పశ్చిమగోదావరి

ప్రత్యేక హోదాపై దొంగాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 30: స్థానిక ప్రకాశం చౌక్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. పార్లమెంటు సాక్షిగా బిజెపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని, ఈ ఆందోళనకు తెలుగు ప్రజల తరఫున యువజన కాంగ్రెస్ ఉద్యమిస్తుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకెం సీతారాం అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్టవ్య్రాప్తంగా ఈ ఆందోళన చేశామన్నారు. తెలుగు ప్రజలను బిజెపి, టిడిపిలు మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లుకు టిడిపి, బిజెపిలు మద్దతు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభలో ఎపి ఎంపీలు చేస్తున్న వ్యవహార శైలిని పరిశీలిస్తుంటే తెలుగు ప్రజలను మోసం చేసే విధంగా ఉందన్నారు. ఈ ఆందోళనలో యువజన కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల నాయకులు పెద్దిరెడ్డి సుబ్బారావు, వెంకట రత్నంనాయుడు, ఉప్పలపాటి ఫణీంద్రకుమార్, పిట్టా సురేష్, కొల్లాబత్తుల సురేష్, గౌతు గణపతి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి అంత్య పుష్కరాలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జూలై 30: పవిత్రమైన గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయ. ఆగస్టు 11వరకు జరిగే అంత్య పుష్కరాలకు జిల్లాలోని అన్ని ప్రధాన ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జిల్లాలో ముఖ్యంగా నరసాపురం, కొవ్వూరు, దొడ్డిపట్ల తదితర ప్రాంతాల్లో అంత్య పుష్కర స్నానాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికార్లు తగుమాత్రపు ఏర్పాట్లుచేశారు. అంత్య పుష్కరాలను పురస్కరించుకుని నరసాపురం వలంధర రేవులోని గోదావరి మాతకు పవిత్రమైన గోదావరి జలాలతో శనివారం ధర్మరక్షా వేదిక ఆధ్వర్యంలో అభిషేకాలు చేశారు. గోదావరి మాతతో పాటు పరమేశ్వరుడు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయునికి జలాలతో అభిషేకాలు చేశారు. వశిష్ఠ ఘాట్‌కు నీరాజన మంత్ర పుష్పాలతో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మరక్షా వేదిక జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ మాట్లాడుతూ అభిజిత్ నక్షత్ర లఘ్నమందు పుష్కరునితో 33 కోట్ల దేవతలు సమస్త తీర్థాలు బృహస్పతి, పితృ దేవతలు ఈ నక్షత్ర సమయంలో ప్రవేశించగానే హిందూ బంధువులతో పుష్కర స్నానాలు ఆచరించారన్నారు. దేశంలో ఉన్న 12 జీవనదుల్లో ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఒక గోదావరికే వస్తాయన్నారు. గతేడాది ఆది పుష్కరాలు ఏ విధంగానైతే పుణ్యస్నానాలు ఆచరించారో, అంత్య పుష్కరాల్లో కూడా భక్తులందరూ పవిత్ర స్నానాలు ఆచరించాలని కోరారు. హిందూ చైతన్యవేదిక అధ్యక్షుడు రావూరి అనంత్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ గరికిముక్కు సుబ్బయ్య, ఆర్. శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరులో ఏర్పాట్లు పరిశీలించిన మురళీమోహన్
కొవ్వూరు: నేటి నుండి ప్రారంభం కాబోయే గోదావరి అంత్య పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక గోష్పాద క్షేత్రాన్ని ఎంపి మురళీమోహన్ సందర్శించారు. స్నాన ఘట్టాలు, మత్స్యకారులకు ఏర్పాటుచేసిన పడవలను, గజ ఈతగాళ్లు తదితర రక్షణ చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాలను స్ఫూర్తిగా తీసుకుని అంత్య పుష్కరాలను కూడా వైభవంగా నిర్వహించాలన్నారు. అంత్య పుష్కరాలకు ఒడిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. అంత్య పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని వైభంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎంపి ఆదేశించారు. ఎంపి మురళీమోహన్ వెంట కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, మున్సిపల్ ఛైర్మన్ సూరపని రామ్మోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్రకుమార్, తహసీల్దార్ కె విజయకుమార్, ఫైర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, టిడిపి నేతలు జెవిఎస్ చౌదరి, పొట్రు శ్రీనివాసు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆరని జ్వాల
-‘గూడెం’ కేంద్రంగా మళ్లీ రగడ
-ఈసారి జడ్పీ ఛైర్మన్ వంతు
-మోనిటరింగ్ కమిటీ భేటీలో వివాదం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జూలై 30: జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం కేంద్రంగా మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి, బిజెపిల మధ్య రగులుకున్న జ్వాల ఇంకా ఆరలేదనే చెప్పాలి. కొద్దికాలం క్రితం టిడిపి నేతల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదవి కూడా వదులుకునేందుకు సిద్ధమని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొనడం, చివరకు ముఖ్యమంత్రి సమక్షంలో వ్యవహారం సద్దుమణగడం తెల్సిందే. ఈసారి శనివారం జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వంతుగా మారినట్లు కన్పిస్తోంది. మంత్రి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా స్ధానిక జడ్పీ సమావేశమందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఈ అంశంపై పెద్దఎత్తున చర్చకు తావిచ్చారు. ఈసందర్భంగా జడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ మంత్రి మాణిక్యాలరావు తీరుపై పరోక్షంగాను, ప్రత్యక్షంగాను నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో మంత్రి చెప్పారని చేసుకుంటూపోతే అధికారులకు ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు.
మళ్లీ రగిలిన ఈ జ్వాల వివరాల్లోకి వెళితే... తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోని మాధవరం, వెంకట్రామన్నగూడెంలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అసుపత్రి అభివృద్ధి కమిటీల నియామకం జరిగింది. ఈ కమిటీల ప్రమాణస్వీకారానికి వేదిక నిర్ణయించినా ఆసందర్భంగా వివాదం రేగడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఇదే అంశాన్ని శనివారంనాటి సమావేశంలో ప్రస్తావించిన జడ్పీ ఛైర్మన్ బాపిరాజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. కమిటీల నియామకంలో ఎవరో చెప్పారని చేసుకుంటూ పోవటం సమంజసంకాదని డిఎంహెచ్‌ఓ డాక్టరు కోటేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కనీసం కమిటీల ప్రమాణస్వీకారోత్సవం సమాచారాన్ని కూడా స్ధానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఎలా ముందుకెళతారని ప్రశ్నించారు. ఈ కమిటీ అధ్యక్షునిగా బిజెపి నాయకుడ్ని ఎలా నియమించారని నిలదీశారు. అయా పరిధుల్లో ఎన్నో గ్రామాలుంటే ఒక గ్రామం నుంచి ముగ్గుర్ని ఏకారణంగా నియమించారని ప్రశ్నించారు. ఇదే సమయంలో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు స్ధానిక ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా సమావేశమందిరంలోకి దూసుకువచ్చారు. నేరుగా పోడియం వద్దకు చేరుకుని తమ గౌరవం కాపాడాలని, తగిన న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా సమావేశమందిరంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకపక్క జడ్పీ ఛైర్మన్ అదే అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అదే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ స్ధానిక ప్రజాప్రతినిధులు సమావేశం మధ్యలో పోడియం వద్దకు చేరుకుని నినాదాలు ప్రారంభించటం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఛైర్మన్ మరింత ఆగ్రహంతో ఊగిపోతూ ఈ ఘటనలకు ఎవరూ సమాధానం చెపుతారని, తనకు సమాధానం చెప్పి తీరాలంటూ నిలదీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టరుకు సమర్పిస్తానని డిఎంహెచ్‌ఓ చెప్పడంతో తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన స్ధానిక ప్రజాప్రతినిధులు కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. కాగా సమావేశం చివరిలో మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మంత్రిపై విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో రైతుబజారు నిర్మాణానికి సంబంధించి చెర్వు తవ్వకానికి ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఇరిగేషన్ ఎస్‌ఇని నిలదీశారు. మంత్రి క్షేత్రస్ధాయిలో పర్యటించకుండానే, అధికారులతో మాట్లాడుకుని స్ధానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా సొంత మనుషులతో పనులు చేయించుకుంటున్నారన్నారు. కేవలం మంత్రి చెప్పారంటూ లక్ష జనాభాకు పైబడిన మున్సిపాల్టీలో కనీసం కౌన్సిల్ తీర్మానం కూడా లేకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా మంత్రి చెప్పారంటూ పనులు చేసి ఇబ్బందులు కోని తెచ్చుకోవద్దంటూ అధికారులకు హితవు పలికారు.

రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం
దానివల్ల ఉపయోగం ఉండదు:ప్రత్యేక హోదాపై పోరాడతాం:మురళీమోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జూలై 30 : రాష్ట్భ్రావృద్ది విషయంలో ఎక్కడా రాజీపడే పరిస్థితి లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగానో కష్టపడుతున్నారని, అవసరమైతే ఆయన ఆదేశాల మేరకు రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధంగా వున్నామని రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. అయితే రాజీనామా చేసినా ఉపయోగం ఉండదని, కేంద్రంతో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ నిధులు మంజూరు చేయించుకోవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ఏలూరు ఎంపి మాగంటి బాబు క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు దేశంలోనే మిగులు ఆదాయం వున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోజనాలకోసం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విడదీసిందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయిదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని రాజ్యసభలోనే హామీ ఇచ్చారన్నారు. అప్పటి రాజ్యసభ సభ్యులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు కనీసం పది సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా కావాలని కోరారన్నారు. అయితే ఈ అంశాన్ని విభజన చట్టంలో పొందుపర్చలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తుంటే 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదాకు వీల్లేదని చెబుతోందని, ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెబుతున్నారన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఆంధ్రప్రదేశ్‌కు కూడా కేంద్రం నిధులు ఇచ్చిందని, ప్రత్యేకంగా రాష్ట్రానికి అదనంగా ఇచ్చింది ఏమీ లేదని పేర్కొన్నారు. రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రవేటు బిల్లుకు మద్దతు తెలపాలని టిడిపికి చెందిన 16 మంది ఎంపిలు అన్ని పార్టీలను కోరామన్నారు. అయితే వారంతా మద్దతు తెలిపినప్పటికీ సభలో అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా కుదరదని తేల్చి చెప్పారన్నారు. జైట్లీ నిర్ణయం ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్ సభ్యులు కనీసం చర్చ కూడా చేయకుండా వాకౌట్ చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టిందని అర్ధమవుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులను కోరగానే 35 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, దేశంలోనే ఇంత పెద్దమొత్తంలో భూమి ఇచ్చిన ఘనత రాష్ట్ర రైతులకే దక్కుతుందన్నారు. టిడిపి ఎంపిలంతా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి వున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తామని, అవసరమైతే రాజీనామాలు చేసేందుకు కూడా తామంతా సిద్ధమని చెప్పారు. అయితే ఇలాంటి నిర్ణయం వల్ల ఉపయోగం వుండదని, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నిధులను మంజూరు చేయించుకోవాల్సిన పరిస్థితి వుందన్నారు. రెండేళ్లుగా రాష్ట్రానికి రైల్వే జోన్ ఇస్తామని చెబుతున్నారని, ఇది కేవలం ప్రకటనలకే పరిమితమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున త్వరలోనే రాష్ట్రానికి రైల్వే జోన్ వస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినా నిధులు మాత్రం నాబార్డు నుంచి అందజేస్తారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి యూనివర్శిటీలు, పరిశ్రమలు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపై వుందన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపి మాగంటి బాబు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావులు పాల్గొన్నారు.

సమీక్షల్లో కాకిలెక్కలు కుదరదు:కలెక్టర్
ఏలూరు, జూలై 30: సమీక్షలకు హాజరయ్యే సమయంలో ఖచ్చితమైన సమాచారంతో హాజరుకావాలని, కాకిలెక్కలు చెపితే చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ జాతీయ రహదారి సంస్ధ అధికారులను హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం డివిజన్‌లో ఎన్‌హెచ్-216 నిమిత్తం 40కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని గత సమావేశం చెప్పి, ప్రస్తుత సమీక్షలో 26కోట్ల రూపాయలు మాత్రమే చెల్లింపులు జరిగాయని చెప్పడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 ఎకరాల భూసేకరణ కోరగా సేకరించి ఇచ్చామని, తిరిగి మరో రెండు ఎకరాల భూసేకరణ కావాలని అడుగుతున్నారని మచిలీపట్నం జాతీయ రహదారుల సంస్ధ అసిస్టెంటు ప్రాజెక్టు డైరెక్టరు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమీక్షలకు హాజరయ్యే సమయంలో ఖచ్చితమైన సమాచారంతో ఎందుకు హాజరుకారని ప్రశ్నించారు. రహదారి విస్తరణలో భాగంగా 2430 చెట్లు, 905 విద్యుత్ స్తంభాలు తొలగించాల్సి ఉండగా ఆరునెలల నుండి సమీక్షిస్తున్నప్పటికీ పని నత్తనడకన సాగుతోందని, 15 రోజుల్లో వీటిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రెండవ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, భూసేకరణ ప్రత్యేక కలెక్టరు భానుప్రసాద్, డిఆర్వో కె ప్రభాకరరావు, నర్సాపురం సబ్‌కలెక్టరు ఎఎస్ దినేష్‌కుమార్, ఐటిడిఎ పిఓ షాన్‌మోసన్, భూసేకరణ ఎస్‌డిసిలు ఆర్‌వి సూర్యనారాయణ, పుష్పమణి తదితరులు పాల్గొన్నారు.

60 అడుగుల లిఫ్ట్ ఎక్కిన చింతమనేని
పెదవేగి, జూలై 30: సంచలనాలకు మారుపేరుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శనివారం సాహసోపేత విన్యాసాలు చేసి అందరిలో ఉత్కంఠ రేపారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామం వద్ద గుండేరు వాగు నుంచి పలు గ్రామాలకు పోలవరం కుడికాలువ నుండి సేద్యపునీరు, తాగునీరు మళ్లించే కార్యక్రమానికి శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా చింతమనేని గోదావరి జలాలకు పూజలు చేసి హఠాత్తుగా 60 అడుగుల ఎత్తులో వున్న లిఫ్ట్ పైకి ఎక్కి సంచలనం సృష్టించారు. నీటిని విడుదల చేసే మోటారు 60 అడుగుల పైభాగంలో ఉండడంతో దానిపైకి ఎక్కడానికి ఎటువంటి మెట్లు లేకపోయినా చింతమనేని ప్రాజెక్టు గట్టుకు ఉన్న ఐరన్ చువ్వలను పట్టుకుని పైకి ఎక్కడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో, పొరపాటున కాలుజారి కిందపడతారేమోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఏలూరు ఎంపి మాగంటి బాబు కూడా సంచలనం ఎందుకు? కింద నుండి నీటిని విడుదల చేద్దాం.. అంటున్నా చింతమనేని లెక్కచేయకుండా రెట్టింపు ఉత్సాహంతో 60 అడుగుల ఎత్తుకు క్షణాల్లో ఎగబాకి రైతుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించారు. అభిమానుల కేరింతల మధ్య ప్రభాకర్ నీటిని విడుదల చేసి కిందకు దిగారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడడానికి తాను ఏడాది నుండి ఎంతో కష్టపడ్డానని, ఆ కష్ట్ఫలితంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువకు నీటిని విడుదల చేశామని, ఆ నీరంతా మెట్ట ప్రాంతంలోని ప్రతీ పల్లెలో పరుగులు తీయించినప్పుడే తాను ఆనందిస్తానని చింతమనేని చెప్పారు. ఇన్నాళ్లు కేవలం భూగర్భజలాలపై ఆధారపడి సేద్యం చేసే రైతులు నేడు డెల్టా ప్రాంత రైతులతో సమానంగా సుస్థిర సేద్యం చేసే స్థాయికి ఎదిగారన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి డెల్టాతో రైతులు సేద్యంలో పోటీపడేలా తీర్చిదిద్దుతానని, అప్పుడే తాను నిజమైన ఆనందం పొందుతానన్నారు.
మరో కాటన్ చంద్రబాబు
పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమ రైతాంగాన్ని కూడా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో మరో కాటన్‌గా నిలుస్తారని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో శనివారం పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గుండేరు దిగువ కాలువకు ఎంపి మాగంటి బాబుతో కలిసి ఆయన సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గుండేరు ఎస్కేప్ నుంచి దెందులూరు మండలంలోని 3426 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి శ్రీనివాసయాదవ్, ఎంపిపి బక్కయ్య, జడ్పీటిసి సక్కుకుమారి, గ్రామ సర్పంచ్ అరుణ, ఎంపిటిసి బుల్లెమ్మ, సొసైటీ ఛైర్మన్ వెంకట్రావు, నీటి సంఘం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గోపాలపురం మండలంలో భారీ వర్షం
గోపాలపురం, జూలై 30: గోపాలపురం మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. సాయంత్రం 3 గంటల నుండి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోపాలపురం మార్కెట్ వద్ద చిట్యాల రహదారి పూర్తిగాజలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగన్నాథపురం నుండి గుడ్డిగూడె, భీమోలు మీదుగా గజ్జరం వెళ్లే రహదారి గోతులమయం కావడంతో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

చోరుల ముఠా అరెస్టు
భారీగా బైక్‌లు స్వాధీనం
దేవరపల్లి, జూలై 30: దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, పలు చోరీల కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంతోబాటు తొమ్మిది మోటారు సైకిళ్లు, కంప్యూటర్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు శనివారం తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గౌరీపట్నం ఆంధ్రాబ్యాంకు సమీపంలో గల ఒక కిళ్లీ షాపులో షట్టర్‌ను తొలగించి కంప్యూటర్, ప్రింటర్‌ను యర్రంపేట గ్రామానికి చెందిన చండ్ర వెంకటేష్ అపహరించాడు. అతనికి మాదేటి పవన్‌కుమార్ సహకరించాడు. తనిఖీల్లో భాగంగా కొవ్వూరు సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ సిహెచ్ ఆంజనేయులు ఈ నెల 29న చండ్ర వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా వెంకటేష్ దొంగిలించిన తొమ్మిది మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన మారిశెట్టి సురేష్ నుండి 3 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ తెలిపారు. తొమ్మిది మోటారు సైకిళ్లలో దేవరపల్లి స్టేషన్‌కు సంబంధించి 6, తాళ్లపూడి 1, కామవరపుకోట 1, టి నర్సాపురం 1 కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితులు కనుమూరి రామరాజు, పి శంకర్, మల్లిపూడి మురళి, ఎం సోమరాజులను అరెస్టు చేసినట్టు డిఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కొవ్వూరు రూరల్ సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ ఆంజనేయులుకు రివార్డుకోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
దేవరపల్లి, జూలై 30: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపి మురళీమోహన్ పిలుపునిచ్చారు. దేవరపల్లి మండలం గాంధీనగరంలో శనివారం వనం - మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అంతకుముందు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో, గ్రామంలోను మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపిపి శ్రీకాకుళపు వెంకట నరసింహారావు, ఎఎంసి ఛైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, మాజీ ఎంపిపి గెడా మురళీ అజిత్‌కుమార్, టిడిపి నాయకులు ముళ్లపూడి దొరాజీ చౌదరి, ఇమ్మణ్ణి సూర్యనారాయణ, ఆచంట గోపాలకృష్ణ, ఎంపిడిఒ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయురాలు బసవ లింగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగనివ్వద్దు
అంత్య పుష్కరాలపై ఆర్డీవో లవన్న ఆదేశం
పోలవరం, జూలై 30: గత సంవత్సరం జరిగిన ఆది పుష్కరాల్లో విధులు నిర్వర్తించినట్లే అంత్య పుష్కరాల్లో కూడా అదే విధంగా విధులు నిర్వర్తించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆర్డీవో ఎస్ లవన్న అన్నారు. ఆదివారం నుండి నిర్వహించబోయే అంత్య పుష్కరాల సందర్భంగా శనివారం సాయంత్రం మండలంలో ఉన్న ఘాట్లను డిఎస్పీ జె వెంకట్రావు, డిఎల్పీవో కె అమ్మాజీతో కలిసి ఆర్డీవో పరిశీలించారు. పట్టిసం రేవులో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన సిబ్బందితో ఆర్డీవో మాట్లాడుతూ అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. విధుల్లో అలసత్వం వహించవద్దని హితవు పలికారు. ఒకవేళ విధులకు హాజరుకాని పక్షంలో ముందుగా తెలియపర్చాలని కోరారు. మండలంలో ప్రభుత్వం గుర్తించిన మూడు ఘాట్లతోపాటు కలెక్టర్ ఆదేశాల మేరకు మిగిలిన 19 ఘాట్లను శుభ్రం చేసినట్లు తెలిపారు. ఘాట్ల వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలని డిఎల్పీవో అమ్మాజీని కోరారు. డిఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ విపత్కర పరిస్థితులు ఏర్పడితే భక్తులను గోదావరి నది దాటించేది లేదన్నారు. అంత్య పుష్కరాల్లో విధులు నిర్వర్తిందుకు ఇద్దరు సిఐలు, ఏడుగురు ఎస్సైలు, సుమారు వంద మంది కానిస్టేబుల్స్ ఘాట్ల వద్ద రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. తహసీల్దార్ ఎం ముక్కంటి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ జ్యోతిర్మయి, సిఐ కె బాలరాజు, బోటు సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్, దేవస్థానం ఇవో విశ్వనాధరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ అజయ్‌బాబు, తదితర సిబ్బంది ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి
మండలంలో అంత్య పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన ఘాట్ అయిన పట్టిసంలో బారికేడ్ల నిర్మాణంతోపాటు స్నానాలు చేసే చోట ఐరన్ మెస్‌లు ఏర్పాటుచేశారు. అలాగే భక్తులకు రక్షణగా 8 పడవలను రేవులో ఉంచారు. అలాగే పోలవరంలో మూడు, గూటాలలో రెండు పడవలను సిద్ధంగా ఉంచారు. వీరేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులను గోదావరి నది దాటించేందుకు రెండు లాంచీలను సిద్ధం చేశారు. మండలంలోని 22 ఘాట్ల వద్ద అగ్నిమాపక సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని శుభ్రం చేశారు. పట్టిసం రేవు ప్రారంభంలో ఉన్న ఆర్చిని మామిడి తోరణాలు, పూలతో దేవాదాయ శాఖ అలంకరించనుంది. ఆదివారం ఉదయం పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు గోదావరి నదికి పూజలు నిర్వహించి తొలి స్నానం చేస్తారని అధికారులు ప్రకటించారు.
రుద్రంకోటలో వసతులు కరవు
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని ఏకైక పుష్కర ఘాట్ అయిన రుద్రంకోటలో కనీస వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అంత్య పుష్కరాలకు ఏకైక ఘాట్‌గా రుద్రంకోటను ఎంపిక చేసి, భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా చూడాలని సబ్‌లెక్టర్ షాన్‌మోహన్ ముందుగానే సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం విదితమే. అయినప్పటికీ ఆదివారం ప్రారంభం కానున్న అంత్య పుష్కరాలకు పుష్కర ఘాట్‌లో కనీసం స్నానాలు గదులు, ప్రమాదాలు జరగకుండా పడవలు ఏర్పాటు చేయడంతోబాటు గజఈతగాళ్లను నియమించాల్సిన అధికారులు పట్టించుకోలేదు. సబ్‌కలెక్టర్ ఆదేశించిన రోజే తూతూ మంత్రంగా చెత్తా చెదారం మెట్ల వద్ద తొలగించి, అదే మెట్లను ఫైరింజన్ ద్వారా శుభ్రపరిచి వెళ్లిపోయారు. తదుపరి ఏర్పాటు చేయాల్సిన స్నానాలగదులు, పడవల విషయం పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీ వారు వారి వద్ద గల ఒక తాడును మాత్రం మొక్కుబడిగా కట్టారు. ఈ విషయంపై ఎంపిడిఒ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా ఒక్క ఆర్‌ఐను ఘాట్‌కు అధికారిగా నియమించినట్టు చెప్పారు. ఏర్పాట్లుకు సంబంధించి ఆదేశాలు తమకు అందలేదన్నారు.

అనధికార తూములపై రైతుల ఆందోళన
మొగల్తూరు, జూలై 30: మొగల్తూరు అడవిపర్ర ఆయకట్టు వ్యవసాయ భూముల్లో శనివారం అనధికార తూములు ఏర్పాటు చేయడం పట్ల ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రైతులు విలేకరులకు తెలిపిన వివరాలిలా వున్నాయి. మొగల్తూరు శివారు అడవిపర్ర ఆయకట్టు వ్యవసాయ భూములకు చెందిన తూరలు సంబంధిత అధికారుల అనుమతితో దర్భరేవు డ్రెయిన్‌లోకి నాలుగు తూరలు మాత్రమే వుండేవి. అయితే కొంతమంది స్వార్థం కోసం శనివారం ఉదయం 15 తూములు దర్భరేవు డ్రెయిన్‌లోకి ఏర్పాటుచేశారు. దీంతో ఆయకట్టుకు చెందిన సుమారు 200 ఎకరాల వ్యసాయ భూముల్లో సాగుకు ఉప్పునీరు తగులుతోంది. దీనివల్ల పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై శనివారం అధికారులకు ఫిర్యాదు చేశారు. అనధికార తూరలు ఏర్పాటుచేసినవారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అడవిపర్రు ఆయకట్టు రైతులు హెచ్చరించారు. ఆయకట్టు రైతులు లక్కు సత్యనారాయణ, పోతురాజు చింతయ్య, లక్కు లక్ష్మణరావు, వి.సత్యనారాయణ, ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు.

జెఎన్‌టియుకె రిజిస్ట్రార్‌గా సాయిబాబు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 30: కాకినాడ జెఎన్‌టియు రిజిస్ట్రార్‌గా ఆచార్య సిహెచ్ సాయిబాబు నియమితులయ్యారు. వర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఎస్‌సిడి)గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబుకు రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన ఆచార్య జివిఆర్ ప్రసాదరాజును ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్‌డి)గా నియమించారు. గతంలో వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా పనిచేసిన సాయిబాబు గత రెండేళ్ళుగా ఎపి ఎంసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య సాయిబాబు మాట్లాడుతూ తనపై విశ్వాసం, నమ్మకంతో కీలకమైన రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సలర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్సిటీలో ఏ విధమైన సమస్య వచ్చినా దాని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ వర్గాల సహాయ సహకారాలతో వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిబాబాను వర్సిటీకి చెందిన అధికారులు, ఉద్యోగులు అభినందించారు.