Others

శ్రీ కాశీ.... శ్రీరామ తారకాంధ్రాశ్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ హైందవ ఆధ్యాత్మిక కేంద్రమైన పవిత్ర కాశీ క్షేత్రం, గంగా నదిని దర్శించే యాత్రికులకు విడిది సదుపాయాలు ఏర్పాటు చేయడంలో శ్రీకాశీ శ్రీరామ తారాకాంధ్రాశ్రమం ఐదుదశాబ్దాలకు పైగా తెలుగు యాత్రికులకు విశిష్టసేవలు అందిస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా భారతావనిలో ఏ రాష్ట్రం నుంచి వచ్చే యాత్రికులను బస, ఉచిత భోజన సదుపాయాలను ఆంధ్రాశ్రమం కల్పిస్తోంది. కాశీకి వెళ్లాలనుకునే వారికి వెంటే గుర్తుకు వచ్చేది ఆంధ్రాశ్రమం. దశాబ్దాల క్రితం కాశీకి వెళ్లే వారు అక్కడ ఏ ఆశ్రయంలో ఉండాలనే దానిపై మల్లగుల్లాలు పడేవారు. కాశీ క్షేత్ర దర్శన నిమిత్తం కుటుంబ సమేతంగా కుతూహలంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి క్షేత్రం చేరిన వెంటనే ప్రపథమంగా కావాల్సింది ఆవాసం. ఆ పై స్నానం, శ్రీకాశీ విశే్వశ్వర స్వామి సందర్శనం చేసుకుంటారు. సహజంగానే కాశీ యాత్రికులు పిండ ప్రదానం, అస్తికల నిమజ్జనం లాంటి వైదికపరమైన తంతుకు ప్రాధాన్యత ఇస్తారు.
కాశీ క్షేత్రంలో శ్రీరామతారకాంధ్రాశ్రమ నిర్మాణానికి వ్యవస్థాపకులు, మహనీయులు శ్రీరామభద్రేంద్ర సరస్వతీ స్వాములు ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొని కృషి చేశారు. ఈ ఆశ్రమానికి 1959 నవంబర్ 12వ తేదీన ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ వీవీ గిరి శంకుస్థాపన చేశారు. ఈ ఆశ్రమం ఏర్పాటుకు బూర్గుల రామకృష్ణారావు, అనంతశయనం అయ్యంగార్, నేతి సుబ్రహ్మణ్యం లాంటి మహనీయులు విశేష కృషి చేశారు. ఈ ఆశ్రమ నిర్మాణానికి, నిర్వహణకు డాక్టర్ భోగరాజు పట్ట్భా సీతారామయ్య ఆరుగురు సభ్యులతో కూడి ట్రస్టును రిజిస్టర్ చేయించడం విశేషం. ఇందులో శ్రీరామభద్రేంద్ర సరస్వతి స్వామి, యూపీ మాజీ గవర్నర్, హైదరాబాద్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, పంచాగ్నుల సూర్యనారాయణ, జేవీ సోమయాజులు, జీఎస్ రాజు, కర్పూరపు వెంకటనారాయణ, సీవీఎస్ నరసింహారావుతో ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమం ప్రస్తుత మేనేజింగ్ ట్రస్టీ వీవీ సుందర శాస్ర్తీ ఆశ్రమ విశేషాలను వివరించారు. ఆశ్రమ వ్యవస్థాపకులైన రామభద్రేంద్ర సరస్వతిస్వామి మోక్ష మార్గమునకు ప్రాకులాడు ముముక్షువుల తీవ్ర కాంక్షను దూరదృష్టితో పరిశీలించి ఆశ్రమంలోని కొన్ని గదులను యోగ్యులైన భక్తులకు, వారి ఆమరణాంతరం కాశీలో నివసించేందుకు వీలుగా కేటాయిస్తూ పత్రంలో పొందుపరిచారు. ఈ వసతిని సాధ్యమైనంత ఎక్కువ మందికి కల్పించేందుకు వీలుగా 9 మాసాలు, 9 దినముల కాశీవాసం చేసేందుకు ఏర్పాటు చేశారు. అట్టి వసతిని దరఖాస్తు క్రమసంఖ్య అనుసరించి కల్పిస్తున్నారు. కాశీ వాసులు తమ నియమిత కాలంలో ఆశ్రమ నియమావళి ప్రకారం కాశీ హద్దులలో నివసిస్తూ, నిత్యం విశే్వశ్వర, కేదారేశ్వర దర్శనములతో, స్మరణ, పూజలతో కాలం గడుపుతూ ఆశ్రమంలో జరుగు పూజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
ప్రస్తుతం ఆశ్రమాన్ని చైర్మన్ పీవీఆర్ శర్మ, మేనేజింగ్ ట్రస్టీ వీవీ సుందర శాస్ర్తీ, ట్రస్టీలు, కేఎల్‌ఎస్‌ఎన్ శర్మ, దూబగుంట శ్రీనివాస్, ఎంఆర్‌కే రాజు, యూఆర్‌కే మూర్తి, పురాణం శ్రీనివాస్‌లు పర్యవేక్షిస్తున్నారు.
పూర్వపురోజుల్లో కాశీ ప్రయాణం కష్టంగా ఉండేది. రైతులు విమాన ప్రయాణం సౌకర్యం వల్ల కాశీ క్షేత్ర మహాత్మ్యం జనాకర్షకమై యాత్రికుల రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో ఆశ్రమంలో లభ్యత, రద్దీని బట్టి గదులను వచ్చిన వారికి వచ్చినట్లు కేటాయిస్తారు. విశేష రద్దీగా ఉండే కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో మూడు రోజులకు బస సదుపాయాన్ని కుదించే పరిస్థితి ఉంటుంది. యాత్రికులు వచ్చిన వెంటనే వసతి ఏర్పాటు చేయలేనప్పుడు తాత్కాలిక వసతి కోసం లాకరు సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని యాత్రికులు గంగాస్నానం, ఈశ్వర దర్శనం, తీర్థ విధులు సకాలంలో చేసుకని సంతృప్తి పొందుతున్నారు.
ఆశ్రమానికి వచ్చే భక్తులు తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా ఉంటారు. వీరికి ఉత్తర హిందూదేశ సంప్రదాయం కంటే దక్షిణ హిందూ దేశ సంప్రదాయంలో వండిన భోజనం అనుకూలమైన భావిస్తారు. వారి కోరిక మేరకు నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. హైందవ సమాజంలో అన్ని కులాలు చాతుర్వర్ణానికి చెందిన భక్తులకు నిత్యాన్నదాన భోజన సదుపాయం ఉంటుంది. 2001 ఏప్రిల్ 30వ తేదీన కాశీ కుసుమాంబ నిత్యాన్న దాన స్కీంను ప్రారంభించారు.
భక్తుల విరాళాలు, భక్తి విశ్వాసాలతో జయప్రదంగా నడుస్తోంది. ఆశ్రమంలో బస చేసే యాత్రికులకు మాత్రమే పగలు భోజనం పప్పు, కూర, పచ్చడి, పులుసు, పెరుగు, సాయంకాలం ఫలాహారం ఏర్పాటుచేస్తారు. సగటు రోజుకు 250 మందికి, రద్దీగా ఉండే సమయంలో 500 మంది వరకు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. విరాళాలు ఇచ్చే భక్తులకు వారు కోరిన విధంగా ప్రత్యేకమైన దినం, తేదీన అన్నదానం చేస్తారు. దీనికి ఆశ్రమ నిబంధనల మేరకు విరాళాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆశ్రమ వాసులకు అహోరాత్రాలు విద్యుత్ సదుపాయంతో గాలి, వెలుతురుకు ఆటంకం లేని విధంగా రెండు జనరేటర్లు, మహిళలు, బాలలు, వృద్ధులకు శ్రమలేకుండా లిప్టు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
కాశీ యాత్ర చేసే తెలుగు యాత్రికులకు భక్తులకు పెట్టని కోటగా వసతులు కల్పిస్తున్న ఆశ్రమంలో వ్యవస్థాపకులు రామభద్రేంద్ర సరస్వతి స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. శ్రీరామభద్రేంద్ర సరస్వతి స్వామి 1983 డిసెంబర్ 12వ తేదీన ఆశ్రమంలోని పరమపదించారు. అనంతరం వారి కనిష్టపుత్రులు వేమూరి శ్రీరామచంద్రమూర్తి ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2008 జూలై 20వ తేదీన దివంగతులయ్యారు.
ఆశ్రమంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు, శ్రీరామనవమి , మహాశివరాత్రిపూజలు, కార్తీక మాస పూజలు ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఆశ్రమ ఆవరణలో సమీపంలోని పవిత్ర హైందవ క్షేత్రాలను సందర్శించాలనుకునే యాత్రీకులకు సహకరించేందుకు ట్రావెల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో జగద్గురువులు కంచికామకోటి పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, విశాఖ పట్నం శారదాపీఠాధిపతులు ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో సిక్కిం, తమిళనాడు మాజీ గవర్నర్లు వీ రామారావు, కొణిజేటి రోశయ్యలు ఉన్నారు. భక్తుల విరాళాలు, భక్తి విశ్వాసాలతో వంట, వడ్డన వార్పు సిబ్బందితో, అక్కౌంట్లు, గోత్రనామాల పట్టికలను తయారుచేసే సిబ్బందితో ఆంధ్రాశ్రమం మూడు పువ్వులు, ఆరుకాయలుగా నడుస్తూ యాత్రికుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాశి పర్యటన సందర్భంగా ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ వీవీ సుందర శాస్ర్తీ కలిసి ఆశ్రమం గురించి వివరించి ప్రశంసలు అందుకున్నారు. కేదారఖండం వద్ద పాండే హవేలీ రోడ్డు, బెంగాలీటోలా వద్ద మానససరోవర్ వద్ద గంగానది తీరంలోనే ఆంధ్రాశ్రమం విరాజిల్లుతోంది.