1.4 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

భారీగా స్వాధీనం
ఏడుగురు నిందితుల రిమాండ్
ఇబ్రహీంపట్నం, జూన్ 25: భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుమారు కోటి 40 లక్షల రూపాయల విలువైన 1449 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరళించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎల్‌బినగర్ డిసిపి తఫ్సీర్ ఇక్బాల్ నిందితులను శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. టాటా మినీ లారీ (ఎపి05టిసి2724), ఇన్నోవా వాహనంలలో అక్రమంగా తరలిస్తున్న 1448.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్టక్రు చెందిన మోహన్ పంజురంగ్‌వాగ్‌మేర్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మేకల రాజశేఖర్‌రెడ్డి, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన కొడం వినయ్‌కుమార్, హన్మకొండ మండలానికి చెందిన బానోత్ మోతిలాల్, రాజమండ్రికి చెందిన కొన దుర్గాప్రసాద్, నగరంలోని వనస్థలిపురానికి చెందిన సోమ నాగరాజు, కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన పెళ్లి రవీందర్‌లను అదుపులోకి తీసుకొని వారి నుండి డిసిఎం, ఇన్నోవా కారు, తొమ్మిది సెల్‌ఫోన్లు, రూ 61,260 నగదు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు డిసిపి వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. భారీమొత్తంలో తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆదిభట్ల సిఐ గోవింద్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్, కానిస్టేబుళ్ళు పిఎన్ కిరణ్, లక్ష్మణ్, వంశీ కృష్ణ, పర్యవేక్షించిన వనస్థలిపురం ఏసిపి భాస్కర్‌లను ఆయన అభినందించారు.

వారం రోజుల్లో భూ సమస్య పరిష్కారం: మంత్రి

వికారాబాద్, జూన్ 25: రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నను శనివారం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క, ప్రధానకార్యదర్శి పి.్భంభరత్, రాష్ట్ర రైతు కూలీ సంఘం కన్వీనర్ పి.నాగిరెడ్డి, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, టఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి కె.నారాయణదాస్ బృందం నగరంలోని మంత్రి నివాసం వద్ద కలిసారు. ఈసందర్భంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పుల్‌మద్ది గ్రామానికి చెందిన దాదాపు 100 కుటుంబాలు 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని రైతులకు చెందేలా చర్యలు తీసుకోవాలని బృందం వివరించింది. అటవీశాఖ అధికారులు పంటలు వేసే సమయంలోనే రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైతులకు భూమి తప్ప మరేమీ ఆధారం లేదని, ఇతర భూములు లేవని వివరించారు. ఈసందర్భంగా స్పందించిన మంత్రి జోగు రామన్న వారం రోజుల్లో భూసమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కలుషిత ఆహారం తిని
ఎన్‌ఐఆర్‌డి ట్రైనీలకు
అస్వస్థత

రాజేంద్రనగర్, జూన్ 25: గ్రామీణ అభివృద్ధిపై శిక్షణ పొందేందుకు వచ్చిన ఎన్‌ఐఆర్డీ ట్రైనీలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శిక్షణ సంస్థలో వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది ట్రైనీలు ఎన్‌ఐఆర్డీకి వచ్చారు. వీరికి కేటాయించిన వసతి గృహంలో సౌకర్యాలు లేకపోవడంతో పక్కనే గల మరో అతిథి గృహంలో సౌకర్యాలు కల్పించారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తరువాత శిక్షణ పొందుతున్న 67 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వీరిని వెంటనే అధికారులు 67 మందిని ఎన్‌ఐఆర్డీలోని హెల్త్ సెంటర్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన 67 మందిలో ఇద్దరు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్ మిశ్రా వెల్లడించారు.

ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఉప్పల్, జూన్ 25: కుటుంబ సమస్యలతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ బీరప్పగడ్డలో నివసిస్తున్న వల్లకాటి ఆంజనేయులు (47) ఆటోడ్రైవర్. గత కొంత కాలంగా భార్య సువర్ణతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె బోడుప్పల్ పుట్టింటికి వెళ్లి భర్త వేదిస్తున్నాడని స్థానిక మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు ఈ నెల 23న స్టేషనన్‌కు పిలిపించి భార్యభర్తల మధ్య కౌన్సిలింగ్ నిర్వహించి ఇక నుంచి మంచిగా ఉండాలని పేర్కొన్నారు. అదే రోజు ఇంటికి వచ్చిన ఆంజనేయులు స్టేషన్‌కు పిలిపించి తనను అవమాన పరిచారని తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారకులైన భార్య అత్తమామ, బందువుల పేర్లను రాసిన ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.

పాపను విక్రయించిన
నలుగురిపై నిర్భయ కేసు నమోదు
జీడిమెట్ల, జూన్ 25: పుట్టిన పాపను మరొకరికి ఇచ్చిన నలుగురిపై దుండిగల్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లి గ్రామం, రాజీవ్ గాంధీనగర్‌లో నివాసముండే బాల్‌రాజ్, పద్మ సహజీవనం చేశారు. వీరికి అక్టోబర్ 1వ తేదీ 2015 నాడు పాప పుట్టింది. అయితే బాల్‌రాజ్ పాప తనకు వద్దని పాపను ఇతరులకు ఇస్తేనే పద్మను వివాహం చేసుకుంటానని బెదిరించడంతో పుట్టిన పాపను హిస్నాపూర్, వడ్డెర బస్తీలో నివాసముండే శ్రీను, దుర్గలకు ఇచ్చారు. పుట్టిన పసికందును విక్రయించారని తెలుసుకున్న మేడ్చల్ ఐసిడిఎస్ అధికారి దుర్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో హిస్నాపూర్, వడ్డెరబస్తీలో నివాసముండే శ్రీను, దుర్గ దంపతులతో పాటు పాపను దుందిగల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పాపను తాము కొనుగోలు చేయలేదని, సమీప బంధువు అయ్యే బాల్‌రాజ్, పద్మల నుండి సాదుకోవడానికి తీసుకున్నామని శ్రీను దంపతులు చెప్పారు. పాపను దత్తత తీసుకున్నట్టు ఎలాంటి ఆధారం లేకపోవడంతో పోలీసులు శ్రీను దంపతులు, బాల్‌రాజ్ దంపతులపై నిర్భయ కేసునమోదు చేశారు. పాపను ఐసిడిఎస్ అధికారులు శిశు విహార్ కేంద్రానికి తరలించారు.

ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్

వికారాబాద్, జూన్ 25: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట పోలీసులు ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 లక్షల రూపాయల విలులైన ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కడప పట్టణం అక్కయపల్లికి చెందిన మేకల శశిభూషణ్ అలియాస్ శశి, అలియాస్ శశిధర్‌రెడ్డి హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఎగ్జిక్యూటివ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ సోమాజిగూడ ఎంఎస్ మక్తాలో తాత్కాలికంగా నివాసముంటున్నాడు. బంట్వారం మండలానికి చెందిన పడుగుల సందీప్ అలియాస్ సంగమేశ్వర్ హైదరాబాద్ నగరంలోని నిజాంపేట రాజీవ్‌గాంధీనగర్‌లో తాత్కాలికంగా నివాసముంటున్నాడు. ఇద్దరు శనివారం ఉదయం 6 గంటలకు కోట్‌పల్లి నుండి మోమిన్‌పేట వైపు స్ప్లెండర్‌ప్రో వాహనంపై వస్తూ మోమిన్‌పేట పోలీసులు చేస్తున్న వాహన తనిఖీని చూసి వాహనాన్ని వెనక్కి తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని వెంబడించి డాక్యుమెంట్ల గురించి ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో గట్టిగా ప్రశ్నించారు. మోమిన్‌పేటతో పాటు నగరంలోని పంజాగుట్ట, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, కెపిహెచ్‌బి, అమీర్‌పేట్, తిరుమలగిరి, ఎస్‌ఆర్ నగర్, లంగర్‌హౌజ్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు చెప్పారు. శశిభూషణ్ ద్విచక్రవాహనాల దొంగతనం కేసుల్లో కడప, చిత్తూర్ జిల్లాల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవించి 18 నెలల క్రితం హైదరాబాద్‌కు చేరుకుని అతని స్నేహితుడి గదిలో ఉండేవాడు. సందీప్‌తో శశికి అతని స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయమైన తర్వాత మూడు నెలలకు ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. దాంతో శశి ఇంటిలో ఆర్థిక ఇబ్బందులున్నాయని వాహనాలు దొంగిలించి అమ్మి వచ్చిన డబ్బులో చెరిసగం తీసుకుందామని సందీప్‌ను ఒప్పించాడు. దొంగిలించిన మోటారు సైకిళ్ళను మారుమూల, గ్రామాలకు వెళ్ళి అమ్మి, ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత ఒరిజినల్ పేపర్స్ ఇస్తామని వాహనాలు కొన్నవారిని నమ్మించారు. ఇద్దరు పథకం ప్రకారం మధ్యరాత్రి సమయంలో ఇళ్ళు, కార్యాలయాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను దొంగతనం చేసేవారు. మోమిన్‌పేట పోలిస్‌స్టేషన్ పరిధిలో రెండు, పంజగుట్ట పోలిస్‌స్టేషన్ పరిధిలో 11, ఎస్‌ఆర్‌నగర్‌లో ఐదు, కెపిహెచ్‌బిలో రెండు, సైఫాబాద్‌లో రెండు, జుబ్లిహిల్స్‌లో ఒకటి, బంజారాహిల్స్‌లో, తిరుమలగిరి, లంగర్‌హౌజ్ పోలిస్‌స్టేషన్ పరిధుల్లో ఒకటి చొప్పున వాహనాలను దొంగిలించారు. వాహనాల దొంగతనమే కాకుండా దొంగిలించిన 10 వాహనాలన అసలు నెంబర్ మార్చి నకిలీ నెంబర్లు వేసి, ఛాసిస్ నెంబర్లు మార్చి వాటిని వీలు చూసుకుని అమ్ముకునేందుకు బంట్వారం గ్రామంలోని సందీప్ ఇంటికి తీసుకెళ్ళి దాచిపెట్టారు. వాటిని సైతం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్, కరిజ్మా, యమహ, బజాజ్‌పల్సర్, హీరోహోండా ప్యాషన్, ప్యాషన్‌ప్రో, హీరో స్ప్లెండర్, హోండా ఆక్టివ, హీరో సిడి డీలక్స్, టివిఎస్ స్కూటీ, ప్లెషర్, గ్లామర్, టివిఎస్ విక్టర్, బజాజ్ సిటిలు ఉన్నాయి. ఇద్దరిపై పిడి చట్టాన్ని నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఇద్దరినీ పట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన మోమిన్‌పేట సిఐ ఎవి రంగా, ఎస్‌ఐ క్రాంతి, ఎస్‌ఐ రాజు, ఐడి పార్టీ కానిస్టేబుళ్ళు దస్తప్ప, కృష్ణారెడ్డి, మల్లేశ్, శ్రీనివాస్, నాగేశ్, కిరణ్, శివరాజ్‌లను అభినందించి రివార్డ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో వికారాబాద్ డిఎస్పీ టి.స్వామి, డిటిసి డిఎస్పీ లతామాధురిలు పాల్గొన్నారు.

తీరు మార్చుకోని
మేడ్చల్ విద్యుత్ అధికారులు
మేడ్చల్, జూన్ 25: విద్యుత్ అధికారులు ఎంత నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారో మేడ్చల్‌లోని పలు సమస్యలను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మేడ్చల్ పరిధిలో గంటల తరబడి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతున్నా వారి పని తీరులో మాత్రం కించిత్తు మార్పు రాకపోవడం గమన్హారం. ఇటీవల నిర్వహించిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ముక్తకంఠంతో విద్యుత్ అధికారుల పని తీరును దుయ్యబట్టిన విషయం తెలిసిందే. అధికారులు కేవలం తమకు అందే ముడుపులపైనే అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నారని, వినియోగదారుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని పలువురు బహిరంగంగానే ఆరోపణలు సంధిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా లేదా గాలి వీచినా గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం పరిపాటిగా మారింది. అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సమస్య తలెత్తినపుడు హడావుడి చేసి గంటల తరబడి విద్యుత్ కోతలు విధించి వినియోగదారులకు నరకం చూపిస్తారు. సమస్య ఉత్పన్నం కాకముందే ముందస్తు చర్యలు చేపడితే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందనే విషయం అధికారులకు బోధ పడకపోడం విచారకరమని చెప్పవచ్చు. విద్యుత్ అధికారులకు వారి విధుల పట్ల చిత్తశుద్ధి, జవాబుదారీ తనం ఏమాత్రం లేదని మాత్రం అక్షరసత్యం. పట్టణంలోని అనేక కాలనీల్లో విద్యుత్ సమస్యలు కోక్కోల్లలు అయిన పట్టించుకోరు అదే ఎవరైనా బడాబాబులు లేదా బిల్డర్లు అడిగినంతన ముట్టచెబితే గంటల వ్యవధిలో ఏలాంటి సమస్య అయిన పరిష్కారానికి నోచుకుంటుందని పలువురు పేర్కొంటున్నారు. మేడ్చల్ విద్యుత్ డివిజన్ పరిధిలో లక్షల్లో అవినీతి జరుగుతుందని ఇక్కడ పని చేసే అధికారులు పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ముతో కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ పరిధి బాగా విస్తరించి ఉండటం, భారీగా పేరు మోసిన పరిశ్రమలు ఉండటం, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు నిరాటకంగా కొనసాగుతుండటంతో ఇక్కడ విధులు నిర్వహించే అధికారులకు నిత్యం కాసుల పంటేనని ప్రజలు అనుకుంటున్నారు. విద్యుత్ అధికారులను మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మందలించేంత వరకు పరిస్థితి వెళ్లిందంటే వారి పని తీరు ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మేడ్చల్‌ను జిల్లాగా చేయాలంటూ హైవేపై రాస్తారోకో

మేడ్చల్, జూన్ 25: అన్ని వసతులతో విరాజిల్లుతున్న మేడ్చల్‌ను ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని బస్‌స్టేషన్ ఎదురుగా 44వ జాతీయ రహదారిపై బైఠాయించి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు కిరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారుల నిరసనలతో సుమారు అరగంటసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మేడ్చల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మేడ్చల్‌కు జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అన్ని వసతులు ఉన్నాయని ప్రభుత్వం పరిశీలించి మేడ్చల్ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌లను కలిపి మేడ్చల్ ప్రాంతంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి, నాయకులు జగన్‌గౌడ్, రాగజ్యోతి ప్రకాశ్‌రెడ్డి, ధన్‌రాజ్ నాయక్, మోహన్‌రెడ్డి, అర్జున్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తీరని సమస్యలు

వికారాబాద్, జూన్ 25: ప్రభుత్వం విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఇంకా విలయతాండవం చేస్తూనే ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని పలుమార్లు సుప్రీం కోర్టు ఆదేశించినా, ఆతర్వాత మొట్టికాయలు వేసినా పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎక్కడ ప్రధానోపాధ్యాయులు, పాఠశాలలపై సమీక్షలు నిర్వహించినా కుప్పలుతెప్పలుగా సమస్యలు బయటకు వస్తూనే ఉన్నాయి. దానికి నిదర్శనమే ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ విద్య సమీక్షా సమావేశం. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పాఠశాలల్లో కొన్ని పాఠశాలలకు ప్రహరీగోడ సమస్య, మరికొన్నింటికి టాయిలెట్లు, మంచినీరు, గదులు సరిపోకపోవడం, ఉపాధ్యాయుల కొరత, కరంటు సరఫరా లేకపోవడం, వాచ్‌మెన్, అటెండర్ లేని సమస్యలు ఉన్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి పాఠశాలలో విద్యార్థులకు బెంచీలు లేకపోవడంతో ఇబ్బంది పడుతుండగా, వాచ్‌మెన్ లేకపోవడంతో పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. కొత్తగడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఆరు తరగతి గదులు అవసరమున్నాయి. మద్గుల్‌చిట్టంపల్లి పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థలం కొరత ఉంది. కొత్తగడి ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండగా, అర్హత గల విద్యావాలంటీర్లు దొరకలేదు. మర్పల్లి మండల ఘణాపురం పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చినా ఉపాధ్యాయుల కొరత ఉంది. మర్పల్లి కెజిబివి పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించాలి. మర్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మంచినీటి వసతి కల్పించాలి. బంట్వారం మండలం మోత్కుపల్లి పాఠశాలలో ఫర్నిచర్ లేదు, ప్రహరీగోడ నిర్మించాలి, నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించాలి, మూత్రశాలలు నాలుగు యూనిట్లు, మధ్యాహ్న భోజన పథకం వండేందుకు వంటశాల లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నారం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఫెయిలవుతున్నారు. ప్రహరీగోడ, అదనపు తరగతులు నిర్మించాల్సిన అవసరం ఉంది. తొర్మామిడి పాఠశాలలో వంటశాల నిర్మించాలి, పాఠశాల గేటు వద్ద చేతిపంపు ఉండటంతో మురికినీరు నిలుస్తోంది. విద్యావాలంటీర్లకు జూన్ నుండి వేతనాలు చెల్లించక అవస్థలు పడుతున్నారు. ధారూర్ బాలుర పాఠశాలలోని 16 గదులు వర్షం పడినపుడల్లా కురుస్తున్నాయి. పాఠశాలకు రక్షణ లేదు. అటెండర్‌ను నియమించాలి. మోమిన్‌పేట జిల్లా పరిషత్ పాఠశాలకు ఆట స్థలం లేదు. వెల్చాల్ పాఠశాలలో అదనపు తరగతి గదులు, అటెండర్ అవసరం. సమీక్షా సమావేశాల్లో సమస్యలు తెలుసుకుంటున్న అధికారులు పరిష్కరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇరుకు గదుల్లోనే విద్యాభ్యాసం మొదలు
కీసర: ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాఠశాలల దుస్ధితి మారకపోవడంతో సమస్యల వలయాల్లోనే విద్యార్థులు విద్యను అభ్యసించాల్సి వస్తోంది.