డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ .. 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడు చెప్పింది వినగానే హరిత ముఖం ఎర్రబడింది. ‘‘ప్లీజ్.. నేను నిన్నిలా అడిగానని ఎవరితోనూ చెప్పకేం?’’ అంది సిగ్గుగా.
అలా అడుగుతున్న ఆమెని చూస్తుంటే వరుణ్‌కి ముచ్చటేసింది. అందం అమాయకత్వం రెండూ ఒకే చోట వుంటే ఎంత ముగ్ధంగా వుంటుందో తెలియాలంటే ఆమెని చూస్తే తెలుస్తుంది. వరుణ్‌కి ఆమె ఏమిటో అప్పటికి సగం అర్థమయింది. మిగతా సగం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనీయకుండా అతడి వయసు తొందరపెడుతోంది.
‘‘చెప్పకుండా వుండాలంటే నాదొక కండీషన్’’ అన్నాడు.
‘‘ఏమిటీ?’’ అంది హరిత.
‘‘నువ్వు ఇప్పుడు నాతో కాఫికి రావాలి’’ అన్నాడు.
‘‘సారీ వరుణ్ నాకు కాఫీ త్రాగడం అలవాటు లేదు’’ అంది హరిత నొచ్చుకుంటున్నట్టుగా.
అంతలోనే అక్కడికి కావేరి వచ్చింది. ఇద్దరినీ చూసి నవ్వింది. ‘హాయ్’ అన్నాడు వరుణ్. బస్సులో ఇంటికి వెళ్తూ వరుణ్‌తో జరిగిన సంభాషణని మననం చేసుకుంటున్న ఆమెకి హఠాత్తుగా కాలేజ్‌లో చేరిన రోజు వరుణ్ తన వంక చూసిన చూపులు గుర్తుకు వచ్చాయి. చూపులతో బాణాలు విసురుతున్నట్టుగా ఎందుకలా చూసాడు? అంటే మొదటిరోజే అతడు తనకి సైట్ కొట్టాడా?
అలా అనుకోగానే గుండెలు దడదడలాడాయి ఆమెకి.
***
తను అంతకుముందు చదివిన కాలేజ్ వాతావరణానికీ ఈ కాలేజ్ వాతావరణానికీ ఎంతో తేడా ఉందని గమనించింది హరిత. ఇదొక స్వేచ్చా ప్రపంచంలా వుంది! అంతేకాదు.. ఇంటర్మీడియెట్‌లో అమ్మాయిలుగానీ అబ్బాయిలుగానీ క్లాసురూముల్లోనూ, చెట్లకింద బస్టాపుల్లోనూ గుంపులు గుంపులుగా గుమిగూడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించేవారు.
ఇక్కడ అలాంటి గుంపులతో పాటూ అక్కడక్కడా జంట పక్షుల్లా ఆడా మగా.. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా తమదంతా వేరే లోకమనన్నట్లుగా ఎవర్నీ లెక్కచేయనట్లుగా కనిపిస్తారు.
అబ్బాయిలు అమ్మాయిలని టీజ్ చేయడం, వెంటపడి వేధించడం చాలా అరుదు.. అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి రాజీకి వచ్చి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎంతో సఖ్యంగా కనిపిస్తారు. హరితకిదంతా కొత్తగా.. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.
అబ్బాయిలతో ఏ మొహమాటం లేకుండా చొరవగా మాట్లాడే అమ్మాయిలూ.. వాళ్ళతో సమానంగా అరిచి, అల్లరి చేసే అమ్మాయిలూ.. వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తూ వాళ్ళ భుజాలమీద చేతులు వేస్తూ మాట్లాడే అమ్మాయిల్ని ఆశ్చర్యంగా చూస్తోంది. అదంతా చూస్తుంటే ఆ కాలేజ్‌లో చేరబోయే ముందు తల్లి సుమతి తనకన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పిందో అర్థమవసాగింది. అన్నిటినీ మించి ఆడ, మగ మధ్య సాన్నిహిత్యాన్ని అక్కడదంతా కామన్ అన్నట్లుగా ఎవరూ ప్రత్యేకంగా పట్టించుకోకపోవడం ఆమెకి మరింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. చదువుదారి చదువుదే ఎంజాయ్‌మెంట్‌దారి ఎంజాయ్‌మెంట్‌దే అన్నట్టుగా వుంటారు అందరూ.
అబ్బాయిలు గర్ల్‌ఫ్రెండ్స్‌నీ అమ్మాయిలు బోయ్‌ఫ్రెండ్స్‌నీ కలిగి వుండడం ఫేషన్ అక్కడ. మొదట్లో వరుణ్ తన చుట్టూ తిరగడం, ఎంతమంది వున్నా తన దగ్గరకే వచ్చి తనతో ప్రత్యేకంగా మాట్లాడడం హరితకి భయాన్ని కలుగచేసేది. కానీ రాను రాను భయం పోయి అందులో థ్రిల్ తెలియసాగింది. ఫ్రెషర్స్‌డే నాడు కూడా హరితని అంటిపెట్టుకున్నట్టుగా పక్కనే వున్నాడు వరుణ్. అంతలో భరణి వచ్చి వరుణ్‌ని పిలిచాడు.
‘‘ఏరా? ఆరోజడిగితే అలాంటిదేం లేదన్నావు? ఇప్పుడేంటి ఆ అమ్మాయి కూడా కూడా తిరుగుతున్నావు? అంతలోనే గర్ల్‌ఫ్రెండయిపోయిందా?’’ అన్నాడు పక్కకి తీసుకుని వెళ్లి.
‘‘నిజంగానే అలాంటిదేం లేదన్నా..’’ అన్నాడు వరుణ్.
భరణి వరుణ్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ‘‘తప్పు నీది కాదులేరా.. నీ వయసుది. నీ చుట్టూ వున్న ప్రపంచానిది. కాలేజ్‌కి రాగానే ఎవరికి నచ్చిన అమ్మాయితో వాళ్ళు స్నేహం చేయాలని ఆరాటపడడం మామూలే.. ఎంజాయ్ చేయండి.. తప్పులేదు కానీ ఆ ఎంజాయ్‌మెంటే జీవితం కాదని గుర్తుంచుకోండి.. అందులో పడి చదువుని మాత్రం మర్చిపోకండి’’ అన్నాడు హితోపదేశం చేస్తున్న లెవెల్లో.
‘‘గాళ్‌ఫ్రెండ్‌ని సంపాదించడానికి మాకందరికీ కాలేజ్‌లో చేరాక ఏడాదో రెండేళ్ళో పట్టింది. వీడు మాత్రం పది రోజులకే అమ్మాయిని పడేసాడు. చూసావా అన్నా జనరేషనెంత ఫాస్టయిపోయిందో’’ అన్నాడు, అంతకుముందు వరుణ్‌తో తగాదాపడిన సీనియర్ వరుణ్ వంక అదోలా చూస్తూ. వరుణ్‌కేం సమాధానం చెప్పాలో తెలియలేదు. తను హరితతో ఎంత కలివిడిగా వుందామనుకున్నా ఆమె మాత్రం భయంవల్లో, బెరుకువల్లో తనకి దూరంగానే వుంటోంది. కానీ వాళ్ళేదేదో మాట్లాడుతున్నారు. తామిద్దరిమధ్యనా ఏమీ లేదని గొంతు చించుకుని అరిచినా వినిపించుకునేట్టు లేరు..
‘‘నేను చెబుతున్నది నిజం అన్నా.. ఆమె నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. నేనే ఆమె వెంట తిరుగుతున్నాను. మా బ్రాంచిలు కూడా వేరు. క్లాసులు మొదలైపోతే మేము కలవడానికి కూడా కుదరదు...’’ అతడేదో చెప్పబోయి ఏదో అన్నాడు. అప్రయత్నంగానే తన మనసులోని బాధని వాళ్ళముందు బయటపెట్టేశాడు. వరుణ్ మాటలు వింటూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా చూసాడు భరణి
‘‘ఓహ్.. అదా నీ ప్రోబ్లమ్? నేను చూసుకుంటానే్ల’’ అన్నాడు కన్ను గీటుతూ.
వరుణ్ అర్థం కానట్టుగా చూసాడు భరణి వంక. అక్కడా సంభాషణ జరుగుతున్న సమయానికి దూరంగా చెట్టుక్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న హరిత మిత్రబృందం దగ్గరికి జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి వచ్చింది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ