పశ్చిమగోదావరి

ఆన్‌లైన్‌లో ఫిర్యాదుదారునితో సెల్ఫీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 1 : మీ-కోసంలో దరఖాస్తు చేసిన ఫిర్యాదుదారుల సమస్యను పరిష్కరించడానికి అధికారులే నేరుగా ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్లి సెల్ఫీ ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ మీ-కోసం ఫిర్యాదుదారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదు ఇచ్చిన తరువాత అధికారులు మీ వద్దకు వచ్చారా? సమస్య తెలుసుకున్నారా? పరిష్కరిస్తామని హామీ ఇచ్చారా? తదితర ప్రశ్నలను అడిగారు. పనులు చేస్తాం, చూస్తాం, మీ సమస్య పరిశీలిస్తాం అంటున్నారే తప్ప వాస్తవంగా సమస్యలు పరిష్కారం కావడంలేదని పలువురు సమాధానం ఇచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇకపై ఫిర్యాదుదారునికి ఇంటికి వెళ్లి కచ్చితంగా సెల్ఫీ ఫొటోతీసుకుని దాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో డి ఆర్‌వో కె ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీ: ముగ్గురు మృతి!
-మితిమీరిన వేగం తెచ్చిన అనర్ధం
నరసాపురం, ఆగస్టు 1: పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రోడ్డు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సిఐ రామచంద్రరావుతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు సత్రపాలెంకు చెందిన కడలి సత్యనారాయణ (28), పాలా నాగరాజు (24)లు సోమవారం తెల్లవారుజామున బైక్‌పై నరసాపురం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక క్రిస్టియన్ పేటకు చెందిన కర్రా గంగరాజు (20) బైకును బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో కడలి సత్యనారాయణకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు భావ్య, రేణులు ఉన్నారు. గల్ఫ్ దేశంలో ఉపాధికి వెళ్ళి ఇటీవలే తిరిగి వచ్చిన సత్యనారాయణ పాలా నాగరాజును కూడా ఉపాధి కోసం తన వెంట తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృత్యువాడ పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఇంటికి తిరిగి వస్తూ మృత్యువాత పడిన కర్రా గంగరాజు కూలిపని చేసుంటూ జీవిస్తున్నాడు. అతని తల్లి మరియమ్మ ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లింది. సంఘటనా స్థలాన్ని సిఐ రామచంద్రరావు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

త్వరలో జిల్లా రెవెన్యూ వెబ్‌సైట్
-పారదర్శకంగా కార్యకలాపాలు
-ఏలూరు డివిజన్ యాప్ ప్రారంభం
ఏలూరు, ఆగస్టు 1 : జిల్లాలో రెవిన్యూ కార్యకలాపాలన్నీ పూర్తి పారదర్శకతతో ప్రజలందరికీ తెలిసే విధంగా జిల్లా రెవిన్యూ వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఏలూరు ఆర్‌డివో తేజ్‌భరత్ రూపొందించిన ఏలూరు రెవిన్యూ డివిజన్ వెబ్‌సైట్ ఇ-తనిఖీ ఆండ్రాయిడ్ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఇదే మాదిరిగా జిల్లాస్థాయిలో రెవిన్యూ వెబ్‌సైట్‌ను త్వరలోనే రూపొందించి రెవిన్యూ కార్యకలాపాలన్నీ ఎక్కడి నుంచైనా ఎవరైనా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తామని కలెక్టర్ చెప్పారు. రెవిన్యూశాఖ జారీ చేసే ఆదేశాలు, నిర్ణయాలు ఏరోజుకారోజు వెబ్‌సైట్‌లో ఆటోమెటిక్‌గా పొందుపర్చేలా యాప్‌ను తీర్చిదిద్దుతామన్నారు. రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంతాల్లో ప్రజలు కలుసుకున్నా, వాటిని కూడా చిత్రీకరించి వెబ్‌సైట్‌లో పొందుపర్చే నూతన విధానాన్ని ఏర్పాటుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెసి -2 షరీఫ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, ఆర్‌డివో తేజ్‌భరత్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు పెరిగిన రద్దీ
కొవ్వూరు, ఆగస్టు 1: పవిత్ర గోదావరి నది అంత్య పుష్కరాలు రెండవ రోజు సోమవారం స్థానిక గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టంలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానమాచరించారు. సోమవారం పరమ శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టంలో పుణ్య స్నానాలు చేశారు. గోష్పాద క్షేత్రంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అభిషేకాలు చేశారు. గోదావరి నదిలో నీటి మట్టం పెరిగినా భక్తులకు ఏ విధమైన ఇబ్బందీ కలగలేదు. కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు, డిఎస్పీ ఎన్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మన్ సూరపని రామ్మోహన్ గోష్పాద క్షేత్రంలో భక్తులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. ఐసిడిఎస్ సిడిపిఒ వైబిటి సుందరి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బంది పిల్లలకు పాలు, బిస్కెట్లు పంచిపెట్టారు. తిరుమల డెయిరీ పార్లర్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా పాలు అందజేయగా, ఆకివీడుకు చెందిన దాత వానపల్లి బాబూరావు బిస్కెట్లు అందజేశారు. గోదావరి నదికి వరద వస్తున్న దృష్ట్యా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. యాత్రికులకు వైద్య సేవలు అందించేందుకు గాను గోష్పాద క్షేత్రంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో వైద్యుడు శ్రీనివాసు, సిబ్బంది యాత్రీకులకు వైద్య సేవలందజేశారు. ఈ రెండు రోజుల్లో సుమారు 200మందికి మందులు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. స్థానిక విఐపి స్నాన ఘట్టంలో సుమారు వెయ్యి మంది పుష్కర స్నానమాచరించారు. అంత్య పుష్కరాలకు ఒడిస్సా భక్తులు ఇంకా రాలేదు.
జనంలోకి ‘టీం జనసేన’
-ప్రత్యేక హోదాపై అభిప్రాయ సేకరణ-
-పవన్‌కళ్యాణ్‌కు నివేదిక-
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఆగస్టు 1: ప్రత్యేక హోదా.. రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే వినపడుతోంది.. ఇప్పుడు ఈ అంశం అన్ని రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై టీం జనసేన పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒక ప్రత్యేక నివేదికను ఇచ్చేందుకు సిద్ధమైంది. జిల్లాలో రాజకీయ కేంద్రమైన భీమవరం నుండి టీం జనసేన ప్రత్యేక హోదాపై అభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తిచేసింది. భీమవరం వేదికగా టీం జనసేన అధినేత కళ్యాణ్ దిలీప్ సుంకర ఆధ్వర్యంలో టీమ్ జనసేన బృందం అభిప్రాయ సేకరణను ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రత్యేక దృష్టిసారించారు. ప్రత్యేక హోదా రాద్ధాంతం కేవలం రాజకీయ పార్టీలకే పరిమితమా లేదా ప్రజలు కోరుకుంటున్నారా అనే అంశంపై టీం జనసేన అభిప్రాయ సేకరణ చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫార్మెట్‌ను కూడా తయారుచేశారు. ఈ ఫార్మెట్‌లో కుటుంబ యజమాని పేరు, చేస్తున్న పని, కులం తదితర వివరాలను సేకరిస్తారు. దీని ఆధారంగా ఏ వర్గాలకు చెందిన వారు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారనే అంశంపై తేటతెల్లమవ్వనుంది. ఈ అభిప్రాయ సేకరణను భీమవరం నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. పట్టణం నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నివేదికను తీసుకుని జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు నివేదించనున్నారు. ఇప్పటికే కళ్యాణ్ దిలీప్ సుంకర జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. ఈనెల 12వ తేదీన ఆయన్ని కలిసి ప్రత్యేక హోదాపై ప్రత్యేకమైన నివేదికను ఆయనకు అందచేయనున్నారు. ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసిపి నాయకులు, కార్యకర్తల నుండి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. కేవలం రాజకీయాలకే పరిమితమా లేక ప్రజల నుండి ప్రత్యేకహోదా డిమాండ్ వస్తుందా అనే అంశంపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో టీమ్ జనసేన, జనసేన ఫోర్స్ నిమగ్నమై ఉంది.