పర్యాటకం

వినాయకుని విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ వైదిక సంస్కృతిలో భగవంతుని ఆరాధన వివిధ సంప్రదాయాలననుసరించి దేశమంతటా కొనసాగేది. ఆయా సంప్రదాయాల అనుయాయులు పరస్పరం విభేదించుకుంటూ, కలహాలకు కాలుదువ్వుతూ వైదిక సంస్కృతిని భ్రష్టుపరుస్తున్న రోజులు. అయినప్పటికి వారి వారి విధానాలలో వారికి అవగాహన లేని భగవంతుని యందుగల భక్తితో అందమైన సత్యాలు ఆవిష్కృతమై ఉన్నాయి.
అటువంటి పరిస్థితుల్లో శ్రీ ఆదిశంకరులు అవతరించారు. దేశమంతా అద్వైత సిద్ధిని ప్రచారం చేయడానికి కంకణబద్ధులై పర్యటించిన సమయంలో పరిస్థితిని ప్రత్యక్షంగా చూసారు. ఆయా సంప్రదాయాలకు మధ్యగల విభేదాలను పరిష్కరిస్తూ, ఆయా మతానుయాయులను ఒక పద్ధతిలో ఏకత్రితం చేసి, వారందరూ అనుసరించే ఆరాధనా విధానాలు వేదమూలాలని నచ్చజెప్పి, ఒప్పించి షణ్మతాలుగా స్థిరీకరించి ‘షణ్మత స్థాపనాచార్యులు’గా ప్రసిద్ధి పొందారు. పంచాయతన పూజా విధానాన్ని ఏర్పాటుచేసారు. ఆ షణ్మతాలు శైవం, వైష్ణవం. శక్తి ఆరాధన, సూర్యారాధన, గాణాపత్యం, అగ్ని (స్కందుడు) ఆరాధన. అగ్ని ఆరాధనతో తతిమ్మా ఆరాధకులు తమతమ దేవతలను మధ్యన ఉంచి, నలుదిక్కులా ఇతర దైవాలను ఉంచి ఆరాధించే పద్ధతినే పంచాయతన పూజగా ఏర్పాటుచేసి, ఆయా సంప్రదాయాలవారు తమ పద్ధతిననుసరించి పూజా పద్ధతుల విధివిధానాలను వాకృచ్చారు.
మహారాష్టల్రో మూర్త్భీవించిన మూషిక వాహ నుని అష్టరూపాలు ఇవే.
మయూరేశ్వర గణపతి: ఈ గణపతి ఆలయం పూణేకు దగ్గరలో మోర్గాఁవ్ అనుచోట ఉంది. గాణాపత్య సంప్రదాయంతో ఈ క్షేత్రానికి ప్రథమస్థానం ఇవ్వడం జరిగింది. మూల విరాట్టుకు అభిముఖంగా గణపతి వాహనమైన మూషిక విగ్రహం కాళ్ళతో మోదకం పట్టుకుని ఉంటుంది. కొంచెం పెద్దదిగా ఉన్న మూషికం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆలయం అష్టదిక్కులలోను గణపతి విగ్రహాలున్నాయి. ప్రతి గణపతికి ఇరుప్రక్కల గణపతి పత్నులుగా భావించే సిద్ధి, బుద్ధి విగ్రహాలు, వాటికెదురుగా మూషిక, మయూర వాహనాలు ప్రతిష్ఠించడం జరిగింది. ముద్గల పురాణంలో చెప్పబడిన గణపతి తంత్రం ఆధారంగా ఈ దేవాలయం నిర్మితమైనదని అంటారు.
చింతామణి గణపతి: ఈ క్షేత్రం పూణేకు సమీపంలోగల ధేపూర్ అను ప్రాంతంలో నిర్మితమైనది. శ్రీ మోరయా గోసానీ అను గణపతి ఉపాసకుడు ఇక్కడ ఉగ్ర తపస్సు చేసాడనీ, అతని తపస్సుకు మెచ్చి గణపతి వ్యాఘ్రరూపంలో దర్శనమిచ్చాడని స్థల పురాణం చెబుతున్నది. ఆ స్థలంలోనే గణపతి ఆలయం రూపుదిద్దుకుంది. గోసానీ తపస్సుకు సాక్షీబూతంగా వ్యాఘ్ర రూపంలో ఆలయం వద్ద ఒక శిల ఉండడం విశేషం. గణపతి భక్తులకు చింతామణి ద్వారా కోరికలను తీరుస్తాడని విశ్వాసం.
గిరిజాత్మజ గణపతి: లేహ్యాద్రి అనే పర్వత ప్రాంతంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం నెలకొని ఉంది. కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేసారు. ఈ క్షేత్రం పూణేకు నలుబది కి.మీ దూరంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధులు నివసించినట్లు ఆధారంగా చుట్టుప్రక్కల పర్వత సానువులలో బౌద్ధుల ఆరామాలు, గుహలు మొదలైనవి ఉన్నాయి. ఈ క్షేత్ర ప్రశస్తి గణేశ పురాణంలో ప్రస్తావించడం జరిగింది.
శ్రీ విఘ్నేశ్వర గణపతి: ఈ క్షేత్రం గిరిజాత్మజ గణపతి ఆలయానికి సమీపంలో ఓఝల్ అనుచోట ఉంది. చుట్టూరా పర్వత ప్రాంతం, ప్రకృతి రామణీయకత యాత్రీకులకు కనువిందు చేస్తాయి. ఈ రెండు క్షేత్రాలను ఒకేమారు సందర్శించే అవకాశం ఉంది.
మహాత్కట గణపతి: పూణేకు ఇరువది కి.మీ. దూరంలో రాజాంగాఁవ్ అనుచోట మహాత్కట గణపతి కొలువై ఉన్నాడు. ఉత్తరాయణ- దక్షిణాయన సంధి కాలంలో సూర్యోదయంలో భానుని కిరణాలు నేరుగా వినాయకునిపై ప్రసరించేటట్లు ఆలయ నిర్మాణంలోని ప్రత్యేక విశేషం. మరొక విశేషమేమంటే గర్భాలయంలో రెండు గణపతి విగ్రహాలున్నాయి. ఒకటి బయటకు కనిపించే పెద్ద మూల విరాట్టు. దీనిని మహాగణపతిగా పేర్కొంటారు. మరొకటి మహాగణపతి క్రింద ఒక అరలో చిన్న మూర్తి. ఇదే అసలు మహోత్కట గణపతి మూర్తియనీ, తురుష్కుల హిందూ దేవాలయాల విధ్వంసాలకు భయపడి, ఆ మూల మూర్తిని అలా కనబడకుండా దాచి ఉంచారని క్షేత్ర కథనం ఉటంకిస్తున్నది.
పైన పేర్కొన్న ఐదు గణపతి క్షేత్రాలను సందర్శించడానికి పూణే నగరాన్ని కేంద్రంగా చేసుకుని అన్నిటినీ దర్శించవచ్చు. అన్నీ పూణేకు సమీపంలోనే ఉండడమే కాకుండా, ఆలయాలన్నీ ప్రకృతి రామణీయకతతో, ఆహ్లాదకరంగా ఉంటూ, భక్తులను రంజింపజేస్తూ స్వాగతిస్తాయి.
భళ్ళాలేశ్వర గణపతి: కొలాబా జిల్లాలో పాళీ అనేచోట ఈ క్షేత్రం ఉంది. ప్రతి రోజూ ఉదయించే సూర్యుని తొలి కిరణాలు ఆలయ ముఖ మంటపం ద్వారా ప్రసరించి మూల విరాట్టు పాదాలను తాకే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ వెనుక భాగంలో డుంఠి వినాయకుని ఆలయం ఉంది. భళ్ళాలేశ్వర గణపతి ఆలయ ప్రశస్తి ముద్గలి, గణేశ పురాణాలలో ఉటంకించబడింది. ఈ క్షేత్రంలోని డుంఠి గణపతి స్వయంభువని స్థల పురాణ కథనం.
వరద వినాయకుడు: ఈ గణపతి క్షేత్రం కూడ కొలాబా జిల్లాలో మహరి అనేచోట ఉంది. ఈ గణపతిని వేదకాలంలో గృత్సమధ మహర్షి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతున్నది. ‘గణానాం త్వాం గణపతిం హవామహే’అను ఋగ్వేద మంత్రాన్ని మహర్షి ఉపాసించి గణపతి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందేడని కథనం. గృత్సమద మహర్షి గాణావత్య సంప్రదాయానికి తొలి ప్రపక్తగా ప్రసిద్ధుడని గాణాపత్యులంటారు.
సిద్ధి వినాయకుడు: అహ్మద్‌నగర్ జిల్లాలో సిద్ధిపేట్ అను స్థలంలో కొలువై ఉన్న క్షేత్రం సిద్ధివినాయక క్షేత్రం. మహారాష్ట్రీయులందరూ జీవితంలో ఒక్కసారైనా విధిగా దర్శించి తరించవల్సిన క్షేత్రం. ఇచ్చటి మూల విరాట్టు స్వయంభువు. ఈ క్షేత్ర గణపతి తుండము కుడివైపుకు తిరిగి ఉండడం వినాయకునిలోని ప్రత్యేకత. సిద్ధి వినాయకుని అచంచల భక్తులలో బాలగంగాధర తిలక్ ప్రముఖులు. ఆ గణపతి అనుగ్రహంతో భారత స్వాతంత్య్రోద్యమంలో భారత జాతినంతటినీ ఏకత్రితం చేసి స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన ధీరుడు. స్వాతంత్య్రోద్యమంతోపాటు గణపతి పూజోద్యమం కూడ దేశమంతటా ప్రాచుర్యం పొందింది. దేశమంతటా గణపతి నవరాత్రోత్సవాలకు అంకురం చేసింది ఈ క్షేత్రంలోనే! గణపతి నవరాత్ర ఉత్సవాలలో గణపతిని దర్శించి, సేవించి, తరించుదాం.

-ఎ.సీతారామారావు