మెయన్ ఫీచర్

సిరియా అశాంతికి తాత్కాలిక విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియాలో వారం పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా- రష్యా లు ఒక అంగీకారానికి రావడం ఇప్ప టి వరకు సిరియాలో కొనసాగుతున్న రక్తచరిత్రకు తాత్కాలిక విరామం. అంతులేని రీతిలో కొనసాగుతున్న పోరాటం తీరును పరిశీలించేవారెవరైనా ఈమాత్రం ఒప్పందమైనా కుదురుతుందని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. అందువల్లనే ఈ ఒప్పందం వర్తమాన సిరియా చీకటి అధ్యాయంలో ఒక కాంతిరేఖ వంటిదని చెప్పవచ్చు. ఈ కాల్పుల విరమణకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసాద్ సమ్మతించారని రష్యా ఈ సందర్భంగా అమెరికాకు హామీ ఇచ్చింది. ఒకపక్క కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినా సిరియా నేతృత్వంలోని సంకీర్ణ యుద్ధవిమానాలు ఈదిబ్, అల్లెప్పో నగరాలపై బాంబుల వర్షం కురిపించి పెద్ద సంఖ్యలో పౌరులను హతమార్చడం ఈ ఒప్పందాన్ని అపహాస్యం చేయడమే. ఇదిలావుండగా పశ్చిమ, గల్ఫ్ దేశాల మద్దతుతో ఏర్పాటైన ఉన్నత స్థాయి చర్చల కమిటి (హెచ్‌ఎన్‌సి) ఇప్పటికే సిరియాలో శాంతి సాధనకోసం ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం రెండు అగ్రరాజ్యాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఈ కమిటీ సమర్థించింది. అయితే అసాద్ చేత యుద్ధం నిలిపివేయించడంలో రష్యా వత్తిడి ఎంతమేర పనిచేస్తుందనేదానిపై వివిధ పక్షాల్లో సందేహాలున్నాయి. ఈ ఒప్పందంపై ఎవరి అభిప్రాయాలు వారికున్నా, రష్యాకు ఇదొక దౌత్యవిజయమనే చెప్పాలి. ఎందుకంటే అధ్యక్షుడు అసాద్‌కు మద్దతుగా సిరియాలో ప్రత్యక్ష సైనిక చర్యను రష్యా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తనను సమాన భాగస్వామిగా గుర్తిస్తూ ఒప్పందం కుదుర్చుకోవడం రష్యాకు ఆనందం కలిగిస్తున్న ఆంశం.
ఐదు సంవత్సరాలుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా దేశంలోని వివిధ నగరాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది అసువులు బాయగా, దేశ జనాభాలో దాదాపు సగం మంది ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇతర దేశాలకు పారిపోయారు. ఇప్పటికే సిరియా వివిధ దేశాల రాజకీయ క్రీడకు ఆటపట్టయి అతలాకుతలమవుతున్న పరిస్థితుల్లో, పుండుమీద కారం చల్లినట్టు తాజాగా టర్కీ కూడా సైనికంగా సిరియాలో కలుగజేసుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడ టర్కీ లక్ష్యం సిరియన్ కుర్దులు మాత్రమే, ఇస్లామిక్ స్టేట్ కాదు. టర్కీ బలహీనతను అడ్డం పెట్టుకొని సిరియన్ కుర్దులు స్వయం పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడానికి యత్నించడం ఆ దేశ ఆగ్రహానికి ప్రధాన కారణం. అమెరికా కుర్దులకు మద్దతు పలుకుతోంది. భూపోరాటంలో అత్యుత్తమమైన దళాలుగా కర్దులకు పేరుంది. అమెరికా అందిస్తున్న వైమానిక దళ దన్నుతో కర్దులు భూతల యుద్ధంలో దూసుకెళుతున్నారు. ఈ పరిణామంతో డైలమాలో పడిన అమెరికా తేరుకొని టర్కీకి మద్దతు పలికింది. దీంతో ఒట్టొమాన్ సామ్రాజ్య శిథిలాలనుంచి తమ ఆధిపత్యాన్ని క్రమంగా విస్తరింపజేస్తున్న తరుణంలో తాజా అమెరికా చర్య కుర్దులను హతాశులను చేసింది. ఇప్పటివరకు కష్టపడి సాధించుకున్నవి కోల్పోవాల్సి వస్తుందనేది వారి భయం. ఇక టర్కీ అధ్యక్షుడు రీసిప్ తయ్యిప్ ఎర్డొగాన్‌కు తమ దేశంలో కుర్దుల తిరుగుబాటు బెడద ఎట్లాగూ ఉన్నది. పికెకె పేరుతో వ్యవహరించే కుర్దుల తిరుగుబాటు గ్రూపు గతంలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, తమను అణచివేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదంటూ, వాటిని ఉల్లంఘించి కాల్పులకు దిగుతున్నారు.
ఇరాక్‌లో చేతులు కాల్చుకున్న తర్వాత అమెరికా మధ్య ప్రాచ్యంనుంచి బయటపడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో వైమానిక దాడులు తప్ప సైన్యా న్ని రంగంలోకి దింపడం అమెరికాకు ఎంతమాత్రం ఇష్టంలేదు. అందువల్ల ప్రస్తుతం యుఎస్ ఇస్లామిక్ స్టేట్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇక ఈ ప్రాంతం నుంచి ఎంత త్వరగా బయటపడదామన్న దృష్టితో రష్యా ఉన్నది. సంక్లిష్టంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి రష్యాను ముందడుగు వేయనీయడంలేదు. మధ్యప్రాచ్యంలో తన పాత్రను ప్రపంచం గుర్తిస్తే వెనక్కివెళ్లేందుకు రష్యా సిద్ధం. ప్రస్తుత కాల్పుల విరమణ కొనసాగితే ప్రజలకు అత్యవసరమైన ఆహారం, ఔషధాలు, వైద్యచికిత్సలు అందించడానికి వీలవుతుంది. కాల్పుల విరమణ తర్వాత జెనీవాలో చర్చలు జరపడం మరో మార్గం. సంక్లిష్ట స్థితినుంచి సిరియాను బయటపడేయడానికి అవసరమైన మార్గాలను కనుగొనడానికి ఈ చర్చలే సాధనం కాగలవు. అయితే రష్యాతో పశ్చిమ దేశాల సంబంధాలపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. అది రాకుండా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడం ఎంతమాత్రం సాధ్యంకాదు. ఇక అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం జరుగుతోంది. వచ్చే నవంబర్‌లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో, ఒబామా పదవీకాలం ముగింపుదశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం ఏవిధమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదు. ఇక సిరియాలో పోరాడుతున్న హిజ్‌బొల్లా, ఇరాన్‌ల పరిస్థితి మాస్కోకు భిన్నంగా ఏమీ లేదు.
బ్రిటన్ విదేశాంగశాఖ ఛత్రచ్ఛాయకింద, ఉన్నతస్థాయి చర్చల బృందం ఒక ప్రణాళికను ముందుకు తెచ్చింది. దీని ప్రకారం చర్చల కాలపరిమితిని ఆర్నెల్లుగా ఇతి ప్రతిపాదిస్తోంది. 18 నెలలపాటు సిరియాను తన ఆధీనంలో ఉంచుకోవడం, ఈ కాలంలో అసాద్ పదవినుంచి తప్పుకోవాలన్నది కూడా ఈ బృందం ప్రతిపాదన. ఇదే అసలైన కొరుకుడుపడని అంశం. ఎందుకంటే అసాద్ తాను పదవినుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నాడు. తనకు పూర్తిస్థాయి మద్దతు పలుకుతూ అండగా ఉన్న రష్యా ఈ ప్రతిపాదనకు ఒకవేళ తలూపినా, అసాద్ మాత్రం అందుకు ఎంతమాత్రం సుముఖంగాలేడు. ఇక్కడ కీలకమైన అంశం మరోటుంది. మధ్యప్రాచ్య రాజకీయ పరిణామాలన్నీ, ఒకవైపు సౌదీఅరేబియా, గల్ఫ్ దేశాలు, మరోవైపు ఇరాన్, హిజ్‌బొల్లా ఉగ్రవాదుల కూటమిపై ఆధారపడి నడుస్తున్నాయి. సౌదీ అరేబియా నేతృత్వంలోని గల్ఫ్ దేశాలు సున్నీలు కాగా, ఇరాన్, హిజ్‌బొల్లా కూటమి షియాలు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నది ఈ షియా, సున్నీ తెగల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటమే. ఏ దేశం ఎన్ని ప్రతిపాదనలు చేసినా ఇస్లాంలోని ఈ శాఖలమధ్య జరుగుతున్న పోరుకు ముగింపు పలికితే తప్ప, ఏవిధమైన రాజీ ప్రతిపాదనలను ముందుకు తీసుకొని రావడం సాధ్యంకాదు. అందువల్ల ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి దగ్గరి మార్గాలేమీలేవు. సౌదీకి త్వరలోనే కొత్తరాజు రానుండడం, రియాద్ ఆలోచనా ధోరణిలో నూతన మార్పునకు దోహదం చేయవచ్చునన్న ఆశాభావాలు వ్యక్తమవడం సహజమే. ముఖ్యంగా ఆయన సౌదీ అరేబియా సుదీర్ఘ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయాలు తీసుకోవచ్చునంటున్నారు. ముఖ్యం గా చమురుపైనే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఆధారపడిన నేపథ్యంలో కొత్త రాజు ఆలోచనలు దేశ ఆర్థిక భవితవ్యంపైనే కేంద్రీకృతమవుతాయన్న అంచనాలున్నాయి.
ప్రస్తుతం వాహబీ ఇస్లాంను ప్రపంచవ్యాప్తం చేయాలన్నది సౌదీ అరేబియా ప్రధాన లక్ష్యం. అందుకోసం పెద్దమొత్తంలో విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేస్తోంది. కానీ రియాద్ యత్నాలు సానుకూల ఫలితాలివ్వడం మాట అట్లావుంచి, ఎదురు తిరుగుతున్నాయనేది వాస్తవం. ఇస్లామిక్ స్టేట్ పేరుతో చోటు చేసుకుంటున్న ఉగ్రవాద సంఘటనల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు తీవ్ర అసహనానికి లోనవుతున్నాయి. జర్మనీ రాజకీయాల్లోకి ఛాందసవాద సంస్థ దూసుకురావడం కలవరపరిచే తాజా పరిణామం. 1945 తర్వాత జర్మనీలో ఈవిధంగా ఒక ఛాందసవాద సంస్థ వెలుగులోకి రావడం ఇదే ప్రథమం. మధ్యప్రాచ్యంలో రగులుతున్న రావణకాష్టానికి అంతమెప్పుడు? శాంతికాముకుల కోర్కె తీరేదెన్నడనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవలసిందే. ఇదే పరిస్థితి మరింత కాలం కొనసాగితే పరిణామాలు మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం. అంతేకాకుండా ఆసియాపై దృష్టి సారించిన అమెరికా, మధ్యప్రాచ్యంనుంచి ఖాళీచేస్తే ఏర్పడే శూన్యాన్ని పూరించే సామర్ధ్యం సౌదీ అరేబియాకు లేదు.
అరబ్ స్ప్రింగ్ మరీ ముందు అట్లాగని మరీ ఆలస్యంగా రాలేదు. ట్యునీసియాలో తప్ప, మిగిలిన అరబ్ దేశాల్లో నియంతలను పదవీచ్యుతులను చేయడం తప్ప అరబ్ స్ప్రింగ్ వల్ల కలిగిన ప్రయోజనం కూడా ఏమీలేదు. నియంతల స్థానంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు నిలిచి సుస్థిరపాలన అందించిందీ లేదు. ఇందుకు ఉదాహరణగా ఈజిప్టును తీసుకుంటే, అరబ్ స్ప్రింగ్ తర్వాత అధికారంలోకి వచ్చిన ముస్లిం బ్రదర్‌హుడ్ ఏడాదికి మించి కొద్దికాలం మాత్రం అధికారంలో కొనసాగింది. ఇందుకు కారణం దానికి పాలనానుభవం లేకపోవడం, ఏవిధంగా పరిపాలించాలో తెలియకపోవడం. ఎంతసేపూ తన సిద్ధాంతాలనే పాలనలో చొప్పించాలని చూసింది తప్ప, నిజమైన పాలన అందించలేకపోయింది. ఇప్పుడు మొత్తం అరబ్ ప్రపంచానికి సిరియా ఒక హెచ్చరిక సంకేతంగా మారిపోయింది. అక్కడి పరిణామాలు, అరబ్ ప్రపంచాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టివేయడం తథ్యం. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక సమస్యలన్నింటికీ నియంతృత్వం సమాధానం చెప్పలేదు. సిరియా విపక్షాల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. ఎంతసేపూ ఇవి తమ స్పాన్సరర్లచుట్టూ తిరగడం లేదా ఉనికికోసం పాకులాడటం తప్ప ఒరగబెట్టింది కూడా ఏమీ లేదు. ఇక భారత్ విషయానికి వస్తే సిరియాకు జూనియర్ విదేశాంగ మంత్రిని పంపి అక్కడి వ్యవహారాల్లో తనకు పెద్దగా ఆసక్తిలేదన్న సంకేతాలను పంపింది. కాని అక్కడి పరిణామాలపట్ల ఆసక్తి కనబరచేవారి అంచనాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా- రష్యాల మధ్య కుదిరిన ఒప్పందంపై, దురదృష్టంతో పోరాడుతున్న సిరియా ప్రజలకు సహాయంతో పాటు, ప్రపంచ దేశాలు తీసుకునే చర్యలు కూడా ఆధారపడి వుంటాయి. సిరియాలో శాంతి సుదూర స్వప్నమన్న సంగతి అందరికి తెలిసినా, దాన్ని నిజం చేయడానికి, దేశాన్ని తిరిగి నాగరిక జీవనంలోకి తీసుకొని రావడానికి ఈ ఒప్పందం ఒక చిన్న ముందడుగు అనేది ఇక్కడ ప్రధానాంశం.

- ఎస్. నిహాల్‌సింగ్