చిత్తూరు

బిసిల్లో చేర్చాలని బలిజకాపులు...వద్దని బిసి సంఘ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: తాము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా పూర్తిగా వెనుకబడి దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, తమను బిసిలో చేర్చాలంటూ బలిజ కాపునేతలు, అన్నివిధాలా ఎంతో అభివృద్ధిలో ఉన్న బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చి తమ గొంతు కోయొద్దని బిసి సంఘ నేతలు జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు తమ వాదనలు వినిపిస్తూ వినతిపత్రం సమర్పించారు. కాపులను బిసి కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ రెండురోజలు పర్యటనలో భాగంగా సోమవారం నగర పాలకసంస్థలోని వైఎస్‌ఆర్ మందిరంలో బహిరంగంగా ప్రజాభిప్రాయాలు సేకరించి వారి వాదనలు విన్నది. ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన ఈ అభిప్రాయ సేకరణ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా బిసి కులాల్లో చేర్చమని కోరేవారి వినతులు, అందుకు అభ్యంతరాలు చెప్పేవారి వాదనలతోపాటు తమ కులాల్లో రిజర్వేషన్‌లో మార్పులు చేయాలని కోరిన వారి వినతులను జస్టిస్ మంజునాథ్ ఆశాంతం ప్రశాంతంగా విన్నారు. సమావేశ మందిరంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కమిషన్ భోజనం చేయడం కోసం సమావేశాన్ని ముగించిన సమయంలో నగర పాలక సంస్థ ఆవరణలో బిసి, బలిజ సంఘ నేతల మధ్య పరస్పరం తమ వాదనలతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఒక దశలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటుందేమో అన్నట్లుగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ధర్నా చేస్తూ ఆందోళనకు దిగారు. అప్పటి వరకు సంయమనం పాటించిన పోలీసులు పరిస్థితి చేయిదాటుతుందని భావించి ముందుగా బలిజ నేతలను అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అటు తరువాత వారిని వదిలివేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అభిప్రాయ సేకరణను జస్టిస్ మంజునాథ్ కమిషన్ తిరిగి ప్రారంభించింది. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజల వినతులను కమిషన్ స్వీకరించింది. ప్రధానంగా బిసి కులాల్లో మార్పులు, చేర్పులను ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్యపరమైన అంశాలపైనే కమిషన్ ప్రధాన దృష్టి సారించింది.
ఈ సందర్భంగా బిసి యునెటెడ్ ఫ్రంట్ ప్రెసిడెంట్ పాలూరి రామకృష్ణయ్య మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలో బ్రాహ్మణేతర కులాలన్నింటిని కూడా బిసిగా చేర్చారని, ఇందుకు సంబంధించిన ఆధారాలతో చూపించారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత వెనుకబడిన తరగతుల వారి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రథమ ప్రధాని నెహ్రూ కాకాకాలేకర్ కమిషన్ వేసి బిసిలపై సర్వే నిర్వహించారన్నారు. ఈ క్రమంలో 2218 కులాలను బిసిలుగా గుర్తించి అప్పటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్‌కు 1953లో సమర్పించారని తెలిపారు. సామాజిక విద్యాపరంగా వెనుకబడిన వారిని మాత్రమే గుర్తించారన్నారు. అటు తరువాత ఏర్పడిన అనేక రకాల పరిణామాల నేపథ్యంలో అనంతరామన్ కమిషన్ 1963లో 92 కులాలను బిసిలుగా గుర్తించిందన్నారు. గ్రూప్ ఎ-37, గ్రూప్ బి -21, గ్రూప్ సి-1, గ్రూప్ డి -33 కులాలను వెరసి 93కులాలకు రిజర్వేషన్ కలుగచేసిందన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిసి రిజర్వేషన్‌లో పెట్టిన 50 శాతం పరిమితులను దృష్టిలో ఉంచుకొని 15 శాతం ఎస్సీ, 6 శాతం ఎస్టీలకు పోను మిగిలిన 29 శాతం బిసిలకు చెందాల్సిన రిజర్వేషన్లు 25 శాతమే అమలవుతూ వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే 4 శాతం రిజర్వేషన్‌ను 15 ముస్లిం వర్గాలకు బిసి జాబితాలోని ఈ-గ్రూప్‌లో చేర్చారన్నారు. అటు తరువాత బిసి జాబితాలో ఎ బి సి డి గ్రూపుల్లో 26 కులాలను చేర్చడంతో ఆ సంఖ్య 135కు చేరిందన్నారు. ఈ క్రమంలో బలిజ కాపులను బిసిలో చేరిస్తే బిసిలో ఉన్నవారి రిజర్వేషన్ శాతం పడిపోతుందన్నారు. వాస్తవానికి కాపులు బలిజలు కారని, రెడ్లని ఆయన స్పష్టం చేశారు. కాపులను బిసిలో చేరిస్తే రెడ్లు కూడా బిసిలు అవువుతారని, ఇది మరో ఇబ్బందికి దారితీస్తుందన్నారు. ప్రస్తుతం బలిజ కాపులు అన్ని రంగాల్లోనూ ముందున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బిసిలో చేర్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బలిజ కాపునేతలు నీలం బాలజి, ఊకా విజయ్‌కుమార్, సింగంశెట్టి సుబ్బరామయ్య, పొలకల మల్లికార్జున్ లాంటి నేతలు మాట్లాడుతూ తాము బలిజ కాపులను కొత్తగా బిసిలో చేర్చమని అడగటం లేదని, 1966 ముందు అనుసరిస్తున్న బిసి విధానానే్న కోరుతున్నామన్నారు. అందులోనూ ప్రస్తుతం బిసిలో ఉన్న కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండానే తమను బిసి జాబితాలో చేర్చమని కోరుతున్నామన్నారు. బిసి సంఘాల సమితి విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వారిని బిసిల్లో చేరిస్తే అటు తరువాత రాజకీయపరమైన అంశాల్లో కూడా తమకు ఇబ్బందులు ఏర్పడతాయని, ముఖ్యంగా విద్యాసంస్థల్లో కోర్సుల రిజర్వేషన్‌లో బిసిల నోళ్లుకొట్టి బలిజకాపులు తన్నుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు జల్లి మధుసూదన్ మాట్లాడుతూ మంజునాథ్ బిసి కమిషన్‌కు చట్ట్భద్రత కల్పించాలని, లేనిపక్షంలో బిసిల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలు బూడిదలోపోసిన పన్నీరవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 91 సంఖ్యలో ఉన్న బిసి కులాలను 141కు పెంచామన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచలేదన్నారు. ఈ నేపథ్యంలో బలిజ కాపులను బిసిలో చేరిస్తే ఓబిసిలకు కూడా తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జస్టిస్ మంజునాథ్‌తోపాటు సభ్యులు వెంకటేశ్వరసుబ్రహ్మణ్యం, శ్రీమంతుల సత్యనారాయణ, పూర్ణచంద్రరావు, మెంబర్ సెక్రటరీ కృష్ణమోహన్ పాల్గొన్నారు. బహిరంగ విచారణ చేపట్టడానికి ముందు జస్టిస్ మంజునాథ్ మాట్లాడుతూ బిసిజాబితాలో 11 కులాలైన బలిజ, ఒంటరి, కాపు, తెలగ, జెట్టి, కరిణిగర్, కర్ణం,కానప్ప,పిళ్లై, వన్నైయ, వన్నయ్యర్, వైశ్య, వల్లువ, పందిర, వెల్లువశాతాని, వెల్లువ దాసరి, వెల్లువన్, వెల్లూరన్, వెల్లువనాయర్, నాడార్, తొలగరి, పనాసా, గాజులబలిజ, కుంతిమల్లారెడ్డిలాంటి వారి ఆర్థిక సామాజిక విద్యాపరమైన అంశాలపై వివరంగా నాయకులు తెలియజేయాలని స్పష్టంచేశారు. అలాగే తమ కులాలను మార్పులు చేయాలని కోరుతున్న దూదాకుల, లడాక, పింజరి, దేవాకుల లాంటి వారి వినతులను కూడా స్వీకరిస్తామన్నారు. తాము బహిరంగ విచారణలో ప్రజలిచ్చిన వినతులను స్వీకరించి ఆపై నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని, రాజకీయ పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఇక తమ కులాలను ఎందుకు బిసిల్లో చేర్చాలో, ఎందుకు కులాల్లో మార్పులు తీసుకురావాలో నాయకులు అనుకూల, వ్యితిరేక అంశాలను కమిటీకి తెలియజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా బలిజ జెఎసి నేత నీలం బాలాజి నేతృత్వంలో బలిజ కులస్తులు లీలామహల్ సర్కిల్‌లో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చేవిధంగా జస్టిస్ మంజునాథ కమిషన్‌కు తగిన మంచి ఆలోచనను ప్రసాదించాలని ప్రార్థించారు.