పర్యాటకం

శివుని చిద్విలాసమే చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిదంబరంలోని తిల్లయ్ నటరాజ మందిరం, చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుని పావన నిలయం. అనాది అద్భుత నర్తక నాయకుడైన, అందాల నటరాజస్వామి రమ్య రంగ స్థలం. రమణీయ రత్నసభ. చిదంబర నటరాజస్వామి ‘ఆనంద నటరాజ’స్వామి.
ఆయన ఆనంద నాట్యం అతిలోక సుందరం.. అతని అనితర సాధ్యం.. అఖిల జనావళికి సుఖశాంతి సంతోష సంధాయకం. నిజానికి పరమేశ్వరుడు పరమానంద స్వరూపుడు. పరమానందానికి ఓ పాట, ఓ నాట్యం ఒక విస్పష్ట సూచిక. పరమానందాన్ని ప్రాణకోటికి అందించడమే, ఈ నాట్యంలోని అంతరార్ధం. ప్రముఖ జర్మన్ తత్వమేత్త నిట్సే, దైవ పద వివరణ సందర్భంగా తన నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటిస్తూ- నాట్యం చేయలేని దైవ రూపాన్ని తాను విశ్వసించలేనని పేర్కొన్నారు.
మాటలలో ప్రకటింప సాధ్యంకాని సచ్చిదానందాన్ని పరమానందాన్ని, నటరాజస్వామి, తన నాట్యం ద్వారా సకల ప్రాణకోటికి అందించారు. తిలయ్ నాటరాజస్వామి విశేషం, విశిష్ఠత ఇదే. ఇది ప్రపంచంలోనే అపూర్వం.. అద్భుతం.
ఈశ్వరుడు నిరాకారుడని, అన్నిరూపాలకు అతీతుడని అందరకూ తెలిసిందే. అయితే ఈ విశేషాన్ని ఒక దేవాలయంలో ప్రకటించడం ఎలా? అది అసలు సాధ్యమేనా? సాధ్యమేనని, చిదంబర ఆలయంలోని, ‘నటరాజమూర్తి’ రూపం వెనుక రహస్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆలయ నిర్మాణవేత్తలు నిరూపించారు. అయితే అసలు రహస్యం ఏమిటో, ఇంతవరకూ ఎవ్వరూ ఖచ్చితంగా స్పష్టంగా.. సందిగ్ధ రహితంగా తేల్చి చెప్పలేకపోయారు. అందుకనే, అది ఆనాటినుంచి నేటివరకు ‘రహస్యం’గానే ఎవ్వరికీ అంతుబట్టని అంతరార్ధంగానే మిగిలి ఉంది. ‘రహస్యం’ముందు ఉన్న తెర ఎత్తగానే, క్షణకాలం ఒక అపురూప తేజం.. విద్యుల్లత.. కనులముందు మెరిసిపోతుంది. సందర్శకులను, తన్మయులనుగావిస్తుంది. అంతే.. అంతలోనే తెరపడుతుంది. భక్తులకు ఒక అనిర్వచనీయ ఆనందం, అనుభూతి. జీవితాంతం మనసులో నిలిచిపోతుంది. ఈ ఆనందానుభూతి సందర్శకులయిన భక్తులకు, నటరాజస్వామి ప్రసాదించే పరమాద్భుత వరం.. పరమానందకరమని చెప్పవచ్చు.
శ్రీకృష్ణపరమాత్మ కూడా భగవద్గీతలో గీత పరమగోప్యమని, అతి రహస్యమని ఇది అందరికీ చెప్పకూడదని, నాస్తికులకు, పరమ మూర్ఖులకు చెప్పకూడదని, తన భక్తులకే చెప్పి, సన్మార్గములో నడిపే జ్ఞానం, ప్రసాదించవలెనని, గీతా పాఠకులకు, గీత ముగించేముందు తెలియజేశాడు.
భగవంతుడు తెలియజేసే రహస్యము మానవుడికి బహుజన్మములకు గానీ అర్ధముకాదని, ఇది తెలియనినాడు జన్మంటూ ఉండదని తెలియజేశాడు. అదే మోక్షము.
మానవుడు, దాచేసే చిదంబర రహస్యము, చివరదాకా దాగదని, ‘‘్భగవంతుడిది వెలుగు, మానవుడిది పగులు’’. ఇది ఎప్పటికీ దాగదు. రహస్యాన్ని దాస్తే పొట్ట ఉబ్బుతుందని ఓ సామెత. ఇది ఆడవారికి శాపం, మొగవారికి పాపం. రహస్యం తెలియనంతవరకు ఆనందం, తెలిసిన తరువాత ఆపదలు చుట్టుముట్టి చుక్కలు చూపిస్తాయి. అతిరహస్యం బట్టబయలు నిరాకారం చిదంబరం.
చిదంబరం మద్రాస్ (చెన్నై) నగరానికి దక్షణంగా 250 కిలోమీటర్ల దూరంలో చిదంబరం పట్టణం ఉంది. రైలుమార్గం పరంగా (చెన్నై)- తిరుచిరాపల్లికి సుమారు మధ్యలో ఉంది.
చిదంబరానికి చెన్నైనుంచి తమిళనాడులోని వివిధ ముఖ్య కేంద్రాల నుండి చక్కని (లగ్జరీ) బస్సుసౌకర్యం ఉంది.
అన్ని సౌకర్యాలు కలిగిన అందమైన పట్టణం చిదంబరం. పట్టణాన్ని ఆనుకొని ఉన్న అన్నామలై విశ్వవిద్యాలయం వివిధ శాఖలతో, దేశవ్యాప్త కీర్తిగడించింది. పరిసర ప్రాంతవాసుల విద్యాసముపార్జనకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. తమిళంలో ఆలయం (కోయిల్-టెంపుల్) అనే పదం చిదంబరం నటరాజ ఆలయానికే ఎక్కువగా వర్తిస్తుంది. రాష్ట్రంలో మిగతా ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇది మాత్రమే దివ్య ఆలయమని, విజ్ఞుల దృఢ విశ్వాసం.
తమిళంలో స్తుతిగీతాలు, అధిక భాగం ‘తిరుచిత్రాంబళం’అనే పదంతో ప్రారంభమై అదే పదంతో పరిసమాప్తమవుతాయి. ఈ పదానికి అర్వం. ప్రతి ఒక్కరు దీవెనలందుకొని తీరవలసిన చిదంబరం అధిస్థాన దైవం అని.
చిదంబర రహస్యం అంటే శివదేవుని, చిద్విలాసమని, జ్ఞానప్రకాశమని, అంతుతెలియని ఆదిదేవుని మహిత మర్మమని, జ్ఞానుల అభిప్రాయం. చిదంబరం ఆకాశలింగం, ఆకాశక్షేత్రం, అనంత క్షేత్రం అద్వితీయ క్షేత్రం. చిదంబర రహస్యంలో నటరాజ శివదేవుడు మంత్రరూపంలో ఉన్నారు. ఇక్కడ ‘యంత్ర’రూపం బంగారు బిల్వమాలతో కప్పబడి ఉంది. స్వామికి ప్రధాన ఉత్సవం సంవత్సరానికి రెండుసార్లు జరుపుతారు. తొలి ఉత్సవం జూన్ 15- జూలై 15మధ్య, మలి ఉత్సవం డిసెంబర్ 15- జనవరి 15మధ్య నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలలనుంచి విదేశాలనుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులువస్తారు.
చిదంబరం శైవులకు, భూలోక కైలాసం. వైష్ణవులకు శ్రీరంగం భూలోక వైకుంఠం.
ఈ ప్రపంచాన్ని మనిషితో పోలిస్తే చిదంబరం హృదయమని చెప్పవచ్చు. మనిషి మోక్షాన్ని పొందాలంటే తిరువారూర్‌లో జన్మించాలి. కాశీలో మరణించాలి. అన్నామలై (తిరువణ్ణామలై) గురించి ఆలోచించాలి. చిదంబరంలో నివసించాలి. లేదా చిదంబరస్వామిని దర్శించాలి. నటరాజమూర్తి నిలయ ఆకృతి, మానవ శరీరాన్నిపోలి ఉంటుంది. స్వామి మందిరం ఎదురుగా నిలబడి అక్కడినుంచే దక్షిణాభిముఖులై ఉన్న నటరాజమూర్తిని చూడవచ్చు. ఇటువంటి అవకాశం మరే ఇతర ఆలయంలోను లభించదు.
ఈ ఆలయంతో మహితజ్ఞానులైన పతంజలి వ్యాఘ్రపాద, ఉపమన్యు ప్రభృతులకు ఎందరో మహాకవులకు మహాభక్తులకు, సన్నిహిత సంబంధం ఉంది. స్వామి ఆశ్రమంలో వారందరూ మహదానందాన్ని అందుకున్నారు. స్వామి సన్నిధిలో సుఖశాంతులను పొందుతున్న పుణ్యాత్ములు ఈనాటికీ గణనీయ సంఖ్యలో ఉన్నారు.
దేవాలయంలో పలుచోట్ల మనకు భరతనాట్య భంగిమలు ప్రదర్శించే సుందర శిల్పాకృతులు గోచరమవుతాయి. మరి స్వామి ఆది నర్తకుడు. నాట్యశాస్త్ర నిర్మాత, తేజోవిరాజుడు, శివస్వామి. ఇక్కడ ప్రతి ఏటా ‘నాట్యాంజలి’పేరిట మనోహరమైన ఉత్సవం నిర్వహింపబడుతుంది. దేశంలో ప్రసిద్ధివహించిన నర్తకులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. శాస్త్ర సంబంధమైన గోష్ఠులు జరుగుతాయి. చిదంబరం చుట్టుపట్ల ఎన్నో పుణ్యక్షేత్రాలు, పావన ఆలయాలు ఉన్నాయి. భక్తులు సందర్శకులు వాటిని చూసి తీరాలి. ఆనందించాలి. ఆనందోబ్రహ్మకు చిదంబరం ప్రతి రూపం. ఏకాంబరం, పీతాంబరం కలబోసిన దిగంబరం స్వామి చిదంబర రహస్యం. ఇదొక ప్రత్యేక రహస్యంగా గొప్ప పుణ్యక్షేత్రం

. - జమలాపురం ప్రసాదరావు