రంగారెడ్డి

ఉండాలా.. పోవాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 23: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీ బాధితులు ఉండాలా.. పోవాలా.. అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ప్రకటిస్తే లోపాయికారీగా కొందరు ఉండాలని చెబుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఫ్లాట్‌లకు తాళాలు వేసి వెళితే దొంగలు దోచుకుంటారనే రూమర్‌లు నెలకొన్నాయి. బండారి లే అవుట్ కాలనీలో సుమారు 250 అపార్ట్‌మెంట్‌లు ఉండగా వరద ఉద్ధృతికి దాదాపుగా 200 అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలోకి నీరు చేరింది. దీంతో మూడురోజులుగా బాధితులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరం చేసినప్పటికీ కాలనీ లే అవుట్‌ను బ్లేమ్ చేయడానికి కొందరు కుట్రపన్నారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా బాధితులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. మరికొంత మంది బంధువులు దూరప్రాంతాల్లో ఉన్నందున వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితులను బాధితులు అర్థం చేసుకుని ఖాళీ చేయాలని, ముందుచూపు లేకపోతే ఇబ్బందులు తప్పవని ఎప్పటికప్పుడు అధికారవర్గం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు అతి భారీవర్షాలు వస్తాయని, ఫ్లాట్‌లను ఖాళీ చేసి వెళితే వస్తువులను దొంగిలించే ప్రమాదం లేకపోలేదని రూమర్‌లు లేకపోలేదు. శుక్రవారం మధ్యాహ్నం నుండి అనుకూల వాతావరణం నెలకొనడంతో అధికారులు, బాధితులు ఊపిరిపీల్చుకున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షం కురిస్తే తుర్క చెరువుకు గండి పడే అవకాశం లేకపోలేదు. ఎప్పటికప్పుడు అధికారులు బాధితులను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా మూడు రోజులుగా అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో వరదనీరు చేరింది. నీటిని పోలీసులు ఫైరింజన్‌ల ద్వారా తొలగించే ముమ్మరం యత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లలో వరదనీరు అలాగే ఉండటం వల్ల పిల్లర్‌లు కుంగి పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిల్లర్‌లు కదులుతున్నాయని అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాని అధికారుల మాటలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే మొదటి అంతస్తులోకి వరద నీరు చేరుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో కాలనీ బాధితులు భయాందోళనలో కాలాన్ని వెల్లదీస్తున్నారు.
ప్రతి ఏడాది వర్షం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరుచేరితే చెరువులకు గండికొట్టే పరిస్థితులు ఉంటాయి. కాని నిజాంపేట బండారి లే అవుట్ బాధితుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆయకట్టు ప్రాంతంలో వెలసిన ఈ లే అవుట్‌లో సుమారు 250 బహుళ అంతస్తుల భవనాలు ఏర్పడడంతో చెరువు అలుగు ప్రాంతంలో నీరు ముందుకు వెళ్లలేక మూసుకుపోయిన నాలాల కారణంగా ఆ నీటి ప్రవాహం ఈ లేఅవుట్‌పై పడింది. అపార్ట్‌మెంట్‌లన్నింటికీ సెల్లార్‌లు తీయడంతో రోడ్లపై భారీగా ప్రవహించే నీరంతా సెల్లార్‌లకు వెళ్లి అవుట్ లెట్ లేక ఎక్కడికక్కడే నిండిపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో పాటు నిర్వాసితులు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎవరెన్ని చెప్పినా అలుగు ప్రాంతం నుండి సహజ నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ వెంటనే చర్యలు తీసుకోకుంటే శాశ్వత సమస్యగా ఉంటుందని ప్రతిఏటా ఇదే పరిస్థితిని తలపిస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మరో మూడురోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికల మేరకు వర్షాలు కురిస్తే తుర్క చెరువుకు గండిపడే ప్రమాదం లేకపోలేదు. దీని కారణంగా కట్టకు పై భాగంలో ఉన్న ప్రాంతాలన్నీ నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలను అధిగమించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక పునరావాస ఏర్పాట్లు చేసి బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కొంతమంది సహకరించకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. రాబోయే ప్రమాదాలను అంచనా వేసిన ప్రభుత్వం భారీ సంఖ్యలో అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి కేవలం ఈ కాలనీ బాధితుల కోసమే చర్యలు చేపట్టినా వారు చెబుతున్న మాటలను బాధితులు వినకపోవడం అలాగే పొంచిఉన్న ప్రమాదాన్ని అంచనా వేసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అవగాహన కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కొద్దిపాటి స్పందనే కనిపిస్తోంది. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ఈ కాలనీ తుర్క చెరువుకు గండిపడితే ఈ ప్రాంత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ అధికారులు మొరపెట్టుకుంటున్నా కొంతమంది వినకపోవడం అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది.