రంగారెడ్డి

స్నాచర్లపై తిరగబడ్డ వృద్ధురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 8: వృద్ధురాలి కంట్లో కారం చల్లి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి దత్తాత్రేయనగర్‌లో గురువారం జరిగింది. చైన్‌స్నాచర్లను ప్రతిఘటించి మూడు తులాల బంగారు గొలుసులో రెండు తులాలను కాపాడుకున్న వృద్ధురాలి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌సినగర్ పంచాయతీ దత్తాత్రేయనగర్‌కు చెందిన చందుపట్ల హంసమ్మ అదే కాలనీలో ఉంటున్న వాలెటీ సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనేందుకు వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా షూటింగ్ బిల్డింగ్ సమీపంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు గుర్తు తెలియని యువకులు వెనుక నుండి వచ్చి వృద్ధురాలి కంట్లో కారం చల్లారు. దీంతో కళ్లు మూసుకున్న వృద్ధురాలి మెడలోని మూడు తులాల గుండ్ల గొలుసును లాక్కున్నారు. విషయం గ్రహించిన వృద్ధురాలు తన గుండ్ల గొలుసును రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వారిపై తిరగబడి అరిచింది. దీంతో చైన్ స్నాచర్లు చేతికందిన ఒక్క తులం గొలుసు ముక్క ఎత్తుకెళ్లి పోయారు. అరుపులు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే దుండగులు పరారు అయ్యారు.
బాధితురాలి కుమారుడు చందుపట్ల నర్సింహ్మరెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచర్లు 19 నుండి 20 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారని వృద్ధురాలు పేర్కొంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
వికారాబాద్, డిసెంబర్ 8: దివ్యాంగుల సమస్యలు, ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం 500 రూపాయల పింఛనును రూ.1500కు పెంచిందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునితామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, గ్రామీణ ఉపాధిహామీ, సెర్ఫ్, స్ర్తి శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల వారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి సంక్షేమ పథకంలో దివ్యాంగులు లబ్ధిపొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని తమ సహకారం ఎల్లపుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని సౌకర్యాలున్నప్పటికీ సకలాంగులు చేయని పనులు దివ్యాంగులు చేసి ఎన్నో విషయాల్లో విజయం సాధించారని పేర్కొన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ వస్తువులను వాడటం మూలాన ఎన్నో నష్టాలకు గురవుతున్నామని, వాటి వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య మాట్లాడుతూ దివ్యాంగులపై జాలి చూపకుండా చేయూతనివ్వాలని సూచించారు. తమ వైకల్యాన్ని అధిగమించి మందుకు వెళ్ళాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపర్చుకోవడంలో మధ్యవర్తులు, పైరవీకారులను ఆశ్రయించకూడదని స్పష్టం చేశారు. దివ్యాంగులు సకలాంగులను వివాహం చేసుకున్నట్టయితే వారికి ప్రోత్సాహక బహుమతిగా ప్రభుత్వం నుండి 50 వేల రూపాయలు చెల్లించనున్నట్టు తెలిపారు. దివ్యాంగులు సంఘాలు ఏర్పాటు చేసుకుని వారి సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సదరం సర్ట్ఫికెట్లు, పింఛను అందిస్తామని, ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు అందించడంతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ సైతం ఇవ్వనున్నట్టు వివరించారు. సదరం క్యాంపులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేస్తామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఇది చిన్న జిల్లాగా ఏర్పడిందని ఇక్కడ మంచిగా పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పిడబ్ల్యు జాన్సన్ మాట్లాడుతూ దివ్యాంగులు ఇప్పటికీ 60 శాతం సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయని చెప్పారు. జిల్లా సంక్షేమాధికారి జికె సునంద మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగవైకల్యం రావడానికి గల కారణాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కొడంగల్‌కు చెందిన ఐదు దివ్యాంగుల సంఘాలకు రూ.3.50 లక్షల బ్యాంకు రుణాల చెక్కులతో పాటు మూడు చక్రాల సైకిళ్లు, సంకకర్రలు, వినికిడి పరికరాలు, అంధుల చేతికర్రలు, 87 సదరం సర్ట్ఫికెట్లు, బస్‌పాస్‌లను జడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్ అందజేశారు. ఉపాధి హామీ పనుల్లో ఎక్కువ రోజులు పనిచేసిన దివ్యాంగులను సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటిసి ముత్తార్‌షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎంకెఐ అలి, ఎంపిడివో సత్తయ్య, డిపిఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.

20లోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలి
కీసర, డిసెంబర్ 8: అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పనులను ఈనెల 20లోగా పూర్తి చేయాలని అధికారులను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గోదావరి జలాల ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. తహశీల్ధార్‌లు డబుల్ బెడ్‌రూం నిర్మాణాలకు అవసరమైన చోట్ల ప్రభుత్వ స్థలాలు గుర్తించి, గృహ నిర్మాణ శాఖ అధికారులకు స్థలాలను స్వాధీన పరచాలన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు త్వరిత గతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మార్కెటింగ్‌లో రైతులుకు మైక్రో ఏటిఎంలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనుమతులు లేకుండా బోరుబావులు వేసే వారిపై తహశీల్ధార్‌లు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో పరిశ్రమలు స్ధాపించేందుకు ప్రభుత్వ భూములు గుర్తించాలని అధికారులను కోరారు. గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు అన్యాక్రాంతమైనట్లుగా తెలిస్తే అట్టి భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు వరి పంటను పండించకుండా వాణిజ్య పంటలపై దృష్టి సారించేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులకు అందించాలని సూచించారు. మేడ్చల్ జిల్లా నగరానికి అతి చేరువలో ఉన్నందున వాణిజ్య పంటలు పండించాలని అన్నారు. ఎకరా వరికి సరిపోయే నీటితో మూడు ఎకరాల్లో వాణిజ్య పంటలు పండించవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కల్టెర్ ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సంధ్యారాణి, డిపిఓ సురేశ్‌మోహన్, ఆర్‌డిఓలు మణిమాల, నర్సింహారెడ్డి, మిషన్ భగీరథ పిడి నరేందర్‌రెడ్డి. గృహ నిర్మాణ పిడి బలరామ్ పాల్గొన్నారు.

సదరం క్యాంపు వాయిదా.. సమాచారం ఇవ్వలేదని వికలాంగుల ధ్వజం
తాండూరు, డిసెంబర్ 8: తాండూరు జిల్లా ఆసుపత్రిలోప్రతి గురువారం డిఆర్‌డిఏ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించే సదరం క్యాంపు.. వికలాంగుల నిర్థారణ పరీక్షల శిబిరం ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాయిదా వేయటంతో సదరం క్యాంపు కొనసాగుతుందని వచ్చిన వందలాది మంది వికలాంగులు, సహాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వికలాంగత్వం నిర్థారణల కోసం సుదూర ప్రాంతాల నుంచి వందల రూపాయలు ఖర్చు చేసుకుని వచ్చామని అమన్నారు. తాండూరు డివిజన్ ప్రాంతం వికలాంగులతోపాటు, జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన అన్ని రకాల అంగవైకల్యం కల్గిన వికలాంగులు సదరం క్యాంపునకు తరలి వచ్చారు. కాగా ప్రతి గురువారం తాండూరు జిల్లా ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంపును ఈవారం వాయిదా వేస్తున్నట్లు జిల్లా అధికారులు, సదరం క్యాంపు నిరాహాకులయిన డిఆర్‌డిఏ, అధికారులు ముందస్తు సమాచారం లేకుండా వాయిదా వేయడం ఏమిటనీ వికలాంగులు, వారి సహాయకులు మండిపడ్డారు. తాండూరు జిల్లా ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు రోడ్డుపై బైఠాయించి గంటన్నర సేపు ధర్నా నిర్వహించారు. దాంతో జిల్లా ఆసుపత్రి పరిసర రహదారులన్ని స్తంభించి ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న తాండూరు పట్టణ ఎస్‌ఐలు నాగార్జున, రాజు తమ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఎంత వారించినా వికలాంగులు బేఖాతర్ చేస్తూ తమ బాధలు ఏకరువు పెట్టారు. ఆర్థోపెడిక్ డాక్టర్లు, డిఆర్‌డిఏ, అధికారులు తమ అవస్థలు గ్రహించటం లేదని ఆరోపించారు. అంగవైకల్యం నిర్థారణలో సంబంధిత అర్థోపెడిక్ డాక్టర్లు తగినంత మంది ఉండకుండా ఒకే ఓక్క డాక్టర్.. వికలాంగ నిర్థారణ పరీక్షలు తనకు ఇష్టమైనంత సేపు చేస్తూ వికలాంగులను మళ్లీ గురువారం రండి అంటూ వెళ్లగొడుతున్నారని విమర్శించారు. సమాజంలో నిరాధరణకు, చిదరింపులకు గురవుతున్న తమకు కనీసం అధికార యంత్రాంగం కూడా సహకరించి తోడ్పాటు అందించక పోవడం చాలా దారుణం అంటూ పలువురు గోడు వెళ్లబోసుకున్నారు. తాండూరు డివిజన్‌లోని పల్లెలు గిరిజన తండాల నుండే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాలవారు జిల్లాల పునర్విభజన కాకముందు నుంచి వస్తుంటారు. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో విలీనమైన చెవేళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాలకు చెందిన వికలాంగులు, అంధులు, చెవిటి మూగ, మతిస్థిమితం లేనివారు, వికలాంగులయిన చిన్నారులు దాదాపు మూడు వందల మంది వరకు గురువారం సదరం క్యాంపులో పాల్గొని అంగవైకల్యం నిర్థారణ పరీక్షలు చేయించుకునేందుకు వచ్చి అధికారులు వైద్యుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఆందోళనలు, ధర్నాలకు దిగుతున్నారు.
ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ భాగ్యశేఖర్‌ను సంప్రదించి తాండూరు పట్టణ పోలీసులు ఆందోళనకు దిగిన వికలాంగులను సముదాయించి ఆందోళన విరమింప జేశారు. తాండూరు సదరం క్యాంపు ఇన్‌చార్జి బందెయ్యను పిలిపించి ఆర్థోపెడిక్ డాక్టర్ల చేత వికలాంగ నిర్థారణ పరీక్షలను తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపు కున్నట్లు సమాచారం.

యుద్ధప్రాతిపదికన ట్రాఫిక్ క్లియర్‌కు చర్యలు

ఉప్పల్, డిసెంబర్ 8: ఉప్పల్ ప్రధాన రహదారిలో యుద్ధప్రాదిపదికన ట్రాఫిక్ క్లియర్ చర్యలను చేపట్టాలని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో తీర్మానించారు. గురువారం జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇఇ నిత్యానందం, ఎఎంహెచ్‌ఓ డాక్టర్ స్వామి, డిఇలు హన్మంత్‌రెడ్డి, ఏసిపి నాగిరెడ్డి, విఓ కృష్ణప్రసాద్, ఎఇలు దామోదర్, శ్రవణ్‌కుమార్, బాజీ షహీద్‌ఖాన్, ఇఇలు సరస్వతి, ఏకాంబరం, విద్యుత్ శాఖ ఎడిఇ యుగంధర్, డిఎఓ ఉషారాణి, ఐలా అధికారి సందీప్‌రెడ్డి, జమ మండలి డిజిఎం డేవిడ్ రాజు, మేనేజర్ రవి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య, ఎస్‌ఐలు హరీశ్వర్‌రెడ్డి, ఆర్టీసి, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొని పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు. ప్రధానంగా ఇరుకైన ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిల్కానగర్ చౌరస్తా, గాంధీ విగ్రహం, శాంతినగర్ వద్ద ఉన్న బస్టాప్‌ను దూర ప్రాంతానికి తరలించాలని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడ్డారు. తరలిస్తే ప్రయాణికులు ఇబ్బందులు పడుతారని ఆర్టీసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. డివైడర్ల మూసివేతతో అవస్థలు పడుతున్న నేపధ్యంలో రహదారి వెడల్పు తప్పదని పేర్కొన్నారు. అప్పటి వరకు రహదారికి ఇరువైపుల ఫుట్‌పాత్‌లను వెడల్పు చేసి మరమ్మతులను చేపట్టాలని ఆర్‌అండ్‌బి అధికారులను కోరారు. రింగ్‌రోడ్డు నుంచి నల్లచెరువు వరకు నిత్యం పెరిగిన వాహనాల రద్ధీ కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, మట్టి రోడ్లకు మరమ్మతులు చేస్తే సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఐలా పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని, ప్రధాన రహదారిలో వ్యర్థ పదార్ధాలను వేయకుండా నిఘా పెట్టాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పరిశుభ్రతను పాటించేలా పారిశ్రామికవేత్తల్లో చైతన్యం కలిగించాలని పేర్కొన్నారు. జల మండలి, విద్యుత్, టెలీఫోన్, ఇతర విభాగాలకు సంబంధించిన పైపులైను పనులు చేపట్టాలనుకుంటే ముందుగానే ప్లానును సంబధిత అధికారులకు చూపించినట్లయితే ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. ప్రధాన రహదారిలో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేయాలని సమావేశంలో పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలైనా సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు చేయూతను అందించాలని తీర్మానించారు. చెరువు, కుంటలలో ఎఫ్‌టిఎల్‌ను ఏర్పాటు చేసి కబ్జాలు కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.