మెయన్ ఫీచర్

బ్రిటన్ ‘లక్ష్య’సాధనకు ‘మాధ్యమం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృభాషా దినోత్సవాలకు ప్రాధాన్యం తగ్గిపోతుండడం నడచిపోతున్న చరిత్ర. ప్రాధాన్యం పెరగడం కాని, తగ్గడం కాని సాపేక్షం! ప్రచారం ‘గీటురాయి’గా మాతృభాషల ప్రాధాన్య ప్రభలు కొడిగట్టిపోయాయి.. మమకారం ‘గీటురాయి’గా మాతృభాషల ప్రాధాన్యపు వెలుగులు కొడిగట్టలేదు! ఈ కొడిగట్టని ప్రాధాన్యానికి మాధ్యమాలలో ప్రచారం లేదు! భాషా పరిరక్షణకు తద్వారా భావజాలం పరిరక్షణకు కాక ‘ప్రసిద్ధుల’ భాగస్వామ్యానికి మాత్రమే ప్రాచుర్యం లభిస్తోంది! మంత్రివర్యుడో మంత్రి సముడో ‘మాతృ భాషా దినోత్సవం’లో పాల్గొన్నట్టయితే దృశ్యమాధ్యమ ప్రతినిధులు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ముఖ్యమంత్రి కాని కేంద్ర మంత్రి కాని మాతృభాషా దినోత్సవ వేదికలపై ఉపస్థితులయినట్టయితే హడావుడి స్థాయి, ఆర్భాటం హోరు మరింతగా పెరిగిపోతాయి. మాతృభాషలకు ప్రాధాన్యం పెరిగిందన్న ప్రచారానికి ఇదీ ప్రాతిపదిక! మాధ్యమాల ‘కెమెరా’ల వెనుక కూర్చున్న వారికి వేదిక మీద జరిగే విన్యాసాల పరంపర దృశ్యమానం కాకపోవడం ‘ప్రాధాన్యం’ పెరిగిందనడానికి ప్రాతిపదిక! కొనే్నళ్లపాటు దేశమంతటా మాతృభాషా దినోత్సవాలకు ‘ఇలాంటి’ ప్రాధాన్యం బాగా పెరిగింది. ‘ఇలాంటి ప్రాధాన్యం’ అని అంటే సభలలో ‘దృశ్యమాధ్యమ ప్రతినిధుల చిత్రీకరణ యంత్ర వ్యవస్థ’ వెనుక కూర్చున్న వారికి వేదికలు కనపడని ప్రాధాన్యం అని అర్థం.. కానీ గత రెండేళ్లుగా ఇలాంటి ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. శిశువుల స్థాయి - ఎల్‌కెజి- పాఠశాల నుంచి స్నాతకోత్తర స్థాయి- పిజి- కళాశాలల వరకు విద్యాబోధనను ఆంగ్ల భాషామాధ్యమం ద్వారా నిర్వహించడానికి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల వారు నడుములను బిగించి ఉండడం మాతృభాషా దినోత్సవాలకు నేపథ్య వైపరీత్యం! ప్రాథమిక స్థాయి బోధనకు సైతం మాతృభాషలు పనికిరాకుండా పోయిన తరువాత మాతృభాషాదినోత్సవ సభలకు ప్రభుత్వాల దృష్టిలో, ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల దృష్టిలో, ప్రతిపక్ష ప్రముఖుల దృష్టిలో ప్రాధాన్యం తగ్గిపోవడం సహజం! తెలుగు తదితర భారతీయ భాషలు వ్రాయలేని, వ్రాయని శిశువులను తయారుచేస్తున్నవారు మళ్లీ వేదికలెక్కి మాతృభాషల ప్రాధాన్యాన్ని గురించి ఎలా ప్రసంగించగలరు? ప్రసంగించే నైతిక అధికారం తమకు లేదని ప్రభుత్వ నిర్వాహకులు గ్రహించారు. అది వారి చిత్తశుద్ధికి నిదర్శనం. అందువల్లనే ప్రభుత్వాల, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో మాతృభాషాదినోత్సవాలను ఆర్భాటంగా నిర్వహించే సంప్రదాయం కొడిగట్టింది. మాతృభాష కంటె రాజకీయవేత్తలు తమ ‘నైతిక అధికారానికి’, చిత్తశుద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు...
ప్రభుత్వంతో సంబంధం లేని రాజకీయవేత్తలలో ప్రముఖులు కూడ మాతృభాషల పట్ల ముఖం చాటేస్తుండడం నడుస్తున్న చరిత్ర! ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలకు భయం చుట్టుకుంది! స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సాహిత్య సంస్థలు, సాంస్కృతిక సంస్థలు కొన్నిచోట్ల ‘మాతృభాషా దినోత్సవాల’ను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలవారు మంత్రులను, ఉన్నతోన్నత అధికారులను తమ సభలకు ఆహ్వానిస్తున్నారు. మంత్రులు ప్రముఖ అధికారులు వస్తే వారివెంట కొంతమంది ‘అభిమాన గణం’, అక్షర మాధ్యమాల, దృశ్యశ్రవణ మాధ్యమాల ప్రతినిధి బృందాలు సభలకు వస్తారన్నది ‘నిర్వాహకుల’ అత్యాశ! సాంస్కృతిక సభలకు ఇలా అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు వస్తున్నారు కూడ. ఎలా వస్తున్నారు? సభ మొదలైన తరువాత మంత్రిగారు, వారి వెంట రాజకీయ అభిమానులు హడావుడిగా నడుచుకుంటూ సభలో ప్రవేశిస్తారు. కలకలం లేదా కోలాహలం మొదలైపోతుంది. హఠాత్తుగా ఇలా అభిమానులతో కలసి సభలలోకి చొరబడిపోవడం, సమయపాలన చేయకపోవడం అంటే- చెప్పిన సమయానికి రాకపోవడం మంత్రులు, మంత్రి సములు మాత్రమే కాదు ప్రతిపక్షాల, మిత్రపక్షాల రాజకీయ ప్రముఖులు సైతం పాటిస్తున్న సంప్రదాయం. అందువల్ల ఈ ‘రాజకీయవేత్త’ అడుగుపెట్టగానే, అప్పటివరకు ప్రసంగిస్తున్న ‘మేధావి’ని తన ప్రసంగం తక్షణం ఆపివేయాలని నిర్వాహకులు ఆదేశిస్తారు! ఎందుకంటె మంత్రిగారు లేదా ప్రభుత్వ పక్ష, విపక్ష నాయకుడు మాట్లాడాలి! తనకంటె పూర్వం ఎవరు ఏమి మాట్లాడారో తన తరువాత ఎవరు ఏమి చెబుతారో తెలియని ఈ ‘రాజకీయవేత్త’ సభా ఇతివృత్తంతో సంబంధం ఉన్న, సంబంధం లేని అనేక అంశాలను ఉద్ఘోషిస్తాడు! వెంటనే సమ్మానం గ్రహించి లేదా వేదిక మీది వారిని సమ్మానించి వచ్చినప్పటి ఆర్భాటానికి రెట్టింపు ఆర్భాటంతో వేదిక దిగి వెళ్లిపోతాడు, ఆయనతోపాటు అనుచరశ్రేణులు, వందిమాగధులు, మాధ్యమాల మిత్రులు అంతే వేగంగా, అంతే నిర్లక్ష్యంగా వీపులను వేదికకు చూపించి బయటికి నడుచుకుంటూ వెళ్లిపోతారు. ఈ రాజకీయపు చొరబాటుకు ముందు, ఉడాయింపు తరువాత సాహిత్య సాంస్కృతిక సభలలో ఎవరు దేన్ని గురించి ఏమి మాట్లాడారన్నది బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.. అక్షర మాధ్యమంలో అచ్చుకాదు, శ్రవణ మాధ్యమాలలో వినిపించదు, దృశ్యమాధ్యమాలలో ఆవిష్కృతం కాదు! సర్వం రాజకీయ మయం జగత్..
అందువల్ల సాహిత్య సాంస్కృతిక సభలకు విచ్చేసి వెడుతున్న అధికార, ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు తమ సభలకు కూడ వచ్చి వేదికలకు వెలుగులనిస్తారని మాతృభాషా దినోత్సవాల నిర్వాహకులు భావించడం సహజం! ‘ఏమండీ.. మీరు భారతీయ మాతృభాషల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు, మీ ప్రభుత్వం మాత్రం మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధనను మాన్పించి ఆంగ్ల మాధ్యమ బోధనను శిశువుల నెత్తికెత్తుతోంది.. ఇది ద్వంద్వ నీతి కాదా?’ అని సభలోని దుస్సాహసవంతుడెవరైనా ప్రశ్నించే ప్రమాదం ఉంది. అదీ అధికార రాజకీయవేత్తల భయం!
క్రీస్తుశకం 1834లో థామస్ బాబింగ్టన్ మెకాలే అనే ఆంగ్లేయ అధికారి భారతీయుల కోసం ‘జాతీయ విద్యావిధానం’ రూపొందించాడు. అప్పుడు భారత జాతి బ్రిటన్ దురాక్రమణలో ఉండేది, అందువల్ల ‘మెకాలే’ అనే ఈ బ్రిటన్ మేధావి భారత జాతి స్వభావాన్ని మార్చి భారతీయులలో బ్రిటన్ స్వభావాన్ని నింపడానికి వీలుగా ఈ వి‘జాతీయ విద్యావిధానాన్ని’ ప్రవేశపెట్టాడు! అంతవరకు మన దేశంలోని అన్ని ప్రాంతాలలోను ఉన్నత విద్యాబోధన సంస్కృత భాషలో జరిగింది. అందువల్ల ఉన్నత విద్యావంతుల స్వభావంలో భారత జాతీయత, భారతీయ సంస్కృతి నిహితమై ఉండేది. ఉన్నత విద్యాబోధన మాధ్యమంగా ఉండిన సంస్కృత భాషను తొలగించి దాని స్థానంలో ‘మెకాలే’ ఆంగ్ల భాషను ఉన్నత విద్యాబోధన మాధ్యమ భాషగా ప్రవేశపెట్టాడు! ఫలితంగా 1947 నాటికి మన దేశంలోని ఉన్నత విద్యావంతులలో అత్యధికులు స్వభావరీత్యా భారతీయతకు దూరమైపోయి బ్రిటన్ జాతీయులుగా ఐరోపీయ సంస్కృతి నిబద్ధులుగామారి ఉన్నారు. ఈ బ్రిటన్ జాతీయ స్వభావులైన నామమాత్రపు భారతీయులు మన దేశాన్ని ఇప్పటికీ నడిపిస్తున్నారు. మన ఉన్నత న్యాయస్థానాలలోను, సర్వోన్నత న్యాయస్థానాలలోను ఇప్పటికీ ఆంగ్లభాషలో సమాచార వినిమయం జరుగుతోంది. భారతీయ భాషలను ఉపయోగించడానికి వీలులేదు! కానీ ఉన్నత విద్యాబోధనకు మాత్రమే ఆంగ్ల భాషను ఉపయోగించడంవల్ల ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో మాతృభాషలలో అంటే భారతీయ భాషలలో బోధన జరగడం వల్ల ‘మెకాలే’అన్న ఆంగ్లేయ బౌద్ధిక బీభత్సకారుని లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికై మన దేశంలోని అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు నడుములను బిగించాయి. మొత్తం భారత జాతిని బ్రిటన్ జాతిగాను, భారతీయ సంస్కృతిని ఐరోపా సంస్కృతిగాను సర్వసమగ్రంగా తీర్చిదిద్దడం ‘మెకాలే’ లక్ష్యం, బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారుల లక్ష్యం. మతాన్ని మార్చడం కంటె భారతీయుల జాతీయతను మార్చివేయడంవల్ల తమకు ఎక్కువ లాభమన్నది బ్రిటన్, ఐరోపా దేశాల హంతక నీతి.. కానీ బ్రిటిష్ వారి పెత్తనం సాగిన రోజులలో ఉన్నత ‘విద్య’ మన దేశంలోని ఎనబయి ఐదు శాతం ప్రజలకు అబ్బలేదు. అందువల్ల ఈ ఎనబయి ఐదు శాతం ప్రజలూ భారతీయులుగానే మిగిలి ఉన్నారు. ఈ డెబ్బయి ఏళ్లలో కూడ ప్రజలందరూ మెకాలే నేర్పిన ఉన్నత విద్యాగ్రస్తులు కాలేదు! అందరినీ ఉన్నత విద్యావంతులుగా మార్చడం అసాధ్యమని గ్రహించిన రాష్ట్రాల ప్రభుత్వాలు ‘మెకాలే విద్య’ను శిశు తరగతి- ఎల్‌కెజి-నుండి మప్పడం ఒక్కటే ఏకైక ప్రత్యామ్నాయమని నిర్ధారించాయి. అందువల్ల ప్రభుత్వాలను నిర్వహిస్తున్న రాజకీయవేత్తలు మాతృభాషల ఉత్సవాలకు రారు, వైరుధ్యాలు వికృతంగా భయటపడతాయని వారి భయం! కానీ ప్రతిపక్ష రాజకీయ వేత్తలు సైతం మాతృభాషా దినోత్సవాలకు ఎందుకని రావడం లేదన్నది అంతుపట్టని రహస్యం..
తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ‘విహిత’ సంస్థవారు నిర్వహించిన ‘్భరతీయ భాషల సమ్మేళనం’లో పాల్గొంటామని వాగ్దానం చేసిన భారతీయ జనతాపార్టీ నాయకులు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం ఒక ఉదాహరణ మాత్రమే! వందల స్వచ్ఛంద, సాహిత్య, సాంస్కృతిక సంస్థలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోను భాషా ఉత్సవాలు జరిపారు. ప్రచారం లభించలేదు! ‘విహిత’ -విస్తృత హిందూతత్త్వ సాహితి- ఇతర సంస్థలతో కలిసి నిర్వహించిన భారతీయ భాషల సమ్మేళనానికి ఇతివృత్తం ‘సమన్వయం’. అన్ని ప్రాంతీయ భాషల లక్ష్యం ఒకే ఒక జాతీయతను, అద్వితీయ సంస్కృతిని పరిరక్షించడం ఈ ‘సమన్వయం’. ఒక్కో భారతీయ భాషకు ఒక ప్రత్యేక జాతి కాని, ప్రత్యేక సంస్కృతి కాని లేదు. అన్ని భాషల జాతీయత, సంస్కృతి ఒక్కటే.. అది భారతీయత! అందువల్లనే ‘విహిత’ భారతీయ మాతృభాషల సమ్మేళనం నిర్వహించింది. సమన్వయం సంస్కృత భాష ద్వారా అనాదిగా ప్రస్ఫుటిస్తోంది! బ్రిటన్ దుండగులు సంస్కృత భాషను తొలగించి, సమన్వయాన్ని చంపి, సంఘర్షణలను వైరుధ్యాలను కల్పించిపోయారు! అందువల్ల ఉన్నత విద్యాబోధన మాధ్యమంగా సంస్కృత భాషను పునరుద్ధరించినప్పుడు మాత్రమే ‘సంఘర్షణ’ భాషా వైరుధ్యాలు తొలగి ‘సమన్వయం’ నెలకొంటుంది!!
‘విహిత’ సంస్థ వేదికపై ప్రసంగించిన కాంగ్రెస్ ప్రతినిధి అద్దంకి దయాకర్ సామాజిక సమన్వయానికి దోహదం చేయగల రెండు అంశాలను ప్రస్తావించాడు! ‘రాజకీయ విభేదాలను భావవైరుధ్యాలుగా చిత్రీకరించడానికి కుట్ర జరుగుతోందన్నది’ ఆయన ప్రస్తావించిన మొదటి అంశం! రాజకీయ విభేదాలున్నప్పటికీ రాజకీయ వాదులందరూ ‘జాతీయ సమైక్యభావం’ కలిగి ఉండాలన్నది అద్దంకి దయాకర్ మాటల సారాంశం! ‘‘అపవాదాల-ఎక్సెప్షన్స్- ను సాధారణంగా సంప్రదాయంగా చిత్రీకరించరాదన్నది’’ఆయన చెప్పిన మరో మంచి మాట! ‘కుల వైరుధ్యం’ ‘దళితులను అణచివేయడం’ మన దేశంలో కేవలం అపవాదమని, తొంబయి తొమ్మిది శాతం ప్రజలు సమన్వయాన్ని, సామరస్యాన్ని కోరుతున్నారన్నది ఆయన అభిప్రాయం.. ఈ రెండు అంశాలు రాజకీయ ప్రముఖులు, మేధావులు గ్రహించవలసిన పాఠాలు! సామాజిక సమన్వయం సృష్టిగత సమన్వయానికి ప్రతిబింబం! అద్దంకి దయాకర్ రాజకీయవేత్తవలె కాక సామాజిక శాస్తవ్రేత్త వలె ప్రసంగించడం ముదావహం.. *

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352