నిజామాబాద్

సవాలక్ష సమస్యల్లో సర్కారు చదువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 4: నిర్ణీత సమయానికి అనుగుణంగా పూర్తికాని సిలబస్, సర్కారీ బడులలో అరకొర వసతుల నడుమ నెలకొని ఉన్న సవాలక్ష సమస్యలు, ఉపాధ్యాయుల కొరత వంటి కారణాల వల్ల ఈ సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు ఏమేరకు మెరుగుపడతాయన్నది సందేహాస్పదంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలంటూ కలెక్టర్ తరుచూ విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేస్తుండగా, లక్ష్య సాధన నల్లేరుపై నడకేం కాదని స్థానిక పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇదివరకు మూడు సంవత్సరాల నుండి ఫలితాల సాధనలో నిజామాబాద్ జిల్లా ఎంతో వెనుకంజలో ఉండిపోయింది. అంతకుముందు వరుసగా మూడు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిస్తూ హ్యాట్రిక్‌ను సాధించింది. గతేడాది రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ జిల్లా, తిరిగి ఇదివరకటి తరహాలో ప్రథమ స్థానం నిలబెట్టుకోవడానికి తీవ్రంగానే కృషి చేస్తోంది. జిల్లాలో ఉన్నత పాఠశాలల సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోంది. ప్రతి గ్రామంలో ఈ పాఠశాలలను ఏర్పాటు చేసుకోవడానికి విద్యావేత్తల ప్రోత్సాహంతో గ్రామాభివృద్ధి కమిటీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఐదారు సంవత్సరాల కాలంలో ఉన్నత పాఠశాలల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే పెరుగుతున్న పాఠశాలల సంఖ్యకు అనుగుణంగా బోధనా సిబ్బంది నియామకాలు జరుగకపోవడం 10వ తరగతి ఫలితాలకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు గత ఏడాది సాధించిన ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని మరింతగా ముందడుగు వేయాలనే ఆశయంతో జిల్లా యంత్రాంగం విద్యాశాఖ అధికారులను సన్నద్ధం చేస్తూ ప్రణాళికాబద్ధంగా తరగతులు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. అన్ని ఉన్నత పాఠశాలలతో పాటు సంక్షేమ హాస్టళ్లలోనూ ప్రత్యేక తరగతులను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం, సాయంకాలం తరగతులతో పాటు 10వ తరగతి పిల్లలకు స్పెషల్ క్లాసులు నిర్వహించి అహర్నిశలు శ్రమించేలా చేస్తున్నారు.
దీంతో పాటు పరీక్షలకు ముందుగా 40రోజుల ప్రత్యేక పాఠ్య ప్రణాళిక కూడా నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షలంటే పిల్లలకు ఉన్న భయాన్ని తొలిగించడానికి మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడంతో ఫలితాల వెల్లువలో మంచి మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు. అసలే ఈ ఏడాది అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలు జరుగనున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఈ విధానం ద్వారా పూర్తిస్థాయిలో న్యాయం జరిగేందుకు ఆస్కారం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఎవరైన కాపీయింగ్‌కు పాల్పడినా సి.సి కెమెరాల ద్వారా అక్రమాల తంతు బయటపడేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో పరీక్షల నిర్వహకులు కూడా అక్రమాలను ప్రోత్సహించేందుకు అంతగా సాహసించరని భావిస్తున్నారు. అయితే ఈ విధానం పట్ల విద్యార్థుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొని ఉన్నాయి. దీనిని దూరం చేస్తూ వారిని పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించేలా కృషి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. విద్యాబోధన విషయాన్ని పక్కనబెడితే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా సిలబస్ పూర్తికాకపోవడం అవరోధంలా మారింది. అప్‌గ్రేడేషన్ పొందిన పాఠశాలల్లో విద్యా వలంటీర్లను నియామకం చేసినప్పటికీ, చాలా పాఠశాలల్లో కనీస అర్హత లేని, అనుభవం లేని వారిని ఈ పోస్టుల్లో నియమించడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పెరిగిన విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అదనంగా మరో మరికొన్ని పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.
ఎటొచ్చీ ఉపాధ్యాయుల కొరత, సదుపాయాల లేమి వెంటాడుతుండడంతో గత వైభవాన్ని నిలబెట్టుకుంటూ రాష్టస్థ్రాయిలో ప్రథమ స్థానం పొందాలంటే ఆచారణాత్మకమైన ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ యోగితారాణా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అన్ని పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాలని, ఈ మేరకు ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ మిగిలిన రోజులలో విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సమాయత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఆటల్లోనూ
నైపుణ్యత సాధించాలి
కలెక్టర్ సత్యనారాయణ

కామారెడ్డి, డిసెంబర్ 4: చదువుతో పాటు ఆటల్లో సైతం నైపుణ్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘మైవిలేజ్ మోడల్ విలేజ్’ వ్యవస్థపకుడు బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటలకు సంబందించి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఈశిక్షణ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ, చాలా మంది విద్యార్థుల్లో ఎన్నో నైపుణ్యతలు ఉంటాయని, ఇలాంటి వాటిని వెలికి తీసేందుకు ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. విద్యార్థులు నేర్చుకుంటున్న డప్పుకొట్టడం, కోలాటం, డాన్స్, మైక్రోఅర్టిస్టు, తదితర కార్యక్రమాలను కలెక్టర్ వీక్షిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ అందిస్తున్న బాలగౌడ్‌ను కలెక్టర్ అభినందించారు. ఈకార్యక్రమంలో పిడి చంద్రమోహన్, మైవిలేజ్ ఫౌండేషన్ ప్రతినిధి బాల్‌రాజ్‌గౌడ్, తదితరులు ఉన్నారు.

దూకుడు పెంచిన టిఆర్‌ఎస్
ఊపందుకున్న అమాత్యుల పర్యటనలు

నిజామాబాద్, డిసెంబర్ 4: రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికార తెరాస పార్టీ మరింత దూకుడు పెంచింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట మంత్రులు ముమ్మరంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు పదును పెట్టినట్టు స్పష్టమవుతోంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కాలం ముందు నుండి ఈ తరహా హడావుడి కనిపించేది కాగా, ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న తెరాస తీరును చూస్తే ఎన్నికలకు ముందు చేపట్టే ప్రచార సన్నద్ధత వాతావరణాన్ని తలపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. సాధారణంగా అధికార పక్షం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, రెండున్నరేళ్ల పాలన పేరుతో తెరాస కొత్త సాంప్రదాయానికి తెరతీయడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇదివరకటితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్‌ను కూడా ప్రతీచోట అట్టహాసంగా చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా పాల్గొని ఉద్యమ నేత కెసిఆర్ కృషిని చాటుతూనే, స్వరాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదాల్చేందుకు తెరాస సర్కార్ చేపడుతున్న చర్యల గురించి ఏకరవు పెట్టారు. రెండు రోజులు గడువకముందే రెండున్నరేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకుని ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. క్షేత్ర స్థాయి నుండి మొదలుకుని రాష్ట్ర కమిటీ వరకు పార్టీ శ్రేణులంతా పాల్గొనేలా పకడ్బందీ చర్యలు చేపట్టడంతో ప్రతీచోట గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే సాధారణానికి ముందస్తుగానే 2018లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయేమోనని పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ఎన్నికల మాటెలా ఉన్నప్పటికీ, తెరాస ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు కూడా విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ, ముప్పేట దాడిని ముమ్మరం చేసిన నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు అధినేత ఆదేశాల మేరకు తెరాస శ్రేణులు కూడా దూకుడును పెంచుతూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలను తీవ్రతరం చేసినట్టు స్పష్టమవుతోంది. రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వల్లె వేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఆయా రంగాల్లో జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, వాటిని అధిగమించేందుకు కెసిఆర్ సర్కార్ సాగిస్తున్న కృషిని వివరిస్తున్నారు. ప్రధానంగా సాగు రంగానికి తొమ్మిది గంటల విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు సన్న బియ్యం పంపిణీ, ఆసరా పెన్షన్లు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో గత కొన్నాళ్ల నుండి మంత్రులు ముమ్మరంగా పర్యటిస్తున్నారు. భిక్కనూరులోని తెలంగాణ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన వసతి గృహాల భవన సముదాయాలను ప్రారంభించేందుకు శనివారం డిప్యూటీ సిఎం, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హాజరవగా, ఆయనతో కలిసి జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరోజు ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముదిరాజ్ మహాగర్జన సభలో పాల్గొనేందుకు ఇందల్వాయికి హాజరయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కోసం పర్యటించి తెరాస ప్రభుత్వ పనితీరు, చేపడుతున్న కార్యక్రమాల గురించి విస్తృత ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు కూడా నిజామాబాద్ మీదుగానే రాజధానికి రాకపోకలు సాగిస్తూ తరుచూ స్థానికంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా తెరాస ప్రచార కార్యక్రమాలు ఊపందుకుని ముందస్తు ఎన్నికల వేడిని రాజేస్తుండడం చర్చనీయాంశమవుతోంది.

రోడ్డు దిగని బస్సులు
* వృథాగా బస్టాండ్‌లు * మళ్లీ మొదటికొచ్చిన డ్రైవర్ల తీరు
ఇందూర్, డిసెంబర్ 4: ప్రయాణీకుల సౌకర్యార్థం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌లు ఎడపల్లి మండలంలో నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. మండలంలోని జానకంపేట గ్రామంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద నాడు దాదాపు 10లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ఆది నుండీ నిర్లక్ష్యానికి గురవుతోంది. 16 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బస్టాండ్ స్థల వివాదం కారణంగా కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణ ప్రాంగణం ఆవరణ అంతా పెంటకుప్పలతో నిండి ఉండేది. ఆ వివాదం సమసిపోయిన అనంతరం ఆర్టీసీ అధికారులు ఈ బస్టాండ్ గురించి పట్టించుకోవడమే మానేశారు. ప్రస్తుతం ఈ బస్టాండ్ ఓ చిట్టడవిలో ఉన్నట్లుగా తయారైంది. బస్టాండ్ చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో, మురికి గుంతలతో, పూర్తిగా అపరిశుభ్రంగా మారింది. బస్టాండ్ లోనికి బస్సులు వెళ్లే రహదారి బండరాళ్లు, గుంతలతో, వాటిలో మురికినీరు చేరి అసౌకర్యంగా మారింది. ఫలితంగా బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో స్పందించిన గ్రామస్థులు, యువకులు గత సంవత్సరం శ్రమదానం చేసి బస్టాండ్ ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. అనంతరం బస్సులను బస్టాండ్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక సర్పంచ్ ఆర్టీసీ ఆర్‌ఎం, డిఎంల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పక్షం రోజుల పాటు బస్టాండ్ లోనికి వచ్చిన బస్సులు, ఆ తర్వాత మళ్లీ రోడ్డు దిగడం మానేశాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ వున్నా, బస్సులు రోడ్డుపైనే ఆపుతుండడంతో ప్రయాణికులు బస్టాండ్ ఆవరణను వదలి రోడ్లపైనే బస్సుల రాక కోసం నిలబడుతున్నారు. ఎండకు, వానకు ఇబ్బందులుపడుతూ రోడ్డుపై బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది.
పిల్లలతో రోడ్డుపై నిలబడటం వలన తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగి పిల్లలు గాయపడుతున్నారు. ఈ బస్టాండ్‌లో ప్రయాణీకుల కోసం సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మూడు మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ బస్టాండ్‌లో కంట్రోలర్ లేడు. మరుగుదొడ్లు అసలే లేవు. తాగడానికి మంచి నీరు కూడా కరువే. చీకటిపడితే లైట్లు వెలగవు. వర్షాకాలంలోనైతే చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు, ముళ్ల పొదల నుండి విష సర్పాలు వచ్చి బస్టాండ్‌లో సంచరిస్తాయి. దీంతో రాత్రి సమయాల్లో ప్రయాణీకులు బస్టాండ్ లోనికి వెళ్లాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే తమ భూములను ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులకు అప్పగిస్తే, బస్టాండ్ కనీస సౌకర్యాలు కల్పించకపోగా, బస్సులు కూడా బస్టాండ్ లోపలకు రావడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ బస్టాండ్ అభివృద్ధి గురించి, పరిశుభ్రత గురించి, సౌకర్యాల కల్పన గురించి పలుమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వెలిబుచ్చారు. ఫలితంగా ప్రైవేటు వ్యక్తుల వాహనాలకు పార్కింగ్ స్థలంగా, రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, బస్టాండ్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం వౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేదంటే ఆర్టీసీకి అప్పగించిన స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, మండల కేంద్రంలోని ఎడపల్లి బస్టాండ్‌లోకి సైతం బస్సులు రాకపోవడం లేదని గ్రామస్థులు తెలిపారు. దీంతో లక్షలాది రూపాయలు వచ్చించిన నిర్మించిన ఈ బస్టాండ్ యాచకులకు నిలయంగా మారిందని ప్రయాణీకులు, ప్రజలు పేర్కొంటున్నారు. బోధన్ ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు బస్టాండ్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు, ప్రజలు కోరుతున్నారు.

‘టఫ్’ కార్యాలయం నుండే
జనశక్తి కార్యకలాపాలు

ఎస్పీ శే్వత

కామారెడ్డి, డిసెంబర్ 4: హైదరాబాద్‌లోని టఫ్(తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్) కార్యాలయం నుండి జనశక్తి కార్యకలాపాలు సాగుతున్నాయని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, మాచారెడ్డి మండలం రాజ్‌ఖాన్‌పేట్‌లో మార్చి 23, 2015లో జనశక్తి నక్సలైట్లు సమావేశం అయినట్లు అప్పట్లో సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఆ సమయంలోనే ఆరుగురు జనశక్తి నక్సలైట్లను అరెస్ట్ చేశామని అన్నారు. అప్పటి కేసులో ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు బీమ్‌భరత్ హైదరాబాద్‌లోని షాబాద్‌లో ఉంటున్నాడని, ఈనెల 2న కామారెడ్డికి వచ్చినట్లు సమాచారం అందినట్లు వెల్లడించారు. సమాచారం మేరకు దాడి చేసి కామారెడ్డిలో భీమ్‌భారత్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 20డిటోనేటర్లు, విప్లసాహిత్యం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అనంతరం అతను అందించిన సమాచారం మేరకు టఫ్ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో పలు విప్లసాహిత్యాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇదే కేసులో మరో పదిమందిపై కేసులు ఉన్నాయని, ఈ పదిమందిలో జనశక్తి అగ్రనేతలైన రాజన్న, అమర్, విమలక్క, ఆనంద్, మల్లేశం, వీరస్వామి, నారాయణదాస్, సురేష్, అబ్బన్న, శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారని అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటాం
ప్రజలతో మమేకమవుతాం * ఎల్లారెడ్డి డిఎస్పీ కొత్తపల్లి నర్సింహ
ఎల్లారెడ్డి, డిసెంబర్ 4: ప్రజలకు అందుబాటులోఉంటూ సేవలు అందించడమే ప్రెండ్లీ పోలిసింగ్ లక్ష్యమని ఎల్లారెడ్డి డిఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోకోత్తగా ముస్తాబైన డిఎస్పీ కార్యాలయం భవనాన్ని పూజారి సంగప్పచే ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం డిఎస్పీ ఛాంబర్‌ను ఎంపిపి నక్కగంగాధర్, జడ్పీటిసి సభ్యులు చినబాలి సామెల్‌తోకలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆతర్వాత ఛాంబర్‌లో విలేఖరులతోమాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకోసమే జిల్లాల పునర్విభజన చేయడం జరిగిందని, దీంట్లోబాగంగా ఎల్లారెడ్డిని డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజన్ పోలీస్ కార్యాలయం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లోని చిన్నగదిలోదాదాపుగా 40 రోజుల పాటు తాత్కాలికంగా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత నీటిపారుదల శాఖ భవనాన్ని పూర్తిస్థాయిలోమరమ్మత్తులు చేసి డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రజలకు అందుబాటులోఉంటూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మూఢనమ్మకాలను నమ్మవద్దని, అటువంటి వాటిపై ఇంద్రజాల ప్రదర్శనలు ఇప్పించిప్రజలను చైతన్య వంతం చేయడం జరుగుతోందన్నారు. మహిళలపై ఆకతాయిల వేధింపులను అరి కట్టేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోఒకటి, ఎల్లారెడ్డిలోడివిజన్ కేంద్రంలోఒక షీటీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకోసం షీ టీం బృందాలు ఎల్లావేళలా సిధ్దంగా ఉంటాయన్నారు. ఎక్కడైన మహిళలకు పోకిరీలు ఆకతాయి పనులు చేస్తుంటే వెంటనే వాట్సప్ నంబర్ 8985333321 కు సమాచారం అందిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐలకు సమాచారం అందుతోందన్నారు.
నూతనంగా ఏర్పడిన డివిజన్ కేంద్రంలోకార్యాలయం ఏర్పాటు కావడంతోప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువలోఉంటాయన్నారు. ఎవరికైన సమస్య ఉంటే వెంటనే తన సెల్ నంబర్ 9440895000కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని అన్నారు. త్వరలోనే డివిజన్ పరిధిలోని ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌కింద ఎంపిక చేసుకుని డిజిటల్ గ్రామంగా అబివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలోవైస్‌ఎంపిపి నునుగొండ శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు షకావత్‌అలీ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రవణ్‌కుమార్, సర్కిర్ పరిధిలోని సదాశివనగర్ సిఐ శ్రీశైలం, ఎస్‌ఐలు శ్రీ్ధర్‌రెడ్డి, పూర్ణేశ్వర్, నాగరాజు, రాజశేఖర్, రవికుమార్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు. నూతన డిఎస్పీకార్యాలయంలోడీఎస్పీగా చార్జి తీసుకోవడంతోసర్కిల్ పరిధిలోని సిఐ, ఎస్‌ఐలు డిఎస్పీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.