ఆటాపోటీ

బోర్డు దూకుడుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపారమైన ధన బలంతో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దూకుడుడు బ్రేక్ పడుతుందా? సుప్రీం కోర్టు ఇవ్వనున్న ఆదేశాలు బోర్డు ఉనికినే దెబ్బతీస్తాయా? భారత క్రికెట్ స్వరూపం పూర్తిగా మారిపోతుందా? లోధా కమిటీ సిఫార్సులతో బిసిసిఐలో సంపూర్ణ ప్రక్షాళనకు పునాదలు పడతాయా? బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమర్పించబోయే అఫిడవిట్ ను సుప్రీం కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది? భారత్‌లోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలివి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నదనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు భారత క్రికెట్‌లో పెనుతుపానుకు కారణమయ్యాయి. ఎన్నో ఆసక్తికర మలుపులు తిరిగి సుప్రీం కోర్టుకు చేరిన ఈ కేసులో దోషులుగా తేలిన వారికి పడిన శిక్ష కంటే, బిసిసిఐ ఎదుర్కొంటున్న సవాళ్లే కఠినతరంగా మారాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడంతో కోట్లాది రూపాయలు చేతులు మారే ఐపిఎల్‌లో మరో కోణం బయటపడింది. అంతర్గత విచారణ జరిపించి, స్పాట్ ఫిక్సింగ్ దోషులకు క్లీన్‌చిట్ ఇప్పించడం ద్వారా చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిన బిసిసిఐకి నిషేదిత బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ కోర్టుకెక్కడంతో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టులో పొంతనలేని సమాధానాలు, తప్పించుకునే ప్రయత్నాలతో బిసిసిఐ పరిస్థితిని మరింత జటిలం చేసుకుంది. స్పాట్ ఫిక్సింగ్‌పై అంతర్గత విచారణకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఢిల్లీ పోలీసుల విచారణ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు మెట్లెక్కిన బిసిసిఐ పరోక్షంగా తన గోతిని తానే తవ్వుకుంది. మూల్యం చెల్లించుకుంటున్నది.
ముద్గల్ కమిటీ
స్పాట్ ఫిక్సింగ్ కేవలం క్రికెటర్లకు మాత్రమే పరిమితం కాదన్నది బిసిసిఐ అప్పటి అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా వంటి ఎంతో మంది తెరపైకి రావడంతో స్పష్టమైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన సుప్రీం కోర్టు ఈ కేసును అధ్యయనం చేసేందుకు ముకుల్ ముద్గల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లోనూ కేసును విచారించిన ఈ కమిటీ రెండు విడతల్లో నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా సుప్రీం కోర్టు దోషులను ఖరారు చేసినప్పటికీ, వారిని శిక్షించే బాధ్యతను మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా ఆధ్వర్యంలో అశోక్ బాను, రవీంద్రన్ సభ్యులుగా గల కమిటీకి అప్పగించింది. దానితోపాటు బిసిసిఐ ప్రక్షాళనకు సూచనలు చేయాల్సిన పనిని కూడా కమిటీ భు జాలపై ఉంచడంతో కేసు స్వరూపం పూర్తిగా మా రిపోయింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు ఐపిఎల్ నుంచి నిషేధించిన లోధా కమిటీ మెయప్పన్, రాజ్ కుంద్రాలను జీవితకాలం సస్పెండ్ చేసింది. ఈ పరిణామాలను బిసిసిఐ తట్టుకున్నప్పటికీ, దేశంలో క్రికెట్‌ను ఒక గాడిలో పెట్టడానికి లోధా కమిటీ చేసిన సూచనలతో బెంబేలెత్తిపోయింది. ఈ సూచనల్లో కొన్ని అమలుకు సాధ్యం కాదం టూ వాదనలు వినిపించింది. కానీ, బిసిసిఐ ప్రక్షాళనకు ఉద్దేశించి చేసిన సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఎదురుదాడికి తెగబడింది.
సుప్రీం కోర్టు ఆగ్రహం
కేసు విచారణ సమయంలో బిసిసిఐ చేసిన పసలేని వాదనలు, ప్రదర్శించిన మొండి వైఖరి సుప్రీం కోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. పైగా లోధా కమిటీ ఆదేశాలను పాటించకుండా, ధిక్కార ధోరణిని ప్రదర్శించడం కూడా సుప్రీం కోర్టు ఆగ్రహానికి మరో కారణం. ఒకానొక దశలో కోర్టుతో ఢీకొనడానికి బిసిసిఐ సిద్ధమైంది. లోధా సూచనలను తు.చ తప్పకుండా అమలు చేస్తే, భారత క్రికెట్‌పై తమ ఆధిపత్యానికి గండిపడుతుందనే విషయం బోర్డు పెద్దలకు తెలుసు. అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌సహా చాలా మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు కొంత కాలం లేదా శాశ్వతంగా బోర్డుకు దూరం కావాలి. ఈ వాస్తవాలను జీర్ణించుకోలేపోతున్న బిసిసిఐ చావోరేవో తేల్చుకోవడానికి, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సుప్రీం కోర్టుతోనే తలపడే సాహసం చేసింది.
స్టేటస్ రిపోర్ట్‌తో షాక్
సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్‌ను లోధా కమిటీ సమర్పించడం బిసిసిఐని చావుదెబ్బతీసింది. అంతేగాక, బిసిసిఐ ఖాతాలు ఉన్న బ్యాంకులకు లేఖ రాసి బిసిసిఐని ఎటూ కదల్లేని పరిస్థితిలోకి నెట్టింది. వివిధ సభ్య సంఘాలకు భారీ మొ త్తంలో నిధులు ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయాన్ని లో ధా కమిటీ తప్పుపట్టింది. అందుకే, సాధారణ పాలనకు అవసరమైన మొత్తాలను తప్ప, మిగతా అన్ని రకాల చెల్లింపులను నిలిపివేయాలని బిసిసిఐ ఖాతాలు ఉన్న బ్యాంకులకు లేఖ రాసింది. లోధా కమిటీ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వజ్రాయుధాన్ని బయటకు తీశాడు. డబ్బు లేకపోతే క్రికెట్ సిరీస్‌లను నిర్వహించడం సాధ్యం కాదంటూ, అవసరమైతే న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ను నిలిపివేస్తామని హెచ్చరించాడు. ముందుగా నిర్ణయించిన షెడ్యూ ల్ ప్రకారం మ్యాచ్‌లు జరగకపోతే, క్రికెట్‌ను ఒక మతంలా ఆరాధించే భారత వీరాభిమానులు తీవ్రంగా స్పందిస్తారని, లోధా కమిటీ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో నిరసన వెల్లువెత్తుతుందనేది ఠాకూర్ వ్యూహంగా కనిపిస్తున్నది. అయితే, ఆ వ్యాఖ్యలకు లోధా కమిటీ దీటైన సమాధానమే ఇచ్చింది. బిసిసిఐ బ్యాంకు ఖాతాలను కమిటీ స్తంభింప చేయలేదని గుర్తుచేసింది. సభ్య సం ఘాలకు చేయాల్సిన రెండు భారీ చెల్లింపులను మాత్రమే నిలిపివేయాలని బ్యాంకులను కోరామని, మిగతా ఆర్థిక లావాదేవీలు సజావుగా జరుగుతాయని వివరించింది. చేతిలో డబ్బు లేకపోతే సిరీస్‌లను ఏ విధంగా నిర్వహించాలన్న ఠాకూర్ వాదనలో పస లేదని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలు బిసిసిఐని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. మరోవైపు కమిటీ స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో చేష్టలుడిగిపోయింది. లోధా సిఫార్సులపై 24 గంటల్లోగా తీర్మానాన్ని ఆమోదించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో, ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నది. దసరా సెలవుల రూపంలో బోర్డుకు కొంత ఊరట లభించింది. కానీ, ఈ ఆనందం ఎక్కువ కాలం ఉండదన్నది వాస్తవం.
తప్పించుకోవడం సాధ్యమా?
లోధా సిఫార్సులను అమలు చేయకుండా తప్పించుకోవడం బిసిసిఐకి సాధ్యమా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం చెప్పాలి. సిఫార్సుల్లోని పలు అంశాలపై బిసిసిఐ లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు పట్టించుకోలేదని ఇప్పటికే పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. ‘దారికి రాకపోతే.. దారికి తెస్తాం’ అని సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసిందనంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాసుల పంట పండించే భారత క్రికెట్‌పై పట్టును ఎలాంటి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదన్న తాపత్రయమే తప్ప, పర్యవసానలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది బోర్డు ఆలోచించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బోర్డు అధికారుల ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. కానీ, సుప్రీం కోర్టు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం మినహా బోర్డుకు మరో దారి లేదన్నది నిజం. చాలాకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ సస్పెన్స్‌కు సోమవారంతో తెరపడుతుంది.

- ఎస్‌ఎంఎస్