భక్తి కథలు

హరివంశం - 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమహావిష్ణువు అధిరోహించటానికి అనుకూలంగా తన మూపును వినమితం చేశాడు. శ్రీహరి గరుడారూఢుడైనాడు. విష్వక్సేనుడు మొదలైన సేనానాయకులు జయ జయధ్వానాలు చేశారు. ముని సంఘాలు హర్షాతిరేకంతో స్తుతించారు. దిక్కులు పిక్కటిల్లే సంతోష ద్వానాలు చెలరేగాయి.
మహావిష్ణువు ఈ విధంగా సాగగానే దేవ సంఘాలతో లక్షల సంఖ్యలో విమానాలు ఆయనను అనుసరించాయి. సమస్త గ్రహ తారకా సంవృతమై సనాతనమైన ఆ విను వీధిలో పయనించి ముహూర్తకాలంలో పరంధాముడు మేరు పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ మేరు పర్వత రమణీయ సాను సీమల్లో నిరంతరం అప్సరోగణం విహరిస్తుంటారు. సిద్ధచారణులు ఆ పర్వత గుహలతో సతతం సంగీత ప్రమోదంతో సంచరిస్తుంటారు. మేఘ పంక్తులకు ఆ పర్వతం ఉల్లాస భూమి. ఆశ్రయ స్థానం. అక్కడివన్నీ సువర్ణ్భూములే. బంగారు రంగు మేనితో ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అది దేవతలకు సముచిత సంచార స్థానం.
ఆ మేరు పర్వత శిఖర సానువులలో అద్భుమైన ఒక కొలువు కూటం వున్నది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అది కోరుకున్న రూపాన్ని ధరించగలదు. కోరుకున్న చోటికి పయనించగలదు. దర్శించినవారికి సమస్త వాంఛలు సిద్ధింపచేయగలదు. శ్రీ మహావిష్ణువు ఆ కొలువుకూటంలో ప్రవేశించి ముఖ్య ఉన్నతాసనంపై తాను అధివసించి బ్రహ్మ మొదలైన ప్రముఖ దేవతాధీశ్వరులనందరినీ తమ తమ ఉచితాసనాలలో కూచునేట్లు సభనంతా కలయచూశాడు. అపుడు యక్ష గంధర్వ విద్యధర సిద్ధ పన్నగ గణాల వారంతా చేరి ఆయనను కొలుచుకున్నారు.
ఇంతలో భూదేవి కూడా తన అభిమతమైన ఆత్మీయ రూపంతో అక్కడకు వచ్చింది. ఆమె చాలా కృశించి ఉంది. వివర్ణ వదనురాలై ఉంది. నిట్టూర్పులు విడుస్తున్నది. చాలా డస్సిపోయినదానిలా కనపడుతున్నది. దేవతల దృష్టులన్నీ ఆమెపైనే నిలిచాయి. ఆమె ఏమి చెప్పబోతున్నదా అని అక్కడ ఉన్న దేవతలంతా విత్కరించుకుంటున్నారు. తలా ఒక మాట మాట్లాడుకుంటున్నారు. అపుడక్కడ ఒక కలకలం చెలరేగింది.
అపుడు వాయుదేవుడు లేచి నిశ్శబ్దం, నిశ్శబ్దం అని ఆ కలకలాన్ని వారించాడు. ఖిన్నురాలై ఉన్న వసుంధరాదేవిని చూసి ‘నీ రాకకు కారణం ఏమిటో దేవదేవుడికి విన్నవించవమ్మా!’ అని ఆమెను కోరాడు. అప్పుడామె దోసిలొగ్గి మనసు చిక్కబట్టుకొని తడబాటు లేకుండా స్పష్ట వాక్కులతో శ్రీమన్నారాయణమూర్తికి ఇట్లా విన్నవించింది.
ఈ పురుషోత్తముడు, అంబుజభవుడు కరుణతో నా విన్నపం ఆలించాలి. ఈ దేవతలంతా నా దీన వ్యధను అర్థం చేసుకోవాలి.
సృష్ట్యాదిని జగత్కర్త నన్ను చరాచర భూత జాలానికంతకూ ఆధారస్థానంగా చేశాడు. అయితే ప్రళయ కాలంలో సర్వజగత్తు ఏకార్ణవమైన కాలంలో మహావిష్ణువు నిద్రించి ఉండగా ఆయన చెవుల నుంచి ఇద్దరు రాక్షసులుద్భవించారు. వాళ్ళు యుగయుగాల పర్యంతం తపస్సు చేశారు. వాళ్ళ అచంచల తపస్సుకు నివ్వెర పొంది బ్రహ్మదేవుడు వాళ్ళు చలిస్తారేమోనని వాళ్ళను తాకి చూశాడు. అందులో ఒకరి శరీరం ఎంతో మృదువుగా ఉంది. ఇంకొకరి మేను ఎంతో కఠినంగా ఉంది. వాళ్ళను సంచలింపజేయాలని వాయుదేవుడు వారి శరీరాలలో ప్రవేశించి సకలాంగాలలో, సర్వనాడులలో విస్తరించినా వాళ్ళు సర్వదిక్కులలో తమ మేనులు ఉబ్బి, బూరటిల్లి భూమ్యాకాశ పర్యంతం వృద్ధి చెందారే కానీ ఏ మాత్రం చలించలేదు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యం పొంది మృదు శరీరుడికి మధుడనీ, కఠిన శరీరుడికి కైటభుడనీ పేర్లు పెట్టాడు.
- ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు